అభివృద్ధి మంత్రం.. ఇటాలియనే!

  • 58 Views
  • 0Likes
  • Like
  • Article Share

    రంగారావు

రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీతో జతకట్టి ఆర్థికంగా చితికిపోయిన ఇటలీ తిరిగి ప్రగతి పథంలో దూసుకుపోవడానికి కారణం... మాతృభాషకు అదిచ్చిన ప్రాధాన్యం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ప్రగతిని ఎప్పటికప్పుడు ఇటాలియన్‌లోకి తెచ్చుకుంటూ విజ్ఞాన పరంగా మేటిగా ఎదిగిందీ దేశం. పాఠశాల నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకూ ఇటాలియన్‌ మాధ్యమంలో చదువు అందిస్తూ దేశానికి బలమైన జ్ఞాన పునాదులు నిర్మించుకుంటోంది ఇటలీ.   
ఇటలీలోని
వేర్వేరు రాష్ట్రాలన్నీ కలిసి 1861లో ఒక దేశంగా ఏర్పడ్డాయి. అప్పటి నుంచే ఇక్కడ జాతీయ భాషకు సంబంధించిన ఆలోచనలు మొదలయ్యాయి. దేశాన్ని ఏకతాటి మీదకి తేవడానికి ఒక జాతీయ భాష అవసరమని 1868లో అప్పటి విద్యాశాఖ మంత్రి అలెగ్జాండ్రో మంజోనీ భావించారు. మేధావులు, రాజకీయ నాయకులతో ఎన్నో చర్చల అనంతరం ఇటలీ దేశ జాతీయ భాషగా ఇటాలియన్‌ (మన అమ్మభాష మాదిరిగానే ఇదీ అజంత భాష. దీన్ని ఉట్టంకిస్తూనే పాశ్చాత్యులు తెలుగును ‘ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌’ అన్నారు) ఉద్భవించింది. అయితే, ఆ తర్వాత చాలా కాలం ఈ జాతీయ భాష కేవలం కాగితాలకే పరిమితమైంది. చాలా తక్కువ మంది మాట్లాడే ఇటాలియన్‌ని అనేక కార్యక్రమాలు, రేడియో ద్వారా విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఆ క్రమంలో దేశంలోని ప్రాంతీయ భాషల మీద ఎలాంటి ఆంక్షలూ విధించలేదు. పాఠశాలల్లో కూడా విద్యార్థులకు ఇటాలియన్‌ నేర్పడం మొదలైంది. లిపిలేని చాలా ప్రాంతీయ భాషలు మాట్లాడేవారు విద్యావంతులుగా మారడానికి ఇటాలియన్‌ తోడ్పడింది. 
విశ్వవిద్యాలయ స్థాయిలో...
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఇటలీ ప్రభుత్వం మాతృభాష   అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. ఇటాలియన్‌లోని విదేశీ పదాల వాడకాన్ని తగ్గించి భాషను ప్రామాణికం చేసింది. 1950 తర్వాత దేశంలో ఇటాలియన్‌ను ప్రజలు ఎక్కువగా నేర్చుకోవడం ప్రారంభించారు. పాఠశాలలు, కళాశాలలతో పాటు అన్ని కార్యాలయాల్లో ఇటాలియన్‌ భాషనే వాడటం మొదలైంది. అయితే ఆయా ప్రాంతాల్లో విభిన్న యాసల్లోకి అది మారింది. 1950 తొలి రోజుల్లో 64 శాతం మంది ప్రాంతీయ భాషల్లోనే మాట్లాడేవారు. 1954 నుంచి ఇటాలియన్‌ భాష ప్రజలకు మరింత చేరువయ్యేందుకు టెలివిజన్‌ ఉపకరించింది. అప్పటి వరకు ఇటాలియన్‌ ఉచ్చారణకు సంబంధించి ప్రజల్లో ఉన్న సందేహాలను టీవీ నివృత్తి చేసింది. వార్తా పత్రికలు కూడా ఇటాలియన్‌ అభివృద్ధికి చాలాతోడ్పడ్డాయి. భాష అభివృద్ధి గురించిన చర్చలు అప్పటి నుంచే  మొదలయ్యాయి.  
      ప్రస్తుతం ఇటలీ పౌరులకే కాకుండా, అక్కడ నివాసముంటున్న విదేశీయుల పిల్లలకు కూడా ప్రభుత్వం ఉచిత విద్య అందిస్తోంది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన ఇటాలియన్‌ మధ్యమంలోనే సాగుతోంది. ప్రాథమిక విద్య నుంచే ఆంగ్లం, ఫ్రెంచ్‌ లాంటి భాషలను ఒక 
సబ్జెక్టుగా బోధిస్తున్నారు. ప్రభుత్వ నిధులు అందుకునే ప్రైవేటు పాఠశాలల్లో కూడా ఇదే విధానం అమలవుతోంది. కొన్ని అంతర్జాతీయ పాఠశాలల్లో మాత్రం ఆంగ్ల మాధ్యమం అందుబాటులో ఉంటుంది. ఇటలీ అక్షరాస్యత 99.2 శాతం. విశ్వవిద్యాలయాల్లో అన్ని కోర్సులనూ ఇటాలియన్‌ మాధ్యమంతో పాటు ఆంగ్లంలో కూడా అందిస్తున్నారు. పరిశోధనల్లో ఇటాలియన్‌నే అధికంగా ఉపయోగిస్తున్నారు. అన్ని పరిశోధనా గ్రంథాలు ఇటాలియన్‌లో అందుబాటులో ఉంటున్నాయి. వైద్య, సాంకేతిక, వృత్తి విద్యా కోర్సులు కూడా ఇటాలియన్‌ మాధ్యమంలో చదువుకోవచ్చు. విశ్వ విద్యాలయ స్థాయిలో ఇటాలియన్‌లో చదువుకునేవారే ఎక్కువ. భాషకు సంబంధించిన నిర్ణయాల్ని విదేశాంగ, విద్యా మంత్రిత్వ శాఖలు తీసుకుంటాయి. 
పదాల దత్తత
ఇటాలియన్‌ భాష అభివృద్ధి కోసం ఇటలీలో ఎన్నో సంస్థలు కృషి చేస్తున్నాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ‘డాంటే అళిఘీరీ’ సొసైటీ. ఇటాలియన్‌ భాషా పితామహుడిగా పిలుచుకునే ప్రముఖ కవి డాంటే పేరు మీద ఈ సొసైటీని 1889లో ఇటలీ ప్రభుత్వం స్థాపించింది. ప్రపంచ వ్యాప్తంగా ఇటాలియన్‌ భాషను ప్రచారం చేయడానికి, ఇటలీ సంస్కృతి పరిరక్షణకు ఇది కృషి చేస్తుంది. ఇటలీలో నివసిస్తున్న విదేశీయులకు ఇటాలియన్‌ నేర్పిస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. బ్రెయిలీ ఇటాలియన్, సైన్‌ ఇటాలియన్‌ అభివృద్ధికి కూడా కృషిచేస్తోంది. ప్రస్తుతం అరవై దేశాల్లో ఈ సంస్థ కార్యాలయాలున్నాయి. దీనికి నిధులు కేంద్రంతో పాటు దాతలు, బోధన ద్వారా సమకూరతాయి. 1948లో ఈ సొసైటీ స్వతంత్ర సంస్థగా అవతరించింది. కీలక నిర్ణయాలన్నీ ఇందులో ఉన్నతోద్యోగులే తీసుకుంటారు. దేశంలో ఇటాలియన్‌కు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ప్రభుత్వంతో పాటు ఈ సంస్థ కూడా ప్రధాన పాత్ర వహిస్తుంది. 
      కాలగతిలో కనుమరుగయ్యే పదాలను సంరక్షించుకోవడానికి ‘పదాల దత్తత’ అనే వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది డాంటే అళిఘీరి. వాడుకలో లేకుండా పోతున్న పదాలను గుర్తించి తమ వెబ్‌సైట్లో పెడుతోంది. ఆ జాబితా నుంచి ఎవరైనా ఒక పదాన్ని దత్తత తీసుకోవచ్చు. అయితే... దాన్ని ఉపయోగిస్తూ వాక్యాలు, చిట్టికథలు, గేయాలు తదితరాలను రూపొందించాలి. అలా తయారు చేసిన వాటిని తిరిగి వెబ్‌సైట్లో ఉంచాలి. ఈ ప్రక్రియను నిరంతరం కొనసాగించాలి. భాషావేత్తల నుంచి విద్యార్థుల వరకూ అన్ని వర్గాల వారూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.  
నిఘంటువులు.. అనువాదాలు
1926లో స్థాపించిన ఇటలీ రాయల్‌ అకాడమీ కూడా ఆయా శాస్త్రాల పదకోశాలను తయారు చేసింది. అనేక పరిశోధనలు జరిపి ప్రామాణిక భాషకోసం కృషిచేసింది. నియంత ముస్సోలినీ మరణం తర్వాత ఇది మూతపడింది. 1925లో గువోని టెక్కోనీ అనే పారిశ్రామికవేత్త స్థాపించిన ఇటాలియన్‌ విజ్ఞాన సర్వస్వ సంస్థ కూడా చరిత్ర, విజ్ఞాన శాస్త్ర వ్యాసాలను ఇటాలియన్‌ భాషలో ముద్రిస్తోంది. ఇటాలియన్‌లో విజ్ఞాన సర్వస్వ పుస్తకాల్ని విడుదల చేస్తోంది. ఇప్పటి వరకు 60 వేలకు పైగా వ్యాసాలతో 37 సంకలనాల్ని ఇది ప్రచురించింది. వీటితో పాటు విశ్వవిద్యాలయాలు కూడా ఇటాలియన్‌ అభివృద్ధికి కృషి చేస్తున్నాయి. 
      ఇతర భాషల్లో చోటుచేసుకుం టున్న పరిణామాల పరిశీలన, మాండ లిక పదాల సేకరణ, అనువాద ప్రక్రి యలో పరిశోధనలు, నూతన నిఘంటు వుల రూపకల్పన తదితరాలు ఇటలీ విశ్వవిద్యాలయాల్లో నిత్యం జరుగుతుం టాయి. భాషాభివృద్ధిలో ఆ దేశ పాలకులూ ప్రత్యక్షంగా భాగస్వాముల వుతారు. ప్రధాని కార్యాలయం ఆధ్వర్యం లోని ప్రచురణల విభాగం ఏటా రూ.3 కోట్ల ఖర్చుతో వంద ఇటాలియన్‌ పుస్తకాలను వివిధ ప్రపంచ భాషల్లోకి అనువదింపజేస్తోంది. ఇటాలియన్‌ మీద విదేశీయుల్లో ఆసక్తి పెంచడానికి, తమ సంస్కృతిని వారికి పరిచయం చేయడానికి అనువాదాలను ప్రోత్సహిస్తోంది.
      ఇటలీలో ప్రస్తుతం ప్రాంతీయ భాషలు, సంస్కృతి పరిరక్షణకు కూడా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇటాలియన్‌కు జాతీయ భాష హోదా కల్పించినా, మైనారిటీ భాషలను కూడా అధికారికంగా గుర్తించారు. రాజ్యాంగాన్ని అన్ని ప్రాంతీయ భాషల్లో ముద్రించారు. న్యాయ విచారణలు, ఇతర పత్రాలను ఇటాలియన్‌తో పాటు ప్రాంతీయ భాషల్లోకీ అనువదించారు. చాలా నామ ఫలకాల మీద ఇటాలియన్‌తో పాటు ప్రాంతీయ భాషలు కూడా కనిపిస్తాయి. సైనా విశ్వవిద్యాలయం అక్కడి ప్రాంతీయ భాషల పరిరక్షణకు కృషి చేస్తోంది. మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా సమర్థంగా ఎదుర్కొంటూ ఇటాలియనే అభివృద్ధి దివిటీగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్న ఇటలీ ఎన్నో దేశాలకు ఆదర్శం. ఈ అజంత భాష వెలుగులను గమనించైనా తెలుగు పాలకులు కళ్లు తెరుస్తారా?


వెనక్కి ...

మీ అభిప్రాయం