ఏడు తరాల నీడ

  • 177 Views
  • 2Likes
  • Like
  • Article Share

    సూరంపూడి పవన్‌ సంతోష్‌

  • తాడేపల్లిగూడెం
  • 9640656411
సూరంపూడి పవన్‌ సంతోష్‌

ఉత్తమ సాహిత్యం ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, రచనకు చెందిన స్థలకాలాల్ని ప్రతిబింబిస్తూనే ప్రపంచంలోని అందరినీ కదిలించగల అంశాలు తనలో దాచుకుంటుంది. అందుకే వాటి అనువాదాలు చదివితే ఆ భాషీయుల విలక్షణ సంస్కృతి అవగాహన కావడమే కాక మానవాళిని అన్నదమ్ముల్ని చేసే వెతలు, ఆనందాలు కూడా అనుభవానికి వస్తాయి. తెలుగు భాషను పరిపుష్టం చేసేందుకు ఎందరో ప్రఖ్యాత కవులు, రచయితలు అనువాద ప్రక్రియను చేపట్టి తమని ప్రభావితం చేసిన, తమకు నచ్చిన పుస్తకాల్ని తెలుగు పాఠకులతో పంచుకున్నారు. దాశరథి కృష్ణమాచార్యులు, దాశరథి రంగాచార్యులు, తిరుమల రామచంద్ర, శ్రీశ్రీ వంటి వారెందరో అలా తమకు అభినివేశం ఉన్న భాషలో సాహిత్యాన్నో, తమను ప్రభావితం చేసిన సిద్ధాంతానికి చెందిన రచనల్నో అనువదించారు. ఇలా ప్రసిద్ధ రచయితలు అనువదించిన రచనలే కాక అనువాదాల వల్లనే ప్రసిద్ధులైన రచయితలు కూడా ఉన్నారు. వారిలో ముందు వినిపించే పేరు సహవాసి. ఆయన ఆంగ్లం నుంచి సంక్షిప్తీకరించి, అనువదించిన నవలే ‘ఏడు తరాలు’. అమెరికా చరిత్రలో చీకటి కోణాల్ని ఆర్ద్రంగా స్పృశిస్తూ అలెక్స్‌ హేలీ రాసిన ‘రూట్స్‌’కు ఇది అనువాదం.
      ప్రపంచం ఒక కుగ్రామమైపోయిందని చెప్పుకున్నా మౌలికంగా మనిషి తన జాతి, తన భాష, తన వంశం, తన చరిత్ర వంటి వాటిలో తన ఉనికిని గుర్తించుకుంటాడు. తన భాషలోని అద్భుత సాహిత్యాన్నీ, తన జాతివారు చేసిన ఆవిష్కరణల్ని తన ఆస్తిగా గర్విస్తాడు. తమ వారు గతంలో సాధించిన విజయాలకు పులకిస్తాడు. తన జాతి అనుభవించిన కష్టాలకు తాదాత్మ్యత చెంది కన్నీరు పెడతాడు. తాను ఏ జాతివాణ్నో, తమ వారు ఎక్కణ్నుంచి వచ్చారో తెలియని వారి బాధ వర్ణనాతీతం. ఆ బాధను మాన్పించేందుకు తమ ఆఫ్రికన్‌ మూలాల్లోకి అమెరికన్‌ రచయిత అలెక్స్‌ హేలీ చేసిన అన్వేషణే ఈ నవల.
      ఇది పూర్తిగా కల్పిత గాథ కాదు. హేలీ నిజ జీవితంలో తన వంశపు మూలాలపై చేసిన లోతైన పరిశోధనకు అక్షరరూపం. 
ఈ నవల ఆంగ్లంలో విడుదలైనపుడు పెను సంచలనాలు సృష్టించింది. హేలీకి పురస్కారాలు పండించింది. టీవీలో ధారావాహికగా, వెండితెరపై చలనచిత్రంగా చిత్రీకరించారు. ఈ నవలను నల్లజాతి ప్రజలు తాము అనుభవించిన అణచివేతకు, తమ ఆత్మగౌరవానికి ప్రతీకగా దాచుకుంటే, తెల్లవారు గతంలో జరిగిన తప్పులకు పశ్చాత్తాపంగా చదివారు. మొత్తానికి ఆఫ్రికన్‌ అమెరికన్లలో ఓ పవిత్రగ్రంథం స్థాయి గౌరవం పొందిందీ నవల.
      1750లో ఉత్తర ఆఫ్రికాలో గాంబియా తీర గ్రామమైన జఫర్‌లో కింటో, రెబ్బాలకు కొడుకు కుంటా పుట్టడంతో కథ ప్రారంభమౌతుంది. డేవిడ్‌ అబ్రహంలు మూల పురుషులుగా ఇస్లాం మతంగా వస్తున్న పురాతన తెగ మాండికోకు చెందినవారు వాళ్లు. ఆఫ్రికాలోని ప్రకృతి సౌందర్యాన్నీ దానిలో మమేకమై జీవించే 
ఆ తెగవారిని, వారి వింత సంప్రదాయాలను ఎంతో చక్కగా చిత్రిస్తారు రచయిత. ముఖ్యంగా కుర్రాళ్లకు పూర్తిస్థాయి పురుషులై తెగను రక్షించుకునేందుకు అడవిలోకి పంపి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం వంటివి వింతగా ఉంటాయి.
      ఆ పురాతన నాగరికతలో 16 ఏళ్లు పెరుగుతాడు కుంటా. పురుషత్వ శిక్షణ ముగించుకుని పొలానికి కావలిగా పడుకొని భవిష్యత్తులో వైవాహిక జీవనం గురించి మధురమైన కలలు కంటాడు. తర్వాత రోజు ఉదయాన్నే తమ్ముడికి డప్పు చేసేందుకు మంచి కలప కోసం అడవికి వెళ్లిన కుంటా తెల్లదొరలకు దొరికిపోతాడు. వేటకుక్కలతో, మారణాయుధాలతో వేటాడి ఉచ్చువేసి పట్టుకుంటారు. మనుషులను ఎత్తుకుపోయే తెల్ల గెడ్డం వారి గురించి, వారి నుంచి వచ్చే చచ్చిన కోడి వాసన వంటి ఎన్నో జాగ్రత్తలు గతంలోనే తండ్రి చెప్పినా పొరపాటున ఆదమరచి ఉన్న సమయంలో దొరికిపోతాడు. కొట్టి, కొట్టి స్పృహ తప్పేలా చేసి తీసుకుపోతారు వారు.
      అక్కడితో అతని జీవితంలో స్వేచ్ఛ అంతరించి ఘోరమైన బానిసత్వం ఉదయిస్తుంది. వందలాదిమంది నల్లవారిని బానిసలుగా పట్టుకుని అమెరికా తరలిస్తున్న ఓడలోకి కుంటాని సంకెళ్లతో చేరుస్తారు. అక్కడ డెక్‌పైనున్న బానిసలను అందర్నీ వివస్త్రలను చేసి, ఎదిరించినవారిని హింస్తారు. నల్లజాతి స్త్రీలపై ఘోరమైన అత్యాచారాలు చేస్తూంటారు. బానిసగా గుర్తుకోసం కాల్చిన ఇనుపకడ్డీతో ముద్రవేస్తారు. అనంతరం ఎక్కడో ఓడ అడుగు భాగంలో సంకెళ్లతో కట్టిపడేస్తారు. ఆ చీకటి గుయ్యారంలో గాయాలైన పుళ్లు, తమ మలమూత్రాల మధ్య ఘోరమైన  ప్రయాణం అనంతరం అమెరికాలో దిగుతాడు కుంటా. అతని శరీరాన్ని, అవయవాల పటుత్వాన్ని పరీక్షించుకుని ఓ తెల్ల భూస్వామి కొనుక్కుంటాడు.
      కుంటా నిరంతరం ఆ కూపం నుంచి తప్పించుకుని పారిపోయే ప్రయత్నాలు చేస్తుంటాడు. ప్రతి ప్రయత్నం విఫలమౌతుంది. ఓమారు తప్పించుకుని దొరికిపోయిన బానిసల్ని పట్టుకునే తెల్లవాడు శిక్షించదలిచి జననాంగాన్నో, పాదాన్నో ఒకటే ఎంచుకోమని గొడ్డలి ఎత్తి సైగ చేస్తాడు.
ఏ పురుషుడూ సృష్టి చేసే శక్తిని వదులుకో కూడదన్న తమ తెగ సంప్రదాయం మేల్కొంటుంది. కుంటా మర్మావయవాన్ని కప్పుకుంటాడు. పాదాన్ని తెల్లవాడు నరికేస్తాడు. ఇక తప్పించుకునే అవకాశం లేదని తెలుసుకుని బానిస బతుకుతో సమాధానపడతాడు కుంటా. తోటి బానిస స్త్రీ బెల్‌ను పెళ్లి చేసుకుంటాడు. వారికి కిజ్జీ అనే కూతురు పుడుతుంది.
      పరిస్థితులు ఇలా ఉన్నా కుంటాకి తన తెగ సంప్రదాయాలు, మత విశ్వాసాల పట్ల  అపారమైన నమ్మకం ఉంటుంది. చావడానికైనా సిద్ధపడతాడు కానీ వాటిని భంగపరిచేందుకు ఇష్టపడడు. అయితే ఆ ఘోరమైన పరిస్థితుల్లో తన భాషలో మాట్లాడటం, మతాచారాలు పాటించడం లాంటివి నిషేధం. అయినా రహస్యంగా అవి సాగిస్తూనే ఉంటాడు. కుంటా తన సంప్రదాయాల ప్రకారమే తన కూతురు కిజ్జీని పెంచుతాడు. తన మాతృభాషలోని కొన్ని పదాలు నేర్పుతుంటాడు. తన కథ అంతా చెప్తాడు. అంతే కాదు రాబోయే తరాలకూ ఈ కథ చెప్పాలని కోరతాడు.
      ఆ తర్వాత కథలో కిజ్జీ, ఆమె వారసులు పడే దారుణమైన అవమానాలూ, బాధలూ ఉంటాయి. కుంటా తర్వాత తరాల వారు అంతర్యుద్ధం అనంతరం అందరు బానిసల్లాగానే విముక్తి పొందుతారు. వివక్ష అనుభవిస్తారు. ఇన్నింటి నడుమా కుంటా వంశీకుల్లో అతని కథ పరంపరానుగతంగా అన్ని తరాలకూ వస్తూంటుంది. అలా కుంటాకి ఏడో తరం వాడైన రచయిత అలెక్స్‌ హేలీకి కూడా తెలుస్తుంది. అతను ఆ కథను ఆధారంగా చేసుకుని తన మూలాల్ని అన్వేషిస్తాడు. పదేళ్లు దీక్షగా బానిసల వివరాలు, వారిని తీసుకొచ్చిన ఓడల రాకపోకలు నమోదైన పురాతన ప్రభుత్వ పత్రాలను అమెరికా దక్షిణ ప్రాంతంలోని గ్రంథాలయాల్లో పరిశోధించి వివరాలు సేకరించాడు. చివరకు తన ముత్తాత పుట్టిపెరిగిన ఉత్తర ఆఫ్రికా ప్రాంతాన్నీ, అక్కడ నదిని చూస్తాడు. కుంటా కథలోని పదాల ఆధారంగా అతను పుట్టిపెరిగిన ఊరికి చేరతాడు. అక్కడ మాండికో తెగవారు కంఠస్థం చేసి వినిపించే వంశవృక్షంలో తప్పిపోయిన వ్యక్తిగా కుంటా కింటో పేరు విని ఆనందం, ఉద్వేగం ముప్పిరిగొని చలించిపోతాడు. ఈ సన్నివేశం చదువుతూ కంటతడి పెట్టుకోని మనిషి ఉండడు. కుంటా కథని వినిపించి, తమ బంధువులను కలుసుకోవడంతో ముగుస్తుందీ కథ.
      ‘సహవాసి’ కలం పేరుతో ప్రసిద్ధులైన జంపాల ఉమామహేశ్వరరావు అనువదించిన ఈ నవల తెలుగు అనువాద రంగంలో బాగా పేరుపొందిన పుస్తకం. ఒక పక్క నవల రాసిన స్థల కాలాల స్పర్శ అందిస్తూనే, మరోపక్క నేరుగా తెలుగులో వచ్చిన నవలే చదువుతున్నామనిపించే అనువాద శైలి సహవాసిది. ‘రక్తాశ్రువులూ, తిరస్కృతులూ, విముక్తి’ వంటి ఎన్నో నవలలను అనువదించి తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయిన చిర యశస్వి సహవాసి.
      హేలీ ఈ రచన విషయంలో విమర్శలను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా కుంటా కింటేనే టోబీ (బానిస పేరుగా రికార్డుల్లో దొరికింది) అనడానికి ఉన్న ఆధారాలు చాలా బలహీనమైనవని కొందరు విమర్శించారు. అవే ఆయన రచనకు విలువ పెంచాయి. ఇంత శ్రమకోర్చిన ఆయన మూలాలను తెలుసుకోలేరని భావించాల్సి వస్తే ఆ వేళ్లకు పట్టిన బానిసత్వమనే పురుగు ఎంత లోతుగా చొచ్చుకుపోయిందో ఊహించుకోవచ్చు. బానిసల కష్టాలు, అవమానాలు, బానిస స్త్రీలపై లైంగిక హింస వంటివి కలచివేస్తాయి. ఇక సాంస్కృతికంగానూ అణచివేసేందుకు బానిసల పూర్వ మతాచారాలు అనుసరించకూడదనీ, మాతృభాషలో మాట్లాడకూడదనీ నిషేధిస్తారు. చివరకు బానిసల పేర్లు కూడా మార్చేస్తారు. వేలాది ఎకరాల్లో పత్తిని పండించేందుకు లక్షలాది బానిసల జీవితాలు బుగ్గిపాలు చేసిన దౌర్భాగ్యకరమైన చరిత్రకి ఈ నవల ప్రత్యక్ష సాక్ష్యం. ఒక్కమాటలో చెప్పుకోవాలంటే ఈ నవల ఎలాంటివారికైనా హృదయాన్ని కల్లోల పరచి మానవత్వాన్ని మేల్కొలుపుతుంది.
      ఆంగ్లభాషకూ, పాశ్చాత్య నాగరికతకూ పట్టం కట్టి తమంత తాముగా స్వచ్ఛంద సాంస్కృతిక బానిసత్వంలో ఇరుక్కున్న తెలుగువారు తప్పక చదవాల్సిన నవల ఇది. 


వెనక్కి ...

మీ అభిప్రాయం