కమనీయ కథావిహారి

  • 100 Views
  • 0Likes
  • Like
  • Article Share

నవలా రచయిత్రిగా అశేష తెలుగు పాఠకులకు చేరువైన డా।। సి.ఆనందారామం అసలు పేరు ఆనందలక్ష్మి. భర్త రామాచారి పేరును తన పేరుకు జోడించి ఆనందారామంగా రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. 1935 ఆగష్టు 20 పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జన్మించిన ఆవిడ ప్రాథమిక విద్యాభ్యాసమంతా వీధిబడిలో కొనసాగింది. సి.ఆర్‌.రెడ్డి కళాశాలలో ఇంటర్మీడియెట్‌ పూర్తిచేసిన తర్వాత ట్యూటర్‌గా కొంతకాలం పనిచేశారు. వివాహానంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎమ్మే పూర్తి చేశారు. ‘ఆటూ పోటూ’ అనే ఆనందారామం మొదటి కథ ఆంధ్రప్రభలో ప్రచురితమైంది. ఒక పక్క చదువు కొనసాగిస్తూనే ‘అందమైన ట్రాజడీ’ లాంటి ఆహ్లాదకరమైన కథలు రాశారు. ‘కరుణ తల్లి’తో మొదలుపెట్టి జనరంజకమైన రేడియో కథలనేకం రాశారు. డా।। సి.నారాయణరెడ్డి పర్యవేక్షణలో ‘తెలుగు నవలల్లో కుటుంబ జీవనం’ అనే అంశం మీద పరిశోధన చేశారు. ఈ క్రమంలో సమాచారం కోసం సాహిత్యాన్ని విస్తృతంగా అధ్యయనం చేశారు.  
      ఆనందారామం మొదటి నవల ‘సంపెంగ పొదలు’. ‘పాతికేళ్ల పసిపాప’ నవల కుటుంబ విలువలకు అద్దం పడుతుంది. ఆవిడ రచనల్లో ‘నా రుషి కృతే కావ్యం’ విశేష ప్రజాదరణ పొందింది. ‘తపస్వి’ నవలలో ఆనందారామం చేసిన ప్రతిపాదనలు, నూతన భావాంశాలు పురాణాలు, ఉపనిషత్తుల మీద ఆవిడకు ఉన్న అవగాహనను స్పష్టం చేస్తాయి. ప్రతీకాత్మకమైన ఇతివృత్తంతో విలక్షణమైన కథనశైలితో సాగే ఆనందారామం ‘తుపాను’ నవల మాదిరెడ్డి సులోచన బంగారు నంది పురస్కారం గెలుచుకుంది. ప్రాచీన సాహిత్యాన్ని అధ్యయనం చెయ్యడమే కాకుండా వాటిని ఆధునిక ప్రక్రియల ద్వారా ఆవిష్కరించడం ఆనందారామం రచనల ప్రత్యేకత. పురాణ పాత్రలతో సమకాలీన రాజకీయ అంశాలను వ్యంగ్యంగా చిత్రిస్తూ ‘ఇంద్ర సింహాసనం’ రాశారు. అరవైకి పైగా నవలలు, 150కి పైగా కథలు వెలువరించారు. వీటన్నింటిలో ప్రధానంగా కనిపించేది కుటుంబ విలువలే. 
      అనేక సినిమా కథలకు ఆనందారామం నవలలే ముడి సరుకును అందించాయి. ఆత్మబలి, జాగృతి, మమతల కోవెల నవలలు ‘సంసార బంధం, త్రిశూలం, జ్యోతి’ చిత్రాలుగా వచ్చాయి. విప్లవకారుల ఆలోచనా విధానానికి దర్పణం పడుతూ జాగృతి నవల రాశారు. బైబిల్‌ కథనాలను హిందూ పురాణ కథలతో తులనాత్మక పరిశీలన చేస్తూ రచనలు చేశారు. తెలుగులో నవలల గమనాన్ని విశ్లేషిస్తూ బుచ్చిబాబు ‘చివరికి మిగిలేది’ అస్తిత్వవాద నవల అన్నారు. విస్తృత సాహితీ సృజన చేసిన రచయిత్రుల్లో ఒకరిగా మానవ జీవితంలో వివిధ కోణాలను స్పర్శిస్తూ రచనలు చేశారు. హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం అధ్యాపకులుగా సేవలందించారు. ఆనందారామం పర్యవేక్షణలో ముప్పై మంది విద్యార్థులు పరిశోధనా పత్రాలను సమర్పించారు. గృహలక్ష్మి స్వర్ణకంకణం, ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ పురస్కారం, మాలతీ చందూర్‌ స్మారక బహుమతితో పాటు సుశీల, నారాయణరెడ్డి పురస్కారాలను అందుకున్నారు. మధ్యతరగతి జీవితాల తీరుతెన్నులను, ఆలోచనా రీతులను తన రచనల ద్వారా నమోదు చేసిన ఈ అక్షర తపస్వి ఈ ఏడాది ఫిబ్రవరి 10న దివంగతులయ్యారు.  


వెనక్కి ...

మీ అభిప్రాయం