కొత్తతరానికి తెలుగు అమ్మభాషకు వెలుగు

  • 125 Views
  • 0Likes
  • Like
  • Article Share

    మాడుగుల నారాయణమూర్తి

  • ఆసిఫాబాద్, ఆదిలాబాదు,
  • 9441139106
మాడుగుల నారాయణమూర్తి

అమ్మభాషలో పిలుచుకునే వరుసలు మాయమవుతున్నాయి. అన్యభాషల పదాలు అందలమెక్కుతున్నాయి. వాడిపోతున్న తెలుగు సంస్కృతిని ఇంటి నుంచే ప్రోది చేయాలి. తెలుగు మాధ్యమ బడులకు ఆదరణ మెరుగవ్వాలి. మాతృభాషను నమ్ముకున్న ఉపాధ్యాయులకు ఊతమివ్వాలి. అప్పుడే తెలుగు పరిపుష్టమవుతుంది.

మతలొలికించే మాతృభాషలో ‘మాటలు’ ఈ రోజుల్లో మృగ్యమవుతున్నాయి. తరాలు మారుతున్న కొద్దీ తెలుగు పలుకులు పెళుసుబారి పోతున్నాయి. ‘నరవర నీచే నాచే వరమడిగిన కుంతి చేత వాసవుచేతన్, ధరచే, భార్గవు చేతన్‌ అరయంగా కర్ణుడీల్గె నార్గురిచేతన్‌’ అన్నట్లు సవాలక్ష కారణాలు తెలుగుకు తెగులంటిస్తున్నాయి. ఆ చీడను వదిలించాలంటే ఏం చేయాలి? జాతికి సాంస్కృతిక సిరులనందించే భాషను బతికించుకోవాలంటే ఎవరు, ఎలాంటి కృషి చేయాలి?
      కుటుంబం, సమాజం, సాంస్కృతిక, విద్య, వ్యవహారాలు, ప్రభుత్వమనే ఆరు కోణాల నుంచి నిర్మాణాత్మక కృషి జరిగితేనే తెలుగు భాషా పరిరక్షణ సాధ్యమవుతుంది. పిల్లలు ఏ మాధ్యమంలో చదువుతున్నా ఇంట్లో మాత్రం తెలుగు భాషనే వినియోగించాలి. అమ్మానాన్నలు ఆమేరకు జాగ్రత్తలు తీసుకోవాలి. మన భాషా సంస్కృతుల గొప్పదనం గురించి తమ మాటల్లో యథాలాపంగా తెలియజేయాలి. పిల్లలకు అర్థమయ్యే స్థాయిలో నిరంతరం చెప్పాలి. పిల్లల తెలుగు మాటల్లో తప్పులు దొర్లితే సరిచేయాలి. తెలుగు సంవత్సరాలు, నెలలు, తిథులు, వారాలు, బాంధవ్యాల (బాబాయి, పిన్నీ, మావయ్య, అత్తయ్య...)ను పరిచయం చేయాలి. ఇంట్లో ప్రతి కార్యక్రమ నిర్వహణలో పిల్లలను భాగస్వాములను చేస్తూ అన్ని వస్తువుల పట్ల వారికి తెలుగులో అవగాహన పెంపొందించాలి.  బాలగేయాలు, కథలు, సామెతలను  సందర్భానుసారంగా చెబుతూ ఆసక్తి పెంచాలి.
      తెలుగు పరిరక్షణలో ప్రధాన పాత్ర పోషించేది సమాజం. ప్రదేశాలకు, కొత్త నిర్మాణాలకు మనవైన పేర్లు పెట్టాలి. కుల, మత సామరస్యంతో భాషా సంస్కృతులను సమన్వయం చేసి సమ్మేళనం చేయాలి. ఇతర భాషీయులతో వ్యవహరించేటప్పుడు మన భాషను మనం తక్కువ చేసుకోకూడదు. తెలుగులో మాట్లాడే వారిని అవమానించొద్దు. అన్ని మాండలికాలు, యాసలకు సమ గౌరవమివ్వాలి. ప్రాథమిక స్థాయి నుంచే పిల్లలు వివిధ సామాజిక, సామూహిక కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా జానపద కళారూపాల ప్రదర్శనలు, భాషా పోటీలు నిర్వహించాలి. ఎన్నికల వేళ ఓట్ల కోసం వచ్చే నేతలను ‘భాషకు మీరేం చేస్తార’ని ప్రశ్నించాలి. ఆమేరకు హామీలు రాబట్టాలి. వాటి అమలుకు పట్టుబట్టాలి. వ్యక్తిగత సంస్కారాలు, వివాహాలు, అక్షరాభ్యాసాలు వంటి కార్యక్రమాలన్నింటికీ పిల్లల్ని సమూహాలుగా ఆహ్వానించాలి. వారికే కొన్ని బాధ్యతలు అప్పగించాలి. ఈ క్రమంలో వారు మన సంస్కృతిని తెలుసుకుంటారు. ప్రేమిస్తారు.
      సమాజంలో తెలుగు అంతర్లీనంగా విస్తరించడానికి సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణ దోహదం చేస్తుంది. కుల, మత, లింగ, వయోభేదం లేకుండా ఎదుటివారిని తెలుగులో పలకరించాలి. సంభాషణలను తెలుగులోనే సాగించాలి. మనదైన కట్టు బొట్టులను కొనసాగించాలి. ముఖ్యంగా వాటి విశిష్టతను చిన్నారులకు విడమరచి చెప్పాలి. ఇతర భాషా సంస్కృతుల ప్రభావం పిల్లలపై పడకుండా చూడాలి. సమాజంలో తప్పుడు పోకడలను గుర్తించి, నియంత్రించడంలో మేధావులు మార్గదర్శులు కావాలి. దీని వల్ల పరోక్షంగా భాషకు మేలు కలుగుతుంది. అంతరాత్మ నుంచి ఆవిర్భవించిన శబ్దరాశి, అసంకల్పిత భాష మన తెలుగు అని గుర్తుంచుకుంటే చాలు ‘పలుకు’కు అదే పదివేలు.
      అన్ని వర్గాలను భాగస్వాముల్ని చేసేది, ప్రభావితం చేసేది విద్య. ప్రతిఒక్కరూ మాతృభాషలో చదువుకునే స్వేచ్ఛ, వనరులు కల్పించాలి. ఇతర మాధ్యమాల్లో విద్యాభ్యాసం చేసే వారికి ఒక అంశంగా తెలుగును నిర్బంధంగా నేర్పించాలి. ఇంట్లో మాట్లాడుకునే యాస, నుడికారంలోనే పూర్వ ప్రాథమిక స్థాయి విద్యనందించాలి. ఆ స్థాయి వరకు పఠనాంశాల(సిలబస్‌)ను స్థానిక జిల్లా అధికారులు, భాషావేత్తలు రూపొందించి, ముద్రించేలా మార్గదర్శకాలు రూపొందించాలి. దీనివల్ల మాండలిక అసమానతలు, భేదాలు, మానావమానాల ప్రసక్తి రాదు. తాను ఇంట్లో మాట్లాడే తెలుగు భాషనే బళ్లో చదువుకుంటున్నానన్న విశ్వాసం, తృప్తి విద్యార్థికి కలుగుతుంది. ఈ స్పృహ భాషపై ధనాత్మక భావనలకు పునాదవుతుంది. పుస్తకాల్లో వ్యవహారిక భాషే నిలవాలన్న గిడుగు రామ్మూర్తి ఆశయం నెరవేరుతుంది. దాంతోపాటు తెలుగు వాచకాల్లో భాషా సంస్కృతీ సంప్రదాయ పౌరాణిక, నీతి, జ్ఞాన అంశాలే ఉండాలి. శాస్త్ర సాంకేతిక, చరిత్రలకు సంబంధించిన పాఠాలు పెట్టకూడదు.
      ప్రాంతీయ భాషా పరీక్షలో ఉత్తీర్ణులైతే తప్ప పదోన్నతి పొందలేరన్న నిబంధన అఖిల భారత సర్వీసుల్లోని అధికారులకు ఉంది. కానీ, ప్రజలతో నిత్య సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండే వైద్యులు న్యాయవాదులు, ఇంజనీర్లకు లేదు. ఫలితంగా వారు ప్రజలను ఆత్మీయంగా పలకరించి, కష్టనష్టాలు తెలుసుకోవడంలో తిప్పలు పడుతున్నారు. కచ్చాపచ్చా మాట్లాడుతూ వృత్తుల్లో కొనసాగుతున్నారు. ఉన్నత విద్యా కోర్సులన్నింట్లో తెలుగును తప్పనిసరి పాఠ్యాంశం చేస్తే తప్ప ఈ పరిస్థితి మారదు.  
      బడుగు బలహీన వర్గాల వారు మాత్రమే ఎక్కువ సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమంలో చదువుతున్నారు. కాబట్టి వారి  తల్లిదండ్రులకు ఆత్మస్థైర్యం కల్పించాలి. తెలుగు మాధ్యమంలో చదివిన వారిని ఉద్యోగ, ఉపాధి ప్రాప్తిలో తగిన విధంగా ప్రోత్సహించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలను పెంచాలి. ప్రభుత్వ విభాగాలకు తెలుగు పేర్లు పెట్టాలి. విద్యా సంబంధిత కోర్సులనూ తెలుగులోనే పిలవాలి.  
      ప్రతి రంగంలో వ్యావహారిక పదకోశాలు, సాంకేతిక పదకోశాలు, నిఘంటువులు, తులనాత్మక పదకోశాలు రూపొందించాలి. అధికార భాషా సంఘం, రాష్ట్ర సాంస్కృతిక శాఖలు క్రియాశీలమవ్వాలి. తెలుగులో ఉత్తర్వులు, తీర్మానాలు, నిర్ణయాలు వెలువడేలా శాసించగలగాలి. అధికార భాషా సంఘానికి తగినన్ని నిధులు కేటాయించి విధులు, బాధ్యతలు నిర్ణయించి అమలు చేసేందుకు ఒత్తిడి తేవాలి. ఆంధ్ర సారస్వత పరిషత్తు, ప్రాచ్య కళాశాలలను ప్రోత్సహించాలి. మండల స్థాయిలో భాషా సంస్కృతుల పరిరక్షణ సమితులను నెలకొల్పాలి.
      ‘తెలుగు’ పేరిట ప్రారంభమైన పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయంలో కేవలం భాషా సంస్కృతీ సంప్రదాయాలు, సంగీత, నృత్య, నాటక, చిత్ర, దృశ్య, శ్రవణ, ప్రసార ప్రచార విభాగాలను మాత్రమే నిర్వహించాలి. చలనచిత్రాలు, టీవీల్లో వినియోగించే భాషను పరిశీలించి, తప్పొప్పులను సరిచేయడానికి ఓ విభాగాన్ని నెలకొల్పాలి. సంస్కృతీ సంప్రదాయాల ప్రచారానికి సంచార విభాగం ఏర్పాటు చేయాలి.
      తెలుగు భాషనే నమ్ముకుని జీవితాలు వెళ్లదీస్తున్న భాషా పండితులకు చేయూతనివ్వాలి. ప్రాథమిక స్థాయిలో ప్రతి విద్యార్థికి అక్షరమాల, గుణింతాలు నేర్పేందుకు తెలుగు పండితులను నియమించాలి. ద్వితీయశ్రేణి ఉపాధ్యాయుల (ఎస్‌జీటీ)తో మాత్రమే సమానంగా వేతనాలు పొందుతున్న తెలుగు పండితులను ప్రాథమిక స్థాయిలో నియమించకుండా ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల్లో నియమిస్తున్నారు. దీనివల్ల ‘నేల విడిచి సాము’ చేసిన చందంగా భాషాశిక్షణ కొనసాగుతుంది. దీంతో అచ్చుల్లోని హ్రస్వాలు, దీర్ఘాలు భేదాలు, హల్లుల్లోని అల్ప, మహా ప్రాణాల భేదాలు, సంయుక్త, ద్విత్త్వాక్షరాల వినియోగాలను సైతం గుర్తించలేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.
      స్నాతకోత్తర పట్టాలు, పండిత ఉపాధ్యాయ శిక్షణలు పొందిన పండితులు పదోన్నతులు లేక నలిగిపోతున్నారు. ఇంటర్మీడియట్, డీఎడ్‌ చేసి ఉద్యోగంలో చేరిన ద్వితీయ శ్రేణి ఉపాధ్యాయులు దూరవిద్య ద్వారా విద్యార్హతలు పెంచుకున్న కొద్దీ, అనుభవం పెరిగిన కొద్దీ మూడేసి పదోన్నతులు పొందుతున్నారు. గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులు మండల విద్యాధికారులు అవుతున్నారు. పండితులపై అధికారం చలాయిస్తున్నారు. అంతకంటే ఎక్కువ విద్యార్హతలతో నియమితులైనా తెలుగు పండితులు మాత్రం ఎక్కడి వారక్కడే ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్నట్లు మిగిలిపోతున్నారు. అందుకే... పండితులు కావడానికి యువతరం ఆసక్తి చూపట్లేదు. కావాలంటే... ఏ ఉన్నత పాఠశాలకైనా వెళ్లి చూడండి, గణితం, ఆంగ్లం, సాంఘిక, సామాన్య శాస్త్రాలను బోధించే వారిలో నవయువకులు ఎక్కువగా కనిపిస్తారు. తెలుగు పండితులుగా మాత్రం వయసు పైబడిన వారే ఉంటారు. ఈ పరిస్థితిలో మార్పు వస్తేనే నవతరానికి తెలుగు చేరువవుతుంది.
      భాషోద్యమాలు గ్రామస్థాయికి వెళ్లాలి. సదస్సులు, గోష్ఠుల్లో పల్లె ప్రజలకు ప్రాధాన్యతనివ్వాలి. వారి అభిప్రాయాలను తెలుసుకోవాలి. తెలుగులో ఉన్న గొప్పదనమేంటి, ఎందుకు చదువుకోవాలనే ప్రశ్నలకు సమర్థనీయంగా వివరణ ఇవ్వగల ఆత్మస్థైర్యం భాషా వినియోగదారుల్లో పెంచేలా ఉద్యమాలు సాగాలి. స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ యంత్రాంగాలు, పత్రికలు, ప్రసారమాధ్యమాలు, వ్యక్తుల సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా తెలుగుకోసం కృషి జరిగే వాతావరణాన్ని సృష్టించాలి. ఈ దిశగా ప్రతి భాషాభిమాని వడివడిగా అడుగులేయాలి.


వెనక్కి ...

మీ అభిప్రాయం