ఆంగ్లేయ సివిల్ సర్వీసు అధికారుల్లో అందరి కంటే చివరిగా భారత గడ్డ నుంచి వీడ్కోలు తీసుకున్నదెవరు?
ఆంగ్ల రాజ్యంలో ఉంటూ తెలుగు నిఘంటువును కూర్చిన వ్యక్తి ఎవరు? అలనాటి తెలుగు అకాడెమీకి తొలిబీజం నాటిన సంఘానికి అధ్యక్షుడెవరు?
ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమొక్కటే... గ్విన్. జాన్ పీటర్ లూసియన్ గ్విన్. తెలుగు వాఙ్మయ సముద్ధారకుడు సీపీ బ్రౌన్ అడుగుజాడల్లో నడుస్తూ తెలుగు భాషా వికాసానికి కృషి చేసిన వ్యక్తి. స్వతంత్ర భారతావనిలో ఇరవై ఏళ్ల పాటు వివిధ హోదాల్లో పని చేసిన (అది మన రాష్ట్రంలో) ఆంగ్లేయ ఐఏఎస్ అధికారి ఆయన. తెలుగు నాట ప్రాథమిక విద్యను బలోపేతం చేయడం నుంచి 28 వేల పదాల తెలుగు నిఘంటువును రూపొందించడం వరకూ తెలుగు జాతికి గ్విన్ చేసిన సేవలు అమూల్యం.
జూన్ 22, 1916న లండన్‌లో జన్మించిన గ్విన్... ఆక్స్‌ఫర్డ్‌లోని డ్రేగన్ ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నారు. ఐర్లండ్‌లోని సెయింట్ కొలంబస్ కళాశాల, డబ్లిన్‌లోని ట్రినిటి కళాశాలల్లో విద్యాభ్యాసం పూర్తి చేసి పట్టభద్రులయ్యారు. తర్వాత ఇండియన్ సివిల్ సర్వీస్ అధికారిగా మద్రాసు ప్రభుత్వంలో చేరారు. ఆనాటి బళ్లారి తహసిల్దార్ కంప్లి కృష్ణమూర్తిరావు వద్ద సహాయ కలెక్టర్‌గా శిక్షణ పొందారు. గుంటూరు, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొంతకాలం జిల్లా రెవెన్యూ అధికారిగా, తర్వాత కలెక్టర్‌గా పని చేశారు. ఏలూరులో ఉద్యోగం చేసే సమయంలో అక్కడి జిల్లా పోలీస్ అధికారి కుమార్తె పెట్రీషియాను ప్రేమ వివాహం చేసుకున్నారు.
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చాలామంది బ్రిటిష్ అధికారులు తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. కానీ, గ్విన్ అలా చేయలేదు. తెలుగు గడ్డపై ఉన్న ప్రేమతో రెండు దశాబ్దాల పాటు ఇక్కడే ఉన్నారు. రెవెన్యూ, ప్రాథమిక విద్య, రవాణా శాఖల కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1967లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. తర్వాత లండన్‌కు 25 కి.మీ దూరంలోని బ్రాంలీ గ్రామంలో స్థిరపడ్డారు.
రాష్ట్రంలో ప్రాథమిక విద్యా విధానాన్ని పటిష్ఠం చేసిన ఘనత గ్విన్దే. సంబంధిత శాఖ కార్యదర్శిగా ఉన్న సమయంలో... గిరిజన ప్రాంతాల్లో విరివిగా ప్రాథమిక పాఠశాలలను స్థాపించారాయన. అప్పుడే ఆయన ఆధ్వర్యంలో తెలుగు భాషా వికాసం కోసం ప్రభుత్వం ఓ సంఘాన్ని ఏర్పాటు చేసింది. పింగళి లక్ష్మీకాంతం, దివాకర్ల వేంకటావధాని, భద్రిరాజు కృష్ణమూర్తి మరికొందరు పండితులతో ఏర్పాటైన ఈ గ్విన్ సంఘం సిఫార్సుల మేరకే 1968 ఆగస్టులో తెలుగు అకాడమి అవతరించింది.
హైదరాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏషియన్ స్పీచెస్‌లో తెలుగును నేర్పే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కూడా గ్విన్ మహాశయుడే. మన భాషపై చక్కటి అవగాహన, అభిమానం ఉన్న గ్విన్... భద్రిరాజు కృష్ణమూర్తి సహకారంతో ‘ఆధునిక తెలుగు వ్యాకరణా’న్ని రచించారు. సజీవమైన వ్యావహారిక భాషను ప్రోత్సహించాలన్న ఆశయంతోనే గ్విన్ ఈ రచన చేశారు.
బ్రౌన్ కూర్చిన తెలుగు - ఆంగ్ల నిఘంటువులో ఆధునిక తెలుగు భాషా ప్రయోగాలు లేవని గ్విన్ గుర్తించారు. ఆ లోటును భర్తీ చేయాలన్న సంకల్పంతో స్వయంగా తెలుగు - ఆంగ్ల నిఘంటువును కూర్చడానికి కంకణధారులయ్యారు. లండన్‌కు తిరిగి వెళ్లాక 1985లో ఈ నిఘంటు నిర్మాణం ప్రారంభించారు. 1992లో పూర్తి చేశారు. ఆధునిక రచయితల వాడుకల నుంచి క్రోడీకరించిన పదాలను ఇందులో చేర్చారు. మొత్తమ్మీద 28 వేల పదాల ఈ బృహన్నిఘంటువును ‘అక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్’ ముద్రించింది. నిఘంటువు కూర్పులో గ్విన్కు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భాషాశాస్త్ర అధ్యాపకులుగా పని చేసిన జొన్నలగడ్డ వేంకటేశ్వర శాస్త్రి సహకారమందించారు. కొడవటిగంటి కుటుంబరావు, రాచకొండ విశ్వనాథశాస్త్రి, పురిపండా అప్పలస్వామి, సి.నారాయణరెడ్డి, బంగోరె (బండి గోపాలరెడ్డి) బూదరాజు రాధాకృష్ణ తదితరుల రచనలు తన నిఘంటు నిర్మాణానికి బాగా ఉపయోగపడ్డాయని గ్విన్ స్వయంగా చెప్పారు.
ప్రవాసాంధ్ర ప్రముఖులు గూటాల కృష్ణమూర్తికి గ్విన్ సన్నిహిత మిత్రులు. కృష్ణమూర్తి మాటల్లో వ్యక్తిగా గ్విన్ నిగర్వి. మితభాషి. ఉదార హృదయుడు. కార్యదీక్షాపరుడు. ఉద్యోగిగా విధి నిర్వహణలో తన కాలాన్ని, విజ్ఞతను నూటికి నూరు పాళ్లు ధారపోసినవాడు.
హైదరాబాద్‌లో 1975లో జరిగిన మొదటి ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఆయన్ను చూశాను. సభల్లో పాల్గొనడానికే ఆయన లండన్ నుంచి వచ్చారు. వేదిక మీద నుంచి మొదట ఆంగ్లంలో ప్రసంగించారు. తెలుగులో మాట్లాడాలని సభాసదులు ఆయన్ను కోరారు. ‘తెలుగులో మాట్లాడితే, తెలుగు భాషను చంపేస్తానేమో’అన్నారు గ్విన్. పి.వి.నరసింహారావు వెంటనే ‘మీకు ఆ అవకాశం లేదులెండి. మేం ఎప్పుడో ఆ పని చేసేశాం’ అన్నారు. అందరూ నవ్వేశారు.
అయితే, ఆ సమయంలో ఆయనతో నాకు పరిచయ భాగ్యం కలగలేదు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత... సీపీ బ్రౌన్ స్మారక గ్రంథాలయం గురించి నేను రాసిన వ్యాసమొకటి ఓ పత్రికలో ప్రచురితమైంది. గుంటూరు జిల్లా కలెక్టర్‌గా పని చేసిన గ్విన్ సహచరుడు పీవీ రత్నం... ఆ వ్యాసం ప్రతిని గ్విన్కు పంపారు. దాన్ని చదివిన ఆయన నాకు లేఖ రాశారు. సీపీ బ్రౌన్ స్మృతి చిహ్నంగా గ్రంథాలయ భవన నిర్మాణం జరగటం సంతోషమన్నారు. ఆయనతో అలా కలం స్నేహం పెరిగింది.
అలా ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్న రోజుల్లో ఓసారి గ్విన్ ‘మీ గ్రంథాలయంలో బ్రౌన్ కూర్చిన నిఘంటువు మొదటి ఎడిషన్ (1852-53) ఉందా? నా దగ్గరుంది. మీకు పంపిస్తాను’ అని చెప్పారు. హైదరాబాద్‌లో ఉండే ఐఏఎస్ అధికారి మామిడిపూడి గోపాలకృష్ణన్ ద్వారా దాన్ని అందజేశారు. దాంతో పాటు తాను కూర్చిన నిఘంటువును, ఎ.గెలెట్ (ఈయన కూడా ఐఏఏస్ అధికారే) రూపొందించిన తెలుగు నిఘంటువును కూడా గ్రంథాలయానికి అందించారు. బొబ్బిలిరాజా వారి ఆర్థిక సాయంతో రూపొందించిన గెలెట్ నిఘంటువులో తెలుగు పదాలు ఆంగ్ల లిపిలో ఉంటాయి.
జె.పి.ఎల్. గ్విన్ ఇరవై ఎనిమిదేళ్ల పాటు తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో ఉద్యోగిగా ఉన్నారు. తులనాత్మక భాషాతత్వ శాస్త్రాన్ని అధ్యయనం చేశారు. గ్విన్ నిఘంటువు పీఠికలో ప్రముఖ భాషావేత్త గిడుగు సీతాపతి ఇలా అంటారు... ‘మారుతున్న భాషకు తగినట్లు ప్రతి 20 ఏళ్లకు ఒకసారి నిఘంటువులు కొత్తరూపును సంతరించుకోవాలి. అప్పుడే అవి సజీవ భాషకు యోగ్యమైన ప్రాతినిధ్యం వహిస్తాయి’. గ్విన్ నిఘంటువు అలాంటి ప్రతినిధే.
ఉద్యోగం రీత్యా తెలుగు ప్రజలతో ఏర్పడిన బంధాన్ని అనుబంధంగా మార్చుకుని ఆఖరి క్షణం వరకూ తెలుగునే ధ్యానించిన ఆ మహానుభావుడు సెప్టెంబరు 14, 1999న అమరలోకాలకేగారు. తన మరణానంతరం పుష్పగుచ్చాలు తేవద్దని, బదులుగా కాన్సర్ పరిశోధన నిధికి విరాళాలు అందజేయాలని కోరిన మనవతావాది గ్విన్. తెలుగును కాపాడుకుంటూ, భావితరాలకు దాన్ని భద్రంగా అందించడమే మనం ఆయనకు ఇవ్వగలిగిన నివాళి.