జన జీవన దర్పణం

  • 153 Views
  • 2Likes
  • Like
  • Article Share

    తెలుగు వెలుగు బృందం

వెయ్యేళ్ల కిందట మగవారూ మెట్టెలు పెట్టుకునేవారనీ,     సిగలో పూలు పెట్టుకునేవారనీ వింటే వింతగానే ఉంటుంది. కానీ ఇది ఆనాటి వేషధారణలో భాగం. ఇప్పుడు స్త్రీలు రకరకాల లిప్‌స్టిక్‌లు వాడుతున్నట్లే, తెలుగు స్త్రీలు ఒకప్పుడు లక్క రంగును (యావక రసం) పెదవులకు పూసుకునే వారంటే ఆశ్చర్యంగానే కనిపించవచ్చు. ఇవన్నీ ఒకప్పటి తెలుగు వారి జీవన విధానంలో భాగం. మన పూర్వీకుల ఆచార వ్యవహారాలు, ఆహార విహారాలు ఇలాగే ఉండేవి. ఇది మన చరిత్రలో భాగం. ఈ రకం చరిత్రను గ్రంథస్థం చేసి సామాన్య మానవుల సాంఘిక చరిత్రకు గౌరవస్థానం కల్పించిన రచనే సురవరం ప్రతాపరెడ్డి    ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’.
భవిష్యత్తును
ఊహించగలిగే వారిని, దర్శించగలిగే వారిని క్రాంతదర్శులు అంటాం. గత చరిత్రను విస్మరించే వారు క్రాంతదర్శులు కాలేరు. ఈ మాట వ్యక్తులకే కాదు జాతికీ వర్తిస్తుంది. సమాజంతో విడివడి జనజీవనం ఉండదు. ఇక్కడే చరిత్రకు ప్రాధాన్యం ఉంటుంది. అయితే చరిత్ర అంటే సాధారణంగా రాజకీయ చరిత్రను మాత్రమే చరిత్ర అనుకునే భావన ఇప్పటికీ ఉంది. సాంఘిక జీవితంతో లంకె లేని రాజకీయ చరిత్ర ఉండదు. అయినా చరిత్రను రాజకీయ పరిణామాలకు పరిమితం చేసిన సందర్భాలే ఎక్కువగా కనిపిస్తాయి.
      సమాజ జీవనయానంలో ఒక్కో అడుగు ముందుకు పడాలంటే ఆ సమాజంలో మంచి చెడ్డలను గమనించగœలగాలి. చెడును వదిలించుకుని మంచిని ప్రోది చేసుకుంటూ పోవాలి. సాంఘిక చరిత్ర సమాజ పురోగమనానికి ఉపకరిస్తుంది. ఈ అవసరాన్ని ఏడెనిమిది దశాబ్దాల కిందటే గుర్తించిన వారు సురవరం ప్రతాపరెడ్డి. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా పరిశోధించి క్రీ.శ. 1000 నుంచి మొదలుపెట్టి 1907 దాకా తెలుగు వారి సామాజిక జీవితాన్ని ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’గా సురవరం ప్రతాపరెడ్డి అక్షరబద్ధం చేశారు. ఆయన చూపిన మార్గంలో సాంఘిక చరిత్రను నిర్మించే ప్రయత్నాలు చాలా బలహీనంగానే సాగాయి.
      సురవరం ప్రతాపరెడ్డి సాంఘిక చరిత్ర మీద దృష్టి పెట్టిన కాలానికి పాశ్చాత్య దేశాల్లో కూడా ఈ అంశానికి అంత ప్రాధాన్యం లేదు. 1960, 70ల్లో పాశ్చాత్య దేశాల విశ్వవిద్యాల యాల్లో సాంఘిక చరిత్ర మీద ప్రత్యేక దృష్టి లేదు. 1970 నుంచి 1995 మధ్య అమెరికా విశ్వవిద్యాలయాల్లో సాంఘిక చరిత్ర అధ్యయనం గణనీయంగా పెరిగింది. అంతకుముందు సాంఘిక చరిత్రను పట్టించుకునే వారు చరిత్ర కారుల్లో 31 శాతం మంది ఉంటే, 1995 నాటికి వారి సంఖ్య 41 శాతానికి పెరిగింది. 2007 నాటికి బ్రిటన్‌ విశ్వవిద్యాలయాల్లో రాజకీయ చరిత్రను అధ్యయనం చేసేవారు 25 శాతం మంది అయితే, సాంఘిక చరిత్ర నిర్మాణానికి పాటుపడేవారు మరో నాలుగు శాతం ఎక్కువే ఉన్నారు. దాదాపు 80 ఏళ్ల కిందటే సురవరం ప్రతాపరెడ్డి ఆంధ్రుల సాంఘిక చరిత్ర గురించి ఆలోచించారంటే ఆయనకు సాంస్కృతిక రంగం మీద ఎలాంటి అభిప్రాయాలు ఉండేవో అర్థం చేసుకోవచ్చు.
      సురవరం ప్రతాపరెడ్డి రాజకీయాల్లో మితవాది అయితే సాంస్కృతిక జీవనంలో అతివాది. ఈ లక్షణమే ఆయన సాంఘిక చరిత్రపై పరిశోధన కొనసాగించడానికి ప్రేరేపించింది. సాంఘిక చరిత్రను క్రోడీకరించాలంటే చరిత్రను సమాజాన్ని నడిపించే రాజకీయ పరిణామాలను మాత్రమే కాక సామాన్య జన జీవితం చరిత్ర నిర్మాణానికి ఎలా తోడ్పడిందో గమనించగలగాలి.
      మన పూర్వీకులు ఏ రాజకీయ చట్రంలో ఉన్నారో తెలుసుకోవడం కన్నా వారి కట్టుబొట్టు ఎలా ఉండేవి, ఆచార వ్యవహారాలు, ఆహార విహారాలు, వారి ఆటపాటలు ఎలా ఉండేవో తెలుసుకోగలిగితే ఆ చరిత్ర మనదేనన్న అభిప్రాయం మరింత బలపడుతుంది. రాజుల చరిత్రకు తోడు ప్రజల చరిత్ర కూడా ఎలా ఉంటుందో, దానిలోని విశేషాలు ఏంటో తెలుసుకోగలిగితే దాంతో మరింత మమేకం అవుతాం.
      ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ను ఆంధ్ర సారస్వత పరిషత్‌ 1949లో మొదటిసారి ప్రచురించింది. ఏడాది తిరగక ముందే రెండో ముద్రణ అవసరమైంది. ఆ తర్వాత విశాలాంధ్ర ప్రచురణాలయం, ఓరియంట్‌ లాఙ్మన్‌ కూడా ఈ గ్రంథాన్ని పునర్ముద్రించాయి. జాతీయ స్థాయిలో తెలుగు పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ రావడం కూడా ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’తోనే ప్రారంభం అయింది. ఐఏఎస్, ఐపీఎస్‌ ఉద్యోగాల కోసం పరీక్షలు రాసే వారికి ఇది పాఠ్య గ్రంథంగా ఉంది.
      తెలుగు సాహిత్యంలో చిత్రించిన జనజీవన వివరాలు తక్కువే కావచ్చు. కానీ వాటిని క్షుణ్ణంగా పరిశీలించి ఆంధ్రుల సాంఘిక చరిత్రను నిర్మించడానికి సురవరం ప్రతాపరెడ్డి ప్రయత్నించారు.
      సురవరం ప్రధానంగా సాహిత్యకారుడు, సాహితీ రంగంలోని దాదాపు అన్నీ ప్రక్రియలను సుసంపన్నం చేసిన వాడు. కానీ ఇరవయ్యో శతాబ్దం మొదటి అర్ధభాగంలో నిజామాంధ్ర ప్రాంతంలో భూస్వామ్యం, రాచరికం, తెలుగు భాష మీద ఆంక్షలు, భావ ప్రకటనా స్వేచ్ఛ మీద ఉన్న కట్టడి, అయిదు శాతం మించని అక్షరాస్యత కారణంగా ఆనాడు సామాజిక రంగంలో కృషి చేసేవారు ఏదో ఒక రంగానికి పరిమితం కాకుండా భిన్న రంగాల గురించి ఆలోచించాల్సి వచ్చింది. ప్రతాపరెడ్డి ఒకవైపు సాంస్కృతిక జీవన రంగంలో క్రియాశీలకంగా ఉంటూనే  రాజకీయాల్లోనూ కృషి చేశారు. శాసనసభ్యుడిగా ఎంపికయ్యారు. ఆ బహుముఖ ప్రజ్ఞ కారణంగానే ఆయన తెలంగాణ వైతాళికుడనిపించుకున్నారు.
      ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ పొడవునా సురవరం నిశిత దృష్టి, లోతైన పరిశీలనా దృక్పథం, గతంలోని మంచిని గౌరవించే ఉదాత్త లక్షణం, గతాన్నంతటినీ గుడ్డిగా నమ్మనవసరం లేదన్న విస్పష్ట వైఖరి కారణంగానే ‘మనమందరమూ చరిత్ర కెక్కదగిన వారమే’ అనగలిగారు. సాంఘిక చరిత్రను క్రోడీకరించడంలో ఆయనకు ప్రధానమైన ఆసరా సాహిత్యమే అయినా ఆ సాహిత్యంలో దీనికి ఉపకరించేవి, ఉపకరించనివి ఏవో నిర్ణయించుకోవడంలో పూర్తి శాస్త్రీయ విధానాన్ని అనుసరించారు.
      ఆంధ్రుల సాంఘిక చరిత్ర చదివితే ఇప్పుడు చెలామణిలో లేకుండాపోయిన అనేక తెలుగు మాటలు ముచ్చట కలిగిస్తాయి. రంగులు వేయడానికి వాడే కుంచెను ‘వర్తిక’ అనీ, జంతువుల వెంట్రుకలతో చేసిన వర్తికను ‘మయ్యెవ’ అనీ, డేరాను ‘గొల్లెన’ అనీ, ఎథ్నాలజీ అంటే ‘అంగస్వరూప శాస్త్రమనీ’, ‘రట్ట’ అంటే రాజ్యమనీ అంటారని తెలుసుకున్నప్పుడు తెలుగు భాషలో ఎంత పదసంపద మరుగున పడిపోతోందో తెలుస్తుంది.
      ఈ గ్రంథంలోని కొన్ని అంశాలు ఇప్పుడు వివాదాస్పదంగానో, అంగీకరించ డానికి వీలు లేనివిగానో కనిపించవచ్చు. తిరుపతి వెంకటేశ్వరుడి విగ్రహం మొదట వీరభద్ర విగ్రహమేననీ దాన్ని రామానుజా చార్యుల కాలంలో వైష్ణవ విగ్రహంగా మార్చారంటే చాలా మందికి అభ్యంతరకరంగా ఉండొచ్చు. కాని ప్రతాపరెడ్డి సాధికారికంగానే ఈ మాట చెప్పారు. వెలమలు దక్షిణాది నుంచి, రెడ్లు ఉత్తరాది నుంచి వచ్చి ఉంటారనీ, రాష్ట్రకూటులే రెడ్లయ్యారని చెప్పారు.
      మతం మార్పిడి ఎంత సహజమో, మతం మారిన వారిని శుద్ధి చేసి మళ్లీ మతంలో చేర్చుకోవడం కూడా అంతే సహజం. కానీ మతమార్పిడులకు ఒకప్పుడు ముస్లింలు, ప్రస్తుతం క్రైస్తవులు ఎక్కువగా పాల్పడుతున్నారని ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. మతాంతరులను మళ్లీ తమ మతంలోకి తీసుకోవడం, మత ప్రచారం చేయడం ముస్లింలు, క్రైస్తవులు - హిందూ, బౌద్ధ మతాల నుంచే స్వీకరించారని ఈ గ్రంథంలో తేల్చారు.
      సురవరం సాంఘిక చరిత్ర నిర్మాణానికి సాహిత్యాన్ని ఆలంబనగా చేసుకున్న కొన్నింటిని నిష్కర్షగా తప్పని కూడా తేల్చారు. శ్రీనాథుడి వచనంలో సరిసర్లు అనే జాతి ఏదో తెలియదన్న సందేహం వ్యక్తం చేస్తూనే, ముద్రిత పాఠంలో ‘వంటరి’ అన్న మాట ఉందనీ వంటరి అంటే వంటరివాడు అన్న అర్థం చెప్పి ఆ మాట బహుశా ఒంటరి (ఏకవీరుడు) అయి ఉంటుందని తేల్చారు.
      ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌లో తయారైన కత్తులు డెమాస్కస్‌కు ఎగుమతయ్యాయని తెలుసుకోవడం కచ్చితంగా తెలుగు వారిలో పౌరుషాన్ని ఇనుమడింప చేసే విషయమే.
      తెలుగు వారి సాంస్కృతిక, సాంఘిక జీవనాన్ని గురించి ఆయన విడమర్చిన తీరు వాటిలో కనిపించే తేడాలను, ఇప్పుడు మనం అంగీకరించడానికి నిరాకరించే అంశాలను వైరుధ్యాలుగా కాకుండా వైవిధ్యంగా అర్థం చేసుకోవడానికి తోడ్పడతాయి. ఇలాంటి ప్రయత్నాలు అవసరమైనంతగా కొనసాగకపోవడం లోపమే.
      గతాన్ని గుర్తుంచుకోని వారు చరిత్రలో జరిగిన పొరపాట్లను పునరావృతం చేస్తుంటారని స్పెయిన్‌ తత్త్వవేత్త జార్జ్‌ సంతాయన అన్నారు. మనం ఆ పొరపాట్లు చేయకుండా ఉండాలంటే ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ వంటి వాటిని చదవాల్సిందే.


వెనక్కి ...

మీ అభిప్రాయం