‘ప్రజ్వలిత’ సాహితీ స్ఫూర్తి

  • 60 Views
  • 0Likes
  • Like
  • Article Share

సాహిత్య పరిపోషణ, కళారాధనే ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా తెనాలి సాంస్కృతిక వికాసానికి విశేష కృషిచేసిన నాగళ్ల వెంకట దుర్గా ప్రసాద్‌ 1965లో గుంటూరు జిల్లా అనంతవరంలో జన్మించారు. తండ్రి రామకోటేశ్వరరావు హెచ్‌ఎమ్‌టీలో కార్మిక నాయకుడిగా పనిచేశారు. చిన్ననాటి నుంచే అభ్యుదయ ఉద్యమాలు, కళా సాహిత్య సంబంధ విషయాల్లో అభినివేశం పెంచుకున్నారు దుర్గాప్రసాద్‌. ప్రజ్వలిత సాహితీ సాంస్కృతిక సంస్థ స్థాపించి సాహితీ కార్యక్రమాలు, సైద్ధాంతిక గోష్ఠులు నిర్వహించి ఔత్సాహిక రచయితలు, కళాకారులను ప్రోత్సహించారు. అజ్ఞాత కవులు, కళాకారులు, రచయితలెందరో ఈ ప్రజ్వలిత ద్వారానే లోకానికి పరిచయం అయ్యారు. కళాభినివేశం కలిగిన వారిని వివిధ ప్రాంతాల నుంచి ఆహ్వానించి సాహితీ సత్సంగానికి వేదికలు ఏర్పాటు చెయ్యడంలో ముందు నిలిచేవారు దుర్గాప్రసాద్‌. సాహిత్య అంశాలకే పరిమితం కాకుండా సినీ రంగస్థల కళారూపాలు, పత్రికా రంగం ఇలా విభిన్న రంగాల్లో విలక్షణ ప్రతిభ కనబరిచేవారందరినీ ఒకచోట సమీకరించేందుకు విశ్వప్రయత్నం చేశారు. యువకులకు సాహిత్య సభల్లో తగిన ప్రాధాన్యత కల్పిస్తూ సంక్షిప్త పరిశోధనా పత్రాలను రూపొందించడం లో శ్రద్ధ చూపారు. సరికొత్త సాహిత్యాంశాల మీద నిశిత పరిశీలన, నిక్కచ్చితత్వం, లోతైన అంశాల మీద సదవగాహన, ఉత్సుకతతో పదిచేతుల మీద జరగాల్సిన పనిని ఒక్కచేతి నడిపించడం ఆయన శైలి. విద్యార్థుల్లో ప్రతిభను ప్రోత్సహించడం, చరిత్ర మీద అవగాహన కల్పించడం నాగళ్లకు నిత్యకృత్యాలు. రచయితలు, విమర్శకులు, పరిశోధకులతో ఉపన్యాసాలు ఏర్పాటు చేసి ఒక సరికొత్త భావధారకి ఆలంబనగా నిలిచిన ఈ నిత్యాన్వేషి 2021 జనవరి 14న కీర్తిశేషులయ్యారు.


వెనక్కి ...

మీ అభిప్రాయం