ఆహా! ఏమి రుచి!!

  • 185 Views
  • 0Likes
  • Like
  • Article Share

    తెలుగు వెలుగు బృందం

తెలుగునాట సాహిత్యాన్ని సుసంపన్నం చేసింది కృష్ణరాయల యుగం. ఆయన పాలనలో భువన విజయం అనే సాహితీసభ తెలుగు సాహిత్యానికి వెలుగుదివ్వెలను ప్రకాశింపజేసింది. ఆయన ఆస్థానంలో అష్టదిగ్గజకవులు వారి ప్రబంధాలతో ఆంధ్రభారతికి నవ్యశోభను చేకూర్చారు.
      ప్రాచీన కాలంలో పెళ్లిళ్లు ఏడు రోజులు కూడా చేసేవారు. ఆ రోజుల్లో పెళ్లి విందుల్లో ఎన్నెన్నో రకాల పిండి వంటలు రుచి చూసేవారు. కళాపూర్ణోదయంలో  పింగళి సూరన, అయ్యలరాజు  రామభద్రుడు తెలిపిన వంటకాల్లో కొన్ని ఎలా చేసేవారో కూడా మనకిప్పుడు తెలీదు. కొన్ని మాత్రం ఇప్పుడూ ఉన్నాయి. తెలిసిన వాటిని చేసుకు తినడం, తెలియని వాటిని ఊహించుకుని ఆనందించడం తప్ప మరేం చేయలేం. ఆ వంటల పేర్లు ఈ పద్యంతో ఆఘ్రాణిద్దాం.
‘కల వంటకములు బూరెలు తేనెతొలలు చా
    పట్లు మండెంగ లొబ్బట్లు వడలు
కుడుములు సుకియలు కడియంపుటట్లు వె
    న్నప్పాలు వడియంబు లప్పడాలు
పొంగరంబులు సొజ్జె బూరె లౌగులు సేవె
    లుక్కెర లరిసెలు చక్కిలములు
ఖర్జూర గోస్తనీ కదళికా సహకార
    ఫలములు కొబ్బెర పనస తొలలు
తేనియలు జున్ను మీగడ లానవాలు
పానకములు రసావళ్లు పచ్చడులును
నాజ్య మొలుపు బప్పులు కూర లనుప మాన్న
మపుడు ప్రజ నెల్ల దనియించె నహరహంబు’
      అలాగే అయ్యలరాజు రామభద్రుని ‘రామాభ్యుదయం’లో చెప్పిన తెలుగు వంటలు మరికొన్ని.
‘ఇడిరమ్మౌని కుపాయనమ్ములు మనోభీష్టంబుగా బూరియల్‌ 
వడలుం జక్కెర కర్జకాయలును లడ్వాలుక్కెరల్‌ పూర్ణపుం 
గుడుముల్‌ గారెలు బెల్లమండెగలు నౌగుల్‌ కమ్మచాపట్లునూ 
టిడులున్‌ దోసెలు నప్పముల్‌ సుకియలున్‌ హేరాళమై కన్పడన్‌’
      బూరెలు, వడలు, చక్కెర కజ్జ్జికాయలు, లడ్లు, ఉక్కెరు, చక్కెర చేర్చి పిండితో చేసేవి. పూర్ణపు కుడుములు, గారెలు, బెల్లపు మండెగలు, గోధుమ పూరీలు, ఔగులు, కమ్మని చాపట్లు, నూటడులు నువ్వులతో చేసిన ఇడులు దోసెలు, అప్పాలు, సుకియలు వంటివి పుష్కలంగా వండేవారు.
      జైమినీ భారతంలో పిల్లలమర్రి పినవీరభద్రుడు తెలుగు వంటల రుచి చూపించాడు. రాజసూయ యాగం చేస్తున్నప్పుడు షడ్రోసోపేతమైన విందును ఏర్పాటు చేశాడు. ఆ విందును ఆరగించడానికి మునులూ హాజరయ్యారు. ఆశ్రమాల్లో ఉన్నప్పుడు కందమూలాలే ఆహారం కదా వారికి. ఈ విందులో ఉన్న  ఆహార పదార్థాల గురించి తెలియక.... 
చింపి వల్కములేమి చేసెడిదన, కావు
    నెరవైన కండ మండెగలు గాని
తెగిన జందెములేల తెచ్చెదరన, కావు 
    వినుడివి సన్న సేవియలు గాని
ఔదుంబరము లనర్హము లొల్ల మన, కావు
    నమలిచూడుడు మోదకములు గాని 
ఫేన పుంజము లేల పెట్టెదరన, కావు
    నీ పాదమాన ఫేనికలు గాని
అంచు వాచంయములు పల్క అబ్జముఖులు 
    నగుచు ఒడబడి చెప్ప అందరు యథేష్ట 
రుచులు భుజియించి, వార్చి కర్పూర వీటి 
    కా సుగంధ ప్రసూన సౌఖ్యములు దనిసి
      ఆ విందులో పాల్గొన్న మునులు ఒక వంటకాన్ని చూసి వడ్డించే స్త్రీను అడిగారట. ‘ఇదేంటి గుడ్డపీలికలా?’ అనే ప్రశ్నకు ఆమె నుంచి ‘కాదవి మండెగలు’ అని సమాధానం వచ్చిందట. మరో వంటకాన్ని ‘జందెపు తునకలా’ అని అడిగారు. ‘కాదు సేమియాల’న్నారు. ‘ఇవేంటి మేడిపండ్లా! అవి నిషేధమ’న్నారు. ‘కాదు మోదకాలు’ అని జవాబిచ్చారు. ‘ఏమిటివి పాల నురుగా?’ అంటే ‘మీ పాదాలపై ఒట్టు ఫేనికలు’ అన్నారు. ఈ పద్యం వల్ల ఆనాటి తెలుగు వంటల్లో ఫేణీలు (పూతరేకులు), మండెగలు, సేమియాలు, లడ్లు, కుడుములు ఉండేవని తెలుస్తోంది.


వెనక్కి ...

మీ అభిప్రాయం