మంచి మాటలకు మంచి రోజులు

  • 227 Views
  • 0Likes
  • Like
  • Article Share

    పరవస్తు నాగసాయిసూరి

  • హైదరాబాదు.
  • 9700074846
పరవస్తు నాగసాయిసూరి

పక్క రాష్ట్రాల వాళ్లు భాషా... భాషా... అని చచ్చిపోతుంటే.. మీరు తెలుగే చచ్చిపోవాలనుకుంటున్నారు. తెలుగంటే ముక్కీ మూలిగి ముప్ఫై ఐదు మార్కులు తెచ్చుకోవడం కాదురా... అది అమ్మతో మన బాధల్ని, ఆనందాల్ని పంచుకునే వారధి. ‘పిల్ల జమీందార్‌’ చిత్రంలోని ఈ మాటలు తెలుగును తెగులనుకుంటున్న వారికి సూటిగా గుచ్చుకోవూ! తెలుగు చలనచిత్ర సంభాషణల శక్తే ఇంత! నాటి పింగళి నుంచి నేటి త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ వరకూ సినీ రచయితల కలాలన్నింటికీ పదునెక్కువే. మానవ భావోద్వేగాలను, ప్రతిస్పందనలను అవి ప్రభావవంతంగా అక్షరాల్లోకి మార్చేస్తాయి. ఆమధ్య కొంతకాలం పాటు మన సినిమాల్లో వంకర మాటలు వాసికెక్కినా ఇప్పుడు మళ్లీ అర్థవంతమైన అచ్చ తెలుగు పలుకులు వినిపిస్తున్నాయి. ప్రేక్షకుల్లో ఆలోచనలను రేపుతున్నాయి.
      సినిమా అత్యంత బలమైన ప్రసార మాధ్యమం. ఎప్పుడో 83 ఏళ్ల క్రితం... ఓ మూగ సినిమా ప్రారంభమైనప్పుడు అది ఇంతగా అభివృద్ధి సాధిస్తుందనీ, ఇన్ని సాంకేతిక సోపానాలు అధిరోహిస్తుందనీ ఎవరూ ఊహించి ఉండరు. తెరపై బొమ్మలు కదలడం ఓ వింతైతే... అవి మాట్లాడటం మరో మాయాజాలం. హెచ్‌.ఎం.రెడ్డి ‘భక్తప్రహ్లాద’ తెలుగులో తొలి టాకీ సినిమా. బలిజేపల్లి లక్ష్మీకాంతం తొలి సినిమా మాటల రచయిత. లవకుశ, హరిశ్చంద్ర, అనసూయ, మళ్లీపెళ్లి, బాలనాగమ్మ లాంటి చిత్రాలకు మాటలు రాసి... ఈ ప్రక్రియకు ఓ పునాదిని వేసింది ఆయనే. ఆ తర్వాత తాపీ ధర్మారావు ‘మాలపిల’్లకు మాటలు నేర్పారు.
      ఎవరూ పుట్టించకపోతే మాటలెలా పుడతాయి అంటూ తన పద చతురతతో పింగళి తెలుగు సినిమా మాటను కొత్తపుంతలు తొక్కించారు. డింగరీ వంటి ఊతపదాలతో పాటు... అసమదీయులు, తసమదీయులులాంటి పాఠాలనూ చెప్పేశారు. కొత్త కొత్త పదాలు, సరికొత్త పాటలు, ఇంకెన్నో జాతీయాలతో మాటల కోటలు కట్టారు. ఆయన తర్వాత సముద్రాల సైతం జనసామాన్య పదాలతో అద్భుతాలు చేశారు. ఇక సదాశివబ్రహ్మం ‘మాట’ వరుస గురించి చెప్పేదేముంది. అప్పు చేసి పప్పుకూడు, లవకుశ చిత్రాలు చూస్తే చాలు... ఆయన పాండిత్యపు విలువ తెలుస్తుంది. ఆ తర్వాత చక్రపాణి తనదైన శైలితో సంభాషణలకు పదును చేకూర్చితే... డి.వి.నరసరాజు, ఆత్రేయ లాంటి వారు కాలంతో పాటే మాట్లాడారు.
      దిగ్గజ రచయితల తరం ముగిశాక ‘మార్పు’ కొట్టొచ్చినట్లు కనిపించింది. రచయితలే దర్శకులుగా మారారు. దాసరి నారాయణరావు లాంటివారి రాక... సంభాషణల్లో పెద్ద విప్లవాన్నే తీసుకొచ్చింది. మాటలతో సందర్భాన్ని మార్చేయడం దాసరి ప్రత్యేకత అయితే... వాడుక మాటల్నే సినీ సంభాషణలుగా పలికించడం ముళ్లపూడి పద్ధతి. సరిగ్గా ఇదే సమయంలో జంధ్యాల... మాటలతో చక్కిలిగింతలు పెట్టారు. శంకరాభరణం లాంటి చిత్రాలను తక్కువ మాటలతో అందంగా మాలకట్టారు. ఇక  పరుచూరి సోదరులైతే... మాటలతో కోటలూ కట్టారు... పేటలూ మెట్టారు. సినిమా డైలాగ్‌ను అందరి మాటగా తీర్చిదిద్దారు.
      కథానాయకుల ప్రాధాన్యత పెరిగిన తర్వాత మాటలు మరో మలుపు తిరిగాయి. కథానాయకుణ్ని బట్టి మాటలు అల్లే ప్రక్రియ మొదలైంది. ‘దాన వీర శూరకర్ణ’లో ‘ఆచార్య దేవా ఏమంటివి... ఏమంటివి...’ అంటూ కొండవీటి వారు రాసిన మాటలు లోకప్రసిద్ధం. ‘ప్రేమనగర్‌’లో నాగేశ్వరరావు సంభాషణల్లో మరో ప్రత్యేకత ఉంటుంది. ఎస్టేట్‌లోకి ప్రవేశిస్తూ... ‘ఇక్కడ నుంచే మా అధికారం ప్రారంభమౌతుంది... మా అహంకారం విజృంభిస్తుంది’ అంటూ... ఆత్రేయ భూస్వామ్య వ్యవస్థ రూపాన్ని ఆవిష్కరించారు. ‘అల్లూరి సీతారామరాజు’ పలుకులు మన గుండెల్ని ఉప్పొంగిస్తాయి. ‘సకల శాస్త్రాలూ పుట్టిన ఈ వేదభూమికి మీరు నాగరికత నేర్పారా... నా జాతి ప్రజలంతా కలిసి ఒక్కసారి ఉమ్మేస్తే... అందులో మీరంతా కొట్టుకుపోతారు...’ వంటి దేశభక్తి, ఆత్మవిశ్వాసం కలగలిసిన మాటలు త్రిపురనేని మహారథి కలం నుంచి జాలువారాయి. ఇదే సమయంలో ముళ్లపూడి వారి మాటలు మరో రకంగా పేలాయి. ‘సెగట్రీ... ఆకాశంలో ఏదో మర్డర్‌ జరిగినట్టు లేదూ. సూర్యుడు నెత్తురు గడ్డలా లేడూ..’, ‘మడిసన్నాక కాసింత కళాపోసన ఉండాలయ్యా. ఊరికే తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకీ తేడా ఏముంటాది...’ వీటిని మర్చిపోగలమా!
      వర్తమానంలో మాటల తీరు బొత్తిగా మారిపోయింది. ముఖ్యంగా యాక్షన్, ఫ్యాక్షన్‌ సినిమాల పుణ్యమా అని... ఊరొచ్చాను, పీకలు కోస్తాను వంటివి డైలాగులు అయిపోయాయి. ఆ వరుసలో తెలుగు ఆంగ్లం సంకరమై పుట్టిన మాటలు సైతం ప్రేక్షకులు మెచ్చిన భాషగా చలామణి అవుతున్నాయి.
      అయితే, భూమి గుండ్రంగా ఉంటుందన్న విషయం ఎంత వాస్తవమో.. చరిత్ర పునరావృతం అవుతుందన్న మాట అంతే నిజం. ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాల్లోని మాటలు చూస్తుంటే... నాటి సినీ మాటల స్వర్ణయుగం తిరిగొచ్చిందా అనిపిస్తోంది. పిల్లజమీందార్, ఓనమాలు, కృష్ణం వందే జగద్గురుం, దేవస్థానం, మిథునం లాంటి చిత్రాలు ఇందుకు చక్కని ఉదాహరణలు.
      ఎంతో కాలంగా పరిశ్రమలోనే ఉన్న బుర్రా సాయిమాధవ్‌ ‘కృష్ణం వందే జగద్గురుం’తో తన ప్రతిభను చాటిచెప్పారు. ‘బువ్వ లేకపోతే మట్టినడిగితే పెట్టుద్ది. మరి మట్టే లేకపోతే... దోచుకుపోతున్నారు..’ అంటూ గనుల దోపిడీపై అక్షర శరాలు సంధించారు. ‘న్యాయం కంటే అన్యాయం ఓ అక్షరం పెచ్చుగదా.. అదే గెలుస్తుంది’ అని చెబుతూ వ్యవస్థపై కసి పెంచుకున్న వ్యక్తి అంతరంగాన్ని పెల్లుబికించారు. ‘పశువులూ పక్షులూ ఏదోచోట బతికేస్తాయ్‌ బాబు. కానీ మనం మనుషులం. మనమే కాదు... మనముండే చోటూ బతకాలా.. మన తోటోడూ బతకాలా’... మనిషన్న వాడు ఎలా బతకాలో ఇంతకు మించి ఎవరైనా ఏం చెప్పగలరు! అతని మాటల్లో ఎక్కడా ఆంగ్ల పదాలు లేవు. బూతులు అంతకంటే లేవు. కానీ ఈ డైలాగులన్నీ బాగా పేలినవే.
      ‘ఓనమాలు’కు మాటలనందించిన ఖదీర్‌బాబులోనూ ఇదే ప్రత్యేకత కనిపిస్తుంది. ప్రతి మాటా మనసు లోతుల్లో గుచ్చుకుంటుంది. ‘అసలు మనిషి కూడా ఒక పశువేనయ్యా. కాకపోతే జ్ఞానం నేర్చుకుని మనిషయ్యాడు. మానవత్వం మర్చిపోయి పశువౌతున్నాడు..’ అనడంలో ఎంత తాత్వికత ఉంది! ‘మతం అంటేనే మంచి. అది దేవుడి చేతిలో బెత్తం...’ అంటూ మతాన్ని నిర్వచించాడు. అమ్మభాషను మరచిపోతున్న వాళ్లని గురించి చెబుతూ.. ‘పరాయిభాషకి కిరీటం పెట్టడానికి... మాతృభాష శిరస్సు ఖండించడం ఎంత పొరపాట’ని ఆవేదన వ్యక్తం చేస్తారు. ‘పిల్లలు ఏదడిగితే అదివ్వడం కాదమ్మా... వాళ్ల అవసరాన్ని గుర్తించి ఏది కావాలో అదివ్వాలి’ అంటూ బిడ్డల్ని అతిగారాబం చేసే వాళ్లని సున్నితంగా మందలించారు. అంతేనా... పల్లె తల్లి గొప్పతనాన్ని గురించి చెబుతూ... ‘పాలు ప్యాకెట్ల నుంచి వస్తాయని, బియ్యం బస్తాల్లో పండుతాయనీ, కూరగాయలు ఫ్యాక్టరీల్లో తయారవుతాయని నమ్మే హైటెక్‌ పిల్లలకి మన దేశపు మట్టివాసన గురించి, రాలే కన్నీటి బొట్టు విలువ గురించీ తెలియాలంటే... అది పల్లెటూళ్ల నుంచే నేర్పించాలం’టారు. పాఠాల పేరుతో పిల్లల పసితనాన్ని చిదిమేసే కర్కశత్వంపై కలంతో దండెత్తిన ఖదీర్‌... ‘నెమలి పిల్లలు జూలో బతికినటే’్ట అంటూ చక్కని పోలిక పెట్టారు. ఈ మాటల్లోనూ ఎక్కడా అసహజ పదాలు దొర్లలేదు. చక్కగా మనం రోజూ మాట్లాడు కునే పదాలే. మనసును హత్తుకునే మాటలే.
      వీటికంటే ముందు ‘పిల్లజమీందార్‌’ అనే చిత్రం వచ్చింది. అందులో జి.చంద్రశేఖర్‌ రాసిన మాటలు ప్రతి మనసునీ కదిలించాయి. యువతను దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమాలో... అందునా అల్లరిని చూపే సందర్భాల్లోనూ... నవ్వులు పండించే సన్నివేశాల్లోనూ... అచ్చతెలుగుతోనే మాటలు అల్లారు. ‘గెలుపుదేముందిరా... మహా అయితే ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది. ఒక్కసారి ఓడిపోయి చూడు... ప్రపంచం అంటే ఏమిటో పరిచయమౌతుంది’... ఈ మాటలో లోతుని వెతుక్కుంటూ వెళితే... చీకటి వెలుగుల జీవితపు దూర తీరాలను చూసి రావచ్చు. ‘కాలేజీలో గడిపిన జీవితం... కాలం విలువేంటో నేర్పింది. ఇక్కడ గడిపిన కాలం జీవితం ఎంత గొప్పదో చెప్పింది’... కళాశాల జీవితాన్ని ఇంత గొప్పగా ఆవిష్కరించిన మాటలు ఈ మధ్యకాలంలో రాలేదు. ‘సైన్స్‌ కావాలంటే... ఇంటర్నెట్‌లోనూ దొరుకుతుంది. సంస్కారం కావాలంటే మీలాంటి వాళ్ల దగ్గరే దొరుకుతుంది’ అంటూ తెలుగు ఉపాధ్యాయుల ఔన్నత్యాన్ని చక్కటి మాటల్లో చెప్పారు. ఈ సినిమా మొత్తం హాస్యభరితంగానే సాగుతుంది. ఎక్కడా పెడార్థాలు వినిపించవు. బూతులు మాత్రమే నవ్విస్తాయని నమ్మే వారికి పిల్లజమీందార్‌ మాటలు... చెంపపెట్టు.
      అప్పట్లో పెద్ద పెద్ద డైలాగులు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటే... ఇప్పుడు కట్టె, కొట్టె, తెచ్చే లాంటి చిన్న సంభాషణలు జనాల్లోకి దూసుకుపోతున్నాయి. ఇలాంటి మాటలకు ఆదరణ కల్పించిన ఘనత రచయిత, దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌దే. ‘నాకిక్కడ ఏదనిపిస్తే అది మాట్లాడతా... నాకిక్కడ ఏదనిపిస్తే అది చేస్తా’నంటూ ప్రారంభించి ప్రేక్షకుల పైకి ఎన్నో మాటల తూటాలను సంధించారు. ‘లాజిక్‌లు ఎవరూ నమ్మరు... అందరికీ మేజిక్‌లే కావాలి. అందుకే మనకు సైంటిస్ట్‌ల కంటే... బాబాలే ఫేమస్‌’... ‘మనం ఇష్టంగా అనుకునేది అదృష్టం. బలంగా కోరుకునేది భవిష్యత్తు’... ‘భయపడ్డంలోనే పడటం ఉంది. మనం పడొద్దు. ఆశతో ఉన్నవాడు క్యాన్సర్‌ను జయిస్తాడు. ఆశ లేని వాడు అల్సర్‌కే భయపడతాడు’... ఇలాంటి సంభాషణలను త్రివిక్రమ్‌ తప్ప ఎవరు రాయగలరు? అందుకే ఆయన ఉత్తమ మాటల రచయితగా అయిదుసార్లు నంది బహుమతులు గెలుచుకున్నారు.
      ఈ మధ్యకాలంలో వచ్చిన ‘దేవస్థానం’, ‘మిథునం’ వంటి చిత్రాలు మంచి మాటలకు చక్కని నిదర్శనాలుగా నిలిచాయి. ఈ రెండూ పుస్తక రచనల ఆధారంగా తెరకెక్కినవి. రచయితలు దర్శకులుగా మారి రూపొందించినవి. అందుకే ఈ సినిమాల్లోని మాటల్లో అన్ని సాహితీ విలువలు. సునీల్‌ కుమార్‌ రెడ్డి తొలి సినిమా ‘సొంత ఊరు’కు ఎల్బీ శ్రీరాం సంభాషణలు అందించారు. ‘ఊళ్ల కోసం రోడ్లు గానీ, రోడ్ల కోసం ఊళ్లు కాదు...’ లాంటి మాటలు జనంలోకి వెళ్లడమే కాదు... నంది పురస్కారాన్నీ సంపాదించి పెట్టాయి. ఆ తర్వాత వచ్చిన ‘గంగపుత్రులు’ మంచి మాటలతోనే విజయ తీరాలకు చేరుకుంది. ‘ఎందుకమ్మా మమ్మల్ని చూసి జాలిపడతారు. మీ బతుకులు మీకు గొప్పైతే... మా బతుకులు మాకు గొప్ప. మీ కళ్లతో చూసి అనవసరంగా మా బతుకులు చిన్నవి చెయ్యమాక. మా బతుకులు మాకొగ్గెయ్యండి. ఒకప్పుడు మా తాత, అయ్య బానే బతికినారు. మీలాంటోళ్లు మా బతుకులు బాగు చేయాలన్నాకే... మొదలయ్యాయి ఈ కట్టాలు. కరెంటు ఫ్యాక్టరీలు పెట్టి మా బతుకుల్ని సీకటి చేసింది సాలమ్మా’ ఇలాంటి మనసును హత్తుకునే మాటలెన్నో సునీల్‌కుమార్‌ రెడ్డి ఆ చిత్రంలో వినిపిస్తారు.
      చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో చిత్రాలు, ఇంకెన్నో మాటలు... ఈ తరం ప్రేక్షకుల నాణ్యమైన అభిరుచికి, పరిశ్రమలోకి పోటెత్తుతున్న కొత్త ప్రతిభకు నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. తెలుగు సినిమాల్లో తెలుగు చచ్చిపోతోందని బాధ పడాల్సిన అవసరం లేదు. మాతృభాషపై మమకారం ఉన్న రచయితలు ఇలాంటి మరికొన్ని మాటలు రాస్తే చాలు. ఆయా చిత్రాల రూపంలో తెలుగు సజీవమవుతుంది.
      కాలంతో పాటే భాష దిశ, దశలు మార్చుకుంటుందే తప్ప... భావాలు, భావనల్లో పెద్దగా మార్పు రాలేదు. ఎందుకంటే మనిషి... మనిషిగా బతకడానికే విలువనిస్తున్నాడు. ఫలితంగా ఆ తరహా సినిమాలకే కాదు... సంభాషణలకు సైతం వన్నె వస్తోంది. మార్పు అనేది సునామీ కాదు... అమాంతం వచ్చి మీద పడిపోవడానికి. అదో విప్లవం. ‘చినుకు... చినుకు కలిసి చిత్ర కావేరి... చివరికా కావేరి కడలి దేవేరి’ అన్న వేటూరి పలుకుల్లా... మాటల చినుకులు చలనచిత్ర మహాసముద్రంలో కలిసిపోవాల్సిందే. జన హృదయాల్లో అనంత భావాలై నృత్యం చేయాల్సిందే.


వెనక్కి ...

మీ అభిప్రాయం