ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు..

  • 223 Views
  • 7Likes
  • Like
  • Article Share

    వెలుగూరి శాంతి శంకర్‌

  • పిడుగురాళ్ల, గుంటూరు జిల్లా
  • 9100567873
వెలుగూరి శాంతి శంకర్‌

పువ్వుల్ని, పసి నవ్వుల్ని చూసినప్పుడు మనసు నిశ్చలమవుతుంది. పూల తోటలో నడయాడితే వయసు వసంతాగమంలా ఉరకలేస్తుంది. ఉన్నట్టుండి పుప్పొడి పరవళ్లు, తుమ్మెద సందళ్లు జ్ఞాపకాల జాజుల వాసనను మోసుకొస్తాయి. పూల సొగసు, సౌకుమార్యాన్ని చూసి చెలికాడే కవిశ్రేష్ఠుడై అల్లే కవితలు తమ్మిరేకుల్లా లేతగా తగులుతాయి. మరి, ఆ లలితమైన పూలబాసల్ని సినీ కవులు పాటలా మలిస్తే ఆ పరిమళం గులాబీ అత్తరులా ఎల్లకాలం ·వెంటాడుతుంది. మరి అలాంటి రాగాల పూదోటలోకి ప్రవేశిద్దామా!  
‘‘ఆకులో
ఆకునై పూవులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై... ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా’’ అని, కమ్మని నెత్తావుల సోయగాన్ని, బరువుగా తలలూచే పూల కొమ్మలను చూసినప్పుడు మనసు స్తబ్దంగా  ఉండదు. కొమ్మలన్నీ గాలించి, విరులన్నింటిని పలకరించి.. మరీ పాడుకోవాలనిపిస్తుంది. పూల రుతువులో ఎదురయ్యే అనుభవాలు మకరందమంత మధురంగా ఎందుకుంటాయి? మధువనిలో విహరిస్తే ఆ సరస సల్లాపాలు ఎందుకంత గాఢంగా ఉంటాయో పువ్వులనే అడగాలి.
 బాలభానుని నులివెచ్చని కిరణాలకి గుట్టుచప్పుడు కాకుండా విచ్చుకునే విరిబాలలతో ముచ్చటించడమే కాదు వాటిని పదే పదే చూడాలని ఉంటుంది. నుదుటిపై ఇంత కుంకుమ అద్దుకుని సిగలో మందారాన్ని తురుముకుని నడిచొచ్చే యవ్వనం ముందు ఎలాంటివారికైనా గొంతు పల్లవిస్తుంది. ‘‘మల్లెపువ్వా కాదు మరుల మారాణి.. బంతిపువ్వా కాదు పసుపు పారాణి’’ అంటూ.. తెలుగింటి పూబోణిని ఎదురుగా పెట్టుకుని... ‘‘ముద్దుకే ముద్దొచ్చే మందారం మువ్వల్లే నవ్వింది సింగారం.. ముద్ద మందారం.. ముగ్ధ సింగారం’’ అని వేటూరిలా కలల తరంగాన్ని విరచించనివారంటూ ఉంటారా! అదంతా విరుల వైభవం కాక మరేంటీ!
      ‘‘తొలి పూత నవ్వే వన దేవతల్లే.. పున్నాగ పూలే సన్నాయి పాడే.. ఎన్నెల్లు తేవే ఎద మీటిపోవే’’ అని ఎలమావి తోటలో వలపు కోయిల మాదిరి పాడుకోవడం వెనుక ఒక ఒక భావ మధురిమ ఉంటుంది. కాబట్టే వేటూరి ‘‘సిరిమల్లె నీవే విరిజల్లు కావే/ వరదల్లె రావే వలపంటి నీవే!’’ అంటూ యువతీ యువకుల మధ్య అల్లుకున్న ప్రణయరాగాన్ని హృదయాంగమంగా వర్ణించారు.
ఎంత తొందరలే హరి పూజకు
భక్తితో సమర్పించాలే కాని పత్రమైనా పుష్పమైనా కాదనేవారెవరూ! అందులోనూ ప్రకృతి సిద్ధంగా లభించే పూలతో సేవిస్తే భగవంతుడు మాత్రం కాదంటాడా! ఆనాడు రుక్మిణి ఒక తులసి దళంతోనే కృష్ణుని ప్రేమను కొలిచింది. మరి పూజ క్రతువులు, పువ్వుల మహిమలు తెలియని కన్నప్ప శివారాధనకు ఏ పువ్వులు అర్చించాలో తెలీక మారేడు దళాలలోనే సేవించాడు. పువ్వులే కాదు సుమదళాలు కుడా నవనీత హృదయ నిర్మలత్వానికి సూచికలని నిరూపించాడు. ‘‘ఒక పువ్వు పాదాల.. ఒక దివ్వె నీ మ్రోల’’ అంటూ ఆధ్యాత్మిక హృదయ సీమలలో లలితమైన భావ సాంద్రతకి అంటు కడతారు దేవులపల్లి.  ‘‘ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు/ పూలిమ్మని రెమ్మరెమ్మకూ/ ఎంత తొందరలే హరి పూజకు/ ప్రొద్దు పొడవక ముందు పూలిమ్మని!’’.. క్షణ కాలపు జీవన మకరందాన్ని భగవంతునికి అర్పించాలనే కుసుమకాంక్షకి అద్దంపట్టే ఉదయరాగమిది.  
      ముద్దబంతులు, చేమంతులు, మత్తుగా తూలే సన్నజాజులు.. ఇలా పూలన్నీ చిలిపి ఊహల మధురోహలకు చిరునామాలవుతాయి. బరువోపని వలపు రాగాలను జతులు సమకుర్చుతాయి. గొంతు దాటిరాని రాస వాహినికి మౌన గీతికలవుతాయి. అందుకే కాబోలు ‘‘ముద్దబంతి పువ్వులో మూగకళ్ల ఊసులు ఎనక జనమ బాసలు ఎందరికీ తెలుసులే!’’ అంటూ.. పూల భాషలో మర్మాన్ని విప్పి చెప్పారు ఆత్రేయ. పరిశీలనగా చూస్తే పువ్వులన్నీ ఏవేవో ఊసులు చెబుతున్నట్లు, తమలోతాము నవ్వుతున్నట్టే కనిపిస్తాయి.
పూసింది పూసింది పున్నాగ
తీరైన జుట్టుని రెండు పాయలుగా తీసి అల్లితే రెండు సన్నాయిల మాదిరిగా ముచ్చటగా ఉంటాయంటారు వేటూరి. అందుకేనేమో కుదురుగా జడల్లుకున్న తెలుగింటి అమ్మాయిని రెండు జెళ్ల సీత అని ముద్దుగా పిలుచుకునేందుకు ముచ్చటపడిపోతారంతా! పున్నాగ పూవంటి అమ్మాయి పువ్వులా కాక మరెలా నవ్వుతుందీ! ‘‘పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగా! సందేళలాగేసె సల్లంగా / దాని సన్నాయి జళ్లోన సంపెంగ’’ అని బావ ఆలాపనకి ఆలంబనగా మరదలు వాయులీనంపై స్వరాలనందిస్తూ మురిసిపోయే ఈ రసమాధురి ‘సీతారామయ్యగారి మనవరాలు’ చిత్రంలో కనిపిస్తుంది.
 పూలకే గనక మాటలొస్తే కరుణశ్రీలా పుష్పవిలాపం పద్యాలో.. ఉత్పల సత్యనారాయణాచార్యలా కుసుమకాంక్ష వియోగ గీతాలో పాడేవే! చెప్పరాని మూగ గొంతు రాగాలను మాత్రం చప్పన వినిపించే పనే ఎప్పుడూ పెట్టుకుంటాయి. ‘‘ముద్దబంతి నవ్వులో మూగబాసలు/ మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలూ/ చదువుకునే మనసుంటే ఓ కోయిలా/ మధుమాసమె అవుతుంది అన్ని వేళలా’’ అంటూ మగువల మధురోహలను అరమరికల్లేకుండా వెల్లడించేవి పువ్వులే అనంటారు గీత రచయిత గురుచరణ్‌.  
మొగలిపొదలాంటి వలపు కౌగిళ్ల వెనుక క్రూరమైన విష సర్పాలు ఉండటం సహజమే. ప్రేమ భావనను ఎల్లకాలం నిలుపుకోవాలంటే ప్రియురాలితో ఆచితూచి వ్యవహరించాలి. అందమైన రోజా కింద ముళ్లు పొంచి ఉందని గమనించుకోవాలి. ప్రేమించడమొక్కటే కాదు అందులోని కష్టాల సుడిగుండాలకు ఎదురీదగలిగే స్థైర్యం కలిగి ఉంటాలంటారు శ్రీశ్రీ.
మల్లెలే ప్రత్యేకం..  
మండువేసవిని పలకరిస్తూ నిండు పున్నమి నవ్వినప్పుడు పులకరింతగా విచ్చుకునేవి మల్లెలే. వేసవిలో మల్లెలొక్కటే మనసును చల్లబరిచే చలివేంద్రాలు. అలాంటి మల్లెల చలవ జీవితాంతం ఉండాలని కోరుకోవడంలో తప్పేముంది! ‘‘మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా/ మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా..’’ అంటూ వేటూరి ‘ఇంటింటి రామాయణం’లో పూలచెండు ప్రస్తావన తెచ్చింది కూడా అందుకే. మల్లెతీగ వంటిది మగువ జీవితం అనడంలో కవి ఆంతర్యం ఏంటంటే జీవిత భాగస్వామిని అద్దంలా పదిలంగా చూసుకోమనే. 
      మకిలి అంటని చిరునవ్వు పిల్లలది. అందుకే పాలబుగ్గల మెరుగు నవ్వులను మల్లెలతో పోలుస్తారు. ‘‘సిరిమల్లె పువ్వల్లె నవ్వు../ చిన్నారి పాపల్లె నవ్వు/ చిరకాలముండాలి నీ నవ్వు../ చిగురిస్తు ఉండాలి నా నువ్వు.. నా నువ్వు’’ అంటూ.. ఆత్రేయ చిత్రగీతం నవ్వులోని స్వచ్ఛతను రూపుకట్టిస్తుంది.
పువ్వు పుట్టగానే పరిమళించదు. పరిమళించాక కూడా ఆ వైభవం ఎంతోసేపు నిలవదు. మూన్నాళ్ల ఆయువు తీరాక విరులు వికృతమైపోతాయి. కానీ ఆ క్షణకాలంలో అవి కలిగించిన ప్రభావం చాలా కాలం నిలిచి ఉంటుంది. పువ్వులా నవ్వాలి... పరిమళించాలి.. ఒక ప్రయోజం కోసం జీవించాలన్నది వువ్వుల జీవ రహస్యం. మదిని గుచ్చే బాధలెన్నున్నా నవ్వుతూ జీవితాన్ని దాటెయ్యలంటూ వేటూరి మనసును సుందరం చేసే మాట చెబుతూ ఇలా అంటారు..
కొమ్మలు రెమ్మలు గొంతే విప్పిన 
కొత్తపూల మధుమాసంలో 
తుమ్మెద జన్మకు నూరేళ్లెందుకు 
రోజే చాలులే! 

      ఎంతకాలం జీవించామన్నది కాదు.. ప్రభావపూరితంగా, సారభూతంగా జీవితాన్ని మలచుకుంటూ ఒక్కరోజు బతికినా మేలే! 
      ‘‘నవ్వవే నవ మల్లికా/ ఆశలే అందాలుగా/ ఎదలోతుల్లో ఒక ముల్లున్నా/ వికసించాలే ఒక రోజాలా!’’.. ఉత్తేజాన్ని, సరికొత్త భావప్రసరణను కలిగించే జీవన సూత్రమిది. ఎన్ని వర్ణాలతో విరబూసినా, విభిన్న సౌరభాలతో శోభిల్లినా మానవ జీవితంలో అన్ని అవస్థలూ వువ్వులకు సుపరిచితమే. జీవించడమనే కార్యాన్ని నవ్వుతూ తూగుతూ రాలుతూ... సాగించే విరుల జీవన కాంక్ష కాలానుగుణమైంది. ప్రకృతిబద్ధమైంది. నేటికాలపు నాగరిక జీవికి స్ఫూర్తి కిరణం కూడా ఇదే! 


వెనక్కి ...

మీ అభిప్రాయం