ఈ గ్రంథం...మానవతా సుగంధం

  • 125 Views
  • 0Likes
  • Like
  • Article Share

    పాలమాకుల శ్రీనివాస్‌

  • హైదరాబాదు.
  • 9394450343
పాలమాకుల శ్రీనివాస్‌

ఇరవై సార్లు ప్రచురణకు వెళ్లిన 849 పుటల బృహత్‌ గ్రంథం గురించి విన్నారా! ఇప్పటి వరకూ దాదాపు లక్షా యాభై వేల ప్రతులు అమ్ముడైన ఆ గ్రంథరాజం... తెలుగులోకి అనువాదమైన అక్షరాల కూర్చు అని తెలిసిన క్షణాన తెలుగు భాషాభిమానుల ఆశ్చర్యానందాలకు అంతుంటుందంటారా!
పొం దికైన
వాడుక తెలుగులో అలరారే విశిష్ట ఆధ్యాత్మిక పొత్తం ‘దివ్య ఖురాన్‌’. తెలుగును అమితంగా అభిమానించే హైదరాబాద్‌ సహకార సంఘ మాజీ ఉద్యోగి హమీదుల్లా షరీఫ్‌ చేతుల మీదుగా మన అమ్మభాషలోకి వచ్చిన అల్లా పవిత్ర వాక్కు ఇది.
      మత గ్రంథాలైనా, వైజ్ఞానిక పుస్తకాలైనా సాధారణ భాషలో అందుబాటులో ఉంటేనే సామాన్య ప్రజల్లోకి చొచ్చుకుపోతాయి.  అక్షరాల్లోని ఆధ్యాత్మిక చింతన, విజ్ఞాన సంపద పాఠకుడి మనసును నేరుగా తాకాలంటే వాడుక భాషకు మించిన ప్రత్యామ్నాయం లేదు. అయితే, మత గ్రంథాల్లో అనువాద స్వేచ్ఛకు పెద్దగా అవకాశం ఉండదు. మూల, లక్ష్యభాషలపై అనువాదకుడి ఉండే పట్టు మాత్రమే పాఠక మనోరంజకమైన రచనకు తొలిమెట్టవుతుంది. ఖురాన్‌ వంటి పవిత్ర గ్రంథ సారాన్ని అర్థం చేసుకోవటానికి ఉపయోగపడుతుంది.
      తెలుగును ప్రేమించి, గౌరవించి, పట్టు సాధించి ఖురాన్‌ను తెలుగులోకి అనువదించారు హమీదుల్లా షరీఫ్‌. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా మునుగోడు. పదో తరగతి వరకూ తెలుగు మాధ్యమంలోనే చదివారు. ఆంగ్లమాధ్యమంలో ఇంటర్మీడియట్, బీఏ, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. హైదరాబాద్‌ సహకార సంఘంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి పదవీవిరమణ చేశారు. సర్వమత సమానత్వాన్ని విశ్వసించే షరీఫ్‌ భగవద్గీతను కూడా ఔపోసన పట్టారు. 
      తేట తెలుగులో చేసిన అక్షరాభ్యాసం, ఉన్నత పాఠశాలలో నేర్చుకున్న తెలుగు... షరీఫ్‌కు అనుకోని అవకాశాన్ని కల్పించింది. కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి, మహావాది వెంకటరత్నం తదితరుల శిష్యరికంలో తెలుగుపై పట్టు సంపాదించుకున్న షరీఫ్‌కు మూడు దశాబ్దాల కిందట ఖురాన్‌ను తెలుగులోకి అనువదించే బాధ్యత అప్పగించింది ‘తెలుగు ఇస్లామిక్‌ పబ్లికేషన్స్‌ ట్రస్ట్‌’.
      తొలి ఖురాన్‌ లిఖితరూపానికి అక్షరాలందించింది అరబ్బీ భాష. కాలక్రమంలో చాలామంది దాన్ని ఉర్దూ, ఆంగ్లం, ఇతర భాషల్లోకి అనువదించారు. ఆ పవిత్ర గ్రంథాన్ని మొదటిసారి తెలుగులోకి తెచ్చిన వ్యక్తి.. మౌలానా అబ్దుల్‌ గఫార్‌ఖాన్‌. కానీ, ఆయన గ్రాంథిక భాషను వినియోగించారు. సామాన్యులకు సులువుగా అర్థమయ్యేలా ఖురాన్‌ను అనువదింపజేయాలని ‘ట్రస్టు’ భావించింది. (తెలుగు అనువాదాల్లో ఇది రెండో ప్రయత్నం) షరీఫ్‌కు అనువాద అవకాశాన్ని కల్పించింది. 
      ఉర్దూ, తెలుగు భాషల్లో చక్కటి నైపుణ్యం ఉన్నా... రచనానుభవం లేకపోవడంతో షరీఫ్‌ కాస్త సంకోచించారు. అలా అని సంస్థ కోరికను కాదనలేకపోయారు. రచనా నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవడానికి తీవ్రంగా సాధన చేస్తూనే 1981లో అనువాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే, ఖురాన్‌ను అనువదించడం, అందులోనూ అందరినీ మెప్పించేలా రచన చేయటమంటే సామాన్య విషయం కాదు. అందుకే, వేరే భాషలకు చెందిన 11 అనువాదాలను అధ్యయనం చేశారు. ఉర్దూ ఖురాన్‌ను మూలంగా తీసుకుని తెలుగు అనువాదానికి నడుం బిగించారు. తొమ్మిదేళ్లకు మహాసంకల్పాన్ని పూర్తి చేశారు. వాడుక భాషలో ‘దివ్యఖురాన్‌’ ఉద్గ్రంథాన్ని తెలుగు ప్రజలకందించారు. 
      ‘పొరుగువాడు ఆకలితో బాధపడుతుంటే కడుపు నిండా అన్నం తినేవారు మనుషులనిపించుకోరు. అలాంటి వారు ప్రార్థన చేసినా లాభం లేదు. సత్కార్యాలు చేయకుండా నమాజు చేసినా ఫలితం ఉండదు. మీ నోటితో, మీ చేతులతో తోటివారికి నష్టం కలిగిస్తే మీరు దైవ భక్తులు కానే కారు. కీడును, అన్యాయాన్ని, అక్రమాన్ని, పాపాల్ని మంచితో పారదోలాలి. దౌర్జన్యం చేసేవార్ని క్షమించు. క్షమాభిక్ష పెట్టమని కరుణామయుడైన అల్లాని ప్రార్థించు’... ఇలా గ్రంథమంతా వాడుక తెలుగులోనే సాగుతోంది. ‘తల్లిదండ్రులను, బంధువులను, అనాథలను, నిరుపేదలను ఆదరించాలి. ప్రజలను సహృదయంతో పలకరించాలి’ అంటూ జీవితానికి నిజమైన అర్థాన్ని వివరిస్తుంది. ‘మానవుల్లోని ఒకడు చెప్పే మాటలు ఇహలోక జీవితంలో నిన్ను ఎంతో రంజింపచేస్తాయి. తన సంకల్పశుద్ధి గురించి తెలపడానికి అతడు అల్లాహ్‌ను మాటిమాటికి సాక్షిగా నిలబెడతాడు. కానీ వాస్తవానికి అతడు సత్యానికి బద్ధవిరోధి. అతడికి అధికారం లభించినప్పుడు లోకంలో కల్లోల వ్యాప్తికి, పంట పొలాల విధ్వంసానికి, మానవ సంతతి వినాశనానికి నిత్యం కృషి చేస్తాడు’ అంటూ మేకవన్నెపులుల మనస్తత్వాలను సూటిగా ఆవిష్కరిస్తుంది. గ్రంథంలో పాదసూచికల ద్వారా ఇచ్చిన సమాచారం... పవిత్ర వాక్కుల్లోని అంతరార్థాలను విడమరచి చెబుతుంది.  
      ఖురాన్‌ లాంటి మహాగ్రంథాన్ని అనువదిస్తున్నప్పుడు అన్వయదోషాలు, పదప్రయోగం, వాక్య నిర్మాణాల్లో లోపాలు లేకుండా చూసుకోవడం అంత తేలికైన విషయం కాదు. ఎంతో శ్రమిస్తే గానీ ఆ లక్ష్యాన్ని పూర్తి చేయలేం. దీని గురించి షరీఫ్‌ని అడిగితే...
      ‘ఖురాన్‌ను అనువదించేందుకు తీవ్రమైన కసరత్తు చేశా. గ్రాంథికం, శిష్ట వ్యావహారికాల్లో ఎవరికీ అర్థం కాదని, వాడుక భాషనే వినియోగించా. ‘‘ప్రభు... నేను నిన్నే ప్రార్థిస్తున్నాను. సహాయం చేయమని అర్థిస్తున్నాను. నన్ను క్షమించి నాకు సరైన మార్గాన్ని చూపించు’’ ఇలా సాధారణ భాషలో అందరికీ అర్థమయ్యేలా అనువదించగలిగా. అనువాదంలో విజయవాడ లయోలా కళాశాల అధ్యాపకులు శనగల నర్సింహస్వామి, నర్సింహమూర్తి, సన్నిహితులు డా।। కృష్ణమూర్తి చాలా సహకరించార’ని చెబుతారు.
      ఈ దివ్య ఖురాన్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ ఇరవై మూడేళ్లలో ఇరవై సార్లు ప్రచురణకు వెళ్లింది. ప్రముఖ పాత్రికేయులు, ప్రెస్‌ అకాడెమీ మాజీ అధ్యక్షులు పొత్తూరి వెంకటేశ్వరరావు ఓ సభలో ప్రసంగిస్తూ ‘షరీఫ్‌ అనువాదం చదివాకే ఖురాన్‌ గొప్పతనమేంటో, ఇస్లాం మతమంటే ఏంటో అర్థమైంద’ని ప్రశంసించారు. ఈ గ్రంథానికి లభిస్తున్న పాఠకాదరణపై ప్రచురణ సంస్థ ఉప సంచాలకులు అబ్దుల్‌ సత్తార్‌ ఏమంటారంటే... ‘సులభశైలిలో, సులభగ్రాహ్యంగా ఉండే రచన ఇది. బోధనల్లోని పరమార్థాలు సగటు పాఠకుడికి బాగా అర్థమవుతాయి. 21వ ప్రచురణకు ఏర్పాట్లు చేస్తున్నాం. దివ్య ఖురాన్‌కు లభిస్తున్న ఆదరణను పరిగణనలోకి తీసుకుని గత అయిదు ప్రచురణల నుంచి పది వేల ప్రతుల చొప్పున ముద్రిస్తున్నాం.’ 
      ‘దివ్య ఖురాన్‌’ 20వ ప్రచురణ జరిగింది 2012 నవంబరులో. పదివేల ప్రతులు అచ్చొత్తారు. ఏడాది తిరగక ముందే అవన్నీ పాఠకులకు చేరిపోయాయంటే గ్రంథం స్థాయిని అర్థం చేసుకోవచ్చు. 
      ఖురాన్‌ అనువాదానికి వచ్చిన స్పందనతో షరీఫ్‌లో ఉత్సాహం ఇనుమడించింది. ‘సహిబ్‌ హారి’గా పిలిచే మహాప్రవక్త ప్రవచనాల సంపుటాలను (తొమ్మిది) తెలుగులోకి తేవడానికి కంకణధారులయ్యారు. ఇప్పటి వరకూ రెండు సంపుటాలను పూర్తి చేశారు.
      ఒకే భావాన్నిచ్చే వివిధ మత గ్రంథాల అంశాలను ఒకచోట చేర్చి అన్ని మతాల అభిమతం ఒక్కటేనని చాటి చెప్పాలని, తద్వారా మతసామరస్యాన్ని పెంపొందింపజేయాలన్నది షరీఫ్‌ సంకల్పం. అందుకే, ఆయన అనువాదాలకే పరిమితం కాలేదు. ఖురాన్‌ సారాన్ని తెలుగులో బోధిస్తూ ‘హిందూ - ముస్లిం’ సోదరభావాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 90 వేదికలపై బోధనలు చేశారు. మధ్యమధ్యలో భగవద్గీత, ఉపనిషత్‌ శ్లోకాలతో సాగే ఆయన ప్రసంగం శ్రోతలను ఆకట్టుకుంటుంది. మతాలకతీతంగా ఆధ్యాత్మిక భావాలను అందుకోవాలని తపించే వారెవరు ఆహ్వానించినా ఆయన వస్తారు. సర్వ మత గ్రంథాల్లోని నీతిసారాన్ని చక్కగా విడమరచి చెబుతారు. షరీఫ్‌ సతీమణి నసీరా బేగంకు కూడా తెలుగు మీద మంచి పట్టుంది. పత్రికల్లో వ్యాసాలు రాస్తుంటారు. 
      కులమతాలకు అతీతంగా ఖురాన్, భగవద్గీత, బైబిల్, గురుగ్రంథ్‌లను ఎవరైనా చదవవచ్చు. అవన్నీ మంచే చెబుతాయి. మానవత్వమే నేర్పుతాయి. సమసమాజ నిర్మాణానికి బాటలు వేస్తాయి. ఇతర మతాల బోధనలను ఆకళింపు చేసుకున్నప్పుడే మనుషుల మధ్య స్నేహ సంబంధాలు మరింత మెరుగుపడతాయి. అందుకు కృషి చేస్తున్నవారందరూ లోకకల్యాణం కోసం తాపత్రయ పడుతున్నవారే. 


వెనక్కి ...

మీ అభిప్రాయం