అంతర్జాలంలో ప్రాంతీయ భాషల్లో సమాచారం, విజ్ఞానానికి పట్టం కట్టేందుకు హైదరాబాదులోని అంతర్జాతీయ సమాచార సాంకేతిక విజ్ఞాన సంస్థ (ట్రిపుల్ ఐటీ) సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రపంచ స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం వికీపీడియాలో, డిజిటల్ మాధ్యమాల్లో ప్రాంతీయ భాషలు విస్తృతంగా వెలిగేందుకు 2019లో డిసెంబరులో ‘ఇండిక్ వికీ ప్రాజెక్టు’ను ఈ సంస్థ ప్రారంభించింది. ఇందులో భాగంగా మొదట తెలుగు వికీపీడియాను అభివృద్ధిచేసే కృషి జరుగుతోంది.
ప్రపంచ విజ్ఞానాన్ని, సమాచారాన్ని అంతర్జాలంలో తేలిగ్గా అందుకోవడానికి మార్గం వికీపీడియా. అయితే, ఎక్కువ మంది సంప్రదించేది ఆంగ్ల వికీపీడియా వ్యాసాలనే. అమెరికన్ల తర్వాత ఆంగ్ల వికీపీడియాను ఎక్కువగా చదువుతోంది భారతీయులే. వీరిలో అధికశాతం ఉన్నత విద్యావంతులే. మన దేశంలో ప్రాంతీయ భాషల వాడకం వికీపీడియాలో, డిజిటల్ మాధ్యమాల్లో చాలా తక్కువ. దీనివల్ల ఆంగ్లం రాని వారు విజ్ఞానానికి దూరమవుతున్నారు. జపాన్లో 98 శాతం మంది తమ మాతృభాషలోనే వికీపీడియాను ఉపయోగించుకుంటు న్నారు. అభివృద్ధి చెందిన చాలా దేశాలు తమ మాతృభాషల్లోనే డిజిటల్ మాధ్యమాలను నిర్వహించుకుంటున్నాయి. దీన్ని పరిగణనలోకి తీసుకుని వికీపీడియా, డిజిటల్ మాధ్యమాల్లో ప్రాంతీయ భాషల బలం పెంచాలని హైదరాబాదు ట్రిపుల్ ఐటీ నిర్ణయించింది.
45 రోజుల శిక్షణ
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో కేవలం డెబ్బై వేల వ్యాసాలే అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకూ 10 నుంచి 15 మంది మాత్రమే ఇందులో వ్యాసాలు రాస్తున్నారు. వారు కూడా తమ ఉద్యోగాలు చేసుకుంటూ ఖాళీ సమయాల్లో స్వచ్ఛందంగా రాస్తున్నారు. ఈ సంఖ్యను పెంచుతూ, యువతను కూడా ఇందులో భాగం చేసేలా ఇండిక్ వికీ ప్రాజెక్టు సభ్యులు కృషి చేస్తున్నారు. తెలుగు భాషను వికీపీడియాతో పాటు మిగిలిన డిజిటల్ మాధ్యమాల్లో కూడా విస్తృతపరచడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా రాబోయే రెండేళ్లలో రెండు నుంచి నాలుగు లక్షల వ్యాసాలను తెలుగు వికీలో అందుబాటులోకి తేవడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు హైదరాబాదు ట్రిపుల్ ఐటీ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నారు. ఇందుకోసం తెలుగు మీద ఆసక్తి ఉండి వికీపీడియాలో వ్యాసాలు రాయాలనుకునే వంద మందికి ప్రతీ నెలా శిక్షణ లేదా ఇంటర్న్షిప్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొన్న వారికి హైదరాబాదు ట్రిపుల్ ఐటీ నుంచి ధ్రువపత్రం అందజేస్తారు. తెలుగే కాకుండా మన దేశంలోని అన్ని ప్రాంతీయ భాషల్లో వికీపీడియా అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంది. మాతృభాషల్లో పరిశోధనలు తక్కువయిపోవడం, ఆంగ్లప్రభావం, ప్రభుత్వాల చిత్తశుద్ధి లేమి, ప్రజల్లో మాతృభాష అభివృద్ధి ఆవశ్యకత గురించి అవగాహన లేకపోవడం దీనికి ప్రధాన కారణాలు. ప్రజల్లోని డిజిటల్ నిరక్షరాస్యత కూడా డిజిటల్ మాధ్యమాల్లో ప్రాంతీయ భాషల అభివృద్ధికి అడ్డంకిగా మారుతోంది.
ప్రస్తుతం హైదరాబాదు ట్రిపుల్ ఐటీలో నలభై మంది బృందం ఈ ప్రాజెక్టు కోసం పనిచేస్తోంది. ప్రతి నెలా వంద మందిని ఇందులో భాగం చేసేందుకు కృషిచేస్తున్నారు. కరోనాకు ముందు నిర్వహించిన కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు, రచయితలు, భాషాపండితులు, విలేకరులు పాల్గొన్నారు. డిజిటల్ మాధ్యమాల్లో తెలుగు అభివృద్ధి కోసం వారిచ్చిన సలహాలు, సూచనలు స్వీకరించారు. మళ్లీ ఫిబ్రవరి 1 నుంచి 45 రోజుల పాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. కంప్యూటర్ మౌలిక విజ్ఞానం, తెలుగు టైపింగ్, వికీపీడియాలో ఫొటో అప్లోడ్, రిఫరెన్స్ లింకులు ఇవ్వడం లాంటి వాటిని నేర్పిస్తారు. ఈ సారి శిక్షణ కోసం 190 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. కరోనా కారణంగా ఈ తరగతులను ఆన్లైన్లోనే నిర్వహిస్తున్నారు. చేస్తూ నేర్చు కోవడం (లెర్నింగ్ బై డూయింగ్) విధానంలో ఈ శిక్షణ ఉంటుంది. ‘తెవికీ’ పేరిట ఒకే చోట అన్ని తెలుగు వికీ వ్యాసాల సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చారు.
కరోనాలోనూ ఆగకుండా...
ప్రాజెక్టులో భాగంగా అంతర్జాల గ్రంథాలయాల సభ్యత్వం ద్వారా కావాల్సిన గ్రంథాలను వ్యాసకర్తలకు అందుబాటులోకి తెస్తున్నారు. ఈ ప్రాజెక్టు గురించి ప్రసారమాధ్యమాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. పాఠశాలలకు వెళ్లి ఉపాధ్యాయులకు వికీపీడియా మీద అవగాహన కల్పించి, అందులో వారు రచనలు చేసేలా ప్రోత్సహిస్తున్నారు. ఆయా రంగాల్లో నిపుణులైన వారిని ఇందులో భాగం చేసి వారితో వ్యాసాలు రాయించేలా కృషి చేస్తున్నారు. నిపుణుల సమీక్షతోనే వ్యాసం ప్రచురితమయ్యేలా, అనువాద వ్యాసాలను పరీక్షించేందుకు ఒక చెక్ లిస్ట్ అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నిస్తున్నారు. అలాగే తరచూ వికీపీడియాలో వాడే పదాలు, వాటి అనువాదాల గురించి ఒక పదకోశాన్ని అందుబాటులోకి తేవడానికి సాప్ట్వేర్ అప్లికేషన్లు అభివృద్ధి చేస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్ కోసం కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ నిధులు మంజూరు చేస్తోంది. తెలుగు విశ్వవిద్యాలయంలోని తెలుగు విజ్ఞాన సర్వస్వం ద్వారా అనేక వ్యాసాలను వికీపీడియాలోకి అందుబాటులోకి తేవడానికి కూడా ప్రయత్నాలు సాగుతున్నాయి. తెలుగు ఆచార్యులు, పరిశోధక విద్యార్థులు, రచయితలు, పాత్రికేయులను ఇందులో భాగం చేసేందుకు సన్నాహాలు జరుగు తున్నాయి. కరోనా పరిస్థితుల్లోనూ ఈ ప్రాజెక్టు కార్యకలాపాలు కుంటుపడలేదు. అంతర్జాల వేదికల్లో సమావేశాలు నిర్వహించుకున్నారు. వికీపీడియా గురించి స్వయం శిక్షణ పొందేలా ట్యుటోరియళ్లు, వీడియోలు కూడా రూపొందించారు. ప్రాంతీయ భాషలకు జవజీవాలందించే ఇలాంటి కార్యక్రమాల్లో భాషాభిమానులు పెద్ద సంఖ్యలో భాగస్వాములవ్వాలి. అప్పుడే ఆంగ్లం రాకున్నా ప్రపంచ విజ్ఞానం అందరికీ చేరువవుతుంది. దేశం భిన్నత్వంలో ఏకత్వం సాధించడం సాధ్యమవుతుంది.
(తెవికీ కృషిలో భాగస్వాములు కాదలచుకున్న వారు 90141 20442, 99592 63974 (వాట్సప్), tewiki.iiit.ac.in లలో సంప్రదించవచ్చు)