ఇంటిల్లిపాది కవులే

  • 152 Views
  • 0Likes
  • Like
  • Article Share

    లగడపాటి వెంకట్రావు

  • వినుకొండ, గుంటూరు జిల్లా.
  • 8008573160
లగడపాటి వెంకట్రావు

ఆ కుటుంబానికి అక్షరాలే ఆస్తిపాస్తులు. పద్యాలే నేస్తాలు. వర్గ, వర్ణ విభేదాలను ఖండిస్తూ కలం ఝళిపించిన కవి యోధుడు ఆ ఇంటి పెద్దాయన. ఆయన వారసులుగా కవన రంగంలోకి అడుగుపెట్టిన ముగ్గురు తనయులూ కవితా విశారదులే. నవ సమాజాన్ని స్వప్నిస్తూ తుది శ్వాస విడిచే వరకూ అక్షర పూజ చేసిన అసహాయ శూరులే.
‘సాహిత్యానికి,
సమాజానికి ఉన్న సంబంధం అతి పవిత్రమైంది. ఏ సమాజమైనా తన రూపురేఖలను సాహిత్య దర్పణంలో చూసుకుని సరి చేసుకుంటుంది. కవి కేవలం కల్పనాత్మకమైన, ఒక ప్రత్యేక ప్రపంచానికి వారసుడిగా జీవితానికి దూరంగా నిలవకూడదు. సహృదయుడైన కవి కళ్ల ఎదుట... శతాబ్దాల తరబడి పీడనలకు గురవుతున్న జాతి, బాధపడే బానిస జనాంగమూ ఉంది’ అంటూ తన ‘నవసంధ్య’కు నాందీ ప్రస్తావన చేసిన బీర్నీడి మోషే... జీవిత పర్యంతమూ బాధాతప్త హృదయుల కోసమే రచనలు చేశారు. ‘పెద్దల’ దురాగతాలను పద్యాల రూపంలో ఎండగట్టారు. 
      ‘ఏక రక్త అనుబంధంగా, అవిభక్త కుటుంబంగా ఉండాల్సిన మానవ జాతి ఎన్నో చీలికలుగా విడిపోయింద’ని ఆవేదన వ్యక్తం చేసే మోషే... ఆ చీలికలకు మూల కారకులైన వారిని తన కవితలతో చీల్చి చెండాడారు. ‘ఏక జాతీయమైన సమానత్వం మనకు అలవడే దాకా కులద్వేషపు కార్చిచ్చు మన హృదయాల్లో పరచుకుంటూనే ఉంటుంద’ని చెబుతూ... ఆ అగ్నిని తన అక్షరాలతో ఆర్పడానికి ప్రయత్నించారు. 
      మోషే... గుంటూరు జిల్లా వినుకొండ నివాసి. 1892లో జన్మించారు. పదిహేనో ఏట రచనలకు శ్రీకారం చుట్టారు. ఉపాధ్యాయుడిగా పని చేస్తూ సాహితీ సేవ చేశారు. ‘వసంతకోకిల’, ‘హరిజనాభ్యుదయం’, ‘నవసంధ్య’, ‘పూలగంప చరిత్ర’, ‘ఇస్సాకు వధ’, ‘గురుభక్తి’, ‘ఉత్తర గోగ్రహణం’.... ఆయన రచనల్లో ముఖ్యమైనవి. 
‘నవసంధ్య’లోని ‘చీకటికేక’ పద్యాలు ఆయన కవితా శక్తికి దర్పణాలు. ‘తెనుగు కళ్యాణి కమ్మని కంఠము నుండి/ ప్రవహించు కావ్య నిర్ఝరులలోన-’ అంటూ ప్రారంభమయ్యే ఈ రచన... అంటరానితనాన్ని కడిగిపారేస్తుంది. 
నీ శరీర రక్త నిర్మిత కులముల
గాక వేఱు కాన్పుగాను నేను!
మాకు సోదరుండవా? కావుపొమ్మను
జ్యేష్ఠులకు జవాబు జెప్పవేమి? 

అని ప్రశ్నిస్తుంది. 
      సమానత్వ వ్యతిరేకులపై సమరం. అదీ అక్షరాలా అక్షరాల ఆయుధాలతో. భావ తీవ్రతకు సమానంగా వచ్చిన కవితా శైలి మోషే కవిది. ‘నవసంధ్య’ దీనికి దాఖలా. వర్ణ దురహంకార వ్యతిరేక పోరాటానికి మోషే పద్యాలు అస్త్రాలూ, శస్త్రాలూ తప్ప సాధారణమైనవి కావు. తేట మాటలతో సూటిగా ధాటిగా చెప్పడంలో... మోషే పద్యాలు, జాషువా పద్యాలు కొన్నింటిని ఒక్కచోట చేరిస్తే ఎవరివి ఏవో చెప్పడం కొంచెం కష్టమే!
      మోషే కవి భార్య సంతోషమ్మ. వీరికి ముగ్గురు కుమారులు. కృపావరదానం, ప్రసన్న, విజయదత్తు. పద్య రచనలో వీరు తండ్రికి తగ్గ తనయులు. ముగ్గురూ తెలుగు ఉపాధ్యాయులు కావడం మరో విశేషం. 
సవ్యసాచి 
మోషే కవి పెద్ద కుమారుడు కృపావరదానం కవి మాత్రమే కాదు మంచి మృదంగ విద్వాంసుడు కూడా. ఈయన రచించిన ‘క్రీస్తు మహాప్రభ’ ప్రసిద్ధం. 
ద్వితీయుడు... అద్వితీయుడు
రెండో కుమారుడు ప్రసన్న. 1923లో జన్మించారు. ఆయన కలం నుంచి జాలు వారిన ‘పృథ్వీభాగవతా’నికి పీఠిక రాయడమే కాకుండా కోరి మరీ అంకితం పుచ్చుకున్నారు కవిసమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ. ‘ఎంత బాగా రాశాడండీ... అసలీయన లాగా నేను రాయగలనటండీ’ అంటూ మెచ్చుకున్నారట విశ్వనాథ ‘పృథ్వీభాగవతం’లోని పద్యాలను చదివి! ప్రసన్న... ‘‘తుకార, మధుమాసం, వీరపత్ని, క్రీస్తుపుట్టుక, మేలుకొలుపు, కోతబతుకు, గంగినేని శతకం’’ తదితర రచనలు చేశారు.
నిప్పు కణిక
ఎండిన డొక్కలో పరువులెత్తిన దాకలిమంట-పైన బ్ర
హ్మాండమువంటి నిప్పుల దుమారము రేగిన దెఱ్ఱటెండలో
కొండలపై శిలల్‌ పగుల గొట్టెడి ఓయి శ్రమైక జీవి! నీ
గుండెలలో సెగల్‌ రగులుకొల్పుమొకానొక విప్లవాగ్నిగా!

      బీర్నీడి సోదరుల్లో ఆఖరి వాడైన విజయదత్తు కలం ఇచ్చిన పిలుపు ఇది. ఆయన తన ‘అంతర్వాణి’ రచనలో పేదల వెతలను ప్రభావవంతంగా అక్షరీకరించారు. గుండెను పిండుతూ మానవత్వాన్ని తట్టిలేపే కవితలు ఇందులో కోకొల్లలు. ఛందోబద్ధంగా పద్యాలు చెప్పడంలోనే కాదు.... నిఖార్సైన వచన కవిత్వం రాయడంలోనూ దత్తుది అందెవేసిన చేయే. ‘శాంతి మహా సూక్తం’లోని ఈ నాలుగు పంక్తులను చూడండి.
జీవన బృందావనిలో
ఎపుడూ సుడిగాడుపులే!
చావూ బ్రతుకుల మధ్యన
ఏవేవో ఏడుపులే!

      1934లో జన్మించిన విజయదత్తు పదమూడో ఏటనే పద్య రచన ప్రారంభించారు. సంస్కృత, తెలుగు, హిందీ భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. ఉపాధ్యాయుడిగా ఎక్కువ కాలం నర్సరావుపేటలో పనిచేశారు. ‘అంతర్వాణి’, ‘నక్షత్రమాల’లతోపాటు ఉమర్‌ ఖయ్యూం రుబాయీలను ఆధారంగా చేసుకుని ‘స్వర్గావతరణా’న్ని వెలువరించారు. దురదృష్టవశాత్తూ దత్తు 31 ఏళ్ల వయసులో పరమపదించారు.
మరుగున పడ్డ మాణిక్యాలు
అస్పృశ్యతతో మనిషిని మనిషిగా చూడలేని నాటి కాలంలో అక్షరాలు దిద్దడమే గొప్ప. సాంఘిక అసమానతలను అధిగమించి సరస్వతీ పుత్రుడయ్యారు మోషే. అయితే, ఆయన కుమారులు రాసిన పుస్తకాల్లో అనేకం ముద్రణకు నోచుకోలేదు. ఇటీవల నిర్వహించిన శ్రీకృష్ణదేవరాయల మహోత్సవాల్లో ప్రసన్న కవి కుమారుడు సుబ్బారావును పిలిచి సన్మానించారు. అసమాన సాహితీ సేవ చేసిన బీర్నీడి కుటుంబానికి దక్కిన చిన్న గౌరవమిది. మూడో తరానికి చెందిన సుబ్బారావుకూ సాహిత్యంలో ప్రవేశం ఉంది. చదువుకునే కాలంలో ‘ఆంధ్రభాషావాఙ్మయం’ అనే పుస్తకాన్ని రచించారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల అది ముద్రణకు నోచుకోలేదు. తాత మోషే పద్యాలు పాడుతుంటే విని వాటిలో కొన్నింటిని ఔపోసన పట్టారు. పీయూసీ చదివిన సుబ్బారావు బ్రాహ్మణపల్లెలో బ్రాంచి పోస్టుమాస్టర్‌గా పనిచేశారు. కారణాంతరాల వల్ల ఉద్యోగం మానేశారు. ప్రస్తుతం ఎ.బి.ఎం. చర్చిలో సహాయకుడిగా ఉన్నారు.
      నాడు సాహిత్యంలో బీర్నీడి కుటుంబీకులది ఉన్నత స్థానం. ఏ ఊరు వెళ్లినా అతిథి మర్యాదలు జరిగేవి. పల్నాడు ప్రాంతంలో మోషే కవికి ప్రత్యేక గుర్తింపు ఉండేది. ఇప్పుడు ఓడలు బళ్లయ్యాయి. ప్రస్తుతం ఆ కుటుంబ వారసులను ఆర్థిక ఇబ్బందులు వేధిస్తున్నాయి.  
      బీర్నీడి వారసులను వారి పెద్దల రచనల గురించి అడిగితే... కళ్లలో మెరుపు కనిపిస్తుంది. తాత, తండ్రి నుంచి వారసత్వంగా ఆస్తిపాస్తులు రాకపోయినా... వారందించిన సాహితీ సంపదతో ప్రజల ముందు గౌరవంగా నిలబడుతున్నామన్న ఆత్మ సంతృప్తి దర్శనమిస్తుంది. అముద్రితంగా ఉన్న బీర్నీడి కవుల రచనలను ప్రచురించడానికి ప్రభుత్వం సాయం చేయాలన్నదే వారి కోరిక.


హరికథాగానంలోనూ అగ్రగణ్యుడే
మోషే కవికి సాహిత్యంలో ఎంత పట్టుందో హరికథాగానంలోనూ అంతే ప్రవేశం ఉంది. ఓపిక ఉన్నంతవరకు గ్రామంలో తిరిగి కథలు చెప్పేవారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో నా ఇరవయ్యో యేట ఆయన కథ చెబుతోంటే హార్మోనిస్టుగా పనిచేశా. నాకు భత్యం కింద నిర్వాహకులు రూ.15 ఇచ్చారు. అయితే, హార్మోనియంను చక్కగా వాయించానని తనకు ఇచ్చిన నూటపదహార్లను కూడా మోషే నాకిచ్చేశారు. ఇది నేను మర్చిపోలేని ఘటన. ఆయన చెప్పిన హరికథను వినే ‘యేషేఫు చరిత్ర’ నాటకం రాశా. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా మోషే గారి పెద్ద కుమారుడు కృపావరదానం మృదంగం వదిలే వాడు కాదు. వివిధ కారణాల వల్ల తన సాహిత్యానికి తగిన ఆదరణ దక్కడం లేదన్న బాధ ప్రసన్నలో ఉండేది.  

- యతిశ్రీ, విశ్రాంత ఉపాధ్యాయుడు, వినుకొండ


పండితుడు ప్రసన్న
సంప్రదాయ సాహిత్యాన్ని రాసిన కవి పండితుడు ప్రసన్న. విశ్వనాథ అంటే తనకు మహా ఇష్టం. ‘పృథ్వీభాగవతం’ పీఠిక విశ్వనాథదే.
ఉపాధ్యాయుడిగా పూర్తికాలం చేయకపోవడం వల్ల చివర్లో పింఛను కోసం ఇబ్బంది పడ్డారు. లయోలా హైస్కూల్‌కు వచ్చిన క్రైస్తవ ఫాదర్లకు తెలుగు నేర్పడానికి వచ్చేవారు.

- సీవీ.కృష్ణయ్య, విశ్రాంత తెలుగు ఉపాధ్యాయుడు, వినుకొండ


 


వెనక్కి ...

మీ అభిప్రాయం