సీనియర్‌ సముద్రాల మాటల కడలి

  • 385 Views
  • 1Likes
  • Like
  • Article Share

    పార్థసారథి చిరువోలు

  • హైదరాబాదు
  • 9908892065
పార్థసారథి చిరువోలు

ఆయన తొలితరం సినీకవి, సంభాషణల రచయిత... పౌరాణిక చిత్రాలపైన ఆయనది చిరస్మరణీయ ముద్ర. రామాయణ, భారత, భాగవతాల్లోని పురాణ పాత్రలను ఆకళింపుచేసుకుని పాత్రోచిత రచన చేయటంలో ఆయన సిద్ధహస్తుడు. వేమన, త్యాగయ్య, భక్తరామదాసు, విప్రనారాయణ, అమరశిల్పి జక్కన్న లాంటి పాత్రలకు వెండితెర ఆవిష్కారం చేశారు. తరాలు మారినా ఈ చిత్రాలు సినిమా అభిమానులను రంజింప చేస్తూనే ఉన్నాయి. మాటల జలధి... పాటల కడలిగా సముద్రాల రాఘవాచార్య కీర్తిప్రతిష్ఠలందుకున్నారు (సీనియర్‌ సముద్రాల ఆయన వ్యావహారిక నామం). సముద్రాల రచనాశైలీవైభవాన్ని రేఖామాత్రంగా చెప్పే ప్రయత్నమిది. 
‘‘దిగ్దిశాంత
విశ్రాంత యశోరాజితమై, నవఖండ భూమండల పరివ్యాప్తమై, దశాక్షౌహిణీ సేనావాహినీ పరిరక్షితమై, శాత్రవ భయంకరమైన, ఈ కురు మహా సామ్రాజ్యమును శాసించు రారాజును నేను’’
      ‘శ్రీకృష్ణ పాండవీయం’ చిత్రం ప్రారంభంలో మయసభలోకి ప్రవేశిస్తూ కురురాజు పలికే సంభాషణలివి. సీనియర్‌ సముద్రాల సాహితీప్రజ్ఞకు మచ్చుతునకలివి. దీనికి కొనసాగింపుగా...‘‘అరివీరషండ నిర్మూలనోద్దండ దోర్దండ బలమండితులు, మేరు సమానధీరులు మా శత సోదరులు... అనన్య సామాన్య కోదండ విద్యా నైపుణ్యంతో భార్గవ రాముండనై కురు సమ్రాట్‌ యశోరక్షాధీరుడైన ఈ రాధేయుడుండగా అనామకులైన పాండవార్భకులకు ఇంత ప్రజా ప్రశంసాడంబరమా? వివిధ వేద వేదాంగ వేదినై, నిఖిల నీతి విశేష పరిజ్ఞాతమైన నాకన్నను ఆ కుంతీ సుతాగ్రజుడు ధర్మకోవిదుడా? కౌరవేశ్వర భుక్తాన్న శేష భోజన మదోన్మత్తుడైన, భీమసేనుడు బలవంతుడా ద్రుపదరాజు జీవగ్రహణ మాత్రోపయుక్త ధనుర్విద్యోల్లాస  దుర్విదగ్ధుడైన మధ్యముడు ధనురగ్రేసరుడా’’
      ... సంస్కృత సమాసభూయిష్టంగా ప్రవాహశైలితో ఈ సంభాషణ కొనసాగుతుంది. సుయోధన పాత్రధారి నందమూరి తారకరామారావు తనదైన హావభావ విన్యాసాలతో వీటికి ప్రాణప్రతిష్ఠ చేశారు. 
* ఇలాంటిదే పాండవ వనవాసంలోనూ కనిపిస్తుంది. ఎస్వీరంగారావు వాచకాన్ని దృష్టిలో పెట్టుకుని సముద్రాల రచన సాగుతుంది.
      ‘‘చతుస్సముద్ర వేలావలయిత పట్టభద్రుడైన ఈ కౌరవచక్రవర్తిని చూచి ఒక బంధకి, పంచభర్తృక... ఆ ద్రౌపది పరిహసించుటా? దీనిని సహించి రారాజు జీవించుటా? ఈ పరాభవానికి తగిన ప్రతీకారం జరగవలసిందే. భీష్మద్రోణకృపాది సౌహిక బాహుక దత్తాది ప్రముఖ వీరాధివీర పరివృతుడై అనేకాక్షౌహిణీచమూ సమేతులైన ఈ సుయోధనుని పరాక్రమం వ్యర్థం... ఉద్దండ వైరి హృదయమండల ప్రచండమైన ఈ గదాదండము నిస్సారం... నిరర్థకం...’’
      దుర్యోధన పాత్ర నేటికీ పండితపామరులను అలరిస్తూనే ఉంది. దీనికి సినీ రంగాన పునాది వేసింది సముద్రాలే. 
* ‘‘ఏకచక్రపురాన యెగ్గుసిగ్గులు మాని తిరిపమెత్తిన నాడె తెల్లమాయె...’’ అని దుర్యోధనుడు ఎకసెక్కం చేస్తే- ‘‘తిరిపెమెత్తుట గాదు తిగిచి జరాసంధు మట్టిజేసిన జగజెట్టి నేను’’ అంటాడు భీముడు దీనికి ప్రతిగా.
      పాండవ వనవాసంలో భీమ, దుర్యోధనుల నడుమ సంవాదం సందర్భంగా ఈ పద్యాలు అంత తేలిగ్గా మరుపునకు రావు. ఘంటసాల, మాధవపెద్ది పోటాపోటీగా వీటిని ఆలపించారు. శ్రీకృష్ణపాండవీయంలో శిశుపాలుడు కృష్ణుణ్ని తూలనాడే ఘట్టం కనిపిస్తుంది. ఇదే కాదు ... పౌరాణిక చిత్రాల్లో సంవాద పద్యాల సృష్టికర్త సముద్రాలే. 
* భూకైలాస్, సీతారామకశ్యాణం చిత్రాల్లో రావణుని పాత్రకు సముద్రాల విశిష్టత చేకూర్చి పెట్టారు. శివభక్తునిగా, తల్లి కోరికనుతీర్చే తనయునిగా, అమేయ పౌరుషానికి, పట్టుదలకు ప్రతీకగా రావణుడు ఇందులో కనిపిస్తాడు. ఈ పాత్ర ఔచిత్యాన్ని గుర్తెరిగి ఎన్టీఆర్‌ సీతారామకశ్యాణం చిత్రాన్ని స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించారు. భావిజీవితంలో ప్రతినాయక పాత్రలను పోషించటానికి ఎన్టీఆర్‌కి ప్రేరణ ఇచ్చింది ఓ రకంగా ఈ చిత్రమేనేమో అనిపిస్తుంది. ఇందులో నారదుడు, రావణబ్రహ్మల మధ్య సంవాదం నాటకీయంగా సాగుతుంది. దేవదేవ పరంధామా, నీలమేఘశ్యామా.... కానరార కైలాసనివాస బాలేందుధరా... జటాహరా...గీతాలతో పాటు... హే పార్వతీ నాథ... కైలాసశైలాగ్రవాసా... శశాంకార్ధ మౌళి.. ఉమాదేవతోల్లాసిత నవ్యాంగభాగా... అన్న  శివదండకాన్ని సముద్రాల విరచించారు. 
* తొలితెలుగు వర్ణచిత్రం ‘లవకుశ’ గీతాల్లో సముద్రాల కలం పరవళ్లు తొక్కింది. జగదభిరాముడు శ్రీరాముడే... రఘుకుల సోముడు ఆ రాముడే...రామకథను వినరయ్యా... ఇహపరసుఖములొసగే సీతారామకథను వినరయ్యా... వినుడు వినుడు రామాయణ గాథ... వినుడీ మనసారా... శ్రీరాముని చరితమును తెలిపెదెమమ్మా... ఘనశీలవతి సీతకథను వినుడోయమ్మ... గీతాలన్నీ సముద్రాల కలం నుంచి వచ్చినవే. ఇందులో రామజననం నుంచి పట్టాభిషేకం వరకూ వివిధ ఘట్టాలను సముద్రాల ఆవిష్కరించారు. ఇదే చిత్రంలో... సందేహించకుమమ్మా... రఘురామ ప్రేమను సీతమ్మా... లేరు కుశలవుల సాటి.. సరివీరులు ధారుణిలో... కూడా సముద్రాల గీతాలే. ఇవి ఎంత జనరంజకమయ్యాయో ప్రత్యేకంగా ప్రస్తావించవలసిన పనిలేదు. ఈ చిత్రం ఉత్తమ తెలుగు చిత్రంగా రాష్ట్రపతి పురస్కారం అందుకుంది. 
* నర్తనశాలలో ‘‘జననీ! శివకామినీ! జయశుభకారిణీ! విజయరూపిణీ! అమ్మవు నీవె! అఖిల జగాలకు... అమ్మలగన్న అమ్మవు నీవె!’’ అన్న గీతం మంచి ప్రాచుర్యం పొందింది. ఇందులోనే బృహన్నల ఆధ్వర్యంలో ఉత్తర నృత్య శిక్షణ గీతంలో... జయజయ గణనాయక విఘ్నవినాయక భయహర! శుభకర! గజముఖ... విఘ్నేశ్వర స్తుతిగీతం... ‘స్వర్ణమంజరి’ చిత్రంలో ‘‘మందాకినీ సలిల చందన చర్చితాయ... నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ... మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ.. తస్త్మె మ కారాయ నమశ్శివాయ...’’ శివస్తుతిగీతం భక్తిభావంతో ఓలలాడేలా చేస్తాయి. 
* అష్టదిగ్గజకవుల్లో ఒకరైన నంది తిమ్మన రచించిన ‘పారిజాతాపహరణం’ ఆధారంగా రూపొందిన శ్రీకృష్ణ తులాభారం చిత్రానికి సముద్రాల సంభాషణలు వన్నె తెచ్చాయి. అహంకారాన్ని ప్రదర్శించే సత్యభామ, భర్తసేవే పరమావధిగా భావించే రుక్మిణి, ఇరువురి నడుమ ప్రణయకలహంతో నలిగిపోయే శ్రీకృష్ణుడు... పాత్రోచిత సంభాషణలు కూర్చారు సముద్రాల. నడివీధిలో శ్రీకృష్ణుని విక్రయించే ఘట్టాలు మురిపిస్తాయి. 
* వీరాభిమన్యు చిత్రంలో యుద్ధానికి వెళ్లబోతున్న అభిమన్యుణ్ణి ఉత్తర వారిస్తుంది. కన్నీరు పెడుతుంది. ‘‘దేవీ! కన్నీరా...’’ అని ప్రశ్నిస్తాడు. ‘‘కాదు, ఆనందాశ్రువులు స్వామీ!’’ అంటుంది. ‘‘అవి అలాగే దాచి ఉంచు. రేపు విజయోత్సాహంతో మరలి 
వచ్చినప్పుడు ఆ అశ్రువుల అవసరం చాలా ఉంటుంది’’ అని నచ్చచెబుతాడు.
‘‘నేను పోవటం తథ్యం...’’ అంటాడు. చనిపోతాననే పరోక్ష ధ్వనిని సూచిస్తూ సముద్రాల రచన సాగుతుంది.
* దండకాలు రాయటంలో సముద్రాల అందెవేసిన చేయి.
‘‘శ్రీ మన్మహాదేవ దేవీ! త్రిలోకైక సంతోషిణీ!
భక్త చింతామణీ! శోక సంహారిణీ!
అంబ శర్వాణి లోకైక రక్షామణీ!
ఏ పురా పుణ్యమో, నిన్నే నిత్యంబు 
పూజించి - ’’
      ‘తారాశశాంకం’లో సముద్రాల విరచిత ఈ గీతాన్ని లీల మనోహరంగా ఆలపించారు. 
* కైలాసే కమనీయ రత్నఖచితే కల్పద్రుమాలే స్థితం...కర్పూర స్ఫటికేన్ద్ర సున్దర తనుం కాత్యాయనీ సేవితం...గంగా తుంగ తురంగ రంగిత జటాభారం కృపాసాగరం... కంఠాలంకృత శేషభూషణ... శివస్తుతి ‘సోమవార వ్రత మాహాత్మ్యం’ చిత్రం కోసం సముద్రాల రాశారు. అలాగే ‘‘కరుణించవె తులసీ మాతా! దీవించవె దేవీ మనసారా!’’ రుక్మిణి తులసిపూజ- సత్యభామ కల్పకవ్రతం చేస్తూ పోటీ పడే సందర్భంగా ఇద్దరి పాత్రలను దృష్టిలో పెట్టుకుని గీత రచన చేశారు. 
* భక్త ప్రహ్లాద చిత్రంలో సుశీల, బాలమురళీకృష్ణ ఆలపించిన ‘‘ఈ మాననీ మందిరా! భక్త మందారా! త్రైలోక్య సమ్మోహనకారా! ప్రేమావతారా! జగన్నాథా! లోకాధినాథా’’- దండకం బాగా ప్రాచుర్యం పొందింది. ఇదే చిత్రంలో ప్రేక్షకులు మెచ్చిన మరో గీతం- ‘జీవము నీవే కదా! దేవా! జీవము నీవే కదా! బ్రోచే భారము నీదే కదా! నా భారము నీదే కదా!’’. దీంతో పాటు... ‘‘నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం, భవబంధాలు పారద్రోలి, వరము నొసంగే విధను...’’ గీతం సముద్రాల కలం నుంచి జాలువారిందే.
* ‘‘ఓ తెరువరీ! వెనుతిరిగి చూడకురా!...గతము తలపకురా...!
మమతగానీ, మరులుగానీ మాసిపోయేవే... సంపదయినా సొంపులైనా సమసి పోయేవే... మనసులోన వెలుగు జ్యోతి నీకు తోడోయీ!... నీ ధర్మము విడనాడక ముందుకు సాగి పోవోయీ!!’’
      కర్తవ్య నిష్ఠను ప్రబోధించే ఈ గీతం  ‘భక్త రఘునాథ్‌’ చిత్రంలోనిది. ఒరియా ప్రాంతానికి చెందిన భక్త రఘునాథుడి గాథకు సినిమా రూపం. ఈ చిత్రానికి సముద్రాల కథ, స్క్రీన్‌ప్లేతో పాటు దర్శకత్వం వహించారు. భక్త రఘునాథుడిగా కాంతారావు, అతని సతీమణి అన్నపూర్ణగా జమున నటించారు.
* ‘‘సిరులు కలిగిన వేళ మైమరువరాదు
కష్టములలోన ధైర్యంబు కలిగియుండు’’ అని హితవు చెబుతాడు ఓ గీతంలో (దేవత)
* ‘‘జపమాచరించె జడధారి కన్నా
దానాలు చేసే సంసారి మిన్న
నిరతాన్న దానమే మీ పెన్నిధానం
ఈ దేహమే మురికి కూపం
పాడు మోహాల పడిజేసే పాపం’’ అంటారు మరో చోట
* ‘‘తనువుతో కలుగు బాంధవ్యమ్ములెల్ల
తనువుతో నశియించు ధరణిలో కలియు
తనువనిత్యము, నిత్యమ్ము ఆత్మ యొకటి -’’
      ‘శ్రీకృష్ణావతారం’ చిత్రంలో శ్రీ కృష్ణుడు అర్జునునికి గీత సారాన్ని బోధించే క్రమంలో సముద్రాల ఈ గీత రచన చేశారు. ఇదే పాటలో..
‘‘చివికి జీర్ణములైన చేలముల్‌ వదిలి
కొత్త వలువలు గట్టి కొన్నట్టి రీతి
కర్మానుగతి నొక్క కాయమ్ము వదిలి
వేరొక్క తనువు ప్రవేశించు ఆత్మ -
ఆత్మకు ఆదియు అంతము లేదు
అది గాలికెగరదు - తెగదు
నీట నానదు - అగ్ని అంబుతో నీరై పోదు’’ 
      అని ఆత్మ వైశిష్ట్యాన్ని వివరిస్తారు. 
కరుణా విషాదాలు కలిగించునట్టి - 
అహమును మమకారమావలపెట్టి
మోహమ్మువీడి ప్రబుద్ధుడివగుమా! అంటూ ప్రబోధిస్తారు.
* ‘‘కలిమీ లేమీ
చావునూ బ్రతుకూ
కావడి కుండలురా
కర్మను మునిగి ఫలమును విడిచి
సుఖము కనెదవురా’’-
      స్వాతంత్య్రానికి ముందే వచ్చిన ‘వందేమాతరం’ చిత్రంలో  ‘నొసటిరాత సటిరాత దాట తరమా’’ అన్న సాకీతో మొదలయ్యే పాటలో జీవన సారాన్ని గుదిగుచ్చారు.
* దేవదాసు చిత్రంలో ‘జగమే మాయ’ ఎంత ప్రాచుర్యం పొందిందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోనే -
‘‘కలిమి లేములు కష్టసుఖాలు
కావడితో కుండలనీ...
... ... ...
కావడి కొయ్యేనోయ్‌! కుండలు మన్నేనోయ్‌!
కనుగొంటే నిత్యసత్యమింతేనోయీ’’ అంటూ వేదాంత సారాన్ని గుదిగుచ్చారు. 
* ‘‘రాదే చెలి- నమ్మరాదే చెలి-
మగవారినిలా నమ్మరాదే చెలీ-
... ... ....
మోసకారి కామదాసుల మాటలు 
నీటిమూటలే చెలి
వాంఛ కొనసాగునందాకనే-
తమ వాంఛ కొనసాగునందాకనే-
ప్రేమానుబంధాలు-
మనమేమైననూ చూడరాదే చెలీ...’’
      మగవాడి స్వభావాన్ని, స్త్రీ లోలతను అందంగా ఆవిష్కరించారు. బెజవాడ రాజరత్నం గానం చేసిన ఈ గీతం బాగా ప్రాచుర్యం పొందింది. చిత్తూరు నాగయ్య హీరోగా నటించిన ‘దేవత’ చిత్రంలోని ఈ పాట తరహాలోనే- ఆ తర్వాత అనేక గీతాలు వచ్చాయి. 
* ‘‘నిప్పు వంటి సీతమ్మ నిందల పాలాయె!
తప్పెరుగని సాధ్వీమణి దండన పాలాయె
ఏనాడూ ఆడ బ్రతుకు ఇంతే కదా!
ఆ దేవుని పరీక్షకు అంతే లేదా’’- అంటారు ఓ  గీతంలో
* ‘‘అందాల దాసులె - 
మగవారందాల దాసులె
గుణవంతులైన, ధీమంతులైన
జగజంతలైన ఎంతటివారలైన...’’ 
అన్న సముద్రాల..  మహిళపై చురక వేయటానికి వెనకాడలేదు.
‘‘నమ్మకురా నరుడా! మగువల నమ్మకురా!
నాగుపాములను నమ్మవచ్చురా!
నాతి మనసు కనిపెట్టలేవురా’’ (సతీ సక్కుబాయి) అంటారు.
* జీవితం అశాశ్వతం, క్షణభంగురమని చెబుతూ...
‘‘ఈ వసంతము నిత్యము రాదోయీ
పూవు దొన్నెలో తీయ తీయని
యౌవన మధువు నింపినదోయి!
ఏ గాలి కుదుపునకు కదిలిపోవునో
హాయి హాయిగా తాగవోయీ - 
మధుపాయీ!’’ అంటారు. 
      గజల్‌ తరహాలో సాగే ఈ గీతమూ సముద్రాల కలం నుంచి జాలువారిందే.
* ప్రణయ, శృంగార గీతాల్లోనూ సముద్రాల కలం కదం తొక్కుతుంది.
‘‘కోరుకున్న పతి చెంత జేరితే
దారి చూపమని వెంట తగిలితే
కొసరి కొసరి నీ కొంగు లాగితే
ఏం చేస్తావే పిల్లా! ఏం చేస్తావే!
జారు పైట సవరిస్తా!
ఓర చూపులతో ఊరిస్తా!
కొసరి కొసరి నే కవ్విస్తుంటే
ఏం చేస్తాడో చూస్తా!
చెలిచెలి నెచ్చెలి నీవంటి
బిలిబిలి జాబిలి నేనంటి గిలిగిలి కౌగిలి 
ఇమ్మంటి
ఏం చేస్తావే పిల్లా!
పకపక నవ్వి పక్క పక్క చేరి
తికమక తికమక తిప్పలు పెట్టి
తకతై తకతై తైతక్కలాడిస్తే
ఏం చేస్తాడో! ఏం చేస్తాడో!’’
      హాస్య జంట గిరిజ, రేలంగిల మధ్య ప్రశ్న, సమాధానం రీతిలో ఈ గీతం సాగుతుంది.
* ‘‘ప్రియురాల సిగ్గేలనే - 
నీ మనసేరు మగవాని జేరి...’’
      శ్రీకృష్ణ పాండవీయంలో ఘంటసాల, పి.సుశీల యుగళగీతం- సముద్రాలకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
* ‘‘నేర్చావు సరసాలు చాలా
మేలా నీకీ లీలా!
ఆ మూల దాచీ - చేలాలు దోచీ
చెలగాట మాడవుగా’’ - గోపిక, కృష్ణుల ప్రణయగీతం కవ్విస్తుంది. 
* కనకతార చిత్రంలోని ‘‘దేవుడి మహిమ తెలియ వశమా?’’ (1937) గీతంతో ప్రారంభమైన ఆయన గేయవ్యాసంగం శ్రీరామకథ (1968)తో పరిసమాప్తమైంది.
‘‘రామకథా! శ్రీరామకథా!
ఎన్నిసార్లు ఆలించిన గానీ
ఎన్నిసార్లు దర్శించిన గానీ
తనివి తీరని దివ్యగాథా- ’’ పల్లవితో ఈ గీతం సాగుతుంది. 
      అంతకు ముందు ‘‘వీరాంజనేయ’’ చిత్రంలో కూడా
‘‘శ్రీరామ! రామ! రామా! సీతామనోభిరామా
ఎనలేని నీ నామ మహిమ
శ్రీరామ ఏనాటికెల్లరికి శ్రీరామరక్ష’’ అని రాశారు. ఇదే గీతంలో కృష్ణుని ప్రస్తుతి ఉంటుంది.
‘‘ద్వాపర యుగమున ద్వారక వెలిసి
ధారుణి నేలే నాథుడవలె!
దానవకోటి దర్పము నణచి
ధర్మము బ్రోచె దైవము నీవె!
శ్రీకృష్ణ! శ్రీకృష్ణ! శ్రీకృష్ణ!! గోపాలా’’ 
* భక్తపోతన చిత్రంలో-
సర్వమంగళ నామా రామా!
సుగుణధామ రఘురామా!
మంగశాంగ సీతారామా!
మధుర మధుర నామా!’’ 
అనే మరో గీతంలో రాముని ప్రశస్తి ఉంటుంది. 
      పౌరాణికాలు, సాంఘికాలు.. చిత్రం ఏదైనా తనదైన ముద్రతో అలరించారు సముద్రాల. కథ, మాటలు, పాటలు వంటి బాధ్యతలతో పాటు కొన్ని చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. జయాపజయాల మాటెలా ఉన్నా వెండితెర వెలిగే వరకూ ఆయన చిత్రాలు అభిమానుల్ని మురిపిస్తూనే ఉంటాయి.


వెనక్కి ...

మీ అభిప్రాయం