బసవా! బసవా! బసవా! వృషాధిపా

  • 162 Views
  • 0Likes
  • Like
  • Article Share

    కొంపెల్ల శర్మ

  • హైదరాబాదు
  • 9701731333
కొంపెల్ల శర్మ

శ్రీరాముని దయచేతను 
నారూఢిగ సకలజనులు నౌరా యనఁగా
ధారాళమైన నీతులు 
నోరూరఁగఁ జవులు పుట్ట నుడివెద సుమతీ
తెలుగింటి చిన్నారులకు తాతయ్యలు, నానమ్మలు నేర్పే సుమతీ శతకంలోని తొలి పద్యమిది. దీంతో వారికి తెలియకుండానే సాహిత్య బోధన ప్రారంభమవుతుంది. అంతేకాదు... వ్యక్తి జీవిత విలువలకు మొదటి మెట్టు కూడా ఇక్కడే మొదలవుతుంది. అంతటి ప్రభావవంతమైన శతక రచనకు తెలుగులో ఆద్యులెవరు?
సాహితీ
ప్రక్రియను సామాజికపరం చేసి, సాంఘిక చైతన్యానికి దోహదపడిన ఘనత శతకానిది. ఇది తెలుగు సాహిత్య కల్పవృక్షం. ప్రజల పలుకుబళ్లను, బతుకు బరువులను శతకం అదిమి పట్టుకున్నంతగా మరే సాహితీప్రక్రియా చేయలేదు. పండితులను, పామరులను ఒకే వరుసలో కూర్చోబెట్టి ఉర్రూతలూగించగల శక్తి శతకానికే ఉంది. అక్షరజ్ఞానంతో పనిలేకుండా ఒక్క శతకపద్యమైనా రాని తెలుగువాడు ఉండడు. శతక ప్రస్తావన చేసిన సంస్కృతాలంకారికుల్లో 13వ శతాబ్దానికి చెందిన అమృతానంద యోగి ప్రథముడు. సంస్కృత శతకాల్లో మయూర మహాకవి సూర్యశతకం, భర్తృహరి సుభాషిత త్రిశతి తదితరాలు ప్రసిద్ధం. సంస్కృత సాహిత్య ప్రభావంతోనే ఈ రచనా ప్రక్రియ తెలుగులోకి వచ్చింది. మన భాషతో పాటు కన్నడ, తమిళం, హిందీ, ఆంగ్లాల్లోనూ శతకాలు వెలువడ్డాయి. కానీ, భారతీయ భాషలన్నింటిలో అత్యధిక శతకాలు ఉదయించింది మాత్రం తెలుగులోనే. అంతగా తెలుగువారు శతకాన్ని అక్కునజేర్చుకున్నారు.
      పేరుకు తగ్గట్టు శతకమంటే వంద పద్యాల సంకలనం. అయితే, సరిగ్గా వంద పద్యాలే అని కాకుండా, అష్టోత్తర శత (108) సంఖ్యా నియమాన్ని అనుసరించి కూడా చాలా శతకాలు వచ్చాయి. అష్టోత్తర శతాన్ని హిందువులు పవిత్ర సంఖ్యగా భావించటమే దీనికి కారణం కావచ్చు. మరోవైపు రెండు, మూడు, అయిదు వందలు... ఇలా శత సంఖ్యను మించిన పద్యాలతోనూ శతకాలు వెలువడ్డాయి.
‘మకుటమే’ మకుటం
శతకానికి ప్రధాన లక్షణం మకుటం. అసలు మకుటం ద్వారానే శతకం ప్రసిద్ధి పొందింది. సుమతీ లాంటి ఏక పద మకుటం నుంచి ద్విపాద మకుట శతకాలూ (ఉదాహరణకు... ఆంధ్రనాయక) ఉన్నాయి. సాధారణంగా మకుటం పద్యం చివర ఉంటుంది. కొన్ని శతకాల్లో మాత్రం ఇది మొదట్లో కనిపిస్తుంది. ఛందస్సు విషయానికొస్తే, శతకంలోని పద్యాలన్నీ ఒకే వృత్తంలో ఉండాలన్నది నియమం. వేమన శతకం ఆటవెలది, సుమతీ శతకం కంద పద్యాలలో ఉన్నాయి. సజాతి వృత్తాలైన చంపక, ఉత్పలమాలలు, మత్తేభ శార్దూలాలతోనూ శతకాలను రచించిన వారున్నారు. ఉదాహరణకు భాస్కర శతకం చంపక ఉత్పలమాలల్లో సాగింది. సాధారణ కావ్యాలకు భిన్నంగా శతకాలు ముక్తక లక్షణంతో ఉంటాయి. ఏ పద్యానికాపద్యం విడిగా అర్థవంతంగా ఉంటాయి. ఇది ఆత్మాశ్రయ రీతికి చెందిన ప్రక్రియ. కవుల ఆత్మానుభవాలు ఇక్కడ ప్రధానం.
      ‘ఆంధ్రవాఙ్మయమున శాఖోపశాఖలుగా వికాసము నొందిన కావ్య ప్రక్రియలలో శతకమొకటి. ప్రాకృత, సంస్కృత ప్రక్రియలననుసరించియే తెలుగు శతక రచన మారంభమై కాలక్రమమున విశిష్ట ప్రక్రియగా రూపొందినది. తెలుగులో 12వ శతాబ్దిలో శతకమావిర్భవించింది...’ అంటారు శతక సాహిత్యంపై పరిశోధన చేసిన ఆచార్య కె.గోపాల కృష్ణారావు. శతకానికి సంబంధించి మకుట లక్షణంతో ఉన్న పద్యాలు నన్నయ భారతంలో కనిపిస్తాయి. భారతంలోని ఉదంకోపాఖ్యానంలో ‘మాకు ప్రసన్నుడయ్యెడున్‌’ అనే మకుటంతో అయిదు పద్యాలు ఉన్నాయి. ఇది శతకానికి అంకురారోపణంగా భావించవచ్చు. ఇక 12వ శతాబ్దానికి చెందినవాడుగా భావిస్తున్న శివకవి నన్నెచోడుడి ‘కుమారసంభవం’లోనూ  ‘దారిద్య్ర విద్రావణ’ అనే మకుటంతో 5 పద్యాలున్నాయి. దీన్ని శతక సాహిత్య వికాసంలో బీజప్రాయంగా పేర్కొనవచ్చు.
మరి తెలుగులో తొలిశతకం ఏది?
శతక సాహితీప్రక్రియకు అవతారయుగం శివకవియుగం. క్రీ.శ.1120 - 1190 మధ్యకాలంలో నివసించిన మల్లికార్జున పండితారాధ్యుడి ‘శివతత్త్వసారం’ తొలి తెలుగు శతకమన్నది కొందరి భావన. అదే మల్లికార్జునుడి రచనగా భావిస్తున్న ‘శ్రీగిరి మల్లికార్జున శతక’మే మొదటిదన్నది మరికొందరి వాదన. అయితే, శివతత్వసారంలో ఒకే మకుటం లేదు. అజా, శివా, రుద్రా, మహేశా అనే   మకుటాలున్నాయి. పైగా 489 కంద పద్యాలు ఉన్నాయి. ఈ రచనలో శతక లక్షణాలు కొన్నే కనిపిస్తున్నాయి. ఇక శ్రీగిరి మల్లికార్జున శతకంలోని కొన్ని పద్యాలే లభ్యమవుతున్నాయి. అందువల్ల దీనిని తొలి శతకంగా నిర్ధరించలేదు. పండితారాధ్యుడికి కొంచెం తర్వాతి వాడు, వీరశైవులు భృంగి అవతారంగా కీర్తించిన పాల్కురికి సోమనాథుడు ‘వృషాధిప శతక’ కర్త. ‘బసవా! బసవా! బసవా! వృషాధిపా’ మకుటంతో ఈ శతకం సాగుతుంది. దీంట్లోని పద్యాలు చంపక ఉత్పలమాలల్లో సాగుతాయి. అంటే, ఛందో నియమం కూడా పాటించాడు కవి. మకుటనియమం, సంఖ్యానియమం, ఆత్మాశ్రయత్వం, ముక్తక లక్షణం, ఛందో నియమాలతో సంపూర్ణ శతక లక్షణాలతో కూడిన వృషాధిప శతకాన్నే తొలి తెలుగు శతకంగా సాహితీవేత్తలు పరిగణిస్తున్నారు.
      ఈ శతకం ‘శ్రీ గురులింగమూర్తి సువిశేష...’ పద్యంతో ప్రారంభమవుతుంది. దీనిని సోమనాథుడు వీరశైవ ఉద్యమ స్థాపకుడైన బసవన్నకు అంకితమిచ్చాడు. దేశి కవితకు పెద్దపీట వేసిన సోమన రచనలో సంస్కృత సమాసాలను ప్రయోగించాడు. అంతేకాదు కన్నడ, తమిళ భాషల పద్యాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇందులో బసవన్న మహిమలతో పాటు ఇతర శివభక్తుల చరిత్రను వివరించాడు. వృషాధిప శతకంలోని కింది పద్యం ప్రసిద్ధం.
బలుపొడ తోలుసీరయును బాపసరుల్‌ గిలుపారుకన్ను వె
న్నెలతల సేదు కృత్తుకయు నిండిన వేలుపుటేఱు వల్లుపూ
సలుగలఱేని లెంకవని జానుదెనుంగున సన్నుతించెదన్‌
వలపు మదిందలిర్ప బసవా, బసవా, బసవా, వృషాధిపా! 

      ఈ పద్యంలో తోలు, సీరయు, కుత్తుక, వేలుపు లాంటి అచ్చ తెలుగు పదాలు దర్శనమిస్తాయి. అంతేకాదు, ‘జానుతెనుగులో నుతిస్తాన’నే సోమనాథుడి అమ్మభాషాభిమానమూ కనిపిస్తుంది పాల్కురికి సోమనకు సమకాలీనుడైన యథావాక్కుల అన్నమయ్య ‘సర్వేశ్వర శతకా’న్ని రచించాడు. దీంట్లో మత్తేభ శార్దూల వృత్తాలతో శతక లక్షణాలన్నింటినీ పొదువుకున్న 142 పద్యాలున్నాయి. ఈ శతకం విశేషమేమంటే, పద్యాలు ముక్తకాలుగా కాకుండా శీర్షికలతో ఉండి కావ్యాన్ని తలపిస్తాయి. యథావాక్కుల అన్నమయ్య సోమనాథునిలా కాకుండా సాత్త్విక శివభక్తుడు. పండితారాధ్యుడు, సోమనాథుడు, అన్నమయ్యలను శతక శివకవిత్రయంగా పిలుస్తారు. అయితే, పూర్వకవులను స్తుతిస్తూ పింగళి ఎల్లకవి(1760) ‘తోభ్యచరిత్రం’లో - మొదట అన్నమయ్యనీ, తర్వాత సోమన్ననీ స్తుతించాడు. దీన్ని బట్టి అన్నమయ్య సోమనకు ముందువాడేమోనన్న అనుమానం తలెత్తుతుంది. ఏది ఏమైనా, తెలుగు శతక ప్రక్రియకు శ్రీకారం చుట్టి, తొలివెలుగులనందించిన త్రిమూర్తులు వీరు. 
      మొదట్లో శైవభక్తి సంబంధంగా శతకం ప్రారంభమైనా తర్వాత పోతన కృతిగా చెబుతున్న నారాయణశతకం, అన్నమాచార్యుల శ్రీవేంకటేశ్వర శతకం, నరసింహ శతకం, దాశరథీ, ఆంధ్రనాయక శతకం ఇలా ఎన్నో వైష్ణవ భక్తి శతకాలూ వచ్చాయి. సుమతీ, వేమన శతకాలతో... శతకం నీతిని బోధించే గురువైంది. భక్తి, నీతి శతకాలతో పాటు వైరాగ్య, శృంగార, అధిక్షేప, వ్యంగ్య, హాస్య ఇలా వివిధ రూపాలతో శతకం ఎన్ని నడకలు నడవాలో అన్నీ నడిచింది. విశ్వనాథ, శ్రీశ్రీ, బోయి భీమన్న మొదలైన ఆధునిక కవులూ శతక కర్తలే. విశ్వనాథ వారి ‘విశ్వనాథ మధ్యాక్కరల’కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారమూ లభించింది. స్వాతంత్య్ర పోరాట సమయంలో గాంధీజీ లాంటి జాతీయనాయకులపైనా శతకాలు వెలువడ్డాయి. ఇప్పటికీ ఎక్కడో ఒకచోట శతక రచన జరుగుతూనే ఉంటుంది. అందుకే సాహితీ ప్రక్రియలెన్ని ఉన్నా శతకమే తెలుగు తల్లి మెడలో బంగారు పతకం. 


వెనక్కి ...

మీ అభిప్రాయం