చరిత్ర అధ్యయనంపై చెరగని సంతకం

  • 62 Views
  • 0Likes
  • Like
  • Article Share

చరిత్ర అధ్యయనకారుడు, విశ్రాంత అధ్యాపకుడు, తెలుగు రాష్ట్రాల స్థానిక చరిత్రలపై పరిశోధన చేసిన తల్లాప్రగడ సత్యనారాయణ మూర్తి 1930 మార్చి 2న పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరులో జన్మించారు. విద్యార్థి దశలోనే వామపక్ష భావాలకు ఆకర్షితులై ఐఎన్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. విశాలాంధ్ర ఉద్యమంలో క్రియాశీలకపాత్ర పోషించారు. ఆంధ్రోద్యమంలో టంగుటూరి ప్రకాశం పంతులుకి చేరువగా ఉంటూ ప్రత్యేక ఆంధ్రోద్యమానికి విశాఖపట్నం నుంచి నేతృత్వం వహించారు. చరిత్ర అంశాలపై విశేష పరిజ్ఞానమున్న మూర్తి ప్రధాని నెహ్రూతో ఆత్మీయ సంబంధాన్ని కొనసాగించేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా స్థానిక చరిత్రలపై సాధికారత కలిగిన ఈయన చరిత్ర రచయితగా అనేక రచనలు వెలువరించారు. పద్మనాభయుద్ధం, కశ్మీరు సంక్షిప్త చరిత్ర, సంక్షిప్త ప్రపంచ చరిత్ర, ఝాన్సీరాణి లక్ష్మీబాయి, ప్రపంచ నాగరికతల చరిత్ర లాంటి రచనలతో పాటు నెపోలియన్‌ మోనోగ్రాఫ్‌ను రూపొందించారు. చరిత్ర అధ్యాపకుడిగా తెలికచర్ల, తణుకు, పిఠాపురం, కాకినాడ, విశాఖపట్నం లాంటి పలు ప్రాంతాల్లో పనిచేశారు. వి.ఎం.ఎ.ఎల్‌ కళాశాల ప్రధాన ఆచార్యులుగా ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ‘ఈనాడు పాత్రికేయ పాఠశాల’ విద్యార్థులకు చరిత్ర, రాజనీతిశాస్త్రం బోధించారు. పాఠశాల, ఉన్నతస్థాయి, దూరవిద్య కోర్సుల చరిత్ర పాఠ్యాంశాలకి సంకలనకర్తగా వ్యవహరించారు. చరిత్ర అంశాలపై వ్యాఖ్యానిస్తూ వివిధ పత్రికలకి వ్యాసాలు రాశారు. మార్క్సిస్టు దృక్పథంతో చరిత్ర అధ్యయనం కొనసాగిస్తూ ఉత్తమ రచనలు అందించిన సత్యనారాయణ మూర్తి జనవరిలో కీర్తిశేషులయ్యారు.


వెనక్కి ...

మీ అభిప్రాయం