పండంటి బోధనకు పది లక్ష్యాలు

  • 171 Views
  • 0Likes
  • Like
  • Article Share

    హేమ

తెలుగు బోధకుడిగా కొలువు సంపాదించాలంటే కొన్ని అంశాలపై పట్టు సాధించాలి. అలాంటి అంశాల్లో ఒకటి ‘లక్ష్యాలు-స్పష్టీకరణలు’. దీనిలోని ముఖ్యమైన విషయాలు, గుర్తుంచుకొనే విధానాలను ఓసారి పరికిద్దాం.
మన మాతృభాష, ప్రాంతీయ భాష, అధికారభాష తెలుగు. మన రాష్ట్రంలో కళాశాల స్థాయి వరకు మాతృభాషలో విద్యాబోధన జరుగుతుంది. పాఠశాల స్థాయిలో తెలుగును ప్రథమ భాషగానూ, కళాశాల స్థాయిలో ద్వితీయ భాషగానూ బోధిస్తున్నారు.
‘మాతృభాష తల్లిపాల వంటిది, పరభాష పోతపాల వంటిది. తల్లిపాలు తాగి పెరిగిన వాడికి, దాదిపాలు తాగి, పోతపాలతో పెరిగిన వాడికి, ఎంత తేడా ఉంటుందో మాతృభాషలో విషయం నేర్చుకున్న వాడికి, పరభాషలో నేర్చుకొన్నవాడికి అంతే తేడా ఉంటుందని ‘కొమర్రాజు వేంకట లక్ష్మణరావు’ అభిప్రాయం.
బోధనా లక్ష్యాలను బెంజమిన్‌ బ్లూమ్‌ మొదట ‘టాక్సానమీ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ ఆబ్జెక్టివ్స్‌’లో విశ్లేషించారు. 1973-74 విద్యా సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ (ఎన్‌సీఈఆర్‌టీ) లక్ష్యాల ఆధారంగా బోధన నిర్వహించడానికి, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడానికి తెలుగు భాషా బోధనకు పది లక్ష్యాలు గుర్తించారు.
1. జ్ఞానం 2. అవగాహన 3. వినియోగం 4. నైపుణ్యాలు 5. భాషాభిరుచి 6. రసానుభూతి 7. సంస్కృతీ సంప్రదాయాలు 8. సృజనాత్మకత 9. భాషాంతరీకరణం 10. సముచిత మనోవైఖరులు
ఈ లక్ష్యాల ఆవిష్కరణలో భాగంగా ఉద్దేశం- గమ్యం- లక్ష్యం- స్పష్టీకరణం అనే పదాలను పరిశీలిస్తే...
ఉద్దేశాలు: పాఠ్య ప్రణాళికల రూపకల్పనకు; పాఠ్యాంశాల ఎంపికకు ఉపకరించి ఆయా పాఠ్యాంశాల ద్వారా విద్యార్థుల్లో సాధించాల్సిన స్థూలమైన ప్రవర్తనా మార్పుల్ని తెలిపేవి ఉద్దేశాలు. ఇవి రెండు రకాలు. 1. సామాన్య ఉద్దేశాలు 2. ప్రత్యేక ఉద్దేశాలు.
గమ్యాలు, ధ్యేయాలు: ఆశయాల ఉద్దేశాల విస్తృత వ్యక్తీకరణలే గమ్యాలు. గమ్యాలు విద్యా విధాన ప్రాధాన్యతను నిర్ణయించి విద్యా ప్రణాళికల రూపకల్పనకు ఉపకరిస్తాయి.
లక్ష్యాలు: ఉద్దేశాలు, గమ్యాల నుంచి ఆవిర్భవించి తరగతి బోధనకు మార్గదర్శకత్వం నెరపి ఆయా పాఠ్యాంశాల ద్వారా విద్యార్థుల్లో ఆశిస్తున్న ప్రవర్తనా మార్పుల్ని సూచించేవి బోధనా లక్ష్యాలు. లక్ష్యాలు రెండు రకాలు.
1. సంవృత లక్ష్యం: విస్తృత వ్యాఖ్యలో ఉంటాయి.
2. వివృత లక్ష్యం: ఒకే వ్యాఖ్యలో ఉంటాయి. వాటిని స్వల్పకాలంలో ఒక పాఠ్యాంశం చివర సాధించవచ్చు.
స్పష్టీకరణలు
• బోధనా లక్ష్యాల సూక్ష్మరూపాలు స్పష్టీకరణలు
• బోధనా లక్ష్యాలను ప్రవర్తనా రూపంలో వివరించేవి  స్పష్టీకరణలు
• బోధనా కృత్యానికి ప్రాతిపదికలు స్పష్టీకరణలు
• అభ్యసనానికి సాక్ష్యాలు స్పష్టీకరణలు
• లక్ష్యాల అర్థాలను పరిమితం చేసేవి స్పష్టీకరణలు
• వివిధ లక్ష్యాల్లోని భేదాలను చెప్పడానికి ఉపకరించేవి స్పష్టీకరణలు
• బోధనాభ్యసన సన్నివేశాల్లో అంతర్దృష్టిని సారించేవి స్పష్టీకరణలు
• మూల్యాంకనంలో ప్రశ్నల తయారీకి తోడ్పడేవి స్పష్టీకరణలు
• ఒక లక్ష్యాన్ని స్పష్టంగా చెప్పడానికి తోడ్పడేవి స్పష్టీకరణలు
• ఒక లక్ష్యాన్ని సముపార్జించడానికి తోడ్పడేవి స్పష్టీకరణలు
జ్ఞానం: జ్ఞానానికి సంబంధించిన స్పష్టీకరణలు రెండు.
1. జ్ఞప్తికి తెచ్చుకోవడం
2. ఆయా సందర్భాల్లో గుర్తించడం.

జ్ఞానం ప్రధానంగా మూడు రకాలు.
1. విషయజ్ఞానం
2. భాషాజ్ఞానం 3. సాహిత్యజ్ఞానం
అవగాహన:

• జ్ఞానం ప్రాతిపదికగా కలిగింది అవగాహన
• అవగాహనను ‘అవభేదం’ అంటారు.
స్పష్టీకరణలు:
• పోలికలు, భేదాలు చెప్పడం
• గంభీర భావాలు వివేచించడం
• ఉదాహరణలు సొంతంగా ఇవ్వడం
• దోషాలను గుర్తించి సరిచేయడం
• జరగబోయే కథను ముందుగా ఊహించడం
• వివరించడం - విశ్లేషించడం
• సంక్షేపించడం - వివేచించడం
• సన్నిహిత సంబంధాల అంశాల సామ్యభేదాలను కనుగొనడం
• నిగూఢార్థాన్ని కనుగొనడం
• విషయాల మధ్య కార్యాచరణ సంబంధాన్ని గ్రహించడం
• అపరిచిత పద్యభాగాల ప్రధాన భావాలను కనుగొనడం
• శీర్షికలను సూచించడం
• పదాల అర్థాలను సందర్భానుసారంగా సూచించడం
• వివేచన జ్ఞానాన్ని కలిగి ఉండటం;
• తగిన వేగంతో చదవడం
• పద్య గద్యాల్లో అన్వయక్రమాన్ని తెల్పడం
నైపుణ్యం:
1. వాగ్రూపనైపుణ్యం: వాచిక శక్తిని అభివృద్ధి చేసే నైపుణ్యం, దీనితో సృజనాత్మకత అలవడుతుంది.
2. లిఖితరూప నైపుణ్యం: సృజనాత్మక శక్తితో కూడిన లిఖిత రూప వ్యక్తీకరణ వృద్ధి జరుగుతుంది.
భాషాభిరుచి: విద్యార్థికి భాషలో అభిరుచి కలిగి కృషి చేసి అభివృద్ధి సాధించడానికి వీలవుతుంది.
• మనసును ఒకదాని వైపు ఆకర్షింపజేసేది అభిరుచి. - రాస్‌
• అవధానం కలిగించడానికి మనకు నిరంతరం తోడ్పడే మానసిక ప్రక్రియ అభిరుచి. - బి.ఎన్‌.ఝా
స్పష్టీకరణలు:
• విస్తారంగా గ్రంథ పఠనం చేయడం
• సాహిత్య రచనల్లో పోలికలను గమనించడం
• సందర్భోచితంగా గ్రంథకర్తల రచనలను ప్రమాణంగా ఉదహరించడం
• ఉత్తమ పద్యాలను ధారణ చేసి పఠించడం
రసం: ఆస్వాదయోగ్యమైనది
స్పష్టీకరణలు: పాత్రౌచిత్యాన్ని తెలుసుకోవడం, శైలీ భేదాలను పరికించడం, ధ్వన్యర్థాలను గ్రహించడం
సంస్కృతీ సంప్రదాయాలు:
ప్రతి సమాజానికీ సంస్కృతీ సంప్రదాయాలుంటాయి. విద్యార్థులు మన సంస్కృతీ సంప్రదాయాలను గ్రహిస్తారు.
• రచనల్లోని కాలభేద ప్రభావాన్ని తెల్పడం - పురాణేతిహాసాల్లోని విశేషాలు వివరించడం - నీతిని గ్రహించడం
సృజనాత్మకత: విద్యార్థులు భాషణంలో, రాతలో సృజనాత్మకత ప్రదర్శిస్తారు
స్పష్టీకరణలు:
• స్వతంత్ర రచనలు చేయడం; • శైలిలో ప్రత్యేకత చూపడం • ఒక ప్రక్రియను వేరొక ప్రక్రియలోకి మార్చడం; • నుడికారపు సొంపు ప్రదర్శించడం
భాషాంతరీకరణం:
మన భాషలోని భావాలను ఇతర భాషల్లోకి గాని, ఇతర భాషల్లోని భావాలను మన భాషలోకి అనువదించడాన్ని భాషాంతరీకరణం అంటారు.
స్పష్టీకరణలు:
• ఉభయ భాషల్లో వాక్య నిర్మాణ పద్ధతులను తెలుసుకోవడం.
•  ఉభయ భాషల్లో సమానార్థక పదాలకు జాతీయాలను ఎన్నుకోవడం.
సముచితమైన వైఖరులు
ఒక వస్తువు, ప్రదేశాన్ని లేదా వ్యక్తిని గురించి ఏర్పడే ప్రత్యేక భావమే వైఖరి
స్పష్టీకరణలు
• సాహిత్య కృషిని ప్రోత్సహించడం
• ఇతర భాషల పట్ల గౌరవభావం కలిగి ఉండటం. • సాహితీ వేత్తల పట్ల గౌరవభావం కలిగి ఉండటం.
• విమర్శనాత్మక దృష్టిని కలిగి ఉండటం.
గత డీఎస్సీ, పీజీటీ, టీజీటీ, టెట్‌ పరీక్షలను బట్టి చూస్తే ఈ విభాగం నుంచి తప్పనిసరిగా ప్రశ్నలు రావచ్చు. బోధనా పద్ధతుల్లో అతికీలకమైన విభాగం లక్ష్యాలు - స్పష్టీకరణలు. ప్రతి పదాన్నీ ప్రశ్నగా అడిగే అవకాశం ఉంది. అనువర్తిత ప్రశ్నలు ఈ విభాగం నుంచే ఎక్కువగా వస్తాయి కాబట్టి నిశితమైన పరిశోధనాత్మక అధ్యయనం చేస్తేనే విజయం సొంతమవుతుంది.


వెనక్కి ...

మీ అభిప్రాయం