రాచరికపు పాలనలో అమ్మభాష ఉనికికే ప్రమాదం ఏర్పడినా, స్వతంత్ర దేశంగా అవతరించాక ప్రజల చొరవతో మాతృభాష ఆసరాతోనే అభివృద్ధి పథం వైపు దూసుకుపోయింది టర్కీ. పాలనలో, చదువులో అమ్మభాషకే పెద్ద పీట వేస్తూ అన్ని రంగాల్లో శక్తిమంత దేశంగా ఎదిగిన ఆ దేశ స్ఫూర్తి గాథ ఇది.
దాదాపు మూడు వేల ఏళ్ల కిందట మంగోలియా, దక్షిణ సైబీరియా ప్రాంతాల్లో టర్కిష్ భాష పుట్టినట్టు భాషాశాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మంగోలియాలో బయటపడిన ఎనిమిదో శతాబ్దం నాటి గొక్టర్క్ రాజుల శాసనాల్లో ఆది టర్కిష్ భాష కనిపిస్తుంది. చరిత్రలో ఐరోపా దేశాల మీద టర్కీ ప్రభావం ఎక్కువ. ఇప్పటికీ ఐరోపా, మధ్యతూర్పు దేశాలకు టర్కీనే వారధి. ప్రస్తుత దేశ జనాభా ఎనిమిది కోట్లకు పైనే.
విజ్ఞానశాస్త్ర అనువాదం
మధ్య యుగంలో టర్కీ ప్రజలు పశ్చిమానికి విస్తరించారు. ఆ కాలంలో పర్షియన్, అరబిక్ భాషల ప్రభావానికి టర్కిష్ లోనైంది. క్రీ.శ. పదో శతాబ్దంలో అరబ్బులు ఈ భాషను నేర్చుకోడానికి టర్కిష్ నిఘటుంవును అరబ్బీ అక్షరాలతోనే రూపొందించారు. అదే శతాబ్దంలో ఈడిప్ అహ్మట్ మహ్మట్ యుక్నెరీ అనే రచయిత ‘అటాబెటు హకాయిక్’ అనే పుస్తకాన్ని తూర్పు టర్కిష్ భాషలో రాశాడు. దీని శీర్షిక మాత్రం అరబ్బీలోనే ఉంటుంది. అరబ్బీ ప్రభావం అధికంగా ఉన్నా టర్కిక్ భాషల్లో ఒకటైన అల్టానిక్ టర్కిష్‌లో వచ్చిన రచనల్లో విదేశీ పదాలు చాలా తక్కువగా ఉపయోగించారు. దీన్నిబట్టి విదేశీ సంస్కృతి ప్రభావం నుంచి బయటపడటానికి టర్కీ ప్రజలు ఆనాడే ప్రయత్నం చేశారని అర్థమవుతుంది.
టర్కిష్ మీద విదేశీ భాషల ప్రభావం ఎక్కువగా ఉన్న ఆ కాలంలోనే ప్రముఖ గ్రంథం ‘కటాడ్గు బిలింగ్’ టర్కిష్ భాషలో ప్రచురితమైంది. పాశ్చాత్య సంస్కృతులు, భాషలను ఎదుర్కొంటూనే అమ్మభాషను కాపాడుకుంటూ వస్తున్న టర్కీ ప్రజల కల అనటోలియన్, కరమనోగులరీల పాలనలో నెరవేరింది. ఈ కాలంలో టర్కిష్ అధికార భాషగా గుర్తింపు పొందింది. తొలిసారిగా టర్కిష్ భాషా నిఘంటువు ‘దివిని టర్కి’ ప్రచురితమైంది. క్రీ.శ.1277లో సుల్తాన్ విలెద్ దీన్ని రూపొందించారు. 14, 15 శతాబ్దాల్లో అహ్మెది, కయ్గుసూజ్ అబ్దుల్, సులేమాన్ సిలేబి, హకీ బైరమ్ లాంటి వారు ప్రముఖ టర్కిష్ కవులుగా గుర్తింపు పొందారు. టర్కిష్ భాషాభివృద్ధి కోసం వీరు ప్రచారం చేశారు. ‘ముఎసిరెటుల్ ఉలుమ్’ అనే టర్కిష్ వ్యాకరణం 1530లో తొలిసారి ప్రచురితమైంది. విజ్ఞానశాస్త్ర ఆవశ్యకతను గుర్తించి 14వ శతాబ్దం నుంచే వైద్య, వృక్ష, గణిత, ఖగోళశాస్త్రాల్లోని జ్ఞానాన్ని టర్కిష్‌లోకి అనువదించుకోవడం ప్రారంభించారు.
టర్కిష్ భాషా సంఘం కృషి
ఒట్టామన్ రాజుల కాలంలో టర్కీలో ఫ్రెంచి భాషా ప్రాధాన్యం ఎక్కువైంది. టర్కీలోని అనేక విశ్వవిద్యాలయాలు ఫ్రెంచ్‌లో బోధించడం ప్రారంభించాయి. ఈ కాలంలో దాదాపు అయిదు వేల ఫ్రెంచి పదాలు టర్కీ భాషలోకి చేరాయి. భవిష్యత్తు భాషగా భావించి ఇస్తాంబుల్ లాంటి ప్రధాన నగరాల్లోని ప్రజలు ఎక్కువగా ఫ్రెంచ్నే మాట్లాడటం మొదలుపెట్టారు. టర్కిష్ మాట్లాడే వారి మీద వివక్ష కూడా మొదలైంది. టర్కిష్ రాజ్యాంగాన్ని కూడా ఫ్రెంచి భాషలోకి అనువదించారు. వార్తా పత్రికలు సైతం ఫ్రెంచి భాషలో ప్రచురితమయ్యేవి. మొదటి ప్రపంచయుద్ధంలో ఒట్టామన్ రాజు ఓడిపోయాడు. 1921 నాటికి రాజరిక పాలన టర్కీలో పూర్తిగా అంతరించింది. ఈ క్రమంలో టర్కీ ప్రజల భాష, సంస్కృతి, స్వయం అభివృద్ధి ప్రమాదంలో పడ్డాయి. ఈ సమయంలోనే ప్రజలు విదేశీ సంస్కృతిని వదిలి తమ మాతృభాషను అభివృద్ధి చేసుకుంటూ ముందడుగేశారు.
1923 అక్టోబర్ 29న టర్కీ గణతంత్ర దేశంగా అవతరించింది. ముస్తఫా కెమల్ మొదటి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. విదేశీ పదాల స్థానంలో సరళంగా ఉండే మాతృభాషా పదాలను చేర్చడం, నిఘంటువులను తయారు చేసుకోవడం, మాతృభాషా ప్రచారాన్ని ముమ్మరం చేయడం, భాషకు సంబంధించి అనేక కార్యక్రమాలు నిర్వహించడం మొదలైంది. అనువాద వ్యవస్థ ముస్తఫా కాలంలో మరింత బలంగా తయారైంది. భాషకు సంబంధించిన అనేక చట్టాల సవరణలు 1930లో ప్రారంభమయ్యాయి.
ఆ సమయంలోనే ‘‘టర్కీ పౌరుడివైతే టర్కిష్ మాట్లాడు’’ అంటూ ఓ నినాదం దేశంలో విస్తృతంగా ప్రచారమైంది. మొదట దీన్ని నాయశాస్త్ర విద్యార్థులు ప్రారంభించారు. తర్వాత ఈ ఉద్యమానికి ప్రభుత్వమే నిధులు మంజూరు చేసి ప్రచారం కల్పించింది. తమ దేశంలో నివసించే విదేశీయులు కూడా టర్కిషే మాట్లాడాలనే ఉద్దేశంతో ఈ ఉద్యమం ప్రారంభమయినప్పటికీ, ప్రజల్లో జాతీయవాదం పెంపొందించి టర్కిష్ భాషాభివృద్ధికి ఈ ఉద్యమం తోడ్పడింది. నూతన కార్యక్రమాలు, కొత్త చట్టాల మూలంగా దేశంలో మాతృభాష సరళమవడంతో ప్రజల అక్షరాస్యత పెరిగింది. ముస్తఫా కెమల్ ఆలోచనతో ‘టర్కిష్ భాషా సంఘం’ 1932 జులై 12న పురుడుపోసుకుంది. దేశంలో భాషకు సంబంధించిన కీలక నిర్ణయాల్ని ఈ సంఘమే తీసుకుంటుంది. కొత్త సమాచారం, అన్ని పరిశోధనా పత్రాలను మాతృభాషలోకి అనువదించేందుకు కృషి చేయడంతో పాటు, ప్రభుత్వానికి సంబంధించిన అన్ని పత్రాలను మాతృభాషలో అందిస్తుంది. సరళ పదాలు సృష్టిస్తూ వాటిని ప్రజలకు చేరువచేస్తుంది. పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో ప్రామాణిక భాషను ఉపయోగించేలా చూస్తుంది. బ్రెయిలీ, సంకేత టర్కీ భాషల అభివృద్ధి, విదేశాల్లో టర్కిష్ భాష ప్రచారానికి పాటు పడుతుంది. కేంద్రం నుంచి దీనికి నిధులు అందుతాయి.
అన్నీ టర్కిష్లోనే!
ప్రపంచంలోని గొప్ప విద్యావ్యవస్థల్లో టర్కీ ఒకటి. ఇక్కడి అక్షరాస్యత 2017 నాటికి 96.12 శాతం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 42 ప్రకారం దేశంలోని అన్ని విద్యాలయాల్లో బోధన భాష టర్కిషే. ఇక్కడి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరిగా మాతృభాషా మాధ్యమంలోనే విద్యాబోధన జరుగుతుంది.
విశ్వవిద్యాలయాల్లో 70 శాతానికి పైగా విద్యార్థులు టర్కిష్ మాధ్యమంలోనే చదువుకుంటారు. సాంకేతిక, వైద్యవిద్యలనూ మాతృభాషామాధ్యమంలో అభ్యసించే వీలుంది. విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు అధిక శాతం మాతృభాషలోనే జరుగుతాయి.
భాషా చట్టం 805 ప్రకారం ఆర్థిక కార్యకలాపాల్లో టర్కిష్ భాషనే తప్పనిసరిగా ఉపయోగించాలి. నిబంధనల ప్రకారం దేశీయ, విదేశీ పరిశ్రమలన్నీ తమ ఆర్థిక కార్యకలాపాలు, ఒప్పంద పత్రాలు, అన్ని రకాల సమాచారాన్ని ప్రభుత్వానికి టర్కిష్లోనే అందించాలి. అన్ని పరిశ్రమల్లోనూ టర్కిష్ భాషనే ఉపయోగించాలి. దీనికి అనుగుణంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోని పత్రాలు, దరఖాస్తులు టర్కిష్ భాషలోనే ఉంటాయి. న్యాయస్థానాల్లో కూడా ఆ భాషనే ఉపయోగిస్తారు. నామఫలకాలన్నీ తప్పనిసరిగా టర్కిష్లోనే ఉంటాయి. వార్తాపత్రికలు, మీడియా రంగాల్లో సింహభాగం మాతృభాషే కనిపిస్తుంది. ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనా ప్రజల అభిమాన బలంతో నిలిచి దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది టర్కిష్. ఆ దేశవాసులకన్నా దాదాపు రెండు కోట్లు ఎక్కువ జనాభా ఉన్న తెలుగువాళ్లం.. మన భాషను మనం అలా తీర్చిదిద్దుకోలేమా?
‘‘దేశ పౌరులందరూ తప్పనిసరిగా తమ మాతృభాషనే మాట్లాడాలి. అదే మనదేశానికి, మన సంస్కృతికీ మనమిచ్చే గొప్ప గౌరవం’’ అంటూ టర్కీ తొలి అధ్యక్షుడు ముస్తాఫా కెమల్ తన ఉపన్యాసాల్లో అనేకసార్లు దేశప్రజలకు గుర్తుచేసేవారు.
- కల్లా