బేట్రాయి సామి దేవుడా!

  • 172 Views
  • 0Likes
  • Like
  • Article Share

    ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి

  • కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత
  • అనంతపురం
  • 9440222117
ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి

కదిరి నరసింహుడు కదలి వచ్చాడు. బేట్రాయి సామిగా యువతరం ఐపాడ్‌ల్లో వెలిశాడు. ‘నిన్నే నమ్మితిరా’ అంటూ నవతరం పాడుతుంటే పరవశించి పోతున్నాడు. రాయలసీమ మట్టి మాటల ‘భజన’కు మురిసిపోతున్నాడు. ఏనాడో సీమ జానపదులు కట్టుకున్న బాణీ కొత్త రూపంలోకి మారి ఈనాడు తెలుగు యువతను అలరిస్తోంది. ఇప్పటి వరకూ కాల చీకట్లలో ఉన్న ఆ అచ్చ తెలుగు జానపదం ప్రముఖ కథనాయకుడు పవన్‌కళ్యాణ్‌ గాత్రం ద్వారా మరోమారు ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇంతకూ ఆ జానపద గీత సాహిత్య విశేషాలేంటి? 
జానపద
కవిత్వం సామూహిక సృష్టి. అందుకే, అది అకర్తృకమైంది.  ప్రకృతితో పోరాడే సందర్భంలో తాను పొందిన అనుభవాలను మనిషి తన సాటి వారికి అభివ్యక్తం చేసే ప్రయత్నంలోంచి జానపద కవిత్వం పుట్టింది. అది కొబ్బరి నీళ్లంత స్వచ్ఛంగా, స్వాతిముత్యమంత సుందరంగా ఉంటుంది. మనిషి తన ప్రపంచాన్ని నిర్మించుకునే క్రమంలో సృష్టించుకున్న సకల అంశాలూ కాలక్రమంలో జానపద కవిత్వంలోకి ప్రవేశించాయి. సమాజ పరిణామంలో ఉద్భవించిన సర్వ భావనలూ జానపద కవిత్వంలో భాగమయ్యాయి. అలా దశావతారాలను వర్ణిస్తూ రాయలసీమ పల్లీయులు పలికిన జానపదమే ‘కాటమ రాయుడా...’ గీతం. దీనికి ఎప్పుడు, ఎవరు ప్రాణం పోశారో తెలియదు. ‘పలకల భజన’గా రేనాటి పల్లెల్లో తరచూ వినిపించే ఈ పాట మొదటిసారిగా 1940వ దశకంలో వెండితెరకెక్కింది. అప్పట్లో వచ్చిన ‘సుమంగళి’ చిత్రం కోసం చిత్తూరు నాగయ్య దీన్ని పాడారు. నవతరాన్ని ఆకట్టుకునేలా బాణీలో మార్పులు చేసి ఆ పాటను తాజాగా ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో వాడారు. (పవన్‌కళ్యాణ్‌ ఈ పాటను ఆలపిస్తున్న దృశ్యాలను చూసుంటారు)
      అనంతపురం జిల్లా కదిరిలో శతాబ్దాల నాటి నరసింహస్వామి దేవాలయం ఉంది. ఉగ్ర నరసింహుడు హిరణ్యకశిపుణ్ని సంహరించాక ఈ ప్రాంతానికే వచ్చాడన్నది స్థానికుల విశ్వాసం. అలా ఆగ్రహావేశాలతో వచ్చిన స్వామి... ఇక్కడి అడవిలోని క్రూరమృగాలను వేటాడేవాడని చెబుతారు. అందుకే ఆయనకు వేటరాయుడు అనే పేరు వచ్చింది. భౌగోళికంగా సమీపంలో ఉన్న కన్నడ భాషా ప్రభావంతో ‘వే’ ‘బే’ అయింది. జన వ్యవహారంలో ఈ ‘బేట్రాయిడు’ బేట్రాయి సామిగా మారాడు. 
      అలాగే, ఇదే జిల్లాలోని గొడ్డువెలగల అనే గ్రామానికి ఎదురుగా ఉండే గుట్ట మీద మరో నరసింహుడు ఉన్నాడు. ఆయన్ను కాటేమి రాయుడు (కాటమ రాయుడు) అంటారు. ‘కాడు’ అంటే అడవి. అందులో ఉండే దేవుడు కాబట్టి ఆయనకు ఆ పేరు వచ్చి ఉంటుంది. 
      కదిరి, గొడ్డువెలగల నరసింహులిద్దరినీ ఉద్దేశించి కట్టిన పాట ‘బేట్రాయి సామి దేవుడా’. ఇందులో ఒక్కో చరణం దశావతారాల్లోని ఒక్కో అవతరాన్నీ అచ్చ తెలుగు పదాలతో వర్ణిస్తుంది. మాండలిక పదబంధాలతో కీర్తిస్తుంది. 
      చేపగా పుట్టి, సోమకాసరుణ్ని చంపి, వేదాల(బాపనోళ్ల సదువులెల్ల)ను తిరిగి బ్రహ్మ(బెమ్మదేవర)కు ఇచ్చిన మహా విష్ణువును పొగుడుతున్నారు మొదటి చరణంలో. ‘ఓపినన్ని నీళ్లలోన వలసి వేగామె తిరిగి’ అంటే ‘అవసర్థారం దండిగా ఉన్న నీళ్లలో వేగంగా ప్రయాణించి’ అని అర్థం. ‘సావులేని మందు’ అంటే అమృతమే కదా. దాన్ని దేవతలకు ఇచ్చింది ఎవరు? మోహినీ అవతారంలోని విష్ణుమూర్తి. నాలుగంటే నాలుగు అచ్చ తెలుగు పదాలతో రెండో చరణంలో ఈ విషయం చెప్పారు. క్షీరసాగర మథనం జరుగుతున్నప్పుడు కవ్వంగా ఉన్న మంధర పర్వతం కుంగిపోతుంటుంది. తాబేలుగా మారిన చక్రధారి ఆ కొండ బరువును మోస్తూ క్షీరసాగర మథనాన్ని సాఫీగా పూర్తి చేయిస్తాడు. ఇంత పెద్ద కథను అలతి అలతి పదాల్లోకి అనువదించారు గ్రామీణులు. 
      దగ్గరి వాళ్లను పరాచకమాడటం మనకలవాటే. గోవిందుణ్ని తమ వాడనుకున్న పల్లె ప్రజలు కూడా అలాగే కోడిగమాడుగుతున్నారు. రక్షించడానికి తొందరగా (బేగి - వేగి) రమ్మని పిలుస్తున్నారు. స్వామి ‘పందిలోన సేరే’(వరాహావతరాం) సందర్భంలో ‘అందగాడనవుదులేవయా’ అనడంలో కొంటెతనముంది. ఇక్కడ మరో చక్కటి ఉపమానముంది. అదే... ‘సందమామ నీవె కాద’. చంద్రుడిచ్చే వెన్నెల చల్లగా ఉంటుంది. అలాగే, చల్లగా చూస్తాడంటూ స్వామిని ఆ చందమామతో పోల్చారు.
      మాండలిక మాటల మందారాలతో కూర్చిన ఈ పాట అందాన్ని ఎంత వర్ణించినా తక్కువే. ‘కంబం’ అంటే స్తంభం. ‘కంబాన సేరి ప్రహ్లాదు గాచి’... స్తంభంలో ఉండి ప్రహ్లాదుణ్ని రక్షించిన నారసింహుణ్ని (నారసిమ్మ) ప్రస్తుతిస్తున్నారు పల్లీయులు. అదే చరణం చివర్లో ‘వైరిగాని గుండె దొర్లసేసినోడ’ అన్నారు. వైరి అంటే శత్రువు. అతని గుండెను దొర్లసేయడమంటే? ‘బాగా కొట్టారు’ అనడానికి ‘చితక్కొట్టారు’ అంటాం కదా. ‘దొర్లసేయడ’మంటే అదే. ఆ పదం ఎక్కడి నుంచి వచ్చింది. మడిలోని మట్టిగడ్డలను చితకొట్టడానికి వాడే వస్తువును ‘దొర్లమ్రాను’ అంటారు. దాన్నుంచి ఈ పదబంధాన్ని పుట్టించారన్న మాట. ఇదీ తెలుగు!
      జానపద సాహిత్యం మౌఖికంగా పుట్టింది. కాబట్టి, పదాలను జనం ఎలా పలుకుతారో అలాగే పాటలోకి తీసుకొస్తారు. దీనికి ఉదాహరణ ‘శక్కురవరితి’. ‘చక్రవర్తి’కి దేశ్యమిది. బుడత బాపనయ్య అంటే వేరెవరో కాదు వామనుడు. బలి చక్రవర్తిని అడిగి భూమినేలాడు. (భూమిపై ఒక అడుగు) ‘నిడువాలు’ అంటే ‘పొడవైన’ అర్థం. అందులోంచి ‘నిడువు కాళ్ళోడు’ (పొడవైన కాళ్ళోడు) వచ్చింది. అంత పొడవైన కాళ్లతో వామనుడు ఏం చేశాడు. ‘అడుగు నెత్తిన పెట్టాడు’ (ఆకాశంపై మరో అడుగు). వాస్తవానికి దీనికి బలి తలపై పాదం పెట్టిన అర్థం స్ఫూర్తిస్తుంది. కానీ, అది కాదు. బలిని పాతాళానికి తొక్కాడన్న దాన్ని వివరించే వాక్యం మరోకొటి ఉంది. అది... ‘తడవు లేక లోకమెల్లా మెడిమతోటి తొక్కినోడ’. ఇందులో ‘తడువు లేక’ అంటే ‘ఆలస్యం చేయకుండా’. ‘మెడిమ’ అంటే ‘వెనుక పాదం’. ‘లోకమెల్ల’ంటే... బలి. చక్రవర్తి ‘ధరణీపతి’ కదా. లోకాన్ని తొక్కడమంటే చక్రవర్తిని అణగదొక్కడమే. మొత్తంగా, భూమ్యాకాశాలపై రెండు అడుగులు వేశాక ఆలస్యం చేయకుండా బలిని వెనుకపాదంతో తొక్కేశాడని అర్థం.  
      పరుశురాముడు 21సార్లు లోకవిహారం చేసి క్షత్రియ వంశాలను సర్వనాశనం చేశాడు. అందుకే ఇక్కడ ‘రెండు పదుల ఒక్కమారుతో ఆ దొరలనెల్ల సెండాడినావు పరశుతో’ అన్నారు. ఇక్కడ ‘పరశు(వు)’ అంటే గండ్ర గొడ్డలి. రాముడు శివధనస్సును విరిచినప్పుడు పరశురాముడు ఆగ్రహిస్తాడు. చేతనైతే ఈ విష్ణుచాపాన్ని ఎక్కుపెట్టమని సవాలు చేస్తాడు. రాముడు ఎక్కుపెడతాడు. పరశురాముడికి ‘విషయం’ అర్థమవుతుంది. కానీ, రామబాణం వృథాపోకూడదు కదా. మరేం చేయాలి? తన తపోశక్తిపై దాన్ని ప్రయోగించమని చెప్పి పరశురాముడు మహేంద్ర పర్వతానికి వెళ్లిపోతాడు. ‘కోల’ అంటే ‘బాణమ’నే అర్థముంది. తిరుగు లేని రామబాణాన్ని ‘బెండు’గా చేసి అంటే ‘బలహీనంగా చేసి’ (తపోశక్తిని కొట్టాక అది బలహీనమే కదా) కొండకాడకేగాడు. (పర్వతం దగ్గరకు వెళ్లాడు).
      ‘తండ్రిమాట గాచి’... నాన్న మాటను గౌరవించి అడవికి వెళ్లావు రామచంద్రా! తర్వాత (‘ఆమైన’ - ఆపైన) ‘లంకనెల్ల దోమగాను సేసినావు’. అంటే.. లంకను పడగొట్టావు అని అర్థం. ‘దోమనాకు’ అని ఒక నిఘంటు పదం ఉంది. దీనర్థం.. ‘దోమ తెగులు సోకిన’. ఆ తెగులు వస్తే పంట నాశనమవుతుంది. లంక పరిస్థితి కూడా అలా అయిందని సేద్యం చేసుకునే పల్లె ప్రజలు పాటలో ప్రతీకాత్మకంగా చెప్పారా? 
      ‘తక్కిడి బిక్కిడి సేయట’మంటే గందరగోళం సృష్టించడం. గోపికల వలువలెత్తికెళ్లి కొంటె కన్నయ్య చేసింది అదే కదా. కృష్ణపరమాత్ముడు ద్వారకలోనే ఉంటాడు... కానీ ఎక్కడెక్కడి కథలను మొత్తం తనే నడిపిస్తాడు. ‘తావుబాగా సేసుకొని’ (స్థిరంగా ఉండి) అంటే ఇదే. 
      మానవత్వమున్న వాడే మనిషి, మతాల కట్టుబాట్లు ఆ మనవత్వానికి అడ్డం పడుతున్నప్పుడు ఆ అడ్డుగోడలను బద్ధలుకొట్టాలి. వెలుగుపూలై ఉదయించాలి. బుద్ధుడి బోధనల పరమార్థమిదే. ఆయన కూడా విష్ణుమూర్తి అవతారమేనని భావిస్తారు. అందుకే ‘ఏదాలూ నమ్మరాదని ఆ శాస్త్రాలూ వాదాలూ బాగా లేవని’ అంటూ చెప్పుకొచ్చారు. ‘నమ్మరాదు, బాగాలేవు’ వంటి పదాలతో అరటి పండు వలిచినంత సులువుగా భావాన్ని విడమర్చారు. చివరిగా ‘కల్కి’ని తమ దొరగా ప్రకటించారు. పిల్లనగ్రోవితో విహరించిన చిన్నికృష్ణుణ్ని (సిన్నీ గోపాలుడౌర/ పిల్లంగోవి సేతబట్టి పేటపేట తిరిగినోడ) జ్ఞప్తికి తెచ్చుకుంటూ పాటను ముగించారు.
      అచ్చ తెలుగు పదాల అంబుధి ఈ పాట. ఇందులోని ప్రతి అక్షరంలో మాధవుడిపై మట్టి మనుషుల అభిమానం కనిపిస్తుంది. అంతేకాదు... మనసులోని భావాలను బలంగా, అందంగా అభివ్యక్తీకరించగల శక్తీ గోచరిస్తుంది. మన పల్లెల్లో ఇలాంటి పాటల మూటలెన్నో! వాటిని సేకరించి భద్రపరచడం, వ్యాప్తిలోకి తేవడం భాషాభిమానుల బాధ్యత.
బేట్రాయి సామి దేవుడా - నన్నేలినోడ
బేట్రాయి సామి దేవుడా
కాటేమి రాయుడా - కదిరినరసిమ్ముడా
మేటైన వేటుగాడ నిన్నే నమ్మితిరా    ।। బేట్రాయి ।।
శాప కడుపు సేరి పుట్టగా - రాకాసిగాని
కోపామునేసి కొట్టగా
ఓపినన్ని నీల్లలోన వలసీ వేగామె తిరిగి
బాపనోల్ల సదువులెల్ల బెమ్మదేవరకిచ్చినోడ    ।। బేట్రాయి ।।
తాబేలై తాను పుట్టగా ఆ నీల్లకాడ
దేవాసురులెల్లకూడగా
దోవసూసి కొండకింద దూరగానే సిల్కినపుడు
సావులేని మందులెల్ల దేవర్లకిచ్చినోడ    ।। బేట్రాయి ।।
అందగాడనవుదులేవయా - గోపాల గో
విందా రచ్చించా బేగరావయా
పందిలోన సేరి కోర పంటితోనె ఎత్తి భూమి
కిందు మిందు సేసినోడ సందమామ నీవె కాద    ।। బేట్రాయి ।।
నారసిమ్మ నిన్నె నమ్మితి - నానాటికైన
కోరితి నీ పాదమే గతీ
ఓరి నీవు కంబాన సేరి ప్రహ్లాదు గాచి
కోరమీస వైరిగాని గుండె దొర్లసేసినోడ    ।। బేట్రాయి ।।
బుడుత బాపనయ్యవైతివి ఆ శక్కురవరితి 
నడిగి భూమి నేలుకుంటివీ
నిడువు కాళ్ళోడివై అడుగు నెత్తిపైన బెట్టి
తడవు లేక లోకమెల్ల మెడిమతోటి తొక్కినోడ    ।। బేట్రాయి ।।
రెండు పదులు ఒక్కమారుతో ఆ దొరలనెల్ల
సెండాడినావు పరశుతో
సెండకోల బట్టి కోదండరామసామికాడ
బెండు కోల సేసికొనీ కొండకాడకేగినోడ    ।। బేట్రాయి ।।
రామదేవ రచ్చించరావయా సీతమ్మ తల్లి
శ్యామసుందర నిన్ను మెచ్చగా
సామి తండ్రిమాట గాచి ప్రేమ భక్తినాదరించి
ఆమైన లంకనెల్ల దోమగాను సేసినోడ    ।। బేట్రాయి ।।
దేవకీదేవి కొడుకుగా ఈ జగములోన
దేవుడై నిలిచినావురా
ఆవూల మేపుకొనీ ఆడోళ్ళాగూడుకొనీ 
తావుబాగ సేసుకొనీ తక్కిడి బిక్కిడి సేసినోడ    ।। బేట్రాయి ।।
ఏదాలూ నమ్మరాదనీ ఆ శాస్త్రాలా
వాదాలూ బాగ లేవనీ
బోధనలూ సేసికొనీ బుద్ధూలు సెప్పుకొనీ
నాదావినోదుడైన నల్లనయ్య నీవెకాద    ।। బేట్రాయి ।।
కలికి నా దొరవు నీవెగా ఈ జగములోన
పలికినావు బాలశిశువుడా
చిల్లకట్టు పురములోన సిన్నీ గోపాలుడౌర
పిల్లంగోవి సేతబట్టి పేటపేట తిరిగినోడ...    ।। బేట్రాయి ।।


వెనక్కి ...

మీ అభిప్రాయం