నీలమోహనా నిను చేరుటకై

  • 116 Views
  • 0Likes
  • Like
  • Article Share

    తాటికొండాల నరసింహారావు

  • ఖమ్మం.
  • 9885787250
తాటికొండాల నరసింహారావు

ఎనిమిది చరణాలతో దేవుడికి ఆర్తిగా సమర్పించే భక్తి మధుర నైవేద్యం అష్టకం. అయితే, శ్రీకృష్ణుణ్ని భక్తిపురస్సరంగా ఎనిమిది పంక్తుల చొప్పున వచన నీలమోహనాష్టకంతో అర్చించారు డా।। తిరుక్కోవళ్లూరు శ్రీరంగస్వామి. తెలుగులో వచన గేయ రూపంలో వెలువడిన తొలి అష్టకంగా ఇది గుర్తింపు పొందుతోంది.
శ్రీకృష్ణున్ని
చాలా మంది చాలా రకాలుగా ఆరాధించి తరించారు. భక్తి సాహిత్యంలో కృష్ణభక్తి ప్రత్యేకమైంది. ఎందరో కవులు కన్నయ్యను అక్షర సుమాలతో అర్చించారు. లీలాశుకుడు శ్రీకృష్ణకర్ణామృతాన్ని గానంచేశాడు. మధుసూదన సరస్వతి మధురాష్టకాన్ని అందించాడు. జయదేవుని అష్టపదులు వినని వారుండరు. నారాయణతీర్థుల కృష్ణలీలాతరంగిణి ప్రసిద్ధమైంది. వేంకటాధ్వరి విశ్వ గుణాదర్శ చంపువును రచించారు. తెలుగులో కూడా విశ్వనాథ సత్యనారాయణ శ్రీకృష్ణకావ్యాలు రాశారు. కందుకూరి రుద్రకవి జనార్దనాష్టకం వెలయించారు. పాల్కురికి సోమనాథుని బసవపురాణంలో అష్టకం కనిపిస్తుంది. అలాగే వరంగల్లుకు చెందిన ప్రముఖ సాహితీవేత్త తిరుక్కోవళ్లూరు శ్రీరంగస్వామి వచన రూప నీలమోహనాష్టకంలో శ్రీకృష్ణునిపట్ల ఆయనకి ఉన్న తీవ్రమైన భక్తి అక్షరరూపం దాల్చి కనిపిస్తుంది. వచన కవితను పెద్దలు వచన పద్యాలుగా చెప్పినందువల్ల తన నీలమోహనాష్టకంలోని అష్టకాలను వచన పద్యాలుగా పేర్కొన్నారు శ్రీరంగస్వామి.
మధుర భక్తి
‘‘మోహనవంశీ భావ భూమికనై/ నీలిరాగమున మనసు ముమ్మడుగులై/ విశ్వనాథకృష్ణ భావనల ఊపిరులూది/ సుప్రసన్న కృష్ణబీజాక్షరిలో ‘సంపత్తు’నైతి’’ అంటూ సంప్రదాయాన్ని అనుసరించి నాలుగు నాందీ పంక్తులు రాశారు శ్రీరంగస్వామి. ఇందులో మహాకవులు విశ్వనాథ, సుప్రసన్న, సంపత్కుమారలను గురుస్థానీయులుగా స్మరించుకున్నారు. ‘‘నీ తలంపు నిత్యము నను వెంటాడుచునే ఉన్నది/ నిను గూర్చిన ఆలోచన నిత్యం తరుముచునే ఉన్నది/ నీ శరీర కాంతులెల్ల నీలాంబరి రాగమై/ నిను జూచిన భావనలకు పీతాంబర భోగమై/ నా మనస్సు నీ మురళీ స్వనమయమై/ కోమల రాగామృత ప్రవాహ తరంగితమై/ నా జీవన సంస్పందన నిను గూర్చిన తలంపులే/ ఈ ‘రంగ’స్థలమున వాంఛింతును నీ నృత్యములే’’ అంటారు తొలి అష్టకంలో. భక్త ప్రపంచంలో ఒక పరమాణువైన తన హృదయమనే రంగస్థలం మీద శ్రీకృష్ణుడు నృత్యం చేయాలని ఇక్కడ వాంఛించారు శ్రీరంగస్వామి. అలా నృత్యం చేసే కృష్ణుని రూపం ఎలా ఉండాలో కూడా చెప్పారు. ‘శరీరకాంతు లెల్ల నీలాంబరి రాగమై, నినుజూచిన భావనలకు పీతాంబర భోగమై’ ఉండాలట! ఇక్కడ నీలాంబరి రాగం ఆకాశం లాంటి నీలవర్ణుని శరీరమైతే ఆయన ధరించిన పట్టువస్త్రం పీతాంబర భోగం. ఆ కృష్ణ పరమాత్మకెమ్మోవిపై వేణునాదంతో వినిపించే కోమల రాగామృతం ప్రవహించేటట్లు రూపం ఉండాలన్నారు. ఇందులో శ్రీకృష్ణుని స్వరూపం సాక్షాత్కారమవుతుంది. 
      అలా నృత్యం చేస్తున్న శ్రీకృష్ణుని పాదాలనలంకరించిన చిరు గజ్జెల సవ్వడి ఆలోచనలు కాస్త కూడా ఆయన మనసుకు నిశ్శబ్దత కలిగించట్లేదని అంటారు రెండో అష్టకంలో. ‘‘బుడుబుంగ వంటి నిన్ను చూడాలని కోర్కెలు/ నా కన్నుల కొంచెమైన మూతబడనీయవు’’ అంటారిందులో. బుడుబుంగవంటి అంటే బుంగమూతితో యశోదను అలరించిన బాలకృష్ణుని రూపం అలాగే చూడాలనిపిస్తోందట. అలా దర్శనాన్నపేక్షించిన ఈ రంగణ్ని నువ్వేం చేయదలచుకున్నావో తెలియజెప్పమని ప్రశ్నిస్తారు. ఇందులో శ్రీకృష్ణుణ్ని ‘‘నీలి నీలి వెల్గుల దొరా! నింగి పొంగులైన దొరా!’’ అని సంబోధించడం ఆకట్టుకుంటుంది. మధుర భక్తికి నిదర్శనం ఈ ప్రయోగాలు.
      ‘‘నీలమోహనా నిను చేరుటకై యాతన మనశ్శరీరముల/ నీ రూపం కోసం నా కన్నులు వాకిళ్లయినయి/ తపిస్తున్నది శ్రవణేంద్రియం నీ వేణుగానం కోసం/ నీ నామస్మరణ కోసం అనునిత్యం ఆత్మకు తపన/ కనులకు కనపడదేమీ నీ మనోజ్ఞ రూపం/ వినపడవేమీ నీ పద ధ్వనులు నా అంతరంగాన/ ఆలోచనాలోచనాలు అనేకమయి నీలవర్ణుని/ అర్థమెరుగడు ఈ ‘రంగ’డు తదన్యుడయ్యి’’ అంటూ మూడో అష్టకంలో తనకు అంతా కృష్ణ మయంగానే కనిపిస్తోందని చెబుతారు. ఆయన్ని చేరడానికి మనశ్శరీరాలు యాతన పడుతున్నాయని, కన్నులు వాకిళ్లయ్యాయని ఆర్తిగా అంటారు. 
ఆర్తి రాగం
‘‘మబ్బుని గని ఆటాడగ నేను మయూరమ్మునా?/ చందమామ వెలుగులకై ఎగిరే ఆ చకోరమ్మునా?/ ఆమనిలో చివురు మేసి పాటపాడు కోకిలనా?/ ప్రతి నిమిషము ‘కృష్ణ! కృష్ణ’ అని పలికే చిలుకనా?’’ అని నాలుగో అష్టకంలో ప్రశ్నలు సంధించి ‘‘ఏమి కాను ఏమి కాను ఈ బతుకింకేమి కాను/ ఎన్నాళ్లని ఊరుకోను ఏమని నీ దరికి రాను’’ అంటూ ‘‘ఏమి చేసినా నీవే, ఏమి చేయకున్నా నీవే/ ఈ ‘రంగ’ము శ్రీరంగము చేయవలసినది నీవే’’ అని తన భారమంతా ఆ కృష్ణపరమాత్మకు వదిలిపెట్టారు. ఇక్కడ రంగమంటే కవి హృదయమనే శ్రీరంగక్షేత్రం. అందులో సుప్రతిష్ఠుడై ఉన్న రంగనాథునిలో ఐక్యం కావాలన్నది ఈ రంగడి కోరిక. జీవుని ఆర్తి ఇందులో కనిపిస్తుంది.
      అయిదో అష్టకంలో శ్రీకృష్ణుణ్ని చేరడానికి తనకున్న అడ్డంకుల గురించి ఆవేదనాభరితంగా చెబుతారు. శ్రీకృష్ణుడి విషయంలో గట్టిగా తన మనసుని అల్లాలనుకుంటే అష్టవంకర్లు తిరిగి కుంచించుకుపోతోందట. హృదయాన్ని స్వచ్ఛపరచి అర్పించాలంటే కమ్ముకున్న తమస్సు కొంచెం కూడా తొలగడంలేదట. కన్నయ్య నీలి వెలుగుల్లో మునిగి తేలాలంటే చీకటి నదులు అడుగడుగునా అడ్డుకుంటున్నాయట. ‘‘మాయ కాదు మిథ్య కాదు అడ్డులేని దారిలేదు/ ఈ ‘రంగ’ని గుంజు కొనవె నీ పాదాల కడకు’’ అంటూ దయతలచి స్వయంగా నల్లనయ్యే తన పాదాల దగ్గరకి తన భక్తుణ్ని లాక్కోవాలని అర్థిస్తారు. ఇక్కడ గుంజుకోవడం అనే ప్రయోగం భగవంతుణ్ని చేరాలన్న భక్తుడి బలమైన ఆకాంక్షను సహజంగా ప్రతిబింబిస్తుంది.  
      కృష్ణుని చేతి స్పర్శననుభవించిన భక్తుల్లో కుబ్జ, కుచేలులు ముఖ్యులు. పరమాత్మ ఆలింగన సౌఖ్యం అనుభవించిన వారు ఎంతటి ధన్యులు! కనీసం నిన్ను ఒక్కసారి చూసే భాగ్యం నాకు కలిగించు అంటూ వేడు కుంటారు ఆరో అష్టకంలో. ‘‘అలనాటి కుచేలునికయ్యా! నే వారసుడను/ కానీ నీ ఆప్యాయత కింతయు నోచుకోను... నిన్ను/ కనవలె నను కోర్కె మాత్ర మొకటె మిగిలినది/ ఇక ఏమీ అడుగబోను, ఇక ఏమీ వేడబోను/ ఈ ‘రంగ’ని బతుకున కనుపించవే ఒక్కసారి!’’ ఇక్కడ కుచేలుడికి తనని వారసుడిగా చెప్పుకుంటున్నారు. 
      ‘‘డాంబికాల బరువులతో డస్సిన ఈ బ్రతుకులో/ ఆర్తి హరా! నీ చూపుల పలకరింపులెన్నడో?/ ఆలోచనకందని అందమా! గోవింద స్పందమా!/ ఈ బ్రతుకున నీ చిరునవ్వులు చిమ్ముట ఎన్నడో’’ అంటూ ఏడో అష్టకంలో ఆర్తిగా వేడుకుంటారు. డాంబికాల బరువులతో అలసిపోయిన జీవితం గురించిన దుఃఖం ఇక్కడ కనిపిస్తుంది. ‘‘నా బుద్ధిలోన నిరతము వెలితి వెలితి వెలితి/ నీ బుద్ధిలోన నిరతము నిండారిన ధర్మాధృతి/ నీ సన్నిధిలోన నిత్యము నేనిక నిలువగలుగుటెప్పుడో/ నా అనుభవకాసారంత‘రంగ’మున నీ మునుగుట ఎన్నడో’’ అంటూ తన సర్వస్వాన్నీ భగవదర్పితం చేసి ఆ రంగనిలో లీనమవటానికి ఈ రంగడి ఎదురుచూపుల్ని ఆవిష్కరిస్తారు. చివరగా ముగింపు పంక్తుల్లో ‘‘నీవుదప్ప నాకు అన్యులెవరురా! శరణు! శరణు!’’ అంటూ వేడుకుంటారు. 2001లో ముద్రితమైన నీలమోహనాష్టకానికి డా।। కంపల్లె రవిచంద్రన్‌ ‘శ్రీకృష్ణశ్శరణం మమ’ పేరుతో వ్యాఖ్యానం రాశారు. భగవంతుడి పట్ల ఒక భక్తుడు ఆలపించిన ఆర్తి రాగం ఈ నీలమోహనాష్టకం. 


వెనక్కి ...

మీ అభిప్రాయం