అలంకార శాస్త్రం... అధ్యాపక అస్త్రం

  • 441 Views
  • 0Likes
  • Like
  • Article Share

    సాయి మనస్విని

త్వరలో యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (విశ్వవిద్యాలయాల నిధుల సంఘం) అధ్యాపక అర్హత పరీక్ష నెట్‌- జెఆర్‌ఎఫ్‌  నిర్వహించనుంది. రాష్ట్ర ప్రభుత్వం జూనియర్, సీనియర్‌ అధ్యాపకుల ఉద్యోగాల భర్తీ నేపథ్యంలో అలంకార శాస్త్రంలో ‘కావ్యం- నాయికా నాయకులు’ విశేషాలు తెలుసుకోవాలి.
కావ్యానికి ప్రధాన ప్రయోజనం ఆనందం, సందేశం లేదా ఉపదేశం. కావ్యం ఉపదేశాత్మకమై ఉండాలంటే ఆ కావ్యంలో నాయకుడు ఉత్తమ చరిత్ర కలిగినవాడై ఉండాలి. అందులోని ఇతివృత్తాన్ని నడిపిస్తూ ఆ ఫలాన్ని పొందే వాడవటం వల్ల నాయకుడికి ఆ పేరు, విశిష్టత కలిగాయి.
విద్యానాథుని అభిమతంలో ఉత్తమ నాయకుని లక్షణాలు: విద్యానాథుడు ఉత్తమ నాయకుని లక్షణాలుగా ఏడింటిని పేర్కొన్నాడు.
1. కులీనత: ఉన్నత కులంలో జన్మించిన వాడవటం
2. మహిభాగ్యం: భూమండలాధిపత్యం 3. ఔజ్జ్వల్యం: చక్కని రూపం కలిగిన దేహం కలిగి ఉండటం. 4. ఔదార్యం: దాన గుణం కలిగి ఉండటం. 5. తేజస్విత: లోక ప్రకాశకత్వం కలిగి ఉండటం.
6. ధార్మికత్వం: ధర్మపరాయణత్వం కలిగి ఉండటం.
7. వైదగ్ధ్యం: కృత్య వస్తు కౌశలత్వం కలిగి ఉండటం. లాక్షణికులు ఈ ఏడు లక్షణాలకి మహామహిమత్వం, పాండిత్యమనే లక్షణాలను కూడా పేర్కొన్నాడు.
విశ్వనాథుని అభిమతంలో...
త్యాగి, కృతి, కులీనుడు, రూపయౌవనోత్సాహ సంపన్నుడు, దక్షుడు, అనురక్తి లోలుడు, తేజోవైదగ్ధ్య, శీలవంతుడైన వాడు నాయకుడని ‘సాహిత్య దర్పణం’లో చెప్పారు.
ధనుంజయుని అభిమతంలో...
వినీతుడు, మధురుడు, త్యాగి, దక్షుడు, ప్రియంవదుడు, రక్తలోకుడు, శుచి, వాగ్మి, స్థిరుడు, రూపవంతుడు, యువకుడు, బుద్ధి, ఉత్సాహ స్మృతి, ప్రజ్ఞా కళామాన సమన్వితుడు, శూరుడు, దృఢుడు, తేజస్వి, శాస్త్ర చక్షువు, ధార్మికుడై నాయకుడు ఉండాలని దశరూపకంలో స్పష్టం చేశాడు.
విద్యానాథుడు ‘ప్రతాపరుద్రీయం’లో నాయక గుణాలు చెప్పిన తర్వాత, యశఃప్రతాప సుభగత్వం, ధర్మకార్యార్థ తత్పరత, దురంధరత్వం, గుణాఢ్యత నాయక స్వరూప లక్షణాలని పేర్కొన్నాడు. భట్టుమూర్తి తన ‘కావ్యాలంకార సంగ్రహం’లో కార్యావనత్వం, భూభారవహన క్షమబాహుత్వం’ అనే వాటిని విద్యానాథుడు చెప్పిన వాటికి అదనంగా  చేర్చాడు.
నాయక భేదాలు: ఆలంకారికులు పేర్కొన్న కావ్య నాయకులు నలుగురు 1. ధీరోదాత్తుడు 2. ధీరోద్ధతుడు 3. ధీరశాంతుడు 4. ధీరలలితుడు
ధీరోదాత్తుడు: ఆత్మశ్లాఘ లేనివాడు, క్షమావంతుడు, గంభీరుడు, బలశాలి, గూఢమైన కోపం కలవాడు, దృఢవ్రతుడు అయినవాడు ధీరోదాత్తుడు. ధీరోదాత్తుడు ‘శృంగార’, ‘వీర’ రసకావ్యాల్లో నాయకునిగా ఉంటాడు.
ధీరోద్ధతుడు: ధీరత్వంతోపాటు ఉద్ధతత్వం కలవాడు ధీరోద్ధతుడు. మాయాపరత్వం, ప్రచండత్వం, చపలత్వం, అహంకారదర్ప భూయిష్ఠత్వం, ఆత్మస్తుతి పరాయణత్వం లక్షణాలు కలిగిన నాయకుడు. వీర, రౌద్ర రస కావ్యాల్లో నాయకునిగా ఉంటాడు.
ధీరశాంతుడు: ధీరత్వం, శాంతత్వం, ప్రసన్నత్వం కలిగిన ద్విజాదికుడు ధీరశాంతుడని, ధీరప్రశాంతుడని కొందరంటారు. కులీనత్వాది నాయక సామాన్య గుణాలు కల ద్విజుడు ధీరశాంతుడని సాహిత్య దర్పణంలో పేర్కొన్నారు.
ధీరలలితుడు: నిశ్చింతుడు, మృదుస్వభావుడు, నిత్య కళానిరతుడు, రాజ్యకార్యాలను దక్షులైన మంత్రులకు వదిలి నిశ్చింతగా భోగలాలసుడైన రాజన్యుడు ధీరలలితుడు. కళానిరతుడు అంటే నృత్యగాన, చిత్రలేఖన, కవితాదులైన లలిత కళల్లో ఆసక్తుడని అర్థం. ధీరలలితుడు నాటికలలో నాయకునిగా ఉంటాడు.
శృంగార నాయక భేదాలు: శృంగార నాయకులు నలుగురు
1. దక్షిణుడు 2. అనుకూలుడు 3. ధృష్టుడు 4. శఠుడు
దక్షిణుడు: అనేక నాయికలందు సమానమైన అనురాగం కలిగి సంతుష్టులుగా ఏలుకొనేవాడు దక్షిణ నాయకుడు. శ్రీకృష్ణుడు దక్షిణ నాయకునిగా ప్రసిద్ధుడు.
అనుకూలుడు: ఒకే నాయికపైనే అనురాగం కలిగినవాడు అనుకూలుడు. శ్రీరాముణ్ని ‘అనుకూలుడు’గా భావించవచ్చు.
ధృష్టుడు: అపరాధ మొనరించి శంకలేనివాడు, తర్జితుడయు లజ్జింపనివాడు, దోషం వ్యక్తమైనా అసత్యం చెప్పేవాడు ధృష్టుడు.
శఠుడు: నాయికకు మాత్రమే తెలిసేటట్లు అప్రియమాచరించే వాడు శఠుడు. శఠుడు ఆచరించే అప్రియం ప్రియురాలికే కాని ఇతరులకు తెలియదు. ధీరోదాత్తులు మొదలైన నాయకాదులు నలుగురు ఒక్కొక్కరు దక్షిణాది భేదాలచే నలుగురై మొత్తం పదహారుగురు అవుతారు. ఈ పదహారుగురు ఉత్తమ, మధ్యమ, అధమ భేదాల వల్ల 48 మంది అవుతారు.
నాయికా భేదాలు
నాయికా భేదాలు స్వీయ, అన్య, సామాన్య అని మూడు రకాలు.
స్వీయ: లజ్జ, ఆర్జవం, పాతివ్రత్యం, కోమలత్వం, సౌందర్యం కలిగి అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకొన్న ఉత్తమురాలు స్వీయ.
అన్య: అన్య మరలా కన్య, అన్యోఢ అని రెండు విధాలు కన్య అనగా అవివాహిత. ‘అన్యోఢ’ అనగా ఇతరుని భార్య. ఏదోమిషతో అటుఇటు తిరుగుతున్నది, కులట, సిగ్గు విడిచింది ‘అన్యోఢ’ అని సాహిత్య దర్పణంలో స్పష్టం చేశారు.
సామాన్య: సామాన్య అంటే వేశ్య. ఈమె సర్వసాధారణ స్త్రీ. ధీరురాలు, కళాకుశల అయిన ఈమె సామాన్య అని ‘సాహిత్య దర్పణం’లో పేర్కొన్నారు. ‘ప్రహసనం’లో తప్ప మిగతా నాటక భేదాల్లో ‘సామాన్య’ అనురాగవతిగానే ఉంటుంది. ‘మృచ్ఛకటికం’లో వసంతసేన ‘సామాన్య’కు ఉదాహరణ.
స్వీయ: స్వీయ యౌవన సంబంధాన్ని బట్టి ముగ్ధ, మధ్య, ప్రౌఢ అని మూడు రకాలు.
ముగ్ధ: అప్పుడే అంకురించిన యౌవనం, మన్మథ వికారం కలిగి రతిలో ప్రతికూలత, మృదువైన ప్రణయకోపం కలది, అధిక లజ్జాసమన్విత కలది ముగ్ధ.
మధ్య: ప్రరూఢమైన యౌవనం, మదనవికారం కలది. ఇంచుక ప్రగల్భ వాక్కులు కలది. సామాన్యమైన లజ్జ కల నాయిక మధ్య.
ప్రౌఢ: సంపూర్ణ యౌవన, సమస్త రతికోవిద, ఉన్నత శృంగారభావ, అల్పలజ్జ, అక్రాంతనాయక అయినది ప్రౌఢ.
అనంతామాత్యుడు ‘ప్రౌఢ’ అన్నది ప్రౌఢ, ప్రగల్భ అని రెండు రకాలని పేర్కొన్నాడు.
అష్టవిధ శృంగార నాయికలు:
అవస్థాభేదాన్ని బట్టి నాయికలు స్వాధీన భర్తృక, వాసకసజ్జ లేదా వాసక సజ్జిక, విరహోత్క లేక విరహోత్కంఠిత, విప్రలబ్ధ, ఖండిత, కలహాంతరిత, ప్రోషితభర్తృక, అభిసారిక అని ఎనిమిది రకాలుగా ఉంటారు.
స్వాధీన భర్తృక: తనయందే అనురాగం కలిగి తనకు అధీనుడై ఉండే భర్త గలది. ‘సత్యభామను’ స్వాధీన భర్తృకగా భావించవచ్చు.
వాసక సజ్జిక: ప్రియుడు వచ్చే వేళకు తన గృహాన్ని అలంకరించుకొని సిద్ధంగా ఉండే వనిత.
విరహోత్కంఠిత: ప్రియుడు చెప్పిన వేళకు రాక ఆలస్యం అయితే ఉత్కంఠ దాల్చే వనిత.
విప్రలబ్ధ: సంకేత స్థలానికి వెళ్లగా అక్కడ ప్రియుడు కనపడక ఆర్తి చెందే నాయిక.
ఖండిత: ప్రియుడు అన్యకాంతతో రాత్రంతా క్రీడించి వేకువనే ఇంటికిరాగా సంభోగ చిహ్నాలు చూసి కుందేది.
కలహాంతరిత: ప్రియుని నిందించి వెళ్లగొట్టి తర్వాత పశ్చాత్తాపం పొందేది.
ప్రోషితభర్తృక: ప్రియుడు పరదేశ గతుడైనప్పుడు విరహంతో కృశించిపోయే నాయిక.
అభిసారిక: మదనార్తయై ప్రియుని వద్దకు తానే స్వయంగా పోవు నాయిక. ఈ అభిసారిక మూడు రకాలు.
1. జ్యోత్స్నాభిసారిక 2. తమోభిసారిక 3. దివసాభిసారిక
ఈ విధంగా శృంగార నాయికలు ఎనిమిది మందిగా ఆలంకారికులు గుర్తించారు. కావ్యశాస్త్రంలో భాగంగా పోటీ పరీక్షల్లో ఎక్కువగా అడుగుతున్న విశేషాలివి...
చక్రవాళం: చక్రవాళంలో మొదట ఒక పద్యం తరువాత 8 దళాలు గల కళిక ఉంటుంది. ఈ రెండు ముక్తపదగ్రస్తాలు, సంబోధనాంతాలై ఉంటాయి.
మంజరి: స్త్రీ శృంగారం, విరహం, వసంత మన్మథ విజృంభణం, వన జలక్రీడలు మొదలైనవి గల కావ్యం మంజరీకావ్యం.
తారావళి: ఒక్కొక్క పద్యంలో ఒక్కొక్క నక్షత్రం పేరు వచ్చేట్లు 27 పద్యాలుగా రాస్తే అది ‘తారావళి’ అవుతుంది. తొమ్మిది పద్యాలు గల కావ్యానికి రత్నావళి అని, అయిదు పద్యాలు గల కావ్యానికి పంచాననావళి’ అని పేర్లు. క్రమంగా వీటిని నవరత్నాలు, పంచరత్నాలుగా పిలుస్తున్నారు.
ఖండకావ్యం: మహాకావ్య లక్షణాల్లో ఏకాదేశాన్ని మాత్రం గ్రహించి రచించిన కావ్యం ఖండకావ్యం. ఉదా: మేఘసందేశం.
కోశం: అన్యోన్యాపేక్షకాలైన శ్లోకాల సమూహాన్ని కోశం అంటారు.
వాకోవాక్యం: ఉక్తి ప్రత్యుక్తి రూపాలైన వాక్యోపవాక్యాలతో కూడి ఉండేది.
గాథ: జననీ జనకులు, పితృదేవతలు, భూదేవి మొదలగు వారిని గురించి చేసే స్తోత్రానికి ‘గాథ’ అని పేరు.
దండకం: ఇది స్తోత్ర రూపమైన కావ్యం. దండకం సాధారణంగా భక్తిరసమయమై ఉంటుంది. ఇందులో త, న, స, హ గణాలలో మొదట ఏదో ఒక గణం ఉండి తరువాత ఎక్కువ త గణాలు ఉంచి చివర ఒక గురువు ఉంచాలి. దండకంలో యతి, ప్రాసల నియమం లేదు.
గద్యకావ్యాలు: గద్యకావ్యాలు నాలుగు రకాలు
1. ముక్తకం: సమాసాలు లేని గద్యం
2. వృత్తగంధి: వృత్త భాగవంతమైన గద్యం
3. ఉత్కళికాప్రాయం: దీర్ఘ సమాసాలతో కూడిన గద్య రచన
4. చూర్ణిక: అల్ప సమాసాలతో కూడిన గద్య రచన.
ఆఖ్యాయిక: ఉచ్ఛ్వాసాది విభాగాలు, మధ్యమధ్య ఇతరుల పద్యాలుంటే అఖ్యాయిక అంటారు.
ఖండ కథ: ఏకదేశ వర్ణన గల గద్య ప్రబంధం.


వెనక్కి ...

మీ అభిప్రాయం