ఊరుగాలువ తియ్యడం

  • 104 Views
  • 0Likes
  • Like
  • Article Share

ఊరుగాలువ తియ్యడం
మాగాణి మడి నుంచి నీళ్లు బయటికిపోయేందుకు తీసే సన్నటి మట్టిదారి. పండిన పైరుని కోసిన తర్వాత పొలంలోనే ఎండబెడతారు. మడిలో నీరు లేకుండా జాగ్రత్త పడతారు. మెరక నుంచి వచ్చే నీటిని తొలగించేందుకు ఊరుగాలువలు తీస్తారు. వీటినే వనగాలువలు అంటారు. ‘‘ఊరుగాలువ తీసినమడి, వాత వేసిన పశువు అక్కర కొచ్చును’’ అని సామెత.


సంచకారం
ఒక వస్తువును కొనడానికి నిర్ణయించుకున్నప్పుడు ఆ ఒప్పుదలను ధ్రువీకరించడానికి కొనుగోలుదారు అమ్మకందారుకు లాంఛనప్రాయంగా చెల్లించే చిన్నమొత్తం. పాళీభాషలో సచ్చకారగా వ్యవహారం పొందిన ఈ పదం సంస్కృతంతో సత్యంకార, తెలుగులో సంచకారగా భిన్నమార్పులు పొందింది. ఈ సంచకారానికి మారుగా నేడు ఉర్దూ పదమైన బయానా, ఆంగ్ల పదమైన అడ్వాన్సులను ఉపయోగిస్తున్నా తెలంగాణ, రాయలసీమ, ప్రకాశం జిల్లా పరిసర ప్రాంతాల్లో ఇదిప్పటికీ వాడుకలో ఉంది. ‘‘వనిత నీ చిత్తమునకేను వత్తునేని కామతంత్రంబునకు సంచకర్వు గాగ జుంబనము సేయనిమ్ము, కోడెగాండ్ర గమికె తన జగ్గుజిగి సంచకారమొసగి’’ అని శివరాత్రి మాహాత్మ్యం, హంస వింశతి కావ్యాల్లో ప్రయోగాలు కనిపిస్తున్నాయి.


దోబూచి 
తల్లులు తమ కళ్లకు చేతులు అడ్డుగా పెట్టుకుని దోబూచీ అంటూ, గప్పున తెరచి పిల్లల్ని విస్మయపరిచే దాగిలిముచ్చులు లాంటి ఆట ఇది. ఇందులో పిల్లలు దొంగలు. తల్లి ఒకరి కళ్లు మూస్తుంది. మిగిలినవారు దాక్కుంటారు. దొంగలను వెదికి పట్టుకోవడం ఇందులో విశేషం.  ‘‘గుఱుతెఱిగిన దొంగ కు కు కు- వీడె/ గుడిలోన దాగిన కూకూగు’’ అనే అన్నమయ్య కీర్తనలో ‘కూకూగు’ పిల్లల ఆటల విశేషాన్ని తెలియజేస్తుంది.


అడుగులకు మడువులొత్తు
మర్యాదస్థులను ఇంట్లోకి ఆహ్వానించేటప్పుడు నేల మీద చలువ దుప్పట్లను పరుస్తారు. వాటి మీదుగా వాళ్లు నడిచి వెళ్లిన తర్వాత ఎత్తి మళ్లీ ముందు పరుస్తారు. గొప్పవారికి చేసే మర్యాద ఇది. మడువులు అంటే ఉతికి మడత పెట్టిన బట్టలు. ‘అడుగులకు మడువులొత్తు’ అనే పలుకుబడి దీంట్లోంచి పుట్టిందే.


బండవాండ్రు
‘‘బ్రతుకుతెరువులేని బడుగులందరు/ పెద్ద యోగవరుల ముందు సాగిరాగ/ బండవాండ్రముందు దండంబు లిడుదురు’’- మణిభద్రుడు సర్వదర్శన సముచ్చయం టీకలో వాడిన ముగ్ధజనులు అనే మాటకు సమానార్థకంగా వేమన బండవాండ్రు అన్నాడు. ముగ్ధం అంటే వివేకం లేనిది అని అర్థం. బండవాండ్రు అంటే అవివేకులు. వీరినే మెప్పెలు అంటాడు వేమన. ‘‘గుడులు దేవతని గుర్తులు గావింత్రు.. మెప్పెలకును దారి జెప్పిన ప్రాజ్ఞత’’ అని వేమన ప్రయోగం.


ఇలారం 
గాదె అని సామాన్యార్థం. రెండు పుట్ల (పుట్టి ఆరు క్వింటాళ్లు) నుంచి అరవై పుట్ల దాకా ధాన్యం నిల్వ ఉంచుకునే పెద్ద గుమ్మి. పుల్చేరు, వావిలి, గువ్వదాటు కట్టెలతో అల్లే ఈ గుమ్మిని ఇంటిముందుగాని, ఆవరణంలో గాని, అరుగు మీద గాని నిలుపుతారు. గడ్డి, ఈత చువ్వలను పై కప్పుకోసం ఉపయోగిస్తారు. ఇంటి పైకప్పు, చిన్న గుడిసె అని నిఘంటు అర్థాలు.


కరిస - గరిసె
కరిస అంటే ఒక కొలపాత్ర, అందులో పట్టగల గింజలను విత్తగల భూ విస్తీర్ణాన్ని సూచించే పదం కూడా. ఈ పాళీపదానికి తెలుగులో గరిసె అనే సమానార్థకం ఉంది. ‘‘గరిసెల వ్రాతెకాని యొక గంటె డెఱుంగము’’ అని అడిదం సూరకవి, ‘‘కుసూలాభిధ గాదె యనంగను గిరిసె యనంగ’’ అని భారతంలోనూ - ప్రయోగాలు కనిపిస్తున్నాయి. గరిసె అంటే ధాన్యాదులను భద్రపరిచే గాదె అని సామాన్యార్థం.


చెప్పుకోండి చూద్దాం!
జోడు నిట్రాళ్లు
నిట్రాళ్లమీద కుడితిగోళెం
కుడితిగోళెంపై పొన్నకాయ
పొన్నకాయ మీద గరికపోచలు
గరికపోచలపై గాడిద పిల్లలు
నాట్యమాడుతున్నాయి
పాదాంతంలోని పదాన్ని పాదాదిలో గ్రహించడం ముక్తపదగ్రస్త అలంకార లక్షణం. ఈ పొడుపు కథలో విడుపు ఏ పాదానికా పాదంలో ప్రత్యేకంగా ఉంటుంది. జోడు నిట్రాళ్లు అంటే కాళ్లు, కుడితిగోళెం అంటే పొట్ట, పొన్నకాయ అంటే తల, గరికపోచ అంటే జుట్టు, గాడిద పిల్లలు అంటే పేలు.


ఔపోసన - ఆపోసన
‘వాడు సర్వకళలను ఔపాసన పట్టాడు’ అని వ్యవహరిస్తారు. అయితే, ఔపాసనం అంటే హోమం చెయ్యడం. నీరు తాగడం అనే అర్థాన్నిచ్చే దాన్ని మాత్రం ‘ఆపోసన పట్టడం’ అంటారు. స్వీకరించడం, తెలుసుకోవడం అనే రూపాల్లో ఇది నేడు వ్యవహారంలో ఉంది.


మహసూలు
కుప్ప నూర్చి ధాన్యం ఇంటికి చేర్చే సేద్యపు పని. మహసూలు అనే అరబ్బీ పదానికి అదను, రుతువు అని అర్థాలున్నాయి. మొగల్‌ పరిపాలనలో శిస్తు ధాన్య రూపంలో వసూలు చేసుకోవడానికి దివానులు రైతులతో కుప్పలు నూర్పించి, తమ భాగాలను సమీప గ్రామాల్లో భద్రపరచి జెట్టలను ఉంచేవారు. ఇలా అదునుకు చేసే నూర్పిళ్లను, ధాన్య సేకరణను మహసూల్‌ అనేవారు. జన వ్యవహారంలో ఇది ‘మాసూళ్లు’ అయ్యింది. 


రట్టగుడి
క్రీ.శ.ఏడెనిమిది శతాబ్దాల నాటి నుంచి తెలుగు గడ్డ మీద రట్టగుడి పేరుతో చిన్న గ్రామాధికారులు ఉండేవారు. ఈ రట్టగుడి శబ్దం నుంచే రట్టోడి, రట్ట, రడ్డి, రెడ్డి అనే రూపాలు పుట్టాయి. చిన్న చిన్న భూభాగాలకు అధికారులుగా వాటిని గుత్తగా అనుభవిస్తుండేవాళ్లని రట్టగుట్టులు, రట్టగుడ్లు అని పిలిచేవారు. వీరి ముఖ్య వృత్తి వ్యవసాయం. ఈ రట్టడులకు నిధి, నిక్షేపం, జలం, పాషాణాలు, అక్షిణి, ఆగామి, సిద్ధం, సాధ్యం అనే అష్ట భోగాలు ఆధీనంలో ఉండేవి.  ఆ కాలంలో రట్టడాలు ఒక రకమైన ఆర్థిక వ్యవస్థలు. ఆదిలో ఇలా వృత్తివాచకమైన రెడ్డి పదం తర్వాత జాతివాచకమైంది. 


 


వెనక్కి ...

మీ అభిప్రాయం