తెలుగుకు ‘పొగ’ బండి

  • 140 Views
  • 0Likes
  • Like
  • Article Share

    సత్తి లలితారెడ్డి

  • హైదరాబాదు.
  • 9492641252

ప్రయాణికులకు విజ్ఞప్తి...
రైల్వే స్టేషన్లోకి అడుగుపెట్టగానే వినిపించే తెలుగు మాట ఇది. బాగుంది. టిక్కెట్టు తీసుకుని రైలెక్కుతాం. అక్కడ తెలుగు కనిపిస్తుందా? ఏవో కొన్ని రైళ్లలో తప్ప ‘సూచన’లేవీ తెలుగులో ఉండవు. కావాలంటే... సికింద్రాబాద్‌ - విశాఖపట్నం మధ్య నడిచే గరీబ్‌రథ్‌ ఎక్స్‌ప్రెస్‌ను చూడండి. ఆంగ్లం, హిందీలు మాత్రమే ఉంటాయి. తెలుగేం పాపం చేసుకుంది? తెలుగు నేలపై తిరగాడే రైల్లో తెలుగు ఉండక్కర్లేదా? 
      దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే జోన్లన్నింటిలో హిందీనే వినియోగించడానికి కారణం... అది జాతీయ భాష. కొందరు చేసే వాదన ఇది. అది శుద్ధ తప్పు. హిందీ మన జాతీయ భాష కాదు. కాదంటే కాదు. అధికార భాష మాత్రమే. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 343... హిందీకి ఇచ్చిన హోదా అదే. గుజరాత్‌ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కూడా మూడేళ్ల కిందట ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. మన దేశానికి జాతీయ భాష అంటూ ఏదీ లేదని! దీని అర్థమేంటి? కేంద్ర స్థాయిలో హిందీకి, రాష్ట్రాల పరిధిలో స్థానిక భాషలకే పట్టం కట్టాలని కదా! మరెందుకు దక్షిణమధ్యరైల్వే (ద.మ.రై. - ప్రధాన కార్యాలయం సికింద్రాబాద్‌) తెలుగును పక్కనబెట్టేసి తెలుగు ప్రయాణికుల నెత్తిన హిందీని రుద్దుతోంది? 
      ద.మ.రై.లో ‘రాజభాషా విభాగం’ అని ఒకటుంది. అది హిందీ కోసం మాత్రమే పని చేస్తుంటుంది. రైల్వే ఉద్యోగుల్లో హిందీ పరిజ్ఞానాన్ని పెంచడం కోసం కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. ఇందుకు గానూ హైదరాబాద్, కాజీపేట, డోర్నకల్, భద్రాచలం, రామగుండం, బెల్లంపల్లి, వికారాబాద్‌ తదితర ప్రాంతాల్లో హిందీ గ్రంథాలయాలను ఏర్పాటు చేసింది. హిందీ ప్రచారం కోసం చేసిన ఇతరేతర కృషికిగానూ... రైల్వేమంత్రి ఇచ్చే ‘రాజభాషా బహుమతి’ ఈ ఏడాది దక్షిణ మధ్య రైల్వేనే వరించింది. చూడండి... ఈ దురవస్థను! ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక ప్రాంతాన్ని, కర్ణాటక, మహారాష్ట్రల్లోని కొన్ని ప్రాంతాలకు సంబంధించిన ద.మ.రై.కు హిందీ బహుమతి!!! మరి ఈ రాష్ట్రాల స్థానిక భాషల పరిస్థితేంటి? ఆయా ప్రాంతాల్లో అవే రాజభాషలు కదా. వాటిని ప్రోత్సహించే బాధ్యతను రైల్వేలెందుకు స్వీకరించవు? ప్రోత్సాహం సంగతి తర్వాత... స్థానిక ప్రయాణికులకు స్థానిక భాషల్లోనే సూచనలందివ్వాలన్న కనీస తెలివిడి ఎందుకు ప్రదర్శించట్లేదు?
      నాలుగైదు దశాబ్దాల కిందట సికింద్రాబాద్‌ రైల్వే డివిజను... దక్షిణ రైల్వేలో భాగంగా ఉండేది. అప్పట్లో రైలు నిలయం (ఇప్పటి ద.మ.రై. ప్రధాన కార్యాలయం)తో సహా అన్నిచోట్లా తమిళమే అధికార భాషగా చెలామణీ అయ్యేదట! ఈ విషయాన్ని ఇప్పటికీ పెద్దలు చెబుతుంటారు. ప్రస్తుతం మనకు ప్రత్యేకమైన రైల్వే జోన్‌ ఉంది. అయినా... తెలుగు కనిపించట్లేదు. ఆనాటి తమిళం స్థానాన్ని హిందీ (ఆంగ్లం కూడా) ఆక్రమించింది. ఈ పరిస్థితి మారాలి. మన రాష్ట్రంలో తిరిగే, రాష్ట్రం గుండా వెళ్లే ప్రతి రైలులోనూ తెలుగు కనిపించాలి. దాని కోసం మనందరం పట్టుబట్టాలి. కొత్తగా నిర్మితమవుతున్న హైదరాబాద్‌ మెట్రోలో కూడా తెలుగుకే అగ్రతాంబూలం ఇవ్వాలి. 
      చివరగా... మన అధికార యంత్రాంగం నేర్చుకోవాల్సిన విషయం ఒకటుంది. దాన్ని ఎమిరేట్స్‌ విమానాల్లో దుబాయి - హైదరాబాద్‌ మధ్య ప్రయాణించిన వారు గమనించే ఉంటారు. ఆ విమానాల్లోని మెనూ కార్డుల్లో అరబిక్, ఆంగ్లంతో పాటు తెలుగు అక్షరాలు కూడా తళుక్కుమంటాయి. ‘షాంపేన్‌ మినహాయించి, అందించే అన్ని పానీయాలు ఉచితమైనవే’, ‘తరిగిన కీరదోసకాయ, ఉల్లిపాయలతో...’ ఇలా ప్రతి విషయం గురించి తెలుగులో సమాచారమిస్తుంది ఆ కార్డు. ఎక్కడో సముద్రాలకవతల ఉన్న వారు స్థానిక భాషల ప్రాధాన్యతను గుర్తించారు. అదీ స్వచ్ఛందంగా! మరి మనవాళ్లు ఆ పని చేయలేరా! చేయకపోతే... మనం చేయించలేమా!


వెనక్కి ...

మీ అభిప్రాయం