సరదా సరదా దసరా పాటలు

  • 137 Views
  • 0Likes
  • Like
  • Article Share

    చింతలపల్లి హర్షవర్ధన్‌

  • గట్టుఇప్పలపల్లి, మహబూబ్‌నగర్‌ జిల్లా
  • 9014897030
చింతలపల్లి హర్షవర్ధన్‌

పల్లె జీవితాలు ఉరుకులూ పరుగులూ లేకుండా సాగుతున్న రోజులవి. పల్లెలో ఓ విధమైన నిశ్శబ్దం ఆవరించి ఉండేది. పండుగలప్పుడు మాత్రం ఊరంతా సందడి నెలకొనేది.     
      ఇరవయ్యో శతాబ్దం చివరి వరకూ చదువులు, కనీసం పాఠశాల స్థాయి వరకైనా పల్లెలోనే సాగేవి. దసరా వస్తోందంటే ఇల్లంతా కళకళలాడుతుండేది. బడికి సెలవులు పది రోజులిచ్చేవారు. ఆ పది రోజులూ సరదాగా సాగిపోయేవి. వర్ష రుతువు వెళ్లిపోయి శరదృతువు  తొలినాళ్లు. ఊరి చుట్టూ పంటపొలాలు, పొలాలను చీల్చుకుంటూ వర్షాలకు గుంతలుపడిన రోడ్డు, ఆ రోడ్డుపై గుంతల మూలాన అటూఇటూ వయ్యారంగా ఊగుతూ ఎర్రబస్సు, తమ ఇంటికొచ్చే చుట్టాల కోసం ఎదురు చూసే వారితో బస్టాండ్‌ సందడిగా ఉండేది. తాము ఎదురు చూసిన వారు రాలేదంటే ఏదో తెలియని బాధ, ఆ విషయాన్ని అడిగినవారి ముందు చిన్నతనం... ఇలా ఉండేది. ఇక అయిదు నుంచి పదేళ్ల పిల్లలకైతే అవి అంతులేని ఆనందాల నిలయంగా ఉండేవి. చిన్నపిల్లలను పల్లెల్లో కేవలం ప్రభుత్వ బడిలోనే కాకుండా క్రమశిక్షణ నిమిత్తం కొంత లోకజ్ఞానం తెలిసిన వీధిబడి పంతులుగారి దగ్గరకు పంపేవారు. ఆయనంటే పిల్లలకు గౌరవంతో కూడిన భయం. 
      దసరా అంటే రైతులకు ఖరీఫ్‌ పంట చేతికొచ్చే రోజులు. దీంతో ఊరంతా వ్యవసాయపు పనులకెళ్లే వారితో హడావుడి పడేది. రైతును ఆశ్రయించుకుని ఉండే కమ్మరం, వడ్రంగం, కుమ్మరం ఇలా ఇతర చేతివృత్తుల వారు చేతినిండా పనితో ఎంతో ఉత్సాహంగా ఉండేవారు. మనుషులతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో భాగమైన ఎద్దులు, ఆవులు, బర్రెలు, దున్నలు మొదలైన పశువుల రావాలతో పల్లె పరవశించేది. ఏ ఊర్లో చూసినా ఒకరకమైన ఆత్మీయత పాదుకున్న వాతావరణం దర్శనమిచ్చేది. ఇంత సందడిలో పిల్లలంతా ఏంచేస్తుండే వారనుకున్నారు?
      దసరా సెలవులు కదా... మార్కులు, ర్యాంకుల రొద తెలియని, భవిష్యత్తుపై బెంగలేని రోజులు కావటంతో వాళ్లంతా ఆటపాటల్లో మునిగి పోయేవారు. ఇక చివరి మూడురోజులు మాత్రం...అంటే దుర్గాష్టమి, మహర్నవమి, విజయ దశమి నాడు వీధిబడి అయ్యోరితో దసరా పాటలు పాడుతూ ఊరంతా సందడి చేసేవారు. ఈ గుంపులో ఓ యాభై మంది దాకా ఉండేవారు. కొంచెం చురుకుగా ఉండేవారు ముందు వరుసలో ఉండేవారు. 
       సాధారణంగా పల్లెల్లో వీధిబడులు ఆ ఊరి దేవాలయంలో ఉండేవి. దుర్గాష్టమి నాడు వీధిబడిగా ఉన్న దేవాలయం నుంచి పిల్లల గ్రామ సందర్శన మొదలయ్యేది. మొదటగా ఆ ఊరి పురోహితులో, ఆ ఊరి పెద్ద ఇంటికో వెళ్లేవారు. ముందుగా 
‘శ్రీగణాధీశాయ శివకుమారాయ 
నాగముఖ తుండాయ నాగభూషాయ
లోకజన వంద్యాయ లోక నేత్రాయ
శ్రీకంఠ తనయాయ సృష్టి కర్తాయ 
బాగుగా విద్యలకు ప్రౌఢిగా దేవ 
జయావిజయీ భవ దిగ్విజయీ భవ
అంటూ... వినాయక గానంతో సందర్శించే ఇంటి వారికి ఏ ఆటంకాలు లేకుండా, అన్నింటా జయం కలగాలని, కోరుతూ...
శ్రీరస్తు విజయోస్తు దీర్ఘాయురస్తు
ధన కనక వస్తు వాహన సిద్ధిరస్తు
కారుణ్యముగ మీకు కల్యాణమస్తు
ఆశ్వయుజ శ్రీ శుద్ధ మహర్నవమి నాడు 
బాలకుల దీవెనలు బ్రహ్మదీవెనలు
చాల సంతోషులై చెలగుచు మీరు
బహుమానములనిచ్చి పంపండి వేగ
ధన ధాన్యములు గలిగి ధర్మములు గలిగి
పుడమి వర్ధిల్లండి పుణ్యములు గలిగి
యెడతెగని సంపదలు యే ప్రొద్దు గలిగి
కొడుకులు కోడండ్లు కొమరొప్ప గలిగి
మనుమలకు మనుమలకు మనుమళ్లు గలిగి
బంధుజాలంబుల ప్రఖ్యాతి గలిగి
మీ కీర్తి ధరలోన మేటియైదనర
వెయ్యారు లేమైన వేడేది లేదు
అయ్యవారికి చాలు ఐదు వరహాలు
పిల్లవాండ్లకు చాలు పప్పుబెల్లాలు

అంటూ సాగేవారు.
      ఒకప్పుడు ఊళ్లలో వీధిబడులే ఉండేవి. పంతులు గారికి రాబడి అంతంత మాత్రమే. అందుకే బతక లేక బడి పంతులు... అనేవారు. దసరా రోజుల్లో కొంత మొత్తమైనా గురుదక్షిణ లభిస్తుందనే నమ్మకంతో  పంతులుగారు బడి పిల్లలతో కలిసి వాళ్లిళ్లకు పాటలు పాడిస్తూ వెళ్లేవారు. అలా దసరా పాటలు మొదలయ్యాయి. 
      దీనికి అనుగుణంగానే  పిల్లలతో మీకు అన్నింటా మంచి జరగాలన్నదే తప్ప, మాకు భారీ దక్షిణ అవసరం లేదంటూ..
శ్రీరస్తు మీకెల్ల దిగ్విజయమస్తు
ఆయురభ్యుదయోస్తు ఐశ్వర్యమస్తు
మీ కుమాండ్లము గాన మేము వచ్చితిమి
దసరాకు వస్తిమని విసవిసలు పడక
బహుమానములనిచ్చి పంపండి వేగ
అయ్యవారికి చాలు ఐదు వరహాలు
పిల్లవాండ్లకు చాలు పప్పుబెల్లాలు

      అని మరో పాట పాడించేవారు. అయితే ధరలు పెరుగుతూ ఉంటాయి. అవసరాలు మారుతూ ఉంటాయి. కనుక అయిదు వరహాలు తర్వాత పది వరహాలయ్యాయి. ఏ ఇంటి దగ్గర ఆ ఇంటి పిల్లలతోనే పాడించేవారు. ఆ ఇంటి వాళ్లకు తెలుసు వీరంతా దసరా భత్యానికి వచ్చారని. డబ్బు అంతగా చలామణిలో లేని రోజులు. దీంతో ఇంటివారు డబ్బులిస్తారో ఇవ్వరో అన్న అనుమానం. అందుకనే పిల్లలు ‘మీ కుమాండ్లముగాన మేము వచ్చితిమి’- మీ పిల్లలం వచ్చాం- అంటూ  ‘దసరాకి వస్తిమని విసవిసలు పడక బహుమానములనిచ్చి పంపండి వేగ...’ అని పాడేవారు. ఆ ఇంటి వారు ఇంకా ఆలోచనలో ఉంటే పిల్లలందరు ‘బాలకుల దీవెనలు బ్రహ్మదీవెనలు’ అని ఆశీఃపూర్వకంగా అడిగేవారు. బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు కదా! ఇంతగా అడిగితే కాదు, లేవు అనేవారుంటారా? వారికి పదో పరకో ఇచ్చి పంపేవారు. ఏదేమైనా పిల్లలు దసరా పాటలు పాడుతూ ఉంటే ఆ ఇల్లంతా సంతోషంతో వినేవారు. 
      ఇక ఆ ఊరి ఆర్థిక వ్యవహారాలకు ప్రాణంగా నిలిచే వైశ్యుల ఇంటికెళ్తే... 
కోటి పడగెత్తిన కోమట్లలోన
నూటొక్క గోత్రాన నుతికెక్కు జాణ
సాటియెవ్వరు మీకు చక్కదనమెన్న
ముత్యాల బేరములు ముదముతోడుతను
పగడాల బేరములు పరుగులాడుచును
ఉబ్బుచు మీ ఇంట్ల ఒప్పుగా లక్ష్మి
కిలకిలా నవ్వుచును కేకవేయుచును
సాంబశివుడు మీకు సామ్రాజ్య పదవి
ఇచ్చుచుండును ఎపుడు అఖిల సంపదలు
కన్యక వరముచే ఘనతకెక్కితిరి
మీ కీర్తి ధరలోన మేటియైదనర
పెద్ద కోమట్లలో పేరుబడసితిరి

      అంటూ మళ్లీ కొడుకులు కోడండ్లు కొమరొప్ప గలిగి... అని దీవిస్తూ, తాము వెళ్లింది వైశ్యుల ఇల్లు కనుక వెయ్యారు లేమైన వేడేది లేదు అని అన్నా... తర్వాత మీరు తగినంత ఇవ్వండి అనే ఉద్దేశం స్ఫురించేలా 
పావలాబేడయితె పట్టేది లేదు
అర్ధరూపాయయితె అంటేది లేదు
మూడుపావలాలయితె ముట్టేదిలేదు
అయ్యవారికి చాలు ఐదు వరహాలు
పిల్లవాండ్లకు చాలు పప్పుబెల్లాలు...’’
అని పాడుతూ వారిచ్చిన దక్షిణ తీసుకుని ముందుకు సాగిపోతారు పిల్లలు.
      ఇతర వృత్తుల వారిళ్ల వద్ద వారికి సంబంధించిన పాటలే పాడేవారు. ఇలా దుర్గాష్టమి, మహర్నవమి రెండు రోజులూ ఊరంతా తిరిగే వారు.
      పంతులుగారి వెంట పిల్లలు దసరా భత్యానికే బయలుదేరినా, విద్యాధిదేవత సరస్వతిని కూడా
సరస్వతీ సతి మాకు చాలంగనిమ్మ
పరమేష్ఠిరాణి మము పాలించవమ్మ
సలలిత మృదుపాణి యలినీలవేణి
పల్లవారుణపాద పరమ కల్యాణి
సమ్మతిగ నినుగొల్తు సద్గుణ కదంబ 
మమ్ము ధన్యుల జేయుమా శారదాంబ
జయా విజయీభవ దిగ్విజయీభవ

అంటూ మాకు విద్య, ధనం చాలినంత ఇవ్వు తల్లీ అని ప్రార్థించేవారు.
      పాటల్లో పాడినట్లుగానే అయ్యవారికి కొన్ని వరహాలు ముట్టేవి. వీటితో అయ్యవారు కూడా దసరా పండుగ జరుపుకునేవారు. వాటిలో కొన్ని రూపాయలతో కొబ్బరికాయలు, మరమరాలు, బెల్లం, పుట్నాలు కొనేవారు. విజయ దశమి నాడు గుడిలో పూజచేసి, ప్రసాదం పంచేవారు. ఇలా మూడు రోజుల పాటు బాలకుల సందడితో పల్లె సరదాగా సంబరం చేసుకునేది. 
      తెలుగునాట మరికొన్ని ప్రాంతాల్లో పిల్లలు వేషాలు వేసుకుని, వెదురు విల్లంబులతో వెళ్లి ఆ ఇంటి వారిపై బాణాలతో పూలు, రంగుకాగితాలవాన కురిపించే వాళ్లు. ఇలా చేయడం వారింట శుభం జరగాలనే ఉద్దేశమే. ఇలా దసరా వాతావరణం పిల్లల్లో ఐకమత్యాన్ని పాదుకొల్పేది.
      కొన్ని చోట్ల ఇవి దసరా మామూళ్ల రూపం సంతరించుకున్నాయి. కానీ చాలా వరకు గురువులకు గౌరవంగానే తమకు తోచినంత ఇచ్చేవారు. 
      కారణాలేమైనా ఆ సంతోషాలు, సరదాలు... వాటి వెంటే మన తెలుగుదనమూ కనుమరుగవుతోంది! ఇప్పటి ఉపాధ్యాయ తరానికి అలా ఇల్లిల్లూ తిరగడం నచ్చకపోయినా కనీసం ఆ బాలగేయాల్ని, ఆ బాలగోపాలానికీ అందిస్తే అదే పదివేలు! 

(పాట‌ల స‌హ‌కారం: నాగుల ల‌క్ష్మీప‌తి, గ‌ట్టు ఇప్ప‌ల‌ప‌ల్లి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌)‌


వెనక్కి ...

మీ అభిప్రాయం