నూరు కథా కమలాలు

  • 113 Views
  • 0Likes
  • Like
  • Article Share

    వై.ఎల్‌.వి.ప్రసాద్‌

  • యాడికి, అనంతపురం జిల్లా
  • 9493559074
వై.ఎల్‌.వి.ప్రసాద్‌

సాహిత్యంలో కాలాన్ని బట్టి ఒక్కొక్క భావజాలం ప్రాధాన్యం సంతరించుకుంటుంది. కానీ మానవనైజంలో మార్పు ఉండదు. హృదయ స్పందనలకు స్థల కాలాదులనే అవధులు ఉండవన్న విషయం ఇల్లిందల సరస్వతీదేవి ‘స్వర్ణకమలాల’ను చదివితే అర్థమవుతుంది. ఓ ప్రత్యేక భావజాలాన్ని వినిపించడం కాకుండా, సామాన్యుల జీవితాలను యథాతథంగా చిత్రించిన కథానికలు ఇవి. ఈ పుస్తకంతోనే సరస్వతీదేవి కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం అందుకుతున్న తొలి తెలుగు రచయిత్రి అయ్యారు. 
‘‘ఏ పాఠకుడినయినా
మెప్పించడం సులభమేమోగానీ మనసుకు సంతృప్తినివ్వగల రచన- మనసు మీద గాఢమైన ముద్ర వేయగల రచన చేయడం చాలా కష్టం’’ అనే ఇల్లిందల సరస్వతీదేవి తెలుగు కథ మీద తనదైన ముద్ర వేశారు. మనుషుల్లోని సహజ మానవీయ లక్షణాలను ప్రేరేపించేలా రచనలు చేసిన ఆవిడ పంథా ప్రత్యేకమైంది. వంద కథల సంకలనమైన ‘స్వర్ణకమలాలు’లో సగటు మనుషుల కలలూ, కన్నీళ్లు కనిపిస్తాయి. ఆలోచింపజేసే సంఘటనలు ఎదురవుతూ పలకరిస్తాయి.
      ‘కొండమల్లెలు’ కథానిక ఈ సంకలనంలో మొదటిది. అలవికాని ఆశలు, పుల్లవిరుపు మాటలతో భార్య కలిగించే చికాకును నిత్యం భరిస్తూ, సాయంత్రాలు ఏటిగట్టున ఇసుకలో తలవాల్చి స్వస్థత పొందుతుంటాడు శివనాథం. తాను పొందలేని సంసార సౌఖ్యాన్ని గురువడి కుటుంబంలో చూస్తూ ఆనందపడతాడు. ఉన్నదాంట్లో సర్దుకుపోతూ చిరునవ్వులను పంచుకోవడమే దాంపత్యానికి అర్థమని చెప్పే కథ ఇది. ఇందులో పాత్రలు చాలా తక్కువే అయినా ఎంతో మంది జీవితాలకు ఇది దర్పణం పడుతుంది. ‘‘ఏడు గుర్రాల దొర వేటచాలించి పోతున్నాడు’’ లాంటి వర్ణనలు, వాక్యాలను తిరిగి చూసేలా చేస్తాయి.
      ‘మాయా ముత్యాలు’ కథానిక ఊహాతీతంగా ముగుస్తుంది. ఇందులో ప్రధాన పాత్ర ఓ అందమైన స్త్రీ. ‘నగల దుకాణాల మధ్య బండి దిగగానే ఆమె నడక ఏవైపునకు సాగుతుందో అని గమనిస్తున్న దుకాణపు నౌకర్లు..’ అంటూ ఆసక్తికరంగా కథ ప్రారంభమవుతుంది. దుకాణం యజమాని ఆమెను ఆకట్టుకునేందుకు చేసే విన్యాసాలు, చెప్పే కట్టుకథలు ఇప్పటికీ మనం చూస్తూనే, వింటూనే ఉంటాం. చివర్లో ఆమె గురించి నిజం తెలిశాక మ్రాన్పడిపోయిన అతణ్ని చూస్తూ గుమస్తా అనే మాటలు గుర్తుండిపోతాయి. ఎదుటివాళ్లని మోసం చేస్తున్నామనుకుంటూ తామే మోసపోయే మనుషుల తత్వాన్ని ఈ చివరి మూడు వాక్యాల్లో స్పష్టంగా చెబుతారు రచయిత్రి. 
భావోద్వేగాల చిత్రణ 
‘డైరీ’ గుండెను తడుముతుంది. కూతురి మనస్తత్వాన్ని అర్థం చేసుకోకుండా వ్యవహరించే ఓ తండ్రి కథ ఇది. తన అల్లరి పాప చనిపోయాక ట్రంకుపెట్టలో చూసి గాని ఆమె మనసు తెలుసుకోలేక పోతాడు. నాన్న లెక్కల పుస్తకాన్ని డైరీగా మార్చుకుని తన భావాలను రాసుకుంటుంది ఆ చిన్నారి. అందులోని వాక్యాలు అతణ్ని వెక్కిరిస్తాయి. ఆ తర్వాత ఆ తండ్రి ఏమవుతాడన్నది కథలోనే చదవాలి. అతని కన్నీళ్లగాథ విన్నాక శాస్త్రి పాత్రకు ‘‘ఏడు చెంచాల రక్తము పట్టే ఆ మానవ హృదయంలోనుంచి అనంతమయిన సముద్రపుహోరు’’ వినపడతుంది- అది పాఠకుల చెవులనూ తాకుతుంది.
      పుస్తకానికి శీర్షికగా నిలిచిన ‘స్వర్ణకమలాలు’ కథానిక.. ఆకలి, భయం రెండు భావోద్వేగాల కలయిక. రుచికరమైన తిండి దొరకుతుందని ఆశ, కలువలు తేకపోతే మునసబు తంతాడనే భయం రెండూ నింపుకుని చెరువులో కలువలు కోస్తాడు ఏడుకొండలు. కానీ ఉదయాన్నే సూర్యకాంతికి బంగారు వర్ణాన్ని నింపుకుని అవి స్వర్ణకమలాలవుతాయి. వాటి అందం ఏడుకొండల్ని మునసబు మాట మీరేంత ఉత్తేజితుణ్ని చేస్తుంది. కానీ, మల్లేసు మాత్రం తన చేతిలో మునసబు పెట్టిన కర్రకు బందీ అయిపోతాడు. గ్రామాల్లోని అణగారిన జీవితాలను ప్రతిబింబిస్తుందీ బంగారు పూల కథ. ఈ సంకలనంలోని సింహభాగం కథానికలు గ్రామీణ నేపథ్యంలోనే నడుస్తాయి. పల్లె వాతావరణ వర్ణనలు, అక్కడి జీవన విధానాన్ని బొమ్మకట్టించిన తీరు పాఠకుల్ని తమ మూలాల్లోకి లాక్కెళ్తాయి.  
కదిలించే కథలు
మనుషులు కొనుగోలు యంత్రాలుగా మారిపోయారన్న చేదునిజాన్ని చెబుతుంది ‘సలహా’ కథ. కారు, రేడియో కొనాలని భర్త, కాదు ఇల్లు కొనాలని భార్య ప్రశాంతత విడిచి జీవితం సాగిస్తారిందులో. దాంపత్యంలో ఆనందం.. కలిసి కబుర్లు చెప్పుకోవడం, సుఖదుఖాఃలను పంచుకోవడంలో కాకుండా ‘కొనడం’లో ఉన్నాయనుకునే మనుషులకు ఈ కథ అద్దంపడుతుంది. పాఠకులు తమ జీవితాలను తరచి చూసుకునేలా చేస్తుంది.
      ఇద్దరు తల్లుల జీవితాలను, వారి మనస్తత్వాలను తెరచి చూపిస్తుంది ‘కాగితప్పూలు’. యవ్వనంలో తెలియక చేసిన తప్పునకు ఫలితంగా బిడ్డను కని, పెంచి ఆనందిద్దామనుకుంటుంది అచ్చమ్మ. కానీ, కొడుకును దూరం చేసుకుని పిచ్చిదవుతుంది. ఆ పిల్లాణ్ని తాను పెంచుకుంటూ అచ్చమ్మను చూసి శాంత రోజూ రోదిస్తూ పశ్చాత్తాపడుతుంటుంది. బిడ్డల్ని పోగొట్టుకున్న తల్లుల బాధ ఈ కథలోని ప్రతి అక్షరంలో కనిపిస్తుంది.. కంటతడి పెట్టిస్తుంది. ‘వీడిన మొబ్బు’లో భార్యభర్తల అనురాగానికి ఓ ఉత్తరాల పెట్టెతో అంతరాయం కలుగుతుంది. అందులో ఏముందో అన్న ఉత్కంఠతో కథ నడుస్తుంది.
సామాన్యుల జీవితగాథలు
ఒంటరితనం, కుటుంబ జీవితాల్లోని ఇక్కట్లు, తక్కువ జీతం గుమాస్తాలు, కూలీలు, బానిసత్వం, స్త్రీల మనస్తత్వాలు, మోసగాళ్లు, అమాయకులు, చిన్న చిన్న కోరికలు తీర్చుకోవడానికి పరుగులు తీసే మనషుల వ్యథలు.. ఇలా ఎన్నో భావోద్వేగాలు ఈ కథల్లో  తారసపడతాయి. ముందుమాటలో అమరేంద్ర చెప్పినట్టు చాలా కథల్లో సామాన్య మానవుల సుఖదుఃఖాలూ, ఆశా నిరాశలూ, విజయ పరాజయాలూ, విలాస విలాపాలు సహజ సుందరంగా ప్రతిబింబిస్తాయి. ‘‘నేను సృష్టించిన స్త్రీ పాత్రలన్నీ క్షమ, ఓరిమి, మంచితనం, ముందుచూపూ కలిగి ప్రవర్తిస్తాయి. స్త్రీలలో ఉండే ఓరిమిని చేతకానితనంగా ఎప్పుడూ అనుకోకూడదు. నా రచనలో స్త్రీ, పురుషుల సమైక్యతను చాటి చెప్పే విశ్వజనీన భావాన్ని పొందుపరచడానికే ప్రయత్నిస్తాను కానీ ఏ ఒకరిని సమర్థించడానికో, విమర్శించడానికో ప్రయత్నించలేదు. నినాదాల వలన ఎవరైనా ఏమైనా సాధించగలరా? నాకు తోచినంత వరకు సమానహక్కులు అంటే స్త్రీ పురుషులు కలిసికట్టుగా జీవించేలా ఉండాలి’’ అంటూ తన రచనలు, ఆలోచనల గురించి చెబుతారు సరస్వతీదేవి.
      ‘స్వర్ణకమలాలు’లోని కథల్లో కొన్ని అంతకుముందు ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి. మిగిలినవి ‘భారతి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ’ తదితర పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఈ 1100 పుటల పుస్తకాన్ని సరస్వతీదేవి ప్రచారించాలనుకున్నప్పుడు రెండేళ్ల పాటు కాగితాలే లభ్యం కాలేదు (అప్పట్లో వాటికి కొరత ఉండేది). చివరకు ఇద్దరు ఐఏఎస్‌ అధికారుల చొరవతో భారత ప్రభుత్వం నుంచి రాయితీ ధరకు కాగితం అందింది. అలా 1981లో ప్రచురితమైన ఈ పొత్తం నాటి ఉమ్మడి రాష్ట్ర సాహిత్య అకాడమీ బహుమతితో పాటు 1982లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికీ ఎంపికైంది. హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోకి వెళ్లింది. మానవ సంబంధాల్లో చోటుచేసుకుంటున్న మార్పులు, కొరవడుతున్న నైతిక విలువలు, మృగ్యమవుతున్న చిరునవ్వులను సున్నితంగా చిత్రించిన ఈ ‘స్వర్ణకమలాలు’.. జీవితాల కొలనులో విరబూసిన కథాకమలాలు!


వెనక్కి ...

మీ అభిప్రాయం