పదమదే అర్థం వేరే

  • 329 Views
  • 2Likes
  • Like
  • Article Share

    అయ్యగారి శ్రీనివాసరావు

  • విజయనగరం
  • 9440108820
అయ్యగారి శ్రీనివాసరావు

మార్పు చెందడం ప్రకృతి సహజం. కాలగమనంలో ఎన్నెన్నో ఎన్నో రకాలుగా మార్పులకు గురవుతూనే ఉన్నాయి. కొత్తవి ఉద్భవిస్తూనే ఉన్నాయి. దీనినే ‘పరిణామక్రమం’ అంటారు. ఇది భాషకూ వర్తిస్తుంది. ఒకనాడు ఒక అర్థంలో వాడిన మాట ఈనాడు మరొక అర్థంలో వాడుక జరుగుతోంది. దీనినే అర్థ ‘విపరిణామం’ అంటారు. దాని వెనుక ఏదో ఒక కథగానీ, లేదా విశేషం, సంఘటన ల్లాంటివి ఉండటం ‘అర్థవిపరిమాణం’ ప్రత్యేకత. అలాంటి పదాలు తెలుగు భాషలో చాలా ఉన్నాయి. మచ్చుకి కొన్ని పరిశీలిస్తే, అవి ఏర్పడిన తీరు తెలుస్తుంది.
భజనపరులు
తాళ, లయ, వాద్య సహకారాలతో గానాన్ని మేళవించి, సామూహికంగా భగవంతుడిని కీర్తించడాన్ని ‘భజన’ అంటారు. అందులో భక్తి ప్రధానం. కానీ మానవ మాత్రుడిని స్వలాభాపేక్షతో అదే పనిగా పొగుడుతూంటే దానిని భజన చేయడం అని, అలా చేసే వారిని భజనపరులనడం ఆనవాయితీ.
తిరుక్షవరం, నిలువుదోపిడీ
క్షవరం అంటే జుత్తుని కత్తిరించుకుని సరిచేసుకునే ప్రక్రియ. కానీ భగవంతుని సన్నిధిలో అయితే జుట్టుని మూలాల నుంచే తీసివేసి తలని నున్నగా చేసేస్తారు. దీనిని శ్రీ(తిరు)క్షవరం అంటారు. అలాగే దుస్తుల ఆచ్ఛాదన తప్ప శరీరంమీద ఉన్నఅన్నింటినీ (తల నుంచీ కాళ్ల వరకూ నిలువునా) భగవంతునికి సమర్పించడాన్ని ‘నిలువు దోపిడీ’ అంటారు. ఈ రెండూ స్వచ్ఛందంగా చేసే పనులు. ఆ రెండు పదాలనీ ‘ఏమీ మిగుల్చుకోలేదు, సర్వం కోల్పోయాడు’ అనే అర్థాలతో వాడుతున్నాం నేడు.
ధ్వజమెత్తడం
‘తగువులాటకి దిగడం’ లాంటి అర్థంలోనే నేడు వాడుతున్నాం. దీనికి మూలం రాజరిక వ్యవస్థ. ఏ రాజైనా ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేయాలనుకుంటే ముందుగా తన రాజ్యపు చిహ్నమైన ధ్వజం (జెండాని) రథం మీద ఉంచి మిగిలిన సన్నాహాలు చేస్తాడు. అలా జెండాని నిలిపాడంటే యుద్ధానికి సిద్ధం అనే అర్థం. అలా వాడుకలోకి వచ్చిందీ పదం.
జెండా ఎత్తేయడం
‘పూర్తయిపోయింది’ అనే అర్థంలో వాడే పదం ఇది. ఏదైనా రాచకార్యం పూర్తయ్యాక దాని సూచనగా ముందుగా రాజధ్వజాన్ని (జెండాని) ఒక్కసారిగా పైకెత్తి దించేసే వారు. ఆ పని అక్కడితో పూర్తయిందని అర్థం. అదే అర్థంలో వాడేదీ పదం.
నడుం కట్టడం, కొంగు బిగించడం
ఏదైనా పని మొదలు పెట్టడం అనే అర్థంలో వాడుతున్నాం. వీటికి మూలం రైతు పొలం పనికి దిగేటప్పుడు తన తలపాగాని విప్పి నడుముకి కట్టి బిగించి ఆ పనికి పూనుకుంటాడు. ఆడవారైతే ఏ పనైనా చేసేందుకు సంసిద్ధులయ్యేటప్పుడు పయ్యెద (పైట) సవరించుకుని దాని కొసని బొడ్డు దగ్గర కట్టులోపలికి బిగించి సంసిద్ధులౌతారు. ఆ రకంగా వాడుకలోకి వచ్చిన పదాలివి.
జావగారి పోవడం
నూకలు, సగ్గుబియ్యం లాంటి వాటితో తయారయ్యే ఒక వంటకం జావ. ఇది స్థిరంగా ఉండదు. అలాగని పూర్తి ద్రవపదార్థమూ కాదు. అలాగే అస్థిరంగా ఉండే స్థితిని ‘జావగారిపోవడం’ అంటారు.
నీళ్లు నమలడం
అతి సులువుగా గొంతులోకి దిగే నీటిని సైతం నమలడం అంటే అంతకంటే అసమర్థత ఉండదు. అలా ఏ పనికైనా అసమర్థత ప్రదర్శిస్తే ఈ పదం వాడుతారు.
టెంక పాతడం
‘చనిపోవడం’ అనే అర్థంలో వాడుతారు. దీనికి మూలం పరిశీలిస్తే, తాటి మొక్కలను పెంచాలనుకునే వారు స్వయంగా విత్తు (టెంక)ని పాతిపెట్టరు. అలా చేస్తే తప్పక మరణిస్తారనే నమ్మకం ప్రజల్లో ఉంది. అందుకే తప్పనిసరై వరుసలో మొక్కలు మొలిపించాలంటే బాగా వయస్సు మళ్లిన, లేదా మరణించడానికి సిద్ధంగా ఉన్న వారి చేతనే ఆ పని చేయిస్తారు. అలా టెంకలు పాతితే ఇక అతడు మరణాన్ని ఆహ్వానించినట్టే లెక్క. అలా వాడుకలోకి వచ్చిందీ పదం.
తోక ముడవటం
కుక్కల ప్రవర్తన ఆధారంగా ఏర్పడింది. తగువులాటలో ఉన్న కుక్క ఎదుటి వాటిని ఎదిరించే శక్తి లేకపోతే తన తోకని వెనుకనున్న రెండు కాళ్ల మధ్యకి ముడిచి కూర్చుండిపోతుంది. అలాగే ఎవరినైనా ఎదురించలేని వారు, ఎదుటి వారితో చాల్లేని వారని ఈ పదభావం.
స్వాహా చేయడం
‘స్వాహా’ అనేది నివేదనలో వాడే పదం. స్వాహా అగ్ని దేవుని భార్య. ఆ పదం పలుకుతూ ప్రసాదాన్ని సమర్పిస్తే భగవంతుడు స్వీకరించి తింటాడని నమ్మకం. భగవంతుడు తినడం మాట ఎలా ఉన్నా దేనినైనా తినేశాడు (ఆక్రమించుకున్నాడు) అనే అర్థంలో దీన్ని వాడుతాం.
ఎగనామం పెట్టడం
ఎగవేయడం, ఇవ్వడం మానేయడం అనే అర్థాల్లో వాడుతున్నాం. దీని మూలం పరిశీలిస్తే నుదుటిన నామం (నిలువుబొట్టు) పెట్టేటప్పుడు మొదలు దళసరిగా ఉండి, చివరికి చేరే సరికి సన్నబడి చేతిలో ఉన్నదంతా (కుంకుమ, లేదా తిలకం) అయిపోతుంది. కాబట్టి ఇంక ఏమీ ఉండదు. అందుకు మరి బొట్టుపెట్టడం అవదు. అలా వాడుకలోకొచ్చింది.

 

 

చతుర్ముఖ పారాయణం
బ్రహ్మ నాలుగు ముఖాల నుంచి వెలువడిన నాలుగు వేదాలని వల్లె వేయడం అని అసలు అర్థం. కానీ లోక సామాన్యంలో నాలుగు గుర్తులు (డైమండ్, ఆఠీన్, కళావర్, ఇస్పేట్‌) గల పేక ముక్కలతో ఆటాడుకోవడం అనే అర్థంలో స్థిరపడిపోయింది.
కన్నుమూయు
మరణించే అనే అర్థంలో వాడుతున్నాం. నిద్రించిన ప్రతిసారీ కనులు మూసుకున్నా తిరిగి మేల్కొనేటప్పుడు కన్నులు తెరుస్తాం. అలా కాకుండా తెరవకుండా శాశ్వతంగా కళ్లు మూసేది మరణించేటప్పుడే. అందుకే ఇలా.
మఖ్ఖీకి మఖ్ఖీ
యథాతథంగా అనే అర్థంలో వాడతున్నాం. అసలు పదం మక్షికానికి మక్షికం అని. పూర్వం ఒక ప్రతికి నకలుగా మరొక ప్రతిని యథాతథంగా రాయమంటే పత్రాల మధ్య ఎప్పుడో నలిగి చచ్చిన ఈగ స్థానంలో మరొక ఈగని చంపి అక్కడ ఉంచాడట ఒక శిష్యుడు. అంత నిబద్ధతతో ఉండేది ఆనాటి శిష్యుల పనితీరు. అలా వాడుకలోకి వచ్చిందీ పదం. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక జాతీయాలు, వాటి వెనుక కథలు, సంఘటనలు తెలుస్తాయి. అలా తెలిసే మరి కొన్నిటిని టూకీగా పరిశీలిద్దాం.
      ఇవే కాకుండా అనేక పదాలు, వాటికి ఉన్న అర్థం ఒకటైతే, వేరే అర్థంలో వాడటం జరుగుతుంది. ఆ పదానికి, ఉపయోగించే సంఘటనకి మధ్య ఉన్న పోలిక, దగ్గరితనం వల్ల అలా జరుగుతుంది. అలా ప్రయోగించే పదాలకి అసలు అర్థాలు కాస్త ఆలోచిస్తే అవగతం అవుతాయి. విషయం సూటిగా చెప్పకుండా కాస్త కల్పన, అందం, భావుకత, విశ్లేషణ జోడిస్తే భాష అందాన్ని సంతరించుకుంటుంది. అలా వచ్చిన అందాల్లో ఈ రకమైన అందం ఒకటి.


వెనక్కి ...

మీ అభిప్రాయం