భాగ్యనగరంలో సాహితీ సంబరం

  • 765 Views
  • 0Likes
  • Like
  • Article Share

    పి.భానుచందర్‌రెడ్డి

  • హైదరాబాదు
  • 7032133361
పి.భానుచందర్‌రెడ్డి

సంక్రాంతికి ముందు భాగ్యనగరం సాహితీ సంబరానికి వేదికగా నిలిచింది. జంటనగరాల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యాన్నీ దేశ, విదేశీ ప్రతినిధులకు పరిచయం చేసింది. రచయితలు, పాఠకుల్ని ఒకే తాటిపైకి తెచ్చింది. రచనలు చేయాలనుకునే ఔత్సాహికులకు మార్గదర్శనం చేసింది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సాహిత్యం మీద లోతైన అధ్యయనం జరిగింది. జానపదానికి పెద్దపీట వేస్తూనే.. చర్చలు.. విభిన్న అంశాలపై కార్యశాలలు, కళలు, సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనలు, పుస్తకావిష్కరణలకు వేదికగా మారింది. సింగపూర్‌ గురించి అవగాహన కల్పించింది. ఇదీ స్థూలంగా.. బేగంపేట హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ వేదికగా జనవరి 7 నుంచి 10 తేదీలలో కన్నుల పండువగా జరిగిన ‘హైదరాబాద్‌ సాహితీ ఉత్సవం- 2016’ పరిచయం.
మనదేశంలోని ప్రముఖ నగరాలు ఏటా సాహితీ ఉత్సవాలకు ఆతిథ్యం ఇస్తాయి. చారిత్రక, వారసత్వ, సాంస్కృతిక సంపదలతో సుసంపన్నమైన హైదరాబాదులో మాత్రం అలాంటివాటి వూసే లేదు. ఇదే నగరంలోని కొంతమంది సాహితీ ప్రియుల్ని ఆవేదనకు గురిచేసింది. 2005లో ప్రారంభమైన మ్యూజ్‌ ఇండియా ఆన్‌లైన్‌ మ్యాగజైన్‌ ఏటా ‘మ్యూజ్‌ మీట్‌’ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించేది. దీని స్ఫూర్తితో హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌ ఎందుకు నిర్వహించకూడదనే ఉద్దేశంతో కొంతమంది ‘హైదరాబాద్‌ లిటరరీ ట్రస్ట్‌’ ఏర్పాటుచేశారు. దీనికి ప్రొఫెసర్‌ విజయ్‌కుమార్‌, అమితాదేశాయ్‌, అజయ్‌గాంధీ, జి.సూర్యప్రకాశరావు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. వీళ్లు మరికొంతమందితో కలిసి 2010లో మొదటిసారిగా హైదరాబాద్‌ సాహితీ ఉత్సవానికి శ్రీకారం చుట్టారు. ఇతరనగరాల్లో జరిగే సాహితీ ఉత్సవాలకు భిన్నంగా ఉండాలనే ఉద్దేశంతో సాహిత్యానికి పెద్దపీట వేస్తూనే ఇతర అంశాలకూ చోటు కల్పించారు నిర్వాహకులు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే సాహిత్య గోష్ఠులు, కార్యశాలలు, సదస్సుల్లో ఎవరైనా పాల్గొనవచ్చు. వక్తల్ని ప్రశ్నలు అడగవచ్చు. ఈ ఏడాది ఆరో ఎడిషన్‌ను జనవరి 7న తాజ్‌కృష్ణా హోటల్‌లో తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ లాంఛనంగా ప్రారంభించారు. నాలుగు రోజుల ఈ సాహితీ వేడుక తెలంగాణ జానపద కళాకారుడు దరిశనం మొగులయ్య కిన్నెర వాయిద్యంతో మొదలయ్యాయి.
అతిథిదేశం సింగపూర్‌
ఇతర నగరాల్లో జరిగే సాహితీ ఉత్సవాలకు విభిన్నంగా ఉండాలనే ఉద్దేశంతోనే నిర్వాహకులు కొంగొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వాటిలో ఒక్కో దేశాన్ని అతిథి దేశాన్ని ఎంపికచేసి, ఆహ్వానించడం ఒకటి. తద్వారా అతిథి దేశం సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు తదితర అంశాలపై సందర్శకులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తారు. గత సాహితీ ఉత్సవాల్లో జర్మనీ, ఫ్రాన్స్‌, ఐర్లాండ్‌, పొలెండ్‌ అతిథి దేశాలుగా వ్యవహరించాయి. ఈసారి ఆ పాత్ర సింగపూర్‌ నగర రాజ్యానిది. ఈ దేశం నుంచి పన్నెండు మంది రచయితలు, కళాకారులు ఉత్సవంలో పాల్గొన్నారు. సింగపూర్‌ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూనే సంస్కృతికి కూడా పెద్ద పీట వేస్తోందని వీరు చెప్పారు. నాలుగు జాతీయ భాషల్లో రచనలు జరుగుతాయని వివరించారు. భారత్‌, ఇండోనేషియా, సింగపూర్‌, జావా దేశాల నుంచి ఒక్కో కథను ఎంచుకుని... ‘స్టోరీస్‌ ఫ్రం ఏషియా’ పేరిట ప్రదర్శించారు. దీనికి ఇండోనేషియా సంగీతాన్ని జోడించారు. సింగపూర్‌కు చెందిన అయిదు యానిమేటెడ్‌ చిత్రాలను ప్రదర్శించారు. ‘లిటరేచర్‌ ఆఫ్‌ సింగపూర్‌- పోయెట్రీ’, ‘లిటరేచర్‌ ఆఫ్‌ సింగపూర్‌- ఫిక్షన్‌’ తదితర అంశాల మీద సాహితీ చర్చాగోష్ఠులు జరిగాయి.
ప్రాధాన్యభాషగా మరాఠీ
      ఉత్సవ నిర్వాహకులు ఏటా ఒక్కో భాష మీద దృష్టి సారించాలని నిర్ణయించారు. తమ ఉద్దేశాలకు అనుగుణంగా ఆ భాషకు సంబంధించిన సాహిత్యం మీద లోతైన అధ్యయనం జరిగేలా కార్యక్రమాల్ని రూపొందిస్తున్నారు. గతంలో ప్రాధాన్యభాషగా తెలుగు, హిందీ, ఉర్దూను ఎంపిక చేశారు. మహారాష్ట్ర ప్రజలతో తెలుగువారిది 400 ఏళ్ల అనుబంధం. అందుకే ఈసారి ప్రాధాన్యభాషగా మరాఠీని ఎంపిక చేశారు. ఇందులో భాగంగా మరాఠీ సాహిత్యం మీద రచయితల చర్చలు జరిగాయి. మరాఠీ దళిత సాహిత్యం, అక్కడి నృత్యరూపకాలపై సాహిత్య గోష్ఠులు, కార్యశాలల్ని నిర్వహించారు. మరాఠీలోని ‘వైట్‌ లిల్లీ నైట్‌ రైడర్‌’ నాటకాన్ని హిందీలో ప్రదర్శించారు. అదే భాషకు చెందిన టింగ్యా, ఎలిజబెత్‌ ఏకాదశి, భరి, కోర్టు, శ్వాస్‌ చిత్రాలను కూడా ప్రదర్శించారు. ఇంకా మహారాష్ట్రలో అంతరించిపోతున్న భాషల అస్తిత్వం గురించి కూడా చర్చించారు.
      ఈ సాహితీ ఉత్సవంలో దేశ, విదేశాలకు చెందిన 150 మందికి పైగా రచయితలు, పాత్రికేయులు, పరిశోధకులు, వివిధ రంగాల్లో నిపుణులు, చిత్ర నిర్మాతలు పాల్గొన్నారు. వీరిలో నయనతార సెహగల్‌, కిరణ్‌ నాగోర్కర్‌, సంజయబారు, భరత్‌ కర్నాడ్‌, తబీష్‌ ఖేర్‌, మీనా అలెగ్జాండర్‌, వోల్గా, వూర్మిళ తదితరులు ఉన్నారు. సాహిత్య గోష్ఠులు, ఆర్ట్‌ ఎగ్జిబిషన్స్‌, ఆర్ట్‌ స్ట్రీట్‌, కళా సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి. ఈసారి ఉత్సవంలో ప్రముఖ నటీనటులు రచయితలుగా పాల్గొన్నారు. మరాఠీ, హిందీ నటి సోనాలి కులకర్ణి, మరాఠీ నాటకరంగానికి చెందిన మోహన్‌ అగాషే, 1990లో బాలీవుడ్‌ వూపు వూపిన ‘ఆషికీ’లో కీలక పాత్ర పోషించిన అను అగర్వాల్‌ తదితరులు పాలుపంచుకున్నారు. ప్రస్తుతం రచయితలు స్వేచ్ఛగా రచనలు చేసే పరిస్థితి లేదని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తిరిగి ఇచ్చేసినవారిలో ఒకరైన నయనతార సెహెగల్‌ ఆవేదన వ్యక్తంచేశారు. నియంత్రణ అనేది పూర్తిగా వ్యక్తిగతమని.. అది ఎవరికీ వారు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దేశంలో ముగ్గురు ప్రముఖ రచయితలను దారుణంగా చంపినా.. ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆరోపించారు. తమినాట పెరుమాళ్‌ మురుగన్‌ రచయితగా చచ్చిపోయానని ప్రకటించారని గుర్తుచేశారు.
      మహిళల నోరు నొక్కడం పురాణాల కాలం నుంచే ఉందని మరాఠీ రచయిత్రి వూర్మిళా పవార్‌ అన్నారు. పురుషుల్ని గట్టిగా నిలదీయడానికే తాను కలం పట్టానని పేర్కొన్నారు. కేవలం భాషా ప్రాతిపదికనే రాష్ట్రాల ఏర్పాటు సరికాదని తెలంగాణ నిరూపించిందని ‘తెలంగాణ దృక్కోణ పథం’ అంశం మీద జరిగిన చర్చలో వక్తలు స్పష్టంచేశారు. కనుమరుగువుతున్న భాషల పరిరక్షణకు నడుం బిగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ‘ఎన్‌డేంజర్డ్‌ లాంగ్వేజస్‌ ఆఫ్‌ మహారాష్ట్ర’ అంశం మీద జరిగిన చర్చాగోష్ఠిలో వక్తలు అభిప్రాయపడ్డారు. కథలు చెప్పడం అంశంపై కార్యశాలల్ని నిర్వహించారు.
రచయితలు పాఠకుల వారధి
పాఠకులు, ఔత్సాహికులకు మేలు కలగాలనే ఉద్దేశంతో ‘మీట్‌ ది ఆథర్‌’ పేరుతో నేరుగా ప్రముఖ రచయితలను కలిసే అవకాశాన్ని కల్పించారు నిర్వాహకులు. చాలామంది ఆ కార్యక్రమంలో పాల్గొని రచయితల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. చర్చాగోష్ఠుల్లో రచయితలు చెప్పే మాటలు వినడం, మెలకువలను నేర్చుకోవడం ద్వారా రచనా వ్యాసంగం మెరుగుపడుతుందని వాళ్లు ఆనందం వ్యక్తంచేశారు. అంతేకాదు.. రచన ఏంటి..? ఎందుకు చదవాలి..? తదితర అంశాలపై పాఠకులకూ అవగాహన ఏర్పడుతుందన్నారు.
      ఒక్కమాటలో చెప్పాలంటే ఈ హైదరాబాద్‌ సాహితీ ఉత్సవం పాఠకులు.. రచయితలను ఏకతాటిపైకి తెచ్చింది. అలాగే.. సమాజం నుంచి పక్కకు నెట్టివేతకు గురైన అంశాల మీద ఎక్కువగా చర్చ జరిగింది. ఉదాహరణకు.. అల్పసంఖ్యాక మతాలు, స్వలింగ సంపర్కులు, ఇతరులకు పుస్తక పఠనం పట్ల ఆసక్తి కలిగేలా నిర్వాహకులు ‘మై వాల్‌ ఆఫ్‌ బెస్ట్‌ రీడ్స్‌’ పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మీరు చదివిన పుస్తకాల్లో ఏది ఇష్టమో కాగితంపై రాసి అక్కడ అతికించమని సూచించారు. చాలా మంది స్పందించారు. ఒక్కసారి అక్కడికి వెళ్లగానే ఏయే పుస్తకాలు బాగుంటాయో కొత్తగా పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకుంటున్న వారికి అవగాహన ఏర్పడుతుంది. సాహిత్యం వైపు చిన్నారుల్ని మళ్లించాలనే ఉద్దేశంతో ప్రత్యేక కార్యక్రమాల్ని నిర్వహించారు. తెలంగాణ కళాకారుడు ప్రశాంత్‌ మంచికంటి ‘దావత్‌ ఏ హైదరాబాద్‌’ పేరిట ప్రత్యేక చిత్ర ప్రదర్శన ఏర్పాటుచేశారు.
      ఈసారి నిర్వాహకులు రెండు కొంగొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అందులో ఒకటి.. ‘స్టేజ్‌ టాక్‌’. ఇందులో ఓ అంశంపై కాసేపు మాట్లాడాలి.. మధ్యలో నాటకం లేదా సినిమాను ప్రదర్శిస్తారు. రెండోది ‘కాజ్‌ ఫర్‌ టాక్‌’ పేరిట సామాజిక అంశాలపై మాట్లాడే అవకాశాన్ని కల్పించారు. ఇందుకోసం అయిదు అంశాలను ఎంపిక చేశారు. ఒక్కోదాని గురించి 8 నుంచి 10 నిమిషాలు మాట్లాడాల్సి ఉంటుంది. ఉదాహరణకు.. అభివృద్ధి చెందుతున్న మనదేశంలో వైద్యుల కొరత.. మంత్రసానుల అవసరం గురించి ఫెర్నాండేజ్‌ ఆసుపత్రి డాక్టర్‌ ఎవిటా ఫెర్నాండేేజ్‌ ప్రసంగించారు.
నాలుగు రోజులపాటు సాగిన ఈ ఉత్సవానికి 15 వేలకు పైగా సందర్శకులు హాజరయ్యారు. చివరి రెండు రోజులు యువత సందడి కనిపించింది. ఇలాంటి సాహితీ ఉత్సవాలు యువతను పుస్తక పఠనం వైపు నడిపిస్తాయి.

*   *   *


వెనక్కి ...

మీ అభిప్రాయం