తమిళులూ తెలుగు ప్రియులే!

  • 119 Views
  • 0Likes
  • Like
  • Article Share

    రావినూతల శ్రీరాములు

  • హైదరాబాదు
  • 8885653924
రావినూతల శ్రీరాములు

తెలుగును తెలుగు వారు ప్రేమించడం సహజం. తెలుగును తమిళులు అభిమానించడం అసామాన్యం. అనన్య ఖ్యాతి గడించిన తమిళ సాహితీవేత్తలు, రాజకీయ, ఆధ్యాత్మిక రంగాల్లోని ప్రముఖులు తెలుగును కళ్లకద్దుకున్నారంటే మరీ ప్రత్యేకం. ఇంతకూ తెలుగును అంతగా నెత్తినపెట్టుకున్న తమిళులెవరు?
మాతృభాషాభిమానాన్ని
అణువణువునా జీర్ణించుకున్న గడ్డ తమిళనాడు. ఆ మట్టిపై పుట్టిన పెద్దల్లో కొందరికి తెలుగంటే ఇష్టం. మరికొందరికి మహాఇష్టం. ‘సుందర తెనుంగు’ అని వారిలో ఒకరు మన భాషను ప్రశంసిస్తే తెలుగునాట పుట్టడమే అదృష్టమని మరొకరు మన భాగ్యాన్ని కొనియాడారు.
ఆంధ్రత్వ మాంధ్రభాషాచ
ఆంధ్ర దేశ జన్మ భూః
నాల్పస్య తపసః ఫలం

      లోకప్రసిద్ధమైన ఈ శ్లోకాన్ని చెప్పింది అప్పయ్య దీక్షితులు. తమిళనాడు వేలూరు సమీపంలోని అడయపాలెంలో జన్మించిన గొప్ప అద్వైతి. తెలుగునాట పుట్టడం, తెలుగును మాతృభాషగా పొందడం జన్మజన్మల పుణ్యఫలమన్నది ఆయన నిశ్చితాభిప్రాయం.
      గత శతాబ్దికి చెందిన కంచి పరమాచార్య కూడా తన ప్రసంగంలో ఒకసారి తెలుగు వారి అదృష్టాన్ని ప్రశంసించారు. తెలుగు దేశం త్రిలింగాల మధ్య ఉండటం, తెలుగు లిపి వామావర్తమై అంబికకు ప్రీతి కలిగించేదవడం, ‘ఓం నమఃశివాయ’ అనే పంచాక్షరితో తెలుగు వారి అక్షరాభ్యాసం ప్రారంభం కావడం వల్లే తెలుగు వారు అదృష్టవంతులయ్యారని పరమాచార్య చెప్పారు. తిరువణ్ణామలైలో ఉంటూ జ్ఞానబోధ చేసిన రమణ మహర్షి (అసలు పేరు వెంకటరమణ్‌ అయ్యర్‌) తొలితరం భక్తులలో చాలామంది తెలుగువారే. గణపతిముని, యోగిరామయ్య, మునగాల వెంకట్రామయ్య, నవీనస్వామి, గంభీరం శేషయ్య లాంటి వారందరితో మహర్షి తెలుగులో ధారాళంగా మాట్లాడేవారు. గణపతిముని సాయంతో తెలుగు ఛందోరీతులపై పట్టు సంపాదించిన ఆయన మన భాషలో పద్యాలూ రాశారు. యోగిరామయ్య కోరిక మేరకు తమిళంలోని తన రచన ‘ఉపదేశ ఉందియార్‌’ను తెలుగులోకి అనువదించారు. చక్కటి ద్విపదల్లో ‘ఉపదేశసారా’న్ని అనుగ్రహించారు. అంతేకాదు, తమిళ ఛందస్సును అనుసరించి తెలుగులో వెణ్పా ఛందస్సును ప్రవేశపెట్టారు. ఆచార్య ఓరుగంటి రామచంద్రయ్య, గుర్రం సుబ్బరామయ్య తదితరులు ఆ ఛందస్సును స్వీకరించి కవితలల్లారు కూడా. రమణ మహర్షి తెలుగు అక్షరాలు ముత్యాల్లాగా మెరిసిపోయేవి. 
      తమిళ జాతీయకవి సుబ్రహ్మణ్య భారతి భారతదేశ వైవిధ్యాన్ని వర్ణిస్తూ రాసిన గేయంలో ‘సుందర తెనుంగ్‌’ అంటూ మన అమ్మభాష సొగసును కీర్తించారు. జూన్‌ 9, 1917 నాటి ‘శక్తిదాస్య’ పత్రికలో సుబ్రహ్మణ్య భారతి ఒక వ్యాసం రాశారు. అందులో ఏమంటారంటే... తెలుగు వారు తమిళులను పరిపాలించినప్పటి చిహ్నాలు మన భాషలో, నిఘంటువుల్లో చెరగని ముద్రలుగా నిలిచిపోయాయి. మన సంగీత నాట్యశాస్త్రాలు తెలుగులోనే మునిగి ఉన్నాయి. మన గాయకులు ఆలపించే కీర్తనలలో ఉత్తమమైనవి తెలుగు కీర్తనలే! దేవదాసీలు నాట్యం చేసేటప్పుడు పాడే వర్ణాలు, జావళీలు మొదలైన వాటిలో కూడా రుచికరమైనవి తెలుగు భాషలోనివే! మన గ్రామాల్లో నివసిస్తున్న తెలుగు రెడ్లు, నాయుళ్లు, బ్రాహ్మణ పురోహితులు తదితరులు కృష్ణదేవరాయల కాలంలో ఇక్కడకు వచ్చి స్థిరపడినవారు. మన భాషలో గమనం, ఎచ్చరిక, దొర, వాడిక, కొంచెం వంటి వందలకొద్దీ తెలుగు మాటలు కలసిపోయాయి. తెలుగువారి ఏలుబడిలో తమిళదేశంలో అధర్మం లేదు. తమిళులకు ఒక న్యాయమనీ, తెలుగువారికి మరో న్యాయమని ఉండేది కాదు.
      ప్రఖ్యాత తమిళ సాహిత్య పరిశోధకుడు యు.వి.స్వామినాథయ్యర్‌ పూర్వులంతా సంగీత విద్వాంసులే. మీరెందుకు వారిని అనుసరించలేదని అడిగారెవరో ఆయన్ను ఒకసారి. ‘సంగీతానికి తెలుగు భాషా పరిచయం క్షుణ్నంగా ఉండాలి. నాకు అది లేనందున ఆ జోలికి పోలేద’ని చెప్పారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా పని చేసిన రాజాజీ హోసూరు ప్రాంతంలో జన్మించారు. అక్కడ తెలుగు వారి సంఖ్య ఎక్కువ. అందుకే, ఆయనకు తెలుగుతో గట్టి పరిచయమే ఉండేది. ఒకసారి ఆయన మన రాష్ట్ర పర్యటనకు వచ్చారు. ఆంగ్లంలో ప్రసంగిస్తుంటే మరొకరు దాన్ని తెలుగులోకి అనుదించి చెబుతున్నారు. అయితే, ఆ అనువాదం సరిగా లేదని భావించి రాజాజీనే తెలుగులో మాట్లాడారు. దాంతో ఆశ్చర్యపోవడం శ్రోతల వంతైంది. 
      ఆంధ్రరాష్ట్ర అవతరణ కొన్ని రోజుల ముందు మద్రాసు సచివాలయం తెలుగు ఉద్యోగుల వీడ్కోలు సమావేశం జరిగింది. దానికి ముఖ్యమంత్రి రాజాజీ వచ్చారు. ఆ సభా ప్రారంభంలో ఓ ఉద్యోగి ప్రార్థన చేస్తూ పోతన భాగవతంలోని ఓ పద్యం చదివారు. దాన్ని మనసులో ఉంచుకున్న రాజాజీ, తన ప్రసంగంలో పోతన రచనా వైభవాన్ని వర్ణించారు.   పోతన భాగవతాన్ని వి.కాళిదాసు వచనంలో ప్రచురిస్తున్నప్పుడు... రాజాజీ చక్కని తెలుగులో దానికి ముందుమాట రాశారు.
      తమిళనాడులో 1967లో తొలిసారి డీఎంకె అధికారంలోకి వచ్చింది. అన్నాదురై ముఖ్యమంత్రి అయ్యారు. హోసూరు శాసనసభ సభ్యునిగా తెలుగు వ్యక్తి కె.ఎస్‌.కోదండరామయ్య గెలుపొందారు. ఆయన తెలుగులో ప్రమాణ స్వీకారం చేస్తానంటే అన్నాదొరై సంతోషంగా అంగీకరించారు. ఒకరోజు శాసనసభలో అన్నాదొరై... ‘రూపాయికే పడిబియ్యం’ పథకాన్ని ప్రకటించారు. దీనిపై హర్షం వ్యక్తం చేస్తూ కోదండరామయ్య ఈ పద్యం చదివారు.
అన్నాదొరై పాలనలో 
అన్నానికి కరవు లేదు అదియెట్ల
పన్నుగ రూపాయికి పడి 
మున్నెన్నడు బియ్యమిడితి మునుకొని చూడన్

      తెలుగు భాషా ప్రేమికుడైన అన్నాదురై ఈ పద్యాన్ని కాగితంపై రాయించుకుని తన దస్త్రంలో పెట్టుకున్నారు. కొద్ది రోజుల తర్వాత కొందరు తెలుగు ప్రముఖులు ఆయన్ను కలిశారు. రాష్ట్రంలో తెలుగుకు సముచిత గౌరవమివ్వాలని కోరారు. ‘అనుసంధాన భాషగా కేంద్రం ప్రతిపాదించిన హిందీకి బదులు మేం తెలుగును గ్రహిస్తాం’ అని అన్నాదురై వారికి హామీ ఇచ్చారు. తర్వాత అధికార పీఠాల్లోకి ఇతరులు రావడంతో అది సాధ్యం కాలేదు. 
      మద్రాస్‌ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా 1949లో తెలుగు భాషా సమితి ఏర్పాటైంది. ఆనాటి ఉపకులపతి లక్ష్మణస్వామి ముదలియార్‌ దీన్ని ప్రారంభించారు. అంతేకాదు, ఆరంభ సభలో ఆయన చక్కటి తెలుగులో మాట్లాడారు.  విశ్వవిద్యాలయంలో తెలుగు బోధన ప్రారంభమై 50 ఏళ్లు పూర్తవడంతో తర్వాత కాలంలో ఓ విశేష సంచిక ప్రచురించారు. అందులో పూర్వ మద్రాసు ముఖ్యమంత్రి యం.భక్తవత్సలం ముఖాముఖీ ఇచ్చారు. అందులో భక్తవత్సలం... ‘మా అక్క, అన్నదమ్ములమందరం ముందుగా తెలుగు అక్షరాలు నేర్చుకుని తర్వాత తమిళ పాఠాలు చదివాం. ఆంధ్ర కాంగ్రెస్‌ నాయకులు తమిళనాడులో పర్యటిస్తున్నప్పుడు, డా।। పట్టాభి సీతారామయ్య తెలుగు ప్రసంగాన్ని నేను తమిళంలోకి అనువదించా’నని చెప్పారు.
      ఇలా ఎందరో తమిళ పెద్దలు మన పలుకుపై అభిమానం పెంచుకున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా దాన్ని ప్రదర్శించారు కూడా. బయటి వాళ్లు మన భాష గొప్పతనాన్ని గుర్తించి గౌరవించినప్పుడు మనమెందుకు మన మాతృభాషను విస్మరిస్తున్నాం? ఉమ్మనీటిలో ఉన్నప్పడే అమ్మభాషతో అల్లుకున్న అనుబంధాన్ని పోగొట్టుకుంటే మిగిలేది రసహీన జీవితమే.


వెనక్కి ...

మీ అభిప్రాయం