నాట్యకళా పారిజాతం

  • 78 Views
  • 0Likes
  • Like
  • Article Share

కూచిపూడి నాట్య కళాకారిణి కొత్తపల్లి పద్మ 1943 మే 14న కృష్ణా జిల్లా పెనుగోలులో జన్మించారు. చదలవాడ ఆనందరామయ్య, పార్వతీదేవి తల్లిదండ్రులు. సోదరి సుందరి ప్రోత్సాహంతో అయిదో ఏటనే నాట్యకళపై మక్కువ పెంచుకున్నారు. విజయవాడ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో నృత్యంలో డిప్లొమా పూర్తిచేశారు. మద్రాసులోని వెంపటి చినసత్యం కూచిపూడి నాట్య అకాడమీ తొలి విద్యార్థి బృందంలో ఈవిడ ఒకరు. అక్కడే పద్దెమిదేళ్ల పాటు శిక్షణ పొందారు. 1966లో అరంగేట్రం చేశాక మంజుభార్గవి, శోభానాయుడు, హేమామాలిని లాంటి వారితో కలిసి అనేక నాట్య ప్రదర్శనలిచ్చారు. 1972లో భారత ప్రభుత్వ జాతీయ ఉపకారవేతనానికి ఎంపికయ్యారు. అకాడమీ నిర్వహించే నాట్య రూపకాలన్నింటిలో కీలకపాత్ర పోషించారు. శ్రీకృష్ణపారిజాతంలో సత్యభామ పాత్ర పద్మకు విశేష గుర్తింపు తెచ్చిపెట్టింది. శకుంతల పరిణయంలో శకుంతలగా, అనసూయ ప్రియంవదలో అనసూయగా  అత్యుత్తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ‘నాట్య విశారద’గా ప్రశంసలందుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ నాట్య అకాడమీ సభ్యులుగానే కాకుండా సంస్థ నిర్వహించే అనేక కార్యక్రమాలకి న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. 1977లో మద్రాసులో నృత్యాలయ సంస్థను స్థాపించి పూల బాలలు, భక్తప్రహ్లాద, ఛండాలిక, వాల్మీకీ, వెంగమాంబ లాంటి రూపకాలను ప్రదర్శించారు. గిరిజనులల్లోని  కళానైపుణ్యాలను ప్రోత్సహిస్తూ.. వారి నాట్యాల పరిరక్షణకు కృషి చేసిన ఈ నాట్యాభినేత్రి 2021 ఫిబ్రవరి 5న హైదరాబాదులో దివంగతులయ్యారు.


వెనక్కి ...

మీ అభిప్రాయం