ఒక్కో సామెత‌... ఒక్కో క‌థ‌

  • 338 Views
  • 2Likes
  • Like
  • Article Share

    చొప్పదండి సుధాకర్‌

  • కరీంనగర్‌.
  • 9948859889
చొప్పదండి సుధాకర్‌

మూరెడు పొంగటం ఎందుకు... బారెడు కుంగటం ఎందుకు!
ఎంత వ్యక్తిత్వ వికాస పాఠం ఉంది ఈ ఆరు మాటల్లో! భావోద్వేగాలను అదుపులో ఉంచుకున్నప్పుడే ఎదుగుదల సాధ్యమన్న చక్కటి విషయాన్ని క్లుప్తంగా, సూటిగా చెప్పారు కదా మన పెద్దలు.
అన్నం పెట్టేవాడు దగ్గరుండాలి కానీ... దణ్నం పెట్టేవాడు దూరంగా ఉన్నా పర్లేదు!
ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే... మనకు మంచి చేసేవాళ్లకు మాత్రమే అగ్రతాంబూలమివ్వాలి. అల్ప పదాలతోటి అనల్పార్థాలను సాధించడమే సామెతల ప్రత్యేకత. 
      ప్రతి మనిషికీ, ప్రతి సందర్భానికీ - ప్రతి చిత్త ప్రవృత్తికీ అతికినట్టు సరిపోయే సామెతలు మన భాషలో కోకొల్లలు! సామెతకు సమానార్థకం లేదా సామ్యం అంటే పోలిక అని ధ్వనించవచ్చు. రూఢ్యర్థం ఏదైనా సామెతను ఎప్పుడూ పైకోణంలోనే అంటే సమానమైందీ, పోలిక కలదనే అర్థంలోనే వాడుతున్నాం. ‘వేదమైనా అబద్ధం కావొచ్చేమో కానీ- సామెత అబద్ధం కాద’ని కన్నడంలో ఓ సామెత ఉంది. అదీ భాషలో సామెతల అర్థ పరాక్రమం!
      నిజం చెప్పాలంటే సామెతల్లో వ్యవహారానికి సంబంధించినవి - కుటుంబ సంబంధమైనవి, చెణుకులు, చమత్కారాలు- సరదాగా చెప్పుకునేవీ ఎన్నో రకాలున్నాయి. పోతే ప్రతి దాని వెనుకా ఒక జీవనసారం ఉంటుంది. రోజులపాటు విశదీకరించి చెప్పినా అర్థంకాని ఒక క్లిష్ట పరిస్థితికి, సందర్భానికీ నాలుగు సెకన్లలో ఉట్టంకించే సామెతతో పరిష్కారం కనుక్కోవచ్చు. లేదా ఎదుటి వ్యక్తి బిత్తరపోయే బదులివ్వొచ్చు. సామెత ప్రయోగించేవారి పరిజ్ఞానాన్ని బట్టి స్థాయి, భాష మారుతుండటం ఒక విశిష్ట లక్షణం. ఇంకా కొన్ని సందర్భాల్లో సగం సామెతే వాడుతుండటమూ కద్దు. ఆ మిగతా సగాన్ని ఎదుటివ్యక్తి మనసులో పూరించుకుంటారు. సామెతల్లో వడకట్టిన జీవనసారం ఉంటుంది. అవి ఒకోసారి కషాయం గానూ- ఇంకోసారి పంచామృతంగానూ ఉండొచ్చు.
      ఏ ఆలుమగలైనా అన్యోన్యంగా కలిసి ఉంటే అంతకు మించిన స్వర్గం మరొకటి ఉండదు. అట్లా కాకుండా ఎడమొగం పెడమొగంగా ఉన్నట్లు వ్యవహరిస్తే వాళ్లెంత స్థితిమంతులైనా ఆ కాపురం నరకమే! పూటకు గతిలేని వాళ్లయినా కలిసిమెలిసి ఉంటే వాళ్ల ఆనందానికి ఆకాశమే హద్దు. అందుకే కలిసి ఉన్న కాపురాల తీరే వేరు. ఆ అర్థం స్ఫురించేలా వాడుకలోకి వచ్చిన సామెతే ‘గతిలేని సంసారం చేయొచ్చు, సుతి (శ్రుతి) లేని సంసారం చేయరాదు’.
      మనలో కొంతమంది ఉంటారు. కలిసి ఉన్నవారి మధ్య తగవులు సృష్టించడంలో వాళ్లు దిట్టలు. వ్యక్తిగతంగా వారి వారి బలహీనతలు కనిపెట్టి ఇరుపక్షాలను ఎగదోసి వినోదం చూస్తుంటారు. అటువంటి నేపథ్యంలోంచి పుట్టిందే ‘అత్తకు అమ్మమని - కోడలికి కొనుక్కొమ్మని చెబుతారు’ అనే సామెత.
      మరోరకం మనుషులుంటారు. పెళ్లిళ్లో పేరంటాల్లో ఇతర సందర్భాల్లో ఏ పని చేయకున్నా అంతా తామే నెత్తిమీద వేసుకొని నడిపిస్తున్నట్టు హడావుడి చేస్తుంటారు. వాళ్లనుద్దేశించి వాడుకునే సామెత ‘ఉరుకులాట - ఉత్తశాట’ అంటే చేటలో ఏం లేదు అయినా అటూ ఇటూ అలికిడి చేస్తూ హంగామా సృష్టిస్తున్నారని సారాంశం!
      ఒక్కోసారి ఇతరులకు చేసే ఉపకారం ఎందుకూ కొరగాకుండా పోతూంటుంది. పైగా శ్రమ దండగ - సమయం వృథా. కనీసం కృతజ్ఞతాభావం కూడా చూపరు. అటువంటి వారిని ఉట్టంకిస్తూ చెప్పేదే... ‘ఊరికి చేసిన ఉపకారం లేదు- పీనుగుకి చేసిన శింగారం లేదు’ అంటే ఊరికి ఎంతమేలు చేసినా ఎవరూ గుర్తించరు, కృతజ్ఞత చూపరు. అదెలాగంటే పీనుగకి చేసిన అలంకరణ లాంటిది. శవానికి ఎంత అందంగా, శ్రద్ధగా అలంకారం చేసినా శోభనివ్వదు. ఎందుకంటే అది ‘శవం’ అందులో ‘జీవకళ’ ఉండదు మరి!
      కొన్ని సందర్భాల్లో ఏదైనా ప్రకటించడం కూడా సంకటంగానే ఉంటుంది. ఇందుకు ప్రతిగా ‘చెబితే సిగ్గుపోతది, చెప్పకపోతే ప్రాణం పోతది’, కొత్తకోడలికి చెప్పరాని చోట శరీరంలో వ్రణం లేచింది. అది అత్తకు మాత్రమే (ఆమె సాటి ఆడది కాబట్టి) చూపించుకొంది. ఆ విషయం వైద్యునికి చెప్పి చికిత్స చేయించుకోవాలి. ఆ సంకట స్థితిలో ఆమె లోలోన వ్యాకుల పడుతోంది. ఆమె పరాకుని గమనించిన తోటివాళ్లు విషయమేమిటని ఆరాతీశారు. ఆ వివరాలు చెప్పలేక ఆ కోమలి అత్త పై సామెత వాడింది. అదీ సంగతి.
      పిల్లలు పెద్దవాళ్లను ఆకతాయి చేష్టలతో నానా తిప్పలు పెడతారు. కూచోమన్న చోట కూచోరు. నిల్చోమన్నచోట నిల్చోరు. అటువంటి పిల్లలతో వేగడం భరించరాని యాతనే. ఆ సందర్భంలో పుట్టిందే ‘పిల్లలంటే పిల్లలు కారు నాయినా! సూదులను ముల్లెకట్టినట్టు’ సామెత. సూదులను ముడివేసి బంధించగలమా- అట్లా బంధించకపోతే అవి ఏమూలనుంచో పొడుచుకొని బయటకు వస్తూనే ఉంటాయి. ఇటువంటి పిల్లలకు సంబంధించిందే ‘ఈ పిల్లలను కిందబెడితే వంటలు లేవు, మీద వెడితె వానలు రావు’ సామెత!
      కొంతమంది కొద్దిగా చనువిస్తే కొంపకొల్లేరు చేస్తారు. వాళ్లని ఉద్దేశించిందే ‘ఇసంత రమ్మంటే ఇల్లంతనాదే అన్నడు’, ‘ఉండటానికి జాగా ఇస్తే పండ మంచమడిగిండు’ సామెతలు.
      నంగనాచి స్త్రీల గురించి సామెతలు కోకొల్లలు.. ‘సద్ది అన్నం తిన్న అమ్మ మొగని ఆకలి ఎరుగదు’, ‘పెళ్లాం మొగలకు వేరు పోస్తది’. అంటే అమాయకంగా కనిపిస్తూనే భార్యాభర్తలకు కూడా తగవులు పెట్టి వాళ్లను వేరు చేస్తుందని అర్థం!
      కొంతమందికి అత్యాశ మిక్కుటం. వాళ్ల ఆరాటం, ఆవేశం చూస్తుంటే కొద్దిగా చిరాకు కూడా వేస్తుంది. వర్షం రాకుండానే దుక్కి దున్నినట్టు, విత్తనం వేయకుండానే పంటకోసం ఎదురుచూసినట్టు హంగామా చేస్తుంటారు. అటువంటి వారిని ఎగతాళి చేస్తూనే కర్తవ్యాన్ని ప్రబోధించే సామెత ఇది. ‘ఉరుకురికి పశువుల కాస్తే పొద్దుగుంకదు’ అంటే మనం తొందరపడితే ప్రయోజనం లేదు. దేనికైనా కాలం రావాలి. అప్పుడే ఫలితం ఉంటుందని.
      ఏదేమైనా భాషకు అలంకారం సంభాషణకు ఆధారం సామెత. అది తెలుగైనా మరో భాషైనా సామెతలేని సాహిత్యంగానీ, సంభాషణగానీ ఊహించలేం. సామెత ప్రయోగం ఒక్కమాటలో చెప్పాలంటే మన వాదనకు పెట్టనికోటలా భాసిల్లుతుందంటే అతిశయోక్తి కాదు.
      ప్రతి సామెతకు ఒక కథ ఉంది - ఉంటుంది. అలాగే ప్రతి సందర్భానికి అతికినట్టు సరిపోయే సామెతా ఉంటుంది. సామెతలు ప్రయోగించడంలో పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువ ఆసక్తి కనబరుస్తుంటారు. అంతే కాకుండా కొత్త సామెత ఏదైనా విన్న ప్రతిసారీ దాన్ని రెండోసారి అడిగిమరీ తెలుసుకొని మననం చేసుకొంటూ మళ్లీ సమయం వచ్చిన వెంటనే వాడుతుంటారు. సామెతలు విసరడం అక్షరాస్యులకన్నా నిరక్షరాస్యులకే ప్రీతి. ప్రతి మనిషికి సగటున కనీసం వందైనా సామెతలు వచ్చుంటాయి. ఇందులో ఎవరి నిఘంటువు వారిది. నలుగురిని కదిలిస్తే ఒకరికి తెలియని సామెతలు మరొకరికి కనీసం పదైనా దొరుకుతాయి. ఈ దృష్టితో చూస్తే సామెతల సంపద అంచనాలకి అందనిది. ఈ రంగంలో కృషి చేసే వారెవరైనా ముందుకొస్తే వారి జీవితకాలమైనా సరిపోదు. ఇటీవలే ఎవరో సామెతల మీద పరిశోధన చేసి 34,000కి పైగా సేకరించారని వినికిడి. వినడానికి ‘అబ్బో’ అనిపించినా వాస్తవానికి ఆ సంఖ్య బహుస్వల్పం. సేకరించగలవారుంటే అంతకు ఎన్నో రెట్ల సామెతలు తెలుగునాట లభిస్తాయి.


వెనక్కి ...

మీ అభిప్రాయం