జనజీవన చిత్రణకు మచ్చుతునక చిల్లరదేవుళ్లు

  • 162 Views
  • 0Likes
  • Like
  • Article Share

    ఆర్వీ రామారావ్‌

  • అనుభవజ్ఞులైన పాత్రికేయులు
  • హైదరాబాదు
  • 9676282858
ఆర్వీ రామారావ్‌

కథ, నవల, నాటకం, కవితలాంటి సృజనాత్మక సాహిత్య ప్రక్రియలన్నీ ప్రధానంగా కల్పన మీద ఆధారపడినవే అయినా ఎంత కల్పనా సాహిత్యమైన జన జీవనంతో సంబంధం లేకుండా సృజించడం దాదాపు అసాధ్యం. ఈ సూత్రం నవలకు మరీ ఎక్కువగా వర్తిస్తుంది. అందుకే కల్పనా కథల కన్నా జన జీవిత చిత్రణ మెండుగా ఉన్న నవలలే కేవలం అపారమైన జనాదరణ పొంది నాలుగు కాలాలపాటు నిలవగలుగుతాయి.
      సమాజ పరిణామక్రమాన్ని చిత్రించిన ఉన్నవ లక్ష్మీనారాయణ ‘మాలపల్లి’, మహీధర రామమోహన్‌రావు ‘కొల్లాయిగట్టితేనేమి’, ‘రథచక్రాలు’, బొల్లిముంత శివరామకృష్ణ ‘మృత్యుంజయులు’ లాంటివి కల్పనాపూరిత నవలలతో పోటీపడి పాఠకుల మనసుల్లో శాశ్వత ముద్ర వేయగలిగాయి.
దాశరథి రంగాచార్య తొలినవల ‘చిల్లర దేవుళ్లు’ అలా పాఠకుల మదిలో చెరగకుండా ఉండిపోయిన నవలే.
      తెలంగాణ నుంచి వెలువడిన తొలినవల ‘ప్రజల మనిషి’ రాసిన వట్టికోట ఆళ్వారుస్వామి జన జీవితం నుంచి రచయితగా ఎదిగిన వాడే కనక 1938కి పూర్వం తెలంగాణలో ఉన్న పరిస్థితిని చిత్రించారు. ఆనాటికి తెలంగాణలో ఉన్న పరిస్థితిని మూడు నవలల రూపంలో వెలువరించాలని ఆళ్వారుస్వామి పథకం వేసుకున్నారు. కాని రెండో నవల ‘గంగు’ కొంత పూర్తయిన తర్వాత ఆయన మృతి చెందారు.
      ఆయన ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని ఎవరూ చేపట్టకపోవడంతో దాశరథి రంగాచార్య 1964లో ఆ భారాన్ని స్వీకరించి ‘చిల్లర దేవుళ్లు’ రచన ప్రారంభించారు. తెలంగాణ జనజీవనం, నిజాం పాలన నాటి స్థితిగతులు, తెలంగాణ రైతాంగ సాయుధ సమరం; ఆ రోజుల్లోని సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక అంశాల నేపథ్యంలో రంగాచార్య ‘మోదుగుపూలు’, ‘జనపదం’ నవలలు రాశారు.
      ఇరవయ్య శతాబ్దం నాల్గవ దశకంలో తెలంగాణాలో విప్లవ దావానలం స్వరూప స్వభావాలను దాశరథి రంగాచార్య కచ్చితంగా అంచనా వేశారు. ఈ తిరుగుబాటు ఆవేశాలకూ, ఉద్రేకాలకూ అతీతమైందనీ ఇది ప్రధానంగా భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేక పోరాటం అన్న అవగాహన ఆయనకు స్పష్టంగా ఉంది. ఇది ‘భూమి కోసం, భుక్తి కోసం జరిగిన పోరాటం’ అన్నది ఆయన నిశ్చితాభిప్రాయం. దేశంలో జరిగిన పోరాటాలన్నింటిలోకి భూమి కోసం, భుక్తి కోసం జరిగిన పోరాటం ‘తెలంగాణా సాయుధ సమరం’ మాత్రమేనన్నది ఆయన దృఢాభిప్రాయం.
      చిల్లర దేవుళ్లు నవలలో రంగాచార్య 1938కి పూర్వం తెలంగాణలో ఉన్న తన జీవితాన్ని చిత్రించారు. దానికి కారణం ఏమిటో కూడా స్పష్టంగానే చెప్పారు. అప్పటికి హైదరాబాద్‌ సంస్థానంలో రాజకీయ పార్టీ లేకపోవడమే దానికి కారణం అంటారాయన.
      ఆంధ్రమహాసభ అస్తిత్వంలోకి వచ్చేదాకా తెలంగాణ గాఢాంధకార భూస్వామ్య వ్యవస్థలోనే మగ్గింది. ‘చిల్లరదేవుళ్లు’ నవలలో భూస్వామ్య వ్యవస్థను సకల పార్శ్వాల నుంచి వింగడించే ప్రయత్నం కనిపిస్తుంది.
      భూస్వామ్య వ్యవస్థకు పట్టుకొమ్మలుగా ఉన్న దొరల ధాష్టీకాన్ని బలంగా చిత్రించారు. అయితే ఆ దొరలకూ కళా పిపాస ఉంటుందన్న వాస్తవాన్ని కూడా ఎత్తి చూపారు. రామారెడ్డి దొర సంగీతాభిమాని. సంగీతాన్ని ఇష్టపడే సౌకుమార్యం ఎంత ఉన్నా మనుషులను మనుషులగా చూసే మానవీయ లక్షణం మాత్రం ఆయనలో మృగ్యం. అక్రమ సంబంధం ద్వారా తన కారణంగా జన్మించిన వనజకు కేవలం ఆడపాపగా వాడుకోవడమేకాక వచ్చిపోయే అతిథులందరికీ ఆమె సర్వస్వాన్ని ధారపోయాల్సిన దుస్థితిలో ఉంచిన క్రూర మనస్తత్వం ఆ దొరది.
      రంగాచార్య దృష్టిలో ఏ మనిషైనా కేవలం నలుపు తెలుపు వర్ణాలకే పరిమితమైన వాడుకాడు. ఏ మనిషి వ్యక్తిత్వం అయినా సప్తవర్ణాలతో కూడిన ఇంద్రధనుస్సేనన్నది ఆయన అభిప్రాయం. అందుకే భూస్వామ్య వ్యవస్థ క్రౌర్యానికి ప్రతిరూపమైన దొర పాత్రను ఆయన కేవలం కిరాతకంగా చిత్రించలేదు. ఆ దొరకూ మానవ సహజమైన బలహీనతలు, కించిత్‌ కళాతృష్ణ ఉన్నట్లు చూపించి వాస్తవికతకు నిర్వచనం చెప్పడానికి ప్రయత్నించారు. మిగతా పాత్రలనూ ఇలాగే రూపు కట్టించారు.
      తాను చిత్రిస్తున్నది జనజీవితం కాబట్టి దానికి వినియోగించే భాష కూడా ప్రజలకు అర్థం కావాలన్న ధ్యాసతో సంభాషణలకు తెలంగాణ మాండలికాన్నే వాడారు. తెలంగాణ మాండలికం వాడుకకు ఆయన ఆద్యుడు కాకపోయినప్పటికీ ఒరవడి దిద్దింది మాత్రం కచ్చితంగా రంగాచార్యే.
      రంగాచార్య వ్యక్తిత్వానికి తెలంగాణ చరిత్రను నవలీకరించిన క్రమానికి సన్నిహిత సంబంధం ఉంది. అన్యాయాన్ని, అక్రమాన్ని సహించకపోవడం ఆయన స్వభావం. పూవు పుట్టగానే పరిమళిస్తుంది అన్న రీతిలో చెప్పడం కాదు కానీ నిరసన రంగాచార్యకు బాల్యం నుంచే అలవడిన తత్వం. ఆయనకు 12 ఏళ్ల వయసున్నప్పుడు నిజాం ప్రభుత్వం ఒక మతం వస్త్రధారణా రీతిని విద్యార్థులపై రుద్దడాన్ని సహించలేక మూడు రోజులు సమ్మె చేయించారు. ఆయనను ఆ పాఠశాల నుంచి తొలగించడమే కాకుండా మరే విద్యాసంస్థలోనూ చేరకుండా నిషేధించారు. ప్రస్తుతం ఆయనలో కనిపిస్తున్న మతఛాయలు దీనికి కారణం అని ఆయనా నమ్మొచ్చు, కానీ దేన్నైనా రుద్దడాన్ని వ్యతిరేకించే నిరసన భావం  ఆయనలో ఇప్పటికీ పోలేదు.
      ఈ నిరసన ధోరణే సాంప్రదాయిక కుటుంబంలో పుట్టిన రంగాచార్యను జనజీవితానికి, ప్రజా పోరాటాలకు చేరువ చేసింది. 1942 తర్వాత ఆంధ్రదేశంలో ఎగిసిపడిన ఎర్రకెరటం ఆయననూ తనలో ఇముడ్చుకుంది. ఆయన కమ్యూనిస్టు రాజకీయాల్లో భాగస్వామి అయ్యాడు. ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టు పార్టీ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు. కమ్యూనిస్టు పార్టీయే తనకు జీవితం నేర్పిందని ఇప్పటికీ దాపరికం లేకుండా చెబుతుంటారు. అనేకమంది వీర కమ్యూనిస్టుల్లాగా ఆయన జీవిత చరమాంకంలో దైవభక్తిని ఆసరాగా చేసుకున్న అవకాశవాది కాదు. ఈ లక్షణం ఆయన అస్తిత్వానికి ప్రతీక అయితే ఆయన తెలంగాణ జీవితాన్ని వర్ణించిన తీరు, అందులో కనబర్చిన చిత్తశుద్ధి ఆయనలోని చైతన్యానికి, వాస్తవ పరిస్థితుల ప్రభావానికి నిదర్శనం. రంగాచార్యను దగ్గరగా ఎరిగిన వారికి ఈ భిన్న కోణాలు పరస్పర విరుద్ధమైనవిగా కాక అపురూపమైన సమన్వయం సాధించినట్టు కనిపిస్తాయి.
      1969లో చిల్లర దేవుళ్లు నవల వెలువడడం, అదే సంవత్సరం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం రావడం యాదృచ్ఛికం కావచ్చు గానీ తెలంగాణతో సంబంధం లేదనుకునే తెలుగు వారికి తెలంగాణను అర్థం చేయించడానికి ‘చిల్లర దేవుళ్లు’ బాగా ఉపకరించింది.
      రంగాచార్య వ్యక్తిత్వంలో ఉన్న ఈ వైవిధ్యమే ఆయన ప్రధాన రచనలన్నింటిలోనూ కన్పిస్తుంది. అది వైరుధ్యం మాత్రం కాదు. వాటన్నింటిలో చిల్లరదేవుళ్లు నిస్సందేహంగా కలికితురాయే.
      శిల్పరీత్యా ‘చిల్లర దేవుళ్లు’ నవలలో లోపాలు ఎన్నడం అసాధ్యం కాదు. ఆంధ్ర పితామహా మాడపాటి హనుమంతరావుతో నవలలో ప్రధాన పాత్రధారి సారంగపాణి సంభాషణ, అందులో తెలంగాణ పరిణామ క్రమాన్ని వివరంగా ఆరు పేజీలపాటు వర్ణించడం, నరేంద్రజీ ప్రస్తావన మొదలైనవి నవలా శిల్పానికి తగినవిగా కనిపించకపోవచ్చు. కానీ తను తీసుకున్న కథా వస్తువును విడమర్చడానికి రంగాచార్య ఎన్నుకున్న మార్గమిదే.
      అలాగే నవలలోని మంజరి పాత్ర అందమైన కల్పన. దొరకు ఉన్న కళాభిమానానికి ముచ్చట పడడం వల్లే కావచ్చు ఆయనను ప్రజలు అంతం చేసినట్టు కాకుండా సహజ మరణాన్ని ప్రసాదించారు రచయిత. ‘కరణం కన్నా దొర మేలు’ అని సారంగపాణి చేత అనేక సందర్భాల్లో చెప్పించిన రచయిత అందుకే కరణాన్ని లంబాడీలు కడ తేర్చినట్టు చూపించారు. వ్యవస్థ కన్నా వ్యవస్థకు ఉపకరించిన కరణంలాంటి ఉపకరణాలు ఎక్కువ ప్రమాదకరం, మరింత ప్రజా కంటకం అని వాదించడానికి అవకాశం ఉన్న మాట నిజమే అయినా దీనివల్ల వాస్తవిక చిత్రణకు ఏ మాత్రం భంగం కలగకపోవడం రంగాచార్య ప్రతిభకు తార్కాణం.
      ‘చిల్లర దేవుళ్లు’ రచన పూర్తి చేసిన రంగాచార్య దానికి పేరు పెట్టలేదు. ఆ పని చేసింది నార్ల చిరంజీవి. ఈ నవల ‘ప్రగతి’ వారపత్రికలో దాదాపు తొమ్మిది నెలలపాటు ధారావాహికగా ప్రచురితం అయినప్పడు, 1969లో నవలగా అందుబాటులోకి వచ్చినప్పుడు, 1971లో ఆకాశవాణిలో ‘రేడియో నాటకం’గా ప్రసారమైనప్పుడూ తెలుగు పాఠకులు ఆంధ్ర, తెలంగాణ అన్న భేదం లేకుండా సమానంగానే సమాదరించారు. ఇప్పటికీ ఈ నవల పాఠకులను ఆకర్షిస్తూనే ఉంది. వాస్తవిక రచనలకు ఉండే విశిష్టత అదే.


వెనక్కి ...

మీ అభిప్రాయం