ఆడించు పాడించు నేర్పించు

  • 107 Views
  • 0Likes
  • Like
  • Article Share

    పైండా శ్రీనివాసరావు

  • పిఠాపురం, తూ.గో.జిల్లా.
  • 9393554688
పైండా శ్రీనివాసరావు

నేను వింటాను... మర్చిపోతాను
నేను చూస్తాను... గుర్తుపెట్టుకుంటాను
నేను చేస్తాను... అర్థం చేసుకుంటాను
కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ఉపకరించే ప్రభావమంతమైన శైలి గురించి వివరించే చైనా సామెత ఇది.
కాగితం
పడవనే తీసుకోండి. దాన్ని ఎలా తయారు చేయాలో పిల్లలకు ‘చెబితే’.. వింటారు. కానీ, ఆ తర్వాత తిరిగి చేయలేరు. దాన్ని ఎలా చేయాలో ‘చూపిస్తే’.. తిరిగి చేయడానికి కొద్దిగానైనా ప్రయత్నిస్తారు. అదే, కాగితాన్ని వారి చేతిలో పెట్టి... ఎక్కడ మడవాలి, ఎక్కడెక్కడ కత్తిరించాలో చెప్పి వారి చేతనే ‘చేయిస్తే’, తయారీ విధానాన్ని చక్కగా గుర్తుపెట్టుకుంటారు. రెండో సారి వారంతట వారే సొంతగా చేసేస్తారు. తెలుగు భాషా బోధనకూ ఇదే పద్ధతిని అవలంబించాలి. నల్లబోర్డుపై వ్యాకరణాన్ని వివరించడం, పదాలను ఎలా పలకాలో చెప్పడం ద్వారా విద్యార్థుల్లో తెలుగుపై ఆసక్తి కలిగించలేం. చిన్న చిన్న అభ్యాసాలు, ఆసక్తికర పోటీల సాయంతోనైతే ఈ పనిని సులువుగా చేయవచ్చు. విఖ్యాత శాస్త్రవేత్త అల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ చెప్పినట్లు ‘విద్యార్థుల్లో సృజనాత్మక వ్యక్తీకరణ సామర్థ్యం, జ్ఞాన సముపార్జన శక్తిని వృద్ధి చేయడమే ఉపాధ్యాయుడి బాధ్యత’ అనుకుంటే... ఆ కర్తవ్య నిర్వహణకు పైన చెప్పిన బోధనా ప్రక్రియే అత్యుత్తమ విధానం.
      ప్రతి పది, పదిహేను రోజులకోసారి పిల్లలకు ఏదో ఒక అంశంపై పోటీనో, ప్రత్యేక తరగతి పెట్టడమో చేయవచ్చు. వాటి వల్ల విద్యార్థులకు తెలుగు సులువుగా బోధించవచ్చు. భాషపై మమకారాన్ని కలిగించవచ్చు. మన ఘన చరిత్రను, వారసత్వాన్ని వారికి అందించవచ్చు. ఇందుకు అవసరమైన ప్రణాళిక రచన, సమాచార సేకరణకు ఉపాధ్యాయులు ఈ వేసవిని ఉపయోగించుకోవచ్చు. ఈ క్రతువుకు ఉపయోగపడే కొన్ని ఆలోచనలు...
* ఉక్తలేఖనం (డిక్టేషన్‌): తెలుగు పదాల ఉచ్చారణను అర్థం చేసుకుని, రాయడానికి ఉపయుక్తమవుతుంది.
* తేట తెలుగులో మాట్లాడటం (ఆంగ్ల పదాలు వాడకుండా): తెలుగులో మాట్లాడటం అలవాటవుతుంది. ఆంగ్ల పదాలు వద్దన్న నియమం వల్ల... తమ భావాలను వ్యక్తీకరించడానికి సరిపోయే తెలుగు మాటలను విద్యార్థులు అన్వేషిస్తారు. తెలుసుకుంటారు. తద్వారా వారి పదసంపద పెరుగుతుంది.
* పద్య పఠన పోటీ: ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉచ్చారణా సామర్థ్యం మెరుగవుతుంది. రాగయుక్తంగా పద్యాలు పాడాలంటే... ముందు వాటి భావం తెలిసుండాలి. ఆ ‘తెలుసుకునే’ సమయంలోనే మన భాష గొప్పతనం పిల్లలకు అవగతమవుతుంది.
* సామెతల పోటీ: భాషాజ్ఞానం పెరుగుతుంది. అనంతమైన భావాలను చిన్న చిన్న మాటల్లో ఎలా వ్యక్తీకరించాలో తెలుస్తుంది.
* తెలుగు భాషాంశాలపై క్విజ్‌: పదాల అర్థాలు, వ్యతిరేకపదాలు, కవుల  రచనలు, సంధులు, సమాసాలు, నానార్థాలు తదితరాలపై క్విజ్‌ పెడితే...  పోటీలో గెలవాలన్న ఉత్సాహంతో వాటిని నేర్చుకుంటారు.
* వక్తృత్వం: వేదిక భయం (స్టేజ్‌ ఫియర్‌) పోగొట్టడానికి, ఉపన్యాస సామర్థ్యాన్ని పెంచడానికి సహకరిస్తుంది.
* బృంద చర్చ: వాదన, తర్క, సంభాషణా సామర్థ్యాల వృద్ధి.
* దస్తూరీ పోటీ:  లేఖన సామర్థ్య పెంపునకు దోహదపడుతుంది. 
* అంత్యాక్షరి: పదాలతోనే నిర్వహించాలి. ఎలా.. లాలి... లిపి... ఇలా పోటీ జరగాలి. పిల్లల్లో పదసంపదను దీంతో పెంచవచ్చు.
* గేయాల పోటీ: దేశభక్తి, జానపద తదితర గేయాలను   పాడటంపై దీన్ని నిర్వహించవచ్చు. అపురూపమైన తెలుగు గేయ సంపదను కాపాడుకోవడానికి ఇది చక్కని మార్గం.
* లేఖల పోటీ: ఈమెయిళ్లు, ఎస్సెమ్మెసులు వచ్చాకా ఉత్తరాలు రాసే అలవాటు పోయింది. కానీ లేఖలు రాయడం వల్ల భావ వ్యక్తీకరణ సామర్థ్యం వృద్ధి చెందుతుంది.
* వర్ణమాల పోటీ: తెలుగు వర్ణమాలను అచ్చులు, హల్లులు,  ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాల వారీగా రాయమని చెప్పవచ్చు. (దీనికి ముందు అవేంటో, వాటి లక్షణాలేంటో వివరించాలి)
* పాటల పోటీలు: లాలి పాటలు, పేరంటాల పాటలు, పండుగ పాటలు, పని చేసేటప్పుడు గ్రామీణులు పాడే పాటలు... ఇలా అన్నిటిపై పోటీలు పెట్టవచ్చు. దీని ద్వారా మౌఖిక సాహిత్యాన్ని కాపాడుకోవచ్చు. ఆ పాటలను  నేర్చుకునే క్రమంలో విద్యార్థులు చేసే సాధన ద్వారా భాషపై పట్టు పెరుగుతుంది.
* మనవైన కాల, కొలమానాలను చెప్పించడం: తెలుగు సంవత్సరాలు, కాలాలు, రుతువులు, మాసాలు, పక్షాలు, వారాలు, తిథులతో పాటు మన సంఖ్యామానాలను ఒకసారి వివరించి, ఏ రోజుకారోజు చెప్పించాలి.
* తెలుగు అంకెల పోటీ:  0 మనవైన ఈ అంకెలను విద్యార్థులకు పరిచయం చేయాలి. సంఖ్యలను చెబుతూ తెలుగు అంకెల్లో వాటిని రాసి చూపించమని చెప్పాలి.
* కథలు చెప్పించడం (గేయ, చిత్ర కథలు కూడా): ఊహాశక్తిని పెంచడానికి ఉపకరిస్తుంది. సృజనాత్మక వ్యక్తీకరణ సామర్థ్యం పెరుగుతుంది. ‘చిత్రం’ చూపించి అప్పటికప్పుడు కథ అల్లమనీ చెప్పవచ్చు. దీనివల్ల సమయస్ఫూర్తి అలవడుతుంది. 
* పెద్ద బాలశిక్షలోని విశేషాలను చర్చించడం: తెలుగంటే బెరుకు పోతుంది. భాషపై పట్టు పెంచడానికి ఉపయుక్తమవుతుంది. 
* సూక్తులు చెప్పించడం: ఏది మంచి, ఏది చెడు అన్న విచక్షణా జ్ఞానం అలవడుతుంది. మంచి నడవడికను అందిస్తుంది.
* వ్యాసరచన: తెలుగు సాహిత్యం, ఇతర అంశాలపై ఈ పోటీని నిర్వహించవచ్చు. లేఖన, భావ వ్యక్తీకరణ సామర్థ్యాలను మెరుగుపెట్టడానికి సాయపడుతుంది.
* హాస్యోక్తులు చెప్పించడం: సంభాషణా చతురత అలవడుతుంది. 
* పండుగలు, జాతర్ల ప్రశస్తి, వాటిని జరుపుకునే విధానం చెప్పించడం: మన సంస్కృతి, సంప్రదాయాల విశిష్టత పిల్లలకు తెలుస్తుంది.
* ఒక పదంలోని అక్షరాలతో కొత్త పదాలను తయారు చేయించడం: ఉదా: చదువు... చలి, దువ్వెన. పదసంపదను పెంచడానికి చక్కటి మార్గమిది.
* ప్రహేళికలను (ఈనాడు ‘ఆదివారం’లోని ‘పదవినోదం’ లాంటివి) పూర్తి చేయించడం: భాషపై పట్టు పెరుగుతుంది. జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. మెదడు పని తీరులో అనూహ్య మార్పులు వస్తాయి.
* నాటక పోటీలు: సంభాషణలను పలకడం ద్వారా ఉచ్చారణా సామర్థ్యం వృద్ధి చెందుతుంది. నాటక రూపకల్పనా క్రమంలో రచనా శక్తి పెరుగుతుంది. సృజనాత్మకత ఇనుమడిస్తుంది. 
* తెలుగు కవుల చిత్రాలను సేకరించి ప్రదర్శన ఏర్పాటు చేయడం: తెలుగుతల్లి ముద్దుబిడ్డలను నవతరానికి పరిచయం చేయవచ్చు. అలాగే, ఒక పుస్తకంలో కవుల చిత్రాలను ఒకవైపు అంటించి, మరోవైపు వారి గురించి రాయమని చెప్పాలి. దీని వల్ల ఆ కవుల గురించి తెలుసుకోవడానికి విద్యార్థులు ప్రయత్నిస్తారు. ఆ క్రమంలోనే మన సాహిత్యంపై అవగాహన పెంచుకుంటారు. 
* చలనచిత్ర గీతాలకు పేరడీలు రాయించడం, పాడించడం: వైవిధ్య భరిత ఆలోచనలకు అవకాశం దక్కుతుంది. వ్యంగ్య రచనా శైలి అలవాటవుతుంది.
* పొడుపు కథలు అడగటం: భాషా జ్ఞానం, ఆలోచన, విశ్లేషణ  సామర్థ్యాలు వృద్ధి చెందుతాయి.
* కొన్ని పంక్తులను గట్టిగా చదివించడం: ఉచ్చారణ దోషాలను గుర్తించి సవరించడానికి ఉపయోగపడుతుంది.
* జాతీయ గీతాలాపన: జనగణమన, వందేమాతరం వంటి గీతాలను పాడటమే కాకుండా వాటి భావాలనూ తెలుగులో చెప్పేలా ప్రోత్సహించాలి. దీనివల్ల ఆ గీతాల ప్రాముఖ్యం తెలుస్తుంది. దేశభక్తి పాడుకుంటుంది. వాటిని రాసిన వారి గొప్పదనం, నేపథ్యం వంటివీ వివరించవచ్చు.
* తెలుగు ఆటలు ఆడించడం: వైకుంఠపాళి, దాడి, పులి-మేక నుంచి మనవైన ఆటలన్నింటినీ వీలును బట్టి ఆడించాలి. 
* ప్రాసవాక్యాలు తయారు చేయించడం: ఉదా... కలిసి మెలిసి తిరుగు... చెలిమి అప్పుడే పెరుగు భాషాపాటవాన్ని పెంచుకోవడానికి దోహదపడే అభ్యాసం.
* స్వీయ పరిచయం: విద్యార్థి పేరు, తల్లిదండ్రుల పేర్లు, వారి వృత్తి, తన అభిరుచులు, అలవాట్లు, ఊరి విశేషాలు... ఇలా రాయించాలి. దీని వల్ల తన గురించి, తన వారి గురించి, తను పుట్టి పెరిగిన ప్రదేశం గురించి తెలుసుకునే అవకాశం చిన్నారికి దక్కుతుంది. 
* కందుకూరి వీరేశలింగం పంతులు, అల్లూరి సీతారామరాజు వంటి వారి వేషధారణల ప్రదర్శన:    విద్యార్థుల్లో స్ఫూర్తి నింపడానికి, వారిని ఉత్తేజితులను చేయడానికి ఉపకరించే చక్కటి ప్రయత్నమిది. 
* బృందగానాలు: ‘భిన్నత్వంలో ఏకత్వం’ అన్న భావనను అర్థం చేసుకోవడానికి సాయపడతాయి.
* తెలుగు పత్రికా పఠనం: లోకం పోకడ తెలుస్తుంది. మన భాషను చదవలేమన్న (కొంత మంది విద్యార్థుల్లో ఉండే) బెరుకు పోతుంది. ‘తెలుగు వెలుగు’ లాంటి భాషా పత్రికలను తప్పనిసరిగా చదివించాలి. దీనివల్ల మన మాతృభాషా విశేషాలు మన బిడ్డలకు తెలుస్తాయి. 
      ఈ కృత్యాలన్నీ మనకు తెలిసినవే. వీటిలో కొన్నింటిని పాఠశాలల్లో అప్పుడప్పుడూ చేయిస్తూనే ఉంటారు. అయితే, వాటిని మరింత ప్రణాళికాబద్ధంగా పిల్లలతో చేయించినప్పుడే మెరుగైన ఫలితాలుంటాయి. ఈ విషయంలో తెలుగు ఉపాధ్యాయులు కాస్త శ్రద్ధ పెడితే సంవత్సర ప్రణాళిక రూపొందించుకోవచ్చు. తెలుగు పంట పండించవచ్చు.


వెనక్కి ...

మీ అభిప్రాయం