సలక్షణ శిక్షణ ఇలా ఉండాలి

  • 207 Views
  • 0Likes
  • Like
  • Article Share

    గోరంట్ల శ్రీనివాసరావు

  • నెల్లూరు
  • 9441767909
గోరంట్ల శ్రీనివాసరావు

విద్యారంగంలో ప్రాథమిక విద్య విద్యార్థికి పునాది వంటిది. ప్రాథమిక విద్యను బోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వితీయశ్రేణి (ఎస్జీటీ) ఉపాధ్యాయులను  నియమిస్తుంది. ద్వితీయ శ్రేణి ఉపాధ్యాయుల నియామకానికి ఉపాధ్యాయ శిక్షణగా పత్రం (టీటీసీ) అర్హత తప్పనిసరి.
      ఉపాధ్యాయ శిక్షణ పత్రం (టీటీసీ) ప్రవేశ పరీక్షలో 100 ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 100 మార్కులుంటాయి. ఇందులో తెలుగుకు 20 మార్కులుంటాయి. 8, 9, 10 తరగతుల తెలుగు పాఠ్య పుస్తకాల్లోని సాహిత్యాంశాలు, వ్యాకరణాంశాల మీద 20 ప్రశ్నలు ఉంటాయి. కనుక సాహిత్యాంశాలతోపాటు, వ్యాకరణాంశాలను కూడా ప్రణాళికాబద్ధంగా అధ్యయనం చేస్తే తెలుగులో మంచి మార్కులు సాధించవచ్చు. ఈ మార్కులు ఉపాధ్యాయ శిక్షణ పత్రం ప్రవేశంలో అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
      గత ప్రశ్నపత్రాలను విశ్లేషించి చూసినప్పుడు వ్యాకరణాంశాల ప్రాధాన్యం గమనించవచ్చు. వ్యాకరణాంశాలకు సంబంధించి ముఖ్యంగా ఆరు విభాగాలున్నాయి.
1. సంధులు 2. సమాసాలు 3. ఛందస్సు 4. అలంకారాలు      5. వాక్యాలు 6. ఇతరాలు
      ఈ విభాగాలను ప్రణాళికాబద్ధంగా, క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి.
      గత ఆరు సంవత్సరాల ప్రశ్నపత్రాల్లో వ్యాకరణాంశాలకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని పరిశీలిద్దాం.    
     అంశాలు    2007    2008    2009    2010    2011    2012
     సంధులు    1    1    1    1    2    2
    సమాసం    1    1    1    1    1    2
    ఛందస్సు    2    -    1    2    1    2
    అలంకారం    2    1    1    -    -    1
    వాక్యాలు    1    3    1    3    2    3
    ఇతరాలు    4    5    1    2    2    6
 సంధులు
ఈ విభాగంలో ప్రధానంగా సంస్కృత, తెలుగు సంధులను అధ్యయనం చేయాలి. సంస్కృత సంధుల్లో సవర్ణదీర్ఘసంధి, గుణ సంధి, వృద్ధిసంధి, యణాదేశసంధి, విసర్గసంధి, తెలుగు సంధుల్లో అత్వ, ఇత్వ, ఉత్వ, ఆమ్రేడిత సంధులను, సరళాదేశ, పుంప్వాదేశ, గసడదవాదేశ, ద్విరుక్తటకారాదేశ వంటి ఆదేశ సంధులను, నుగాగమ, రుగాగమ, దుగాగమ, టుగాగమ వంటి ఆగమ సంధులను, త్రిక, పాత్రాది, పడ్వాది సంధులను అధ్యయనం చేయాలి. ఈ విభాగంలో ప్రశ్నల స్థాయి కొంత కాఠిన్యతతో ఉండటానికి అవకాశం ఉంటుందని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి.
      ఈ విభాగంలోని ప్రశ్నల తీరు, స్థాయిలెలా ఉంటాయంటే...
‘చేయునెడ’ పదరూపం    (ఇ)
 అ. చేయు+నెడ        ఆ. చేయున్‌+ఎడ 
 ఇ. చేయు+ఎడ        ఈ. చేయును+ఎడ
విశ్లేషణ: ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గుర్తించాలంటే సంధులపై పూర్తి అవగాహన ఉండాలి. ‘ఉ’కారం చివరగా ఉన్న తద్ధర్మార్థక పదం మొదటి పదంగా ఉండి రెండో పదం మొదట అచ్చు ఉంటే ‘౯’ ఆగమంగా వస్తుంది.
* తద్ధర్మార్థకం అనగా క్రియమూల రూపం
  ఉదా: చేయు, ఉండు, పలుకు మొదలగునవి. 
  ఈ విభాగంలో సవర్ణదీర్ఘసంధి, గుణసంధి, నుగాగమ సంధి, ప్రాతాది సంధులను గురించి పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలి.
 సమాసాలు
ఈ విభాగంలో ఉత్తర పదం అర్థం ప్రధానంగా గల తత్పురుష సమాసాలు, పూర్వపదం అర్థం ప్రధానంగా గల అవ్యయీభావ సమాసం, రెండు పదాల అర్థం ప్రధానంగా గల ద్వంద్వ సమాసం, అన్యపదం అర్థం ప్రధానంగా గల బహువ్రీహి సమాసం, సంఖ్యావాచకం మొదటి పదంగా గల ద్విగు సమాసం, విశేషణ, విశేష్యాలతో కాని, ఉపమాన ఉపమేయాలతో గానీ ఏర్పడే కర్మధారయ సమాసాలను ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయాలి.
ఇందులో ప్రశ్నలు అడిగిన తీరును చూస్తే...
* ‘హృద్యోదాత్తము’ ఈ కర్మధారయానికి ఉదాహరణ   (ఇ)
అ. ఉపమాన ఉత్తరపదం       ఆ. ఉపమాన పూర్వపదం        
ఇ. విశేషణోభయ పదం       ఈ. విశేషణోత్తర పదం
విశ్లేషణ: ఉపమానం, ఉపమేయం, విశేషణం, విశేష్యములపై అవగాహన ఉంటే తప్ప సమాధానం గుర్తించలేం. ‘హృద్యోదాత్తము’లో హృద్యం, ‘ఉదాత్తము’ అనే రెండు విశేషణాలు (గుణాలు) అని గుర్తిస్తేనే సరైన సమాధానం గుర్తించగలం.
ఛందస్సు
పద్య లక్షణాలను తెలుసుకోవడానికి ఛందస్సు ఉపయోగ పడుతుంది. ఈ విభాగంలో ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేభం అనువృత్తాలను, ద్విపద, కందం అనుజాతులను, తేటగీతి, ఆటవెలది, సీసం అనే ఉపజాతులను, మాత్రాగణబద్ధమైన ముత్యాల సరాలకు సంబంధించిన లక్షణాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఇందులో అడిగే ప్రశ్నలిలా ఉంటాయి.
* ‘ఆమందాకిని యా త్రివేణి వలనంబాబాహ్య కక్ష్యాస్థలం’ అన్న పద్యపాదం   (ఆ)
 అ. మత్తేభం  ఆ. శార్దూలం   ఇ. స్రగ్ధర   ఈ. మత్తకోకిల
* ప్రతి పాదంలోనూ వరుసగా ఒక సూర్యగణం, రెండు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు కలిగిన పద్యం    (ఇ)
 అ. కందం   ఆ. సీసం     ఇ. తేటగీతి   ఈ. ఆటవెలది
విశ్లేషణ: వృత్తపద్యాలకు గురులఘువులు గుర్తించి గణవిభజన చేయడం, ఈ విభాగంలో లోతైన అధ్యయనం చేస్తే సమాధానాలను గుర్తించడం సులభమవుతుంది.
 అలంకారాలు
కావ్యకన్యకు అందాన్ని కలుగజేసేవి అలంకారాలు. శబ్దాలంకారాల్లో వృత్యనుప్రాస, ఛేకానుప్రాస, లాటానుప్రాస, యమకాలంకారాలను, అర్థాలంకారాల్లో ఉపమ, ఉత్ప్రేక్ష, రూపక, అర్థాంతరన్యాస, శ్లేష, స్వభావోక్తి, అతిశయోక్తి, వ్యాజస్తుతి అలంకారాలను సమగ్రంగా అధ్యయనం చేయాలి. ఈ విభాగంలో ప్రశ్నలు అడుగుతున్న తీరుని గమనిద్దాం.
* ఓ కృష్ణా! నీ కీర్తి హంసలాగా ఆకాశగంగలో మునుగుతూ ఉంది’ అనే వాక్యంలోని ఉపమేయం    (ఇ)
 అ. హంస     ఆ. ఆకాశగంగ    ఇ. కీర్తి    ఈ. కృష్ణా
విశ్లేషణ: అలంకార లక్షణాలను, ఉపమానం, ఉపమేయాలను గురించి అభ్యర్థి అధ్యయనం చేస్తే సమాధానాన్ని ఎలా గుర్తించాలన్నది స్పష్టమవుతుంది.
 వాక్యాలు: 
ఈ విభాగంలో సమాపకక్రియ, అసమాపక క్రియ, నామాఖ్యానం (క్రియారహిత వాక్యం), క్రియాఖ్యానం (క్రియాసహిత వాక్యం), సామాన్య వాక్యం, సంయుక్త వాక్యం, సంశ్లిష్టవాక్యం, చేదర్థక, హేత్వర్థక, శత్రర్థక, అప్యర్థక, తద్ధర్మార్థక వాక్యాలు, అనుకృతి వ్యాక్యాలు (ప్రత్యక్షానుకృతి, పరోక్షానుకృతి), కర్తరి, కర్మణి వాక్యాలను, నామ్నీకరణ వాక్యాలను గురించి సమగ్ర అధ్యయనం చేయాలి. ఈ విభాగం నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి జాగ్రత్త సుమా! ఈ విభాగంలో ప్రశ్నలు మచ్చుకి
* ‘రేత్రి నా కూతురు పట్టెడన్నం పెట్టింది’ అనే వాక్యంలో క్రియావిశేషణం (ఇ) 
  అ. నా       ఆ. కూతురు      ఇ. రేత్రి        ఈ. అన్నం
* తెలుగు రచనల్లో అన్యభాషల ప్రభావం వల్ల అక్కడక్కడా కనిపించేది  (అ)
  అ. క్రియాపదానికి ‘బడు’ చేరడం 
  ఆ. విశేషణానికి అవ్యయం చేరడం 
  ఇ. నామవాచకానికి ‘బడు’ చేయడం   
  ఈ. అవ్యయం లోపించడం
విశ్లేషణ: భాషాభాగాలు, తెలుగుకు సహజమైన వాక్యాలు, ఇతర భాషల ప్రభావం చేత తెలుగులోకి వచ్చి చేరిన వాక్యాలేవి అనే విషయాలను అధ్యయనం చేస్తే ప్రశ్నలకు సరైన సమాధానం గుర్తించవచ్చు.
 ఇతరాలు
ఈ విభాగంలో పాఠ్యాంశాలకు అనుబంధంగా ఉండే అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు, వ్యుత్పత్యర్థాలు, ప్రకృతి-వికృతులు, ప్రామాణిక భాషారూపాలను సమగ్రంగా అధ్యయనం చేయాలి. ఈ విభాగం నుంచి కూడా ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. ఈ విభాగంలో అడుగుతున్న ప్రశ్నలపై వైవిధ్యాన్ని గమనిద్దాం.
* ‘సంపుతాది’ అనే పదానికి ప్రామాణిక ప్రయోగం (అ)
  అ. చంపుతుంది ఆ.సంపుతోంది ఇ. సంపుతుంది ఈ. చంపింది
* ‘కేదారం’ అను పదానికి వ్యుత్పత్యర్థం          (ఈ)
అ. కేదార్‌నాథ్‌ అనే జ్యోతిర్లింగక్షేత్రం    
ఆ. కేతనాన్ని దారంతో ఎగరేస్తారు కనుక కేదారం
ఇ. కేలు అంటే చేతితో దారం తీస్తారు కాబట్టి కేదారం
ఈ. ఇక్కడ నీళ్లు పెట్టి దున్నుతారు కావున కేదారం
* ‘షోడశోపచారాలు’ అంటే              (ఆ)
అ. ఇరవై ఆరు రకాల సేవలు  ఆ. పదహారు రకాల సేవలు
ఇ. ఆరు రకాల సేవలు      ఈ. అరవై రకాల సేవలు
 ఉపయుక్త గ్రంథాలు
* చిన్నయసూరి బాలవ్యాకరణం (సంధి సమాస పరిచ్ఛేదాలు)
* చేకూరి రామారావు - తెలుగు వాక్యం
* 8, 9, 10 తరగతుల తెలుగు పాఠ్య పుస్తకాలు
ప్రధానంగా పాఠ్య పుస్తకాలను ఆధారంగా చేసుకొని వ్యాకరణాంశాలను సమగ్రంగా, విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేస్తే మంచి మార్కులు మీ సొంతం అవుతాయి.


వెనక్కి ...

మీ అభిప్రాయం