యూనివర్సిటీ గ్రాంట్స్ కమిటీ వారి నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్)- జూనియర్ రీసెర్చి ఫెలోషిప్ (జెఆర్ఎఫ్), పరీక్ష జరగనుంది. జూనియర్, సీనియర్ అధ్యాపకుల ఉద్యోగాల భర్తీ నేపథ్యంలో అభ్యసనాంశాల్లో ‘అలంకారశాస్త్రం’ ముఖ్యమైంది.
కవి- కావ్యం- కావ్యాత్మ
‘కవి’ శబ్దం బ్రహ్మకు పర్యాయపదంగా ఈశావాస్యోపనిషత్తులో కనిపిస్తుంది. ‘కవి’ శబ్దం మొదటగా వేదాల్లో పరమాత్మ పరంగా, తర్వాత సాక్షాత్కారం పొందే రుషుల పరంగా వాడారు.
‘నానృషిః కురుతే కావ్యమ్’- రుషి కానివాడు కావ్యస్రష్ట కాలేడు అని ‘కవయః క్రాంత దర్శినః’ కవులు క్రాంత దర్శులని సంస్కృతంలో లోకోక్తులు చలామణిలో ఉన్నాయి. తెలుగులో ‘రవిగాంచనిచో కవి గాంచును’ అనే లోకోక్తి ప్రచారంలో ఉంది.
నవనవోన్మేష శాలినీ అయిన ప్రజ్ఞ అనే ప్రతిభతో ‘వర్ణన’ సల్పగల నిపుణుడు కవి అని భామహుడు వ్యాఖ్యానించాడు.
లోకోత్తర వర్ణన సలుపగల వాడు కవి అని, కవి కర్మ కావ్యమని ముమ్మటుడు నిర్దేశించాడు. స్రష్టయైన కవి కాలక్రమంలో ఒక మెట్టు దిగి ద్రష్ట అయిన రుషి అయ్యాడు. మరొక మెట్టు దిగి రుషి అయిన కవి వర్ణనా నిపుణుడు కావాల్సి వచ్చింది. లోకోత్తర వర్ణనా నిపుణత్వం, ప్రతిభా లభ్యం. ‘ప్రతిభ’ దేవతానుగ్రహ సంపాద్యం. దేవతానుగ్రహం తపస్సంపాద్యం. తపస్సు రుషికర్మ. కవి కర్మకావ్యం అని తేలింది.
అనంతమైన కావ్య ప్రపంచంలో కవే బ్రహ్మ అని ఆనందవర్ధనుడు పేర్కొన్నాడు.
లోక నియతికి లోబడక, సర్వతంత్ర స్వతంత్రమై నవరస రుచిరమై ఆనంద తన్మయత్వంతో నిండిన కావ్యసృష్టిని చేసే కవివాణికి జయమగుగాక అని ముమ్మటుని శ్లోకతాత్పర్యం.
చలువ గల వెన్నెలల చెలువునకు సౌరభము
గలిగినను సౌరభము జలువయు దలిర్పం
బొలుపెసగు కప్పురపు బలుకులకుగోమలత
నెలకొనిన సౌరభము జలువ పసయుం గో
మలతయును గలిగి జనముల మిగుల బెంపెసగు
మలయ పవనంపు గొదమలకు మధురత్వం
బలవడిన నాడు మఱికల దనగవచ్చు గడు
వెలయగల యీ సుకవి పలుకులకు నెంచన్
- పింగళి సూరన (కళాపూర్ణోదయం)
వాస్తవ జగత్తులో కొదవలన్ని కవితా జగత్తులో తీరిపోతాయనేది పై పలుకుల్లో స్పష్టమవుతుంది.
వర్ణించేవాడు కవి అని విద్యాధరుని అభిప్రాయం.
కావ్యం
వేదాలు ప్రభుసమ్మితాలు. పురాణాలు మిత్ర సమ్మితాలు. కావ్యాలు కాంతా సమ్మితాలు అంటారు.
వర్ణించేవాడు కవి అయితే వర్ణించేది కావ్యం.
ఆలంకారికులలో శబ్దమే కావ్యం అనే వారు కొందరు, శబ్దార్థాలు కావ్యం అనే వారు కొందరు.
శబ్దమే ‘కావ్యం’గా గల నిర్వచనాలు
* ఇష్టార్థ వ్యవచ్ఛిన్నా పదావళి కావ్యమ్ - దండి (కావ్యాదర్శం)
* నిర్దోషం గుణవత్కావ్య మలంకారై రలంకృతమ్, రసాత్మకం కవిః కుర్వన్ కీర్తిం ప్రీతించవిందతి - భోజుడు (సరస్వతీ కంఠాభరణం)
* ‘‘రమణీయార్థ ప్రతిపాదక శబ్దః కావ్యమ్’’ - జగన్నాథుడు (రసగంగాధరం)
కావ్య నిర్వచనాల్లో ఉత్తమ నిర్వచనం జగన్నాథుని నిర్వచనమే. రమణీయమైన అర్థాన్ని ప్రతిపాదించే కేవల శబ్దమే కావ్యం. రమణీయత్వాన్ని గురించి జగన్నాథుడు ఇలా పేర్కొన్నారు.
‘ఒక్కొక్క అర్థాన్ని పునః పునరను సంధానం చేయగా అలౌకికానందం కలుగుతుంది. ఆ ఆనందాన్నే లోకోత్తరాహ్లాదమని అంటారు. ఆహ్లాదం లోకోత్తరత్వానికే చమత్కారం అని పేరు. ఇది అనుభవ సాక్షికం. ఇట్టి లోకోత్తరాహ్లాద జనక జ్ఞాన గోచరత్వమే రమణీయత్వం. లోకోత్తరమైన ఆహ్లాదాన్ని పుట్టించే జ్ఞానానికి విషయమగుటయే రమణీయత్వం అని భావం. లోకోత్తరాహ్లాద జనక జ్ఞాన విషయమగు అర్థాన్ని ప్రతిపాదించే శబ్దమే కావ్యం. అని జగన్నాథుడు రమణీయత్వాన్ని విశ్లేషించాడు.
‘శబ్దార్థాలు కావ్యం’ అని నిర్వచించినవారు
* శబ్దార్థౌ సహితౌ కావ్యమ్ - భామహుడు (భామహాలంకారం)
* ‘నను శబ్దార్థౌ కావ్యమ్’ - రుద్రటుడు (కావ్యాలంకారం)
* ‘‘కావ్య శబ్దో అయం గుణాలంకార సంస్కృతయోః శబ్దార్థ యోర్వర్తతే’’ - వామనుడు (కావ్యాలంకారం)
* సాధు శబ్దార్థ సందర్భం గుణాలంకార భూషితమ్; స్ఫుటరీతి రసోపేతం కావ్యం కుర్విత కీర్తియే’’ - వాగ్భటుడు.
* గుణాలంకార సహిత్, శబ్దార్థ దోష వర్జితౌ కావ్యం కావ్య విదోవిదుః’’ - విద్యానాథుడు (ప్రతాపరుద్రీయం)
* తదదోమీ శబ్దార్థౌ సగుణా వ్యలంకృతీ ఫునఃక్వాపి - ముమ్మటుడు (కావ్యప్రకాశం)
పాశ్చాత్యుల కావ్య నిర్వచనాలు
* అంధానుకరణమే అనుకరణం - ప్లేటో
* కళలన్నీ అనుకరణలే. అనుకరణం అంటే సృజన వ్యాపారమే కానీ కేవల అనుకరణం కాదది. - అరిస్టాటిల్ (పోయెటిక్స్)
* సత్కవిత్వమంతా శక్తిమంతాలైన అనుభూతుల స్వచ్ఛంద విజృంభణమే.
కవిత్వానికి ఆనందం ఏకైక ప్రయోజనం కాకపోయినా ముఖ్య ప్రయోజనం. ఉపదేశం గౌణమే కానీ ప్రధానం కాదు. ఏ విధంగానంటే కవిత్వం ఆనందం కలిగిస్తూనే ఉపదేశం చేస్తుంది.
కవిత్వం ఛందోబద్ధమైన రచన - డా।। జాన్సన్
కవిత్వం ఛందోరహితంగా కూడా ఉండవచ్చు - ఫిలిప్ సిడ్నీ,
కవిత్వం శాస్త్రానికి విరుద్ధమైంది. దాని సధ్యఃఫలం ఆనందం కాని సత్యం కాదు. ఇచట ‘సత్యం’ అనగా శాస్త్ర సత్యమే కానీ, కవితాసత్యం కాదు. - కాల్రిడ్జ్
జీవిత విమర్శే కవిత్వం - ఆర్నాల్డ్.
సంగీతాత్మక ఆలోచనే కవిత్వం - కార్లైల్.
భావావేశం తనంత తాను దాల్చెడి సహజ శబ్దార్థ స్వరూపం కవిత్వం - మిల్
కవిత్వం అంటే సౌందర్యాన్ని లయాత్మకంగా సృష్టించడం.- ఎడ్గార్ ఎలన్పో
కావ్య భేదాలు
* పద్య కావ్యాలు, గద్యకావ్యాలు, చంపూ కావ్యాలు - స్వరూపం ఆధారంగా మూడు రకాలు
* శ్రవ్యకావ్యం, దృశ్యకావ్యం - స్వభావం ఆధారంగా రెండు రకాలు
* ప్రఖ్యాతం, ఉత్పాద్యం, మిశ్రమం - ‘ఇతివృత్తం’ అనుసరించి మూడు రకాలు
* ధ్వనికావ్యం, గుణీభూత వ్యంగ్యం, చిత్రకావ్యం - అర్థం అనుసరించి మూడు రకాలు
* కావ్యం, శాస్త్రం, ఇతిహాసం, కావ్యశాస్త్రం, కావ్యేతిహాసం, శాస్త్రేతిహాసం - భోజుడు కావ్య భేదాలను ‘6’గా ప్రకటించాడు.
* నిబద్ధ కావ్యం, అనిబద్ధ కావ్యం - వామనుడు రెండు రకాలుగా కావ్య భేదాలను పేర్కొన్నాడు.
కావ్యాత్మ సంప్రదాయాలు
శబ్దార్థాలు లేదా శబ్దం కావ్య శరీరమైతే కావ్యానికి ఆత్మ ఏది అనే ప్రశ్న జనిస్తుంది. ఏది ఉన్నంత మాత్రాన కావ్యానికి కావ్యత్వం సిద్ధించునో, ఏవి లేకున్నా ఇతరాలెన్ని ఉన్నా, కావ్యానికి కావ్యత్వం సిద్ధింపదో అది కావ్యాత్మ అనబడుతుంది.
కావ్యాత్మ సంప్రదాయాలు ప్రతిపాదకులు
1. రస సంప్రదాయం భరతుడు
2. అలంకార సంప్రదాయం భామహుడు
3. గుణ సంప్రదాయం దండి
4. రీతి సంప్రదాయం వామనుడు
5. ధ్వని సంప్రదాయం ఆనంద వర్ధనుడు
6. వక్రోక్తి సంప్రదాయం కుంతకుడు
7. అనుమాన సంప్రదాయం మహిమభట్టు
8. ఔచిత్య సంప్రదాయం క్షేమేంద్రుడు
ఈ విభాగం నుంచి గత ప్రశ్న పత్రాల్లో అడిగిన ప్రశ్నలను విశ్లేషిద్దాం.
కావ్యాలు (ఆ) (జెఎల్-2013)
అ. ప్రభు సమ్మితాలు ఆ. కాంతా సమ్మితాలు
ఇ. మిత్ర సమ్మితాలు ఈ. శత్రు సమ్మితాలు
ఆనంద వర్ధనుడు రాసిన గ్రంథం? (ఆ)
అ. కావ్యాదర్శం ఆ. ధ్వన్యాలోకం
ఇ. సాహిత్య దర్పణం ఈ. కావ్యప్రకాశం
జతపరచండి. (ఆ)
క. కావ్యాలంకారం 1. విద్యానాథుడు
ఖ. ప్రతాపరుద్ర యశోభూషణం 2. ఉద్భటుడు
గ. కావ్యాలంకార సంగ్రహం 3. విశ్వనాథుడు
ఘ. సాహిత్య దర్పణం 4. రుద్రటుడు
క ఖ గ ఘ
అ. 4 1 3 2
ఆ. 4 1 2 3
ఇ. 1 3 2 4
ఈ. 2 3 1 4
దాదాపు ఈ విభాగం నుంచి నెట్, సెట్ స్థాయిలో 10 ప్రశ్నలు, జె.ఎల్, డి.ఎల్ స్థాయిలో 20 ప్రశ్నలు వచ్చే వీలున్నందున ఈ అలంకార శాస్త్ర విభాగంపై ప్రత్యేక అధ్యయనం కొనసాగిస్తేనే విజయం వరిస్తుంది.