సిక్కోలు యాస సితక్కొట్టదేటి!

  • 321 Views
  • 1Likes
  • Like
  • Article Share

    డా।। ఎం.సి.దాస్‌

  • విజయవాడ.
  • 9948656111
డా।। ఎం.సి.దాస్‌

మాటకు శృతిలయలుంటాయి. అలాగే ప్రతీ మాండలికానికి కొన్ని సొగసులుంటాయి. ఒక మాండలికం గొప్ప అనీ, మరో మాండలికం తక్కువ అనీ అనుకోవడం తప్పు. మా సొంతూరు శ్రీ సూర్య నారాయణస్వామి ఆలయమున్న అరసవిల్లి. శ్రీకాకుళం పట్టణానికి ఒక మైలు దూరం. మా ఊరెళ్లినపుడు పలకరింపులే పులకరింప జేస్తాయి. ‘‘ఓహో బాబు! ఎప్పుడు రాక’’ అన్న ఆ పలకరింపులో ఆప్యాయతతో కూడిన సంగీతం ఉంటుంది. కాళీపట్నం రామారావు(కా.రా)మాష్టారు రచనలన్నీ శ్రీకాకుళం మాండలికంలోనే రాశారు. అలాగే గణేశ్‌ పాత్రో చాలా నాటకాల్ని అక్కడి యాసలోనే రాశారు. యాసకి కూడా అందం ఉంది. వినడానికి ఆనందంగా ఉంటుంది.
      ‘‘ఓలమ్మ గుంటడికి బేపొచ్చి బీపంతా బక్రీసిందే’’ బేపి అంటే కుక్క, బీపి అంటే వీపు, బక్రీడమంటే గీరటం. వేపి అన్న పదానికి దేశ్యవిశేష్యంలో కుక్క అని అర్థం. ‘వబయోరభేదః’ (‘వ’కు ‘బ’కు భేదం లేదు) అన్నారు కాబట్టి ‘వే’ బదులుగా ‘బే’ వాడుకలోకి వచ్చింది. పక్కనే ఉన్న ఒడిశా ప్రభావమది.
      ‘‘అమ్మీ మీ పెనిమిటి ఇంటి కాడున్నాడమ్మా’’. భర్తను పెనిమిటి అనడం ఈ ప్రాంతంలో ప్రత్యేకత. బహుశా ఈ పదం పెనుపు+మేటి అనే పదాల సమ్మేళనమై ఉంటుంది. పెనుపు అంటే పెంచువాడు అనే అర్థంలో. ‘‘ఆడికేటా గీర్మానము’’ అనే ప్రయోగం అవతలవాడి పొగరుబోతుతనానికి వాడుతుంటారు. ‘‘గీర్వాణ’’ పదంలో నుంచి పుట్టిందై ఉండాలి.
      ఈ ప్రాంతంలో వింత సంబోధనలు ఉంటాయి ‘‘ఏవండీ బాబు నువ్వెక్కడుం తన్నావిప్పుడు?’’ ఇక్కడ ‘‘నువ్వు’’ అంటే మీరు అని అర్థం. ఇది బహుశా ఆంగ్ల సంప్రదాయమై ఉండాలి. నువ్వన్నా, మీరన్నా ‘‘యు’’ అనే పదం వాడతాం కాబట్టి.
      కారానికి ‘‘వర్ర’’ అని వాడతారు. ఈ పదం పాండురంగ మాహాత్మ్యంలో ‘‘...ఒక గొన్ని ద్రబ్బెడలొక గొన్ని తాలిపులొక కొన్ని విధముల యొఱ్ఱ జారు...’’ అని వర్ణించాడు. అదే విధంగా బహుశా ఆంగ్ల శబ్దంలో నుంచి పుట్టిన పదమేమో! ఆంగ్లంలో ‘‘ఒకమటోపియా’’ అంటారు. శబ్దంలో నుంచి పుట్టిన పదాలను ‘‘క్రొ’’, ‘‘బ్రే’’, ‘‘మ్యూ’’, ‘‘కుకూ’’ మొదలైన పదాలు శబ్ద జనితాలు. వర్రలాగే గర్ర అనే పదమూ వాడుకలో ఉంది. గురజాడ వారు కన్యాశుల్కం నాటకంలో ఈ పదం వాడారు. ‘‘ఆడికేటా గర్ర’’ అంటే వాడికేంటా గర్వమని.
      ఎవరన్నా డాంబికం ప్రదర్శిస్తే వారిని ‘‘నువ్వేటి గయినేరు గుంపువండీ?’’ అంటారు. గయినేరు అన్నపదం ‘‘గవర్నర్‌’’ అనే ఆంగ్ల పదానికి రూపాంతరం. మరి ఈ గుంపు ఎక్కడి నుంచి వచ్చిందో అని పరిశోధిస్తే ‘‘గింఫ్‌’’ అనే ఆంగ్ల దొర ఈ ప్రాంతంలో ఉండే వాడని తెలిసింది. అతణ్ని       ‘‘గవర్నర్‌ గింఫ్‌’’ అనే వారు ఆ వాడుకలో నుంచి పుట్టిందే ఈ ‘‘గయినేరుగుంపు’’. మా ఇంట్లో పనిమనిషిది  శ్రీకాకుళం జిల్లా. ఓ రోజు ‘‘అమ్మగోరూ, మా దేశం వెళ్తాన్నావమ్మా! పదిరోజులు దాకా రావమ్మా’’ అంది. అప్పుడర్థమయింది ‘‘దేశం’’ అంటే సొంతూరని, వాళ్లకి విజయవాడ పరాయి దేశం కింద లెక్క!.
      ‘‘ఏటాడి గోరోజనవు’’ ఏమిటి వాడిగొప్పతనం అనే అర్థంలో వాడతారు. అదే అర్థంలో ‘‘నీలుగు’’ అనే పదం వాడకంలో ఉంది. ‘‘ఏట్రా నీలుగుతున్నావు’’ అని తరచుగా అంటూ ఉంటారు. పోలిక అనే పదానికి ఎక్కువగా ‘‘సాటవ’’ అనే పదం వాడుతుంటారు. ‘‘నక్కకీ నాగలోకానికే’’ అనే సామెత కూడా ఉంది ఈ ప్రాంతంలో!
      ‘‘బాబు అల్లాగుంట గెడ్డలోన పడిపోనాది’’ అంటే కాలువలో ఆ పిల్ల పడిపోయిందని అర్థం ‘‘మా అయ్య గుడ్డికాడ కెల్లినాడు’’ అంటారు. ‘‘గుడ్డి’’ అంటే పొలం అని అర్థం. అలాగే ‘‘మాయమ్మ బుగతోరింటికి పనికెల్లినాది’’ అంటారు. ‘‘బుగత’’ అంటే భూస్వామి. ఈ పదం ‘‘భుక్త’’ అంటే భోజనం పెట్టేవాడు అనే శబ్దంలో నుంచి పుట్టింది. కొన్ని పదాలు ఉచ్చారణను బట్టి అర్థాలు మారుతుంటాయి. ‘‘అలాగే’’ అనే పదానికి అనేక అర్థాలున్నాయి. మంద్రస్థాయిలో అంటే ‘‘తప్పకుండా’’ అనీ, మధ్యమ స్థాయిలో అంటే ‘‘చూసుకుందాం’’ అనే ధోరణి, తారాస్థాయిలో అంటే ‘‘నువ్వేం చేసుకుంటావో చేసుకో’’ అనే భావం స్ఫురిస్తాయి.
      గురజాడ వారు కన్యాశుల్కంలో వెంకమ్మచేత ‘‘మీరెప్పుడు ఓగాయిత్తం మాటలే అంచూవుంచారు’’ అని అనిపిస్తారు. ‘‘అఘాయిత్యం’’ అనే పదానికి రూపాంతరం ‘‘ఓగాయిత్తం’’ అలాగే ‘‘ఊష్టం’’, ‘‘ఉడుకు’’అనే పదాలు కూడా ఈ ప్రాంతానివే. ‘‘ఉష్టం’’లో నుంచి వచ్చిన ఈ పదానికి జ్వరం అని అర్థం. అలాగే ‘‘వేడి’’ అనే శబ్దానికి ‘‘ఉడుకు’’ అని వాడతారు. ‘‘సలేస్తంది కదా ఉడుకునీలు పోసుకో బాబూ’’ అంటారు చలికాలంలో! అడ్డగోలుగా ప్రవర్తించే వాళ్లని ‘‘ఆడికేటా ఒల్లుపోత్రం’’ అని అంటారు. ముక్కుసూటిగా అనడానికి ‘‘ఖరాఖండీ’’ అనే శబ్దం వాడతారు. ప్రతీ మాండలికానికి ఆయా ప్రాంతాల సంప్రదాయాలు, పాలకులు, సరిహద్దులు మొదలైన వాటి ప్రభావాలు ఉంటాయి. మాండలికాన్ని ఆనందించాలి గాని దోషాలు వెతకడానికి ప్రయత్నం చెయ్యకూడదు.
      కొన్ని సంస్కృత పదాలు దేశ్యవిశేష్యాలై ఈ మాండలికం లోనికి చొచ్చుకు వచ్చాయి. ‘‘ఆడు ఇదమూ పదమూ లేని మనిసిరా’’ అని వాడుతుంటారు. ‘‘విధము’’, ‘‘పథమూ’’ అనే సంస్కృత పదాలు ఇలా రూపాంతరం చెంది ఉండాలి.
      ‘‘ఆడితోనేటిరా నీకు, ఉల్లీ కాడూ వసాకాడూ’’ దేనికీ పనికిరాని వాణ్నీ ఇలా అంటూ ఉంటారు. అంటే అసలు విలువలేని వాడు అని అర్థం. ‘‘చితక్కొట్టీసాడు’’ అనే పదం పలు అర్థాల్లో వాడుతూ ఉంటారు. ఒక్కొక్క శృతిలో ఒక్కొక్క భావం స్ఫురిస్తుంది.
      ఆశ్చర్యార్థకంలో వాడితే ‘‘బ్రహ్మాండంగా ఉంది’’ అనీ, విసుగ్గా అంటే ‘‘బోరు’’ కొట్టేశాడని అర్థం. ఆహారం విషయంలో కూడా కొన్ని అందమైన పదాలున్నాయి. ‘‘బాబూ పకాలి తిన్నావా’’ అంటే చద్దన్నం తిన్నావా అని అర్థం. బహుశా ప్రాతః కాలంలో తినే ఆహారం కాబట్టి ఆ శబ్దం వచ్చి ఉంటుంది. పూర్వం తెల్లవారు ఝామున పకాలి తిని ఉడుపులకీ, కోతలకీ పొలాలకు బయలు దేరేవారు. అలాగే పొలం నుంచి వచ్చిన తర్వాత సాయంత్రం తినే ఆహారాన్ని ‘‘అలబొద్దు’’ అంటారు. ఆలమందల పొద్దు అంటే పశువులు ఇంటికి తిరిగొచ్చే వేళ నుంచి ఉత్పన్నమైన పదం. ‘‘తొంగో’’ అంటే నిద్రపో అని అర్థం. తూంగో అనే తమిళ పదంలోంచి ఈ పదం పుట్టిందా లేక ఈ పదమే అక్కడికెళ్లి తూంగో అయిందా అన్నది మీమాంస! అలాగే ‘‘కుట్టి’’ అనే మళయాళ పదానికి సమంగా ‘‘కుట్టె’’ అనే పదం ఈ ప్రాంతంలో వాడుకలో ఉంది. ‘‘వెర్రి కుట్టె’’ అనే పదం గురజాడ వాడారు. ‘‘రాముని విరిశరముల బారికి నేనేమని సహింతునే, చెలీ ఏమని సహింతునే! వీడి తస్సాగొయ్యా. వీడి బాణాలు పువ్వులుటోయి. ఆ మాట ఎవడు నమ్ముతాడు. వెర్రి కుట్టె ఎవడయినా నమ్మాలిగాని’’ మళయాళ కుట్టి ఆడపిల్లయితే శ్రీకాకుళం కుట్టె మగ పిల్లాడు ‘‘అయ్య’’, ‘‘అమ్మ’’ అన్నవి ఎంత సున్నితమైన పదాలు. తెలుగు ‘‘అయ్య’’ మళయాళీ ‘‘అయ్యన్‌’’ దగ్గరగా ఉంటాయి.
      ‘‘ఏవలగ’’ అనే పదాన్ని గమ్మత్తుగా వాడుతుంటారు. సంకోచంగా పలికితే ‘‘నిజమా’’ అని స్ఫురిస్తే, కోపంగా అంటే ‘‘ఎందుకలా చేశాడు’’ అనే అర్థాన్నిస్తుంది. ‘‘ఏటీడి గోతాలు’’. ‘‘కోతలు’’ అనే పదానికి వికృతి గోతాలు. అయితే గోనె సంచిని కూడా ‘‘గోతాం’’ అని వాడతారు. శ్రీకాకుళం మాండలికాన్ని పరిశోధిస్తుంటే ఒక నిఘంటువుకి సరిపోయినన్ని పదాలు దొరుకుతాయి. అలాగే ప్రతి మాండలికం లోనూ ఒక నిఘంటువు తయారు చెయ్యవచ్చు. తెలుగు భాషలో ఉన్నన్ని మాండలికాలు మరే భాషలోనూ లేవంటే అతిశయోక్తి కాదేమో? ఒకే లిపితో అనేక భాషలున్నాయి గానీ, ఒకే లిపి ఉన్న ఒకే భాషలో ఇన్ని మాండలికాలు ఉండటం అరుదు. అన్ని మాండలికాల్లోని పదాలన్నీ తీసుకుని మన తెలుగు నిఘంటువు తయారు చేస్తే ప్రపంచభాషల్లో ఏ భాషలోనూ లేనన్ని పదాలు తెలుగు భాషలో ఉంటాయి.


వెనక్కి ...

మీ అభిప్రాయం