కన్నీటి అక్షరాల జలధి
యాతమేసి తోడినా...

  • 244 Views
  • 0Likes
  • Like
  • Article Share

    తెలుగు వెలుగు బృందం

పాలు తాగి రొమ్ము గుద్దేవాళ్లకు... కులాల కుంపట్లు రాజేసి చలి కాచుకునే వాళ్లకు... పక్కవాణ్ని ద్వేషిస్తూ, పైకి మోసుకుపోలేని పైసల్ని ప్రేమించే వాళ్లకు మొట్టికాయలేసే మాటలవి. కుల, మత, ఆర్థిక, లింగ భేదాలకతీతంగా మనిషిని, మనిషిలా చూడటమే మానవత్వమని ప్రబోధించే పలుకులవి. అంతేనా... కష్టాలు కయ్యానికి వచ్చినప్పుడు కంగారుపడి కన్నీళ్లు పెట్టుకుంటే ఫలితముండదనే వాస్తవాన్ని విడమరచే పదాలవి. జానపదాల జలధి జాలాది కలాన్ని అజరామరం చేసిన అక్షరాలవి.

‘తెలుగు సినీ జానపద సాహిత్యంలో కొసరాజు చక్రవర్తి. నేను సామంత రాజును’ అని ప్రకటించడమే కాదు... ‘అక్షరాలా’ నిరూపించిన పల్లెపదాల మొనగాడు జాలాది రాజారావు. తన పాటల ద్వారా పల్లీయుల పలుకుబడుల్లోని అందచందాలను ఆబాలగోపాలానికి ప్రదర్శించిన వ్యక్తి ఆయన. అలాంటి జాలాది రచించిన ‘యాతమేసి తోడినా’ (చిత్రం: ప్రాణం ఖరీదు) గీతాన్ని వింటే.... జీవితం గాయం చేసినప్పుడు గేయం ఇచ్చే ఓదార్పు ఎలా ఉంటుందో తెలుస్తుంది.
యాతమేసి తోడినా యేరు ఎండదూ
పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు
దేవుడి గుడిలోదైనా పూరి గుడెసెలోదైనా
గాలి ఇసిరికొడితే... ఆ దీపముండదు    
।।యాతమేసి।।
పలుపుతాడు మెడకేత్తే పాడి ఆవురా
పసుపుతాడు ముడులేత్తే ఆడదాయిరా
కుడితి నీళ్లు పోసినా అది పాలుకుడుపుతాదీ
కడుపుకోతకోసినా అది మనిషికే జన్మ ఇత్తాదీ
బొడ్డు పేగు తెగిపడ్డా రోజు తలుసుకో  
గొడ్డుకాదు ఆడదనే గుణం తెలుసుకో
।।యాతమేసి।।
అందరూ నడిసొచ్చిన తోవ ఒక్కటే
సీమునెత్తురులు పారే తూము ఒక్కటే
మేడ మిద్దెలో ఉన్నా సెట్టునీడ తొంగున్నా
నిదరముదరపడినాకా పాడె ఒక్కటే
వల్లకాడు ఒక్కటే
కూతనేర్చినోళ్ల కులం కోకిలంటరా
ఆకలేసి అరసినోళ్లు కాకులంటరా ।।యాతమేసి।।  

      చక్రవర్తి సంగీత సారథ్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ పాట సాహిత్యంలో వేమన భావాలతో పాటు అన్నమయ్య ఆలోచనలూ కన్పిస్తాయి. సమాజంలో వేళ్లూనుకున్న అంతరాలను అక్షరాలతో ఎదుర్కొన్న ఆ మహానుభావుల అడుగుజాడల్లో నడుస్తూ సామాజిక దురాచారాలపై జాలాది సంధించిన అస్త్రం ఈ గీతం. పల్లె పదాలు, పలుకుబళ్లు, సామెతల స్థాయిలోని పాదాలతో సాగిన ఈ రచన... తెలుగు సినీ కవుల ప్రతిభకు మెచ్చుతునక.
      మనసులోని బాధను ఏరుగా భావిస్తే... ఏడుపు ఏతమవుతుంది. (‘ఏతం’...నీళ్లు తోడటానికి వాడేది. ఇద్దరు వ్యక్తులు అటూ ఇటూ దీంతో నీళ్లు తోడతారు. ఒకప్పుడు పొలాలకు నీళ్లు పెట్టడానికి వాడేవారు) ఏడిస్తే బాధ పోతుందన్న నమ్మకం లేదు కదా. ఈ వేదాంతపరమైన విషయాన్నే జాలాది ‘ఏతమేసి తోడినా ఏరు ఎండద’ంటూ ప్రతీకాత్మకంగా చెప్పారు. ఏడుపును ఏతంతో పోల్చడంలో విశేషం ఉంది. ఇద్దరు పట్టుకుని ఏతంతో నీళ్లు తోడినట్లే... రెండు కళ్లు కలిసే కన్నీటిని వర్షిస్తాయి!
      పొంత అంటే వేణ్నీళ్లు కాసే కుండ. పూర్వం వంటకు రాళ్ల పొయ్యిలు వాడేవారు. దాంట్లో రెండు వైపులా రాళ్లు పెట్టి మూడో వైపు ఓ నీళ్ల కుండ పెడతారు. వంట చేసేటప్పుడు పొయ్యిలోని మంట వేడికి ఆ నీళ్లు కాగుతాయి. వాటిని స్నానానికి వాడుకునే వారు. చలికాలాన్ని మినహాయిస్తే, సాధారణంగా వేణ్నీళ్లతో స్నానమెందుకు చేస్తాం? అలసిన ఒడలుకు సాంత్వన కలిగించడానికి! ‘పొంత నింపుతున్నామంటే’... శారీరక కష్టం నుంచి ఊరడింపు పొందాలనుకుంటున్నామనే కదా! అదే... మనసు అలసిపోతే! దానికి సాంత్వన చేకూర్చడానికి కన్నీళ్లతో ‘పొంత’ను నింపాలనుకోవడం అర్థరహితం. మంట వేడి(బాధ తీవ్రత)కి పొంతలో పడిన కన్నీటి చుక్క ఆవిరవుతుంది కానీ ఆదరువు కాబోదు... దాంతో ఎన్ని కన్నీళ్లు కార్చినా ఆ పొంత నిండదు. మనసు తేలికపడదు.
      సుఖదుఃఖాలు రేయింబవళ్లు. కష్టాలకు అతీతంగా కాపురాలు సాగవు. కాలం కలిసిరానప్పుడు ఎంతటి వారైనా నూకలు తినాల్సిందే. గుడిలో ఉందా, గుడిసెలో ఉందా అన్నది ముఖ్యం కాదు, గాలి విసిరికొడితే దీపం కొండెక్కిపోతుందన్నది పరమసత్యం. ఈ ఒక్క ఉపమానంతో కష్టాల సామ్యవాదాన్ని కళ్లకు కట్టారు జాలాది. మనకు వచ్చిందే పెద్ద కష్టమంటూ అధైర్యపడటమెందుకని ఆత్మవిశ్వాసాన్ని పంచే ప్రయత్నం చేశారు.
      అ అంటే అమ్మ, ఆ అంటే ఆవు... పసివారికి వర్ణమాలతో పరిచయం పెంచడమే కాకుండా అమ్మకు, ఆవుకు ఇంకేమైనా పోలికలున్నాయా? ఎందుకు లేవూ... ఆకలి తీర్చే ఆవును ‘గోమాత’ అంటూ తల్లిని తలచుకుంటున్నాం కదా. అందుకే జాలాది రెండో చరణంలో స్త్రీ పురుష భేదభావాలను ఎండగట్టడానికి అమ్మకూ ఆవుకూ పోలిక పెట్టారు. ఆవును అదుపులో ఉంచుకోవడానికి మెడలో పలుపు తాడు వేస్తారు... స్త్రీ ఒకరికి సొంతమైందని చెప్పడానికి పసుపు తాడు కడతారని (పెళ్లితో పురుషుడు కూడా మరొకరికి సొంతమవుతాడు కదా. దాని గుర్తేంటి? లేదు) చెప్పారు. కుడితి నీళ్లు పోశామని చెప్పి పాడి ఆవు పాలివ్వకుండా ఉంటుందా. తన స్తన్యంతో తన బిడ్డ ఆకలినే కాదూ యజమాని అవసరాలనూ తీరుస్తుంది. (కుడుపు అంటే స్తన్యమివ్వడం, ఆహారం, తాగడం) స్త్రీ కూడా అంతే. కడుపు కోసి (శస్త్రచికిత్స) కన్నీళ్లు పెట్టించినా సరే, మనిషికి జన్మనిస్తుంది. నిస్వార్థతకు పర్యాయపదం నారి. అలాంటి తనను బాధపెట్టి బావుకునేదేంటని ప్రశ్నిస్తున్నారిక్కడ కవి.
      ఉన్నోళ్లు, లేనోళ్లు, ఉన్నత కులాలు, నిమ్న జాతులు... ఎన్ని రకాలుగా విడిపోవాలో అన్ని రకాలుగా విడిపోయాడు మనిషి. సృష్టిలో మరే ప్రాణికి లేని ‘ఆలోచన’ ఉన్న మనిషే... మరే జీవజాతుల్లో లేని భేదభావాలకు దాసోహమయ్యాడు. అందుకే జాలాది... తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎవరికీ అంటని ‘మరకల’ను ఆ క్షణం తర్వాత ఎవరికి వారు అంటించుకోవడం ఎందుకని అంటున్నారు. ఉమ్మనీటిని దాటుకుంటూ అందరూ  నడిచొచ్చిన తోవ ఒకటే అయినప్పుడు... భూమ్మీద బతుకు ప్రయాణంలో తరతమ భేదాలతో ఎవరి దారి వారు చూసుకోవడమెందుకని ఆవేదన చెందుతున్నారు కవి. సీము, నెత్తురులు పారే తూము అంటే శరీరం.  వెంట్రుకల నుంచి అరికాళ్ల వరకూ మానవుల శరీర నిర్మాణమంతా సమానం. కళ్లకు కనిపించే ఈ ‘సమానత్వాన్ని’ వదిలేసి కంటికి కనిపించని మానసిక వికారాలతో వివక్ష చూపుకోవడం ఎందుకంటున్నారు.
      మిద్దెలోని హంసతూలికా తల్పాలపై శయనిస్తున్నారా, మట్టి గోడల గుడిసెలోని నేలపై పడుకున్నారా అన్నది ముఖ్యం కాదు శాశ్వతనిద్రలోకి జారుకున్నాక (నిదరముదరపడినాకా) అందరూ పాడెపై పవళించాల్సిందే. వల్లకాటికి బైలెల్లాల్సిందే. అంతమాత్రం దానికి పేద, ధనిక అంటూ గొప్పలు చెప్పుకోవడం దేనికంటున్నారు జాలాది చివరి చరణంలో.  
      చివరి రెండు వాక్యాలతో పాటకు అద్భుతమైన ముగింపునిచ్చారు కవి. ‘కూతనేర్చినోడు కోయిల’గా సత్కారాలు అందుకుంటుంటే ‘ఆకలేసి కేకలేసినోడు కాకి’గా ఛీత్కారాలు పొందుతున్నాడని సమాజంపై వ్యంగ్య బాణాలేశారు. కడుపు నిండిన వాడు కూనిరాగాలు తీస్తాడు. వాటినే కుహుకుహు రాగాలుగా భావించి సమాజం శ్రవణానందం పొందుతుంది. ఆకలి కేకలతో అలమటించే అన్నార్తుల వ్యథను మాత్రం ‘కాకిగోల’గా అసహ్యించుకుంటుంది. ఇదెంత వరకు న్యాయమని ఎండగడతారు కవి.
      ఈ పాట బాణీయే కాదు ప్రతి పాదమూ జానపదమే! ఇందులో దృష్టాంతాలంకారం కనిపిస్తుంది. రెండు అంశాలను ఒకదానికొకటి బింబ ప్రతిబింబాలుగా పోల్చడమే దృష్టాంతాలంకారం అవుతుంది. యాతమేసి తోడినా... పొగిలి పొగిలి ఏడ్సినా... అన్న మాటలను ఒకదానికొకటి బింబంగా చూపించారు. దేని అర్థం దానికున్నా ఆ రెండింటిలోనూ ఒకే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే, పలుపుతాడు మెడకేత్తే - పసుపుతాడు ముడులేత్తే, ...తోవ ఒక్కటే. ...తూము ఒక్కటే; .స్వచ్ఛమైన తెలుగు పదాలతో గుబాళించే పూదోట ఈ పాట.
      ‘ఎక్కువ పాటలు రాయాలనే కోరిక నాకెప్పుడూ లేదు. రాసిన నాలుగూ మంచివి రాయాలనే తపన తప్ప’ అని చెప్పిన జాలాది మాట మీద నిలబడ్డారు. లక్షల విలువ చేసే అక్షరాలను తెలుగు వారికి కానుకగా అందించారు.


వెనక్కి ...

మీ అభిప్రాయం