మన చరిత్రకు ‘కావలి’

  • 166 Views
  • 3Likes
  • Like
  • Article Share

    వెలగా వెంకటప్పయ్య

  • విశ్రాంత గ్రంథాలయాధికారి,
  • ఐతానగరం, తెనాలి.
  • 9490449555
వెలగా వెంకటప్పయ్య

ప్రభువెక్కిన పల్లకి కాదోయ్‌... అది మోసిన బోయీ లెవ్వరని ప్రశ్నించాడు మహాకవి శ్రీశ్రీ. అట్టడుగున పడి కాన్పించని కథలన్నీ కావాలిపుడని ఆకాంక్షించాడు. అలాంటి కథే ఇది. ముగ్గురు తెలుగు సోదరులు ఇందులో కథానాయకులు. తమ మేథస్సు, పరిశోధనా పటిమ, భాషా పరిజ్ఞానాలతో మెకంజీకి ‘కైఫియత్తు’ల కీర్తి కిరీటధారణ చేసిన అసాధారణ ప్రతిభాసంపన్నులు వారు. అయినా... ఇతిహాసపు చీకట్లను చీల్చుకుని ‘వెలుగు’లోకి రాలేకపోయిన దురదృష్టవంతులు.
ఎక్కడో...
ఏదో సందర్భం! మంచో... చెడో! గతంతో పోలిక మొదలవుతుంది. చరిత్ర పునరావృతమవుతోందన్న వ్యాఖ్య వినిపిస్తుంది. మనమూ ‘అవునా’ అనుకుని ఆలకించి మిన్నకుంటాం. మరి ఇంతకూ ఏంటా చరిత్ర? ఎప్పుడు, ఎలా నమోదైంది? వర్తమానంతో దానికి సాపత్యమేంటి? ఇవన్నీ ఆలోచిస్తామా? 
      అనుభవమే గురువు. గతాన్ని గుర్తుపెట్టుకుని, అది నేర్పే పాఠాన్ని ఒంట బట్టించుకుని ముందడుగు వేసే వారి భవిత బంగారుమయమవుతుంది. వ్యక్తులకే కాదు సమాజానికీ ఇది వర్తిస్తుంది. అయితే, గతకాలంలో ఎవరో ఒకరు చొరవ చూపి అక్షరబద్దం చేస్తేనే కదా ఆనాటి సమాజానుభవాలు, అంతకు పూర్వపు పరిస్థితుల పుట్టుపూర్వోత్తరాలు నవతరానికి తెలిసేది! తెలుగు సమాజానికి ఆ మేలు మెకంజీ చేశాడు. వేలకొద్దీ  రాతప్రతులు, స్థానిక చరిత్రలు, శాసనాలను సేకరించి, వాటిని విశ్లేషించాడు. సమగ్ర చరిత్ర రచనకు అవసరమైన సంపత్తిని సమకూర్చిపెట్టాడు. అయితే, ఆ కృషి అంతా ఆయన ఒక్కడే చేశాడా! కాదు! ఆయన వెనక మూలస్తంభాల్లా ముగ్గురు అన్నదమ్ములు నిలబడ్డారు కాబట్టే కైఫియత్తుల భారాన్ని మోయగలిగాడు. మెకంజీ ‘రాత’లకు అపూర్వ సాయం చేసిన ఆ అదృశ్య హస్తాలు మన తెలుగు వారివే. 
      కావలి వెంకట బొర్రయ్య, వెంకట లక్ష్మయ్య, వెంకట రామస్వామిల ప్రత్యక్ష సహాయ సహకారాలతోనే మెకంజీ... 1568 గ్రంథాలు, 2070 స్థానిక చరిత్రలు, 8076 శాసనాలు, 6218 నాణేలు, 2630 శిల్పాల చిత్రాలు, 108 విగ్రహాలు, 79 పురాతన భవనాల ప్రతిరూపాలు, 40 చారిత్రక శిథిలాల విశేషాలను భద్రపరచగలిగాడు. ఈ విషయాన్ని ఆయన తన పై అధికారులకు, స్నేహితులకు రాసిన లేఖల్లో ప్రముఖంగా పేర్కొన్నాడు. అయితే, విధి వైచిత్రమో, తెలుగు వారికి తోటివారి ప్రతిభా విశేషాలపై ఉన్న ‘గౌరవమో’ కానీ... కావలి సోదరులు ముగ్గురూ బోయీలుగా మిగిలిపోయారు. మన పుస్తకాల నిండా మెకంజీ పేరు దర్శనమిస్తుంది కానీ వీరి ప్రస్తావన కనీస మాత్రంగా కూడా కనిపించదు. 
ఆ శాస్త్రానికే ఆద్యుడు
ప్రాచీన శాసనాలను శాస్త్రోక్తంగా అధ్యయనం చేయడం కావలి వెంకట బొర్రయ్య(1776 - 1803)తోనే ప్రారంభమైంది.   కుశాగ్రబుద్ధి అయిన బొర్రయ్య నేటి పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో జన్మించారు. అక్కడే  ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. సంస్కృతాంధ్ర కావ్యాలు చదివారు. అనతికాలంలోనే విశేష సాహిత్య పరిజ్ఞానం సంపాదించారు. పద్నాలుగో ఏట మచిలీపట్నం మోర్గను పాఠశాలలో ఆంగ్లం నేర్చుకున్నారు. అప్పట్లో ఆయన సోదరుడు నారాయణప్ప కుంఫిణీ కొలువులో పని చేస్తుండేవారు. ఆయన ప్రాపకంతో బొర్రయ్య చిన్న ఉద్యోగాన్ని సాధించారు. విధుల్లో చేరిన కొద్దికాలంలోనే పనిమంతుడన్న మన్ననలందుకున్నారు. తర్వాత అధికారి పియర్సు వద్ద హెడ్‌ రైటరుగా నియమితులయ్యారు. అదే సమయంలో మెకంజీ బొర్రయ్య చురుకుదనాన్ని గమనించారు. పియర్సును ఒప్పించి తన దగ్గరకు తెచ్చుకున్నాడు. దుబాసీగా, అనువాదకునిగా నియమించుకున్నారు. అప్పటి నుంచి మెకంజీ ఎక్కడకు వెళ్లినా బొర్రయ్య వెంట ఉండేవారు.
      మెకంజీ చేయూతతో బొర్రయ్య గణిత, భూగోళ, ఖగోళ తదితర శాస్త్రాలను నేర్చుకున్నారు. దేశ పటాలను, వివిధ లిపులను అధ్యయనం చేయడం ప్రారంభించారు. ఈస్టిండియా కంపెనీ 1799లో శ్రీరంగపట్నాన్ని ముట్టడించింది. దీనికి  హైదరాబాదు నుంచి బయలుదేరిన దళాల్లో మెకంజీ, బొర్రయ్య ఉన్నారు. ముట్టడి వైనాన్ని బొర్రయ్య పద్యరూపంలో అక్షరబద్దం చేశారు. మైసూరు సంస్థానం కంపెనీ వశమయ్యాక, అక్కడ సర్వే చేసేందుకు మెకంజీ నాయకత్వంలో ఒక బృందం ఏర్పాటైంది. ఆ సర్వే ప్రారంభంలో  తన వద్ద పని చేస్తున్న భారతీయుల గురించి మెకంజీ రాస్తూ ‘30 వరహాలతో ప్రధాన విశ్లేషకుడు, అనువాదకుడు ఒకడు, కన్నడ విశ్లేషకుడొకడు, పర్షియన్‌ రికార్డులను వివరించేందుకు ఒక మున్షీ ఉన్నార’ని చెప్పాడు. ప్రధాన విశ్లేషకుడిగా, అనువాదకునిగా బొర్రయ్యకు ప్రతిపాదించిన వేతనం... ఆయన ప్రతిభకు ప్రతిఫలం. మైసూరు సర్వే సమయంలో ఆనెగొంది రాజులు, హరిహరలోని మధ్వ గురువులు, నినగల్లు భట్రాజుల వృత్తాంతాలను బొర్రయ్య సేకరించి, ఆంగ్లంలోకి అనువదించి మెకంజీకి చెప్పారు. దాంతో ఆయన ఆ వివరాలను రాయల్‌ ఏసియాటిక్‌ సొసైటీ జర్నల్‌లో ప్రకటించారు. 1801లో మెకంజీ బొర్రయ్యతో కలిసి మద్రాస్‌కు తిరిగి వచ్చారు. ఆ తర్వాత శాసనాలు, స్థానిక చరిత్రల అనువాద ప్రక్రియ ఆరంభమైంది. బొర్రయ్యకు తెలుగు, కన్నడం, మరాఠి, సంస్కృతం, పర్షియన్, హిందుస్థానీ, ఆంగ్ల భాషల్లో పాండిత్యం ఉంది. శాసనాల్లోని రాతలను విడమర్చి విశ్లేషించడంలో ఆయనది అందెవేసిన చేయి. అసలు ఇలా శాసనాలను ‘అర్థం చేసుకునే’ శాస్త్రానికి ఆద్యుడు బొర్రయ్యే. ఎందుకంటే, మెకంజీ రావడానికి ముందు ఎవరూ ఇలాంటి విషయాలపై శ్రద్ధ పెట్టలేదు.
      స్థానిక శాసనాలు, తామ్రపత్రాలు, శిలాశాసనాలను అనువదించి, విశ్లేషించకపోతే మెకంజీ సర్వే సమగ్రమయ్యేది కాదు.  ఆ పని బొర్రయ్య చేశారు కాబట్టే మెకంజీ పని సులువైంది. దీని గురించి మెకంజీ ఒక ఉత్తరంలో ఇలా చెప్పారు. ‘ఏ భారతీయ భాషతో గాని పరిచయంలేని నేను నా చిరకాల వాంఛితాన్ని తీర్చుకోగలిగా. ఈ వ్యక్తి (బొర్రయ్య) మేధాశక్తే నాకు ప్రోద్బలాన్నిచ్చింది. అందుకు నేనెంతో రుణపడి ఉన్నాను’ 
      మైసూరు పర్యటనలో బొర్రయ్య ఎన్నో నాణేలను, శాసనాలను సంపాదించారు. వాటికి ప్రతులు తీశారు. దేశం మొత్తం ఇలా సర్వే చేస్తే ఎంతో మేలు జరుగుతుందని, దీని కోసం సర్వేయర్‌ జనరల్‌ పదవిని సృష్టించాలని మెకంజీ కంపెనీ డైరెక్టర్ల బోర్డుకు ప్రతిపాదించారు. మొదట్లో వారు దీనికి అంగీకరించలేదు. అయితే, మెకంజీ కృషికి ప్రతిఫలంగా 9000 పూలవరహాలు పారితోషికమిచ్చారు. మరో 200 వరహాల భత్యం ఏర్పాటు చేశారు. దాంతో మెకంజీ ఆర్థిక పరిస్థితి బాగా మెరుగైంది. సమగ్ర చరిత్ర పరిశోధనను ప్రారంభించారు. కొత్త కార్యాలయాన్ని, సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారు. 
      అలా వచ్చిన కొత్త వ్యక్తులకు... స్థానిక చరిత్రలు, ప్రాచీన శాసనాలు, చిత్రాలు, నాణేలు, వస్తువులు, బొమ్మలను ఎలా సేకరించాలి, భద్రపరచాలో బొర్రయ్య శిక్షణిచ్చారు. తర్వాత ఆ బృందం కలిసి వెలకట్టలేని చారిత్రక సమాచారాన్ని సేకరించి మెకంజీ ముందు రాసులు పోశారు. చరిత్ర రచనకు మహోపకారం చేశారు. 
      అయితే, దురదృష్టవశాత్తూ బొర్రయ్య జనవరి 7, 1803న మద్రాస్‌లో అనారోగ్యంతో మరణించారు. 26 ఏళ్లకే కొండెక్కిపోయిన ఈ పరిశోధనా జ్యోతి నూరేళ్లు వర్ధిల్లుంటే... తెలుగు జాతికి ఇంకెన్ని వెలుగులు పంచేదో! 
మూడు దశాబ్దాల సేవ
కావలి సోదరుల్లో రెండో వారు వెంకట లక్ష్మయ్య. తన అన్న జీవించి ఉండగానే కంపెనీ కొలువులో కుదురుకున్నారు. సోదరుని వద్ద సర్వే సూత్రాలను క్రమబద్దంగా నేర్చుకున్నారు. బొర్రయ్య కాలం చేశాక, తన స్థానంలో మెకంజీ దగ్గర చేరారు. వివిధ ఆధారాల ద్వారా సేకరించిన అంశాలను లక్ష్మయ్య వర్గీకరించి, వాటిని ఆంగ్లంలోకి అనువదించి మెకంజీకి సమర్పిస్తుండే వారు.
      మెకంజీ గతంలో ప్రతిపాదించిన సర్వేయర్‌ జనరల్‌ పదవి 1808లో ఏర్పాటైంది. మెకంజీనే ఆ పదవిలోకి వచ్చారు. దాంతో తన కార్యాలయం కలకత్తాకు మారింది. అలా ఆయన అక్కడకు వెళ్తూ లక్ష్మయ్యను తీసుకెళ్లారు. అయితే ‘కావలి’ కుటుంబం కోసం కంపెనీతో చెప్పి మద్రాసు పరిసరాల్లో ఒక గ్రామాన్ని ఈనాంగా ఇప్పించారు. అంతే కాకుండా తన ఆస్తిలో పది శాతం లక్ష్మయ్యకు, అతని తమ్ముడికి చెందాలని విల్లు రాశారు. ఆ తర్వాత దాదాపు మూడు దశాబ్దాల పాటు లక్ష్మయ్య మెకంజీ దగ్గర ప్రధాన విశ్లేషకుడిగా ‘అన్న నిర్వర్తించిన బాధ్యత’లను వహించారు. అయితే, కుటుంబ పరిస్థితులు, ఇచ్చిన రుణాలను రాబట్టుకోలేకపోవడంతో కష్టాల పాలయ్యారు. కుటుంబ పోషణకు అప్పులూ చేశారు. ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా మెకంజీతో కలిసి సేకరించిన సంకలనాలను కంటికి రెప్పలా కాపాడారు. మెకంజీ గతించాక కూడా లక్ష్మయ్య కొంతకాలం కలకత్తాలోనే ఉండిపోయారు. సేకరించిన సామగ్రిని ఒక క్రమంలో పెట్టారు. వాటికి సూచీలు తయారుచేశారు. 
      ఆ తర్వాత కొద్దికాలానికి మద్రాస్‌కు వచ్చేశారు. సాహిత్యంపై అభినివేశం ఉండటంతో సంబంధిత మిత్ర బృందానికి చేరువయ్యారు. అప్పట్లో మంచి పేరు ప్రఖ్యాతులున్న మద్రాసు లిటరరీ సొసైటీ (1833) కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ సంస్థలో  మైసూరు, తంజావూరు, తిరువాన్కూరు, పుదుక్కోట మహారాజులు, ఆర్కాటు, కర్నూలు నవాబులు గౌరవ సభ్యులుగా ఉండేవారు. దీనికి విదేశీయుల ప్రాపకం ఎక్కువ. భారతీయులు మూడో తరగతి సభ్యులుగా ఉండేవారు. దాంతో ఈ సంస్థకు పోటీగా నగరంలోనే 1834లో హిందూ లిటరరీ సొసైటీ ఏర్పడింది. దీనికి లక్ష్మయ్య ఏకగ్రీవంగా అధ్యక్షులయ్యారు. సంఘం తరఫున అనేక సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. లక్ష్మయ్య ఎంత గొప్ప గౌరవ పదవులు నిర్వహించినా ఆర్థిక సమస్యలు తప్పలేదు. కొంతకాలం ఆంగ్లేయులకు తమిళం నేర్పి పొట్టపోసుకున్నారు. అభిరుచి గల చరిత్ర పరిశోధన చేద్దామంటే అవకాశం లభించలేదు. 
అనువాదంలో రారాజు
సోదరత్రయంలో చివరి వాడైన వెంకట రామస్వామి అసాధారణ ప్రజ్ఞాశాలి. అనువాదంలో దిట్ట. మెకంజీ కొలువులో 1798లో లేదా కాస్త తర్వాత చేరారు. మెకంజీకి మంచి నమ్మకస్తుడు. రామస్వామి గురించి మెకంజీ బొర్రయ్య/ లక్ష్మయ్య ముందు ప్రశంసిస్తూ ‘నీతో పనిచేస్తున్న నీ సోదరుడు చాలా కాలం జీతమేమీ లేకుండా నా కోసం కృషి చేశారు. ఆ తర్వాత కూడా చాలా తక్కువ తీసుకున్నారు. ఇప్పుడు దుబాసీలకు ఇచ్చే 25 వరహాల వేతనాన్ని రామస్వామికి కేటాయించారు. ఎంతో తెలివితో నాకు అనేక వివరణలు సమకూర్చినందుకిది ప్రతిఫల’మని చెప్పారు. ఆ తర్వాత కొద్ది కాలానికి మద్రాసు డిప్యూటీ సర్వేయర్‌ జనరల్‌కు మెకంజీ ఉత్తరం రాస్తూ ‘రామస్వామికి కళాశాలలో ఉద్యోగం దొరికింది. అది అత్యున్నత పదవి. అయితే నెలకు వేతనం 15 వరహాలు మాత్రమే. ఇప్పుడు అతనికి లభిస్తున్న దాని కన్నా ఇది చాలా తక్కువ. ఆ తేడా మొత్తాన్ని సర్వే శాఖ నుంచి భర్తీ చేయాల’ని చెప్పారు. చరిత్ర సమాచార సేకరణలో రామస్వామి ఎంత సాయం చేయకపోతే మెకంజీ ఇలా రాస్తారు! 
      మెకంజీ మరణించాక రామస్వామి ఉద్యోగం మానేశారు. అప్పటికే ఆయన బెంగాలీ భాష నేర్చుకున్నారు. ఆనాడు బెంగాలులో ప్రముఖులైన రాజా రామ్మోహనరాయ్, ద్వారకానాథ్, ఠాకూరు, బోలానాథ్‌ మిశ్రాలతో పరిచయం పెంచుకున్నారు. 1829లో ‘డెక్కను కవుల చరిత్ర’ను రాశారు. అంతకు ముందే  సంస్కృతంలోని విశ్వగుణా ధర్మాన్ని ఆంగ్లంలోకి అనువదించి, అనుబంధాలు, వివరణలు చేర్చి 1825లో కలకత్తాలో ప్రచురించారు. ఆ తర్వాత ‘డిస్క్రిప్టివ్‌ అండ్‌ హిస్టారికల్‌ స్కెచస్‌ ఆఫ్‌ సిటీ అండ్‌ ప్లేసెస్‌ ఇన్‌ ది డెక్కన్‌’ అనే గ్రంథాన్ని రాశారు. ఇందులో ప్రాచీన పాలకుల చరిత్రను వివరించారు. 1830 దశకం తొలినాళ్లలో మద్రాస్‌కు తిరిగి వచ్చేశారు. హిందూ లిటరరీ సొసైటీ ఏర్పాటులో సోదరుడికి సహకరించారు. ఎన్నో భారతీయ గ్రంథాలను ఆంగ్లంలోకి అనువదించారు. మన ధర్మ, సాంఘిక శాస్త్రాలు, ఆయుర్వేదంపై ఉన్న పట్టుతో.... ఆ జ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేయాలన్న తలంపుతో అనువాదాలు చేశారు. 
      ఇలా ఎందరో మహానుభావులు తెలుగు భాష, సంస్కృతుల పరిరక్షణకు పాటుపడ్డారు. వారందించిన జ్ఞానసంపదను మనం జాగ్రత్తగా భావితరాలకు అందించాలి. అదే వారి కృషికి నివాళి.


వెనక్కి ...

మీ అభిప్రాయం