చక్కెర పలుకులు చేదవుతున్నాయా!

  • 166 Views
  • 0Likes
  • Like
  • Article Share

    ఎస్‌. సుబ్బరాయుడు

  • విశ్రాంత ఉపాధ్యాయులు
  • కడప
  • 9491949310
ఎస్‌. సుబ్బరాయుడు

అమ్మ చేసిన ఆవడ... నాన్న తెచ్చిన కలకండ... మావయ్య ఎక్కించిన ఏనుగు అంబారీ... తాతయ్య చెప్పిన చిక్కటి కథలు... పసితనపు గురుతులన్నీ జ్ఞాపకమే కదా. మరి ఈ అనుబంధాల మందారమాలలోని అరుణారుణ పుష్పాలన్నింటినీ పెనవేసిన అంశువు అమ్మభాషేనన్న సంగతి గుర్తుందా? ఉంటే, నేడు మన మాతృభాషకు ఈ దుస్థితెందుకు? చెరుకు గడలు సైతం చిన్నబోయేంత చక్కెర తోట అయిన తేట తెలుగును చేదుమాత్రలా చూస్తున్నామెందుకు?

తేనెల తేటలు మన తెలుగు మాటల మూటలు. తెలుగులో మాట్లాడే వారందరూ సంగీత విద్వాంసులే. మన పలుకుల్లోనే రాగాలున్నాయి మరి. తెలుగు రాసేవారందరూ చిత్రకారులే. ఎందుకంటే, మన అక్షరాల్లో ‘అజంత’ చిత్రాలున్నాయి. మనది అజంత భాష. ఆంగ్లం, తమిళం లాంటి హలంత భాషలకన్నా యింపు సొంపు పెంపుగా ఉంటుంది. 
      కొన్ని భాషల్లో తల్లిని ఒకే అక్షరంతో సంబోధిస్తే, మరికొన్నిటిలో రెండు మూడేసి అక్షరాలు ఉంటాయి. ఏమైనా మనం మనసారా ‘అమ్మా’ అనటంలో అమృతమంత మాధుర్యముంది. ‘నాన్నా’ అన్న పిలుపులో నా బలమంతా ఆయనే అన్నంత నమ్మకం తొణికిసలాడుతుంది. ఇది మన తెలుగు అని గర్వంగా చెప్పుకోవడమే కాదు, ఆ ఘనతని ఇనుమడింపజేయాలి. దానికోసం మన భాషని ఇంకా ఇంకా గౌరవించాలి, మరింత అభివృద్ధి చేయాలి. తెలుగులోని కొన్ని భాషా ప్రయోగాలని ఆకళింపు చేసుకుని ఆస్వాదించాలి. పదుగురి చేత ఆస్వాదింపజేయాలి. 
      నన్నయ మొదలుకొని తెలుగు భాషా వికాసానికి ఎందరో మహాకవులు తమ వంతు కృషి చేశారు. చరితార్థులయ్యారు. నన్నయతో పాటు తిక్కన, ఎర్రనలు పంచమవేదమైన మహా భారతగాథని తెనిగించి జాతికి అంకితం చేశారు. పోతన, వేమన లాంటి కవులు - త్యాగయ్య, అన్నమయ్య, రామదాసు లాంటి వాగ్గేయకారులు, భక్తాగ్రేసరులు తెలుగు గానామృతాన్ని దోసిళ్లతో పంచిపెట్టారు. 
       ‘నానా రుచిరార్థ సూక్తి’ - అని నన్నయ భారత రచనకి ముందే చెప్పాడంటే తెలుగులోని తీపిని గుర్తు చేయడానికే. ‘ధర్మ తత్వజ్ఞులు ధర్మశాస్త్రం’ అనుకుంటే, వేదాంతులు వేదాంతమేనని భావిస్తారు. అంతంత మాత్రమే అర్థం చేసుకునే వాళ్లుంటే ‘అక్షర రమ్యత’ని ఆదరిస్తారని విన్నవించాడు. ఇది మన తెలుగు రమణీయతని నొక్కి చెప్పే సరైన నిదర్శనం.
      ‘మందార మకరంద మాధుర్య మునదేలు, మధుపంబు పోవునే మదనములకు’ - అన్న పోతన మకారాల మమకారం గురించి ఆలోచించాలి. అందులోని రసాస్వాదనకి ఆనందించాలి. మందారపూల మకరందం లాగే తుమ్మెద కొండ మల్లెలకు ఎందుకు చేరుతుంది? అన్న ఈ భావనలో హరినామ స్మరణలోని తన్మయత్వాన్ని స్పష్టంగా చెప్పాడు కవి. అలాగే, మన తెలుగు మధువుని గ్రోలగలిగిన వానికి అన్యభాషల జోలి ఎలా? మన భాష తర్వాతనే మరో భాషలోని విశేషాలను ఆస్వాదిస్తే... జాతికెంత మేలు. 
      ముక్కు తిమ్మన పలుకులు ముద్దుముద్దుగా ఉంటాయని ప్రసిద్ధి. ‘చెలులు నాతో ఏమి చెప్పుదురో యని, లంచంబులిచ్చునో చంచలాక్షీ!’ - అని శ్రీకృష్ణుని ప్రేమకు దూరమయ్యానని సత్యభామ విలపించడం వింటుంటే - బాధల్లోని తలపోతలు స్ఫురిస్తాయి ఎవరికైనా..
      ‘మేడి పండు జూడ మేలిమై యుండు’ అన్న వేమన పలుకులో లోకం గుట్టు దాగి ఉంది. పైపై మెరుగులకే మోసపోయే నేటి నవనాగరికులకు ఇదెంత చురక!
      మన సామెతలు, జాతీయాలు తేనెల సోనలు. ‘అడ్డాల నాడు బిడ్డలే కానీ గడ్డాల నాడు కాదు’ అనడంలో తరతరాల ఆంతర్యాన్నీ, మనస్తత్వాల మార్పునీ రంగరించి అద్భుతంగా చెప్పారు. ‘అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు’లో ఆశలు రేపి అవస్థలు పెట్టనేల? అనే భావం ఉంది. అయినా ధైర్యానికి, ఊరడింపునకు ఒక్కోసారి అతిగా చెప్పక తప్పదు కదా అని ఆలోచించమంటారు కొందరు. అందుకే సందర్భానుసారంగా ‘ఆలస్యం అమృతం విషం’ - అని ఒకసారి ‘నిదానమే ప్రధానం’ అని మరోసారి చెప్తారు. ఇలాంటప్పుడు ‘ఎప్పటికెయ్యది ప్రస్తుతమో - అప్పటికా మాటలు’ అన్న ఆచరణ ఉందంటారు. ‘నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని’ చెప్పి ‘మాట’లకున్న శక్తిని కళ్లకు కట్టారు. ఇవన్నీ మన భాషలోని తార్కిక, లౌకిక విషయాలు. 
      జాతీయాల జోలికి వస్తే - ‘కళ్లు నెత్తికెక్కాయి’ అన్నారంటే ఆ రెండు పదాల్లో ఎన్ని భావాలను కూర్చినట్టు! ఎంత ‘పొగరుబోతువి’రా అని చెప్పినట్టు కాదూ! చెప్పిన మాటలను వినిపించుకోని వారికి ‘చెవుల్లో చెట్లు మొలిచాయా?’ అన్న ఎత్తిపొడుపులు తప్పవు. ‘మూడు పువ్వులు - ఆరు కాయలు’... అభివృద్ధిని ప్రకృతితో పోల్చుకుని సంబరపడే చక్కటి లక్షణం మన జాతిది.
      కోడి కూతతో మేల్కొనే పల్లెలు కోకొల్లలు ఒకప్పుడు. రానురాను కాస్త తెల్లారుతున్నా, ఆచార వ్యవహారాలు మాత్రం అంటిపెట్టుకునే ఉంటున్నాయి. అప్పట్లో జానపద వాఙ్మయానికి పునాది పల్లె పట్టులే. కష్టసుఖాలను పాటల రూపంలో వెలిబుచ్చుకునే వాళ్లు. కోలాటాలు, భజనలు అక్కడి నుంచి పుట్టినవే. జానపదుల్లోనే కల్లాకపటం లేని మనస్తత్వాలు ఎక్కువ. కాలప్రభావం వల్ల వసతులు వనరులు పెరిగి టీవీలు అందరికీ అందుబాటులోకి రావడంతో ప్రాచీన కళలు కొన్ని అంతరించిపోతున్నాయి. అయినా, వాటిని నెమరు వేసుకుంటే ఎన్నో మధుర స్మృతులు గోచరిస్తాయి. పేరంటాలు, పెళ్లిళ్ల పాటలు, బావ - బావమరుదుల అల్లరి గీతాలు ఎంతో హృద్యంగా ఉంటాయి.
      ‘బావా! బావా! పన్నీరు - బావను పట్టుక తన్నేరు’ - అంటే కన్నీరు అసలే రాదు. ఈ మధ్య ప్రాచుర్యం పొందిన ‘కోడి బాయె లచ్చమ్మది’ లాంటి¨ జానపదాలు ఇంకెన్నో ఉన్నాయి. అవన్నీ ఒకప్పుడు అందరికీ ఆహ్లాదాన్ని పంచినవే. తిరిగి తెచ్చుకుంటే ఇప్పటికీ పంచుతాయి కూడా.
      ‘తోకలేని పిట్ట తొంబై ఆమడలు వెళ్లింది’ అనే పొడుపు (కథ)లోని అల్లికను మెచ్చుకోవాలి. బాగా ఆలోచించాకే ‘జాబు’ అని జవాబు అర్థమవుతుంది. ఇంకా తెలుగులో నానార్థాలు, పర్యాయపదాలు, వ్యుత్పత్తులు చదివితే ఎన్నో అర్థాలు తెలుస్తాయి. ఆనందాలకు వారధులవుతాయి. 
      పలుకుబడులకి పాకులాటలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో వీటిని వంటబట్టించుకోవడమెలా అన్న సందేహం వద్దు. పలుకు బడిలోని పలుకులతోనే - పలుకులన్నీ బడి నుంచే బాగా నేర్చుకుంటే భవిత బంగారుమయమవుతుంది. 
      ‘అవధాన ప్రక్రియ’కి బీజం వేసింది తెలుగువారే. అందులో ‘తిరుపతి వెంకట కవుల’ ప్రస్తావన తప్పనిసరి. వారి కాలంలో - పాఠకులు తక్కువైనా పత్రికల్లో, రచ్చబండ చర్చల్లో అవధానాలు, కవిత్వం, కావ్యాల గురించే మాటలు దొర్లేవి. ఇప్పుడు రాజకీయాలు, సినిమాలు, క్రికెట్టులు ఆ స్థానాన్ని ఆక్రమించాయి. ఇవి అనవసరం కాదు కానీ, తెలుగు భాషా సంపత్తిని కాపాడుకోవడానికి ఆపాతమధురాన్ని తల్చుకోవడం తప్పు కాదు కదా. 
      మన భాషలోని చమత్కారాలకైతే లెక్కేలేదు. ‘వినిపించనా నీకో సంగీతం’ - ఇక్కడ నీకోసం ‘గీతం’ అని - నీకో ‘సంగీతం’ అని విడమరచుకుంటే రెండర్థాలు ధ్వనిస్తాయి. తెలుగుకు ఎన్నో శ్లేషాలంకారాలు. ఒకే పదంతోనే వేర్వేరు అర్థాలను సాధించవచ్చు. బెండు నీళ్లపై ‘తేలు’తుంది - తాతను ‘తేలు’ కుట్టింది... ఇలాగన్న మాట. ఇలాంటి వాటిని పిల్లలకు నేర్పితే వారికి తెలుగుతో బంధం బలపడదా! 
      ఇలా చెప్పుకుంటూ పోతే మన తెలుగులోని వివిధ ప్రక్రియల్లో వినూత్న శోభలెన్నో గోచరిస్తాయి. మాతృ భాషాభివృద్ధి జరగాలంటే ఆది నుంచి అధ్యయనం ఆరంభం అవ్వాలి. పిల్లలు మన భాషలో అభ్యసించాకే ఇతర భాషల్ని నేర్చుకోవాలి. అదీ నేటి కాలమాన పరిస్థితుల దృష్ట్యా. 
      పొరుగు వారి భాషాభిమానంతో పోల్చుకుంటే మనమెందుకు తీసిపోవాలని పట్టుదల పెంచుకుందాం. ఏ దేశమేగినా మన తెలుగుతల్లిని సదా స్మరిద్దాం. తెలుగు వెలుగుల కోసం చేతులు కలుపుదాం. అందరమొక్కటై అమ్మభాషను అందలమెక్కిద్దాం. 


వెనక్కి ...

మీ అభిప్రాయం