చందమామ రావే

  • 275 Views
  • 0Likes
  • Like
  • Article Share

    వి.రాధ‌

  • విజ‌య‌వాడ‌
  • 9032044635
వి.రాధ‌

రామా లాలీ... మేఘశ్యామా లాలీ...
తామరస నయనా దశరథ తనయా లాలీ...

      కమ్మని లాలి పాటలు, హాయిగా వినిపించే జోలపాటలు  అమ్మల నోటి నుంచి జాలువారే అమృత ధారలు... వింటూనే మానవ జీవనయానం ఆరంభమవుతోంది. పొత్తిళ్ల నుంచి వార్ధక్యం వరకూ జీవితపు ప్రతి దశలోనూ ఒక భాగంగా కలసిపోయిన పాటలు... ఇప్పుడు క్రమంగా కనుమరుగైపోతున్నాయి.     
‘‘జోల పాడు కృష్ణ, జోకొట్టు రంగా...
నిద్రపో బలభద్ర రాము తమ్ముడవు... జో... లాలీ’’
‘‘చిట్టి చిట్టీ రావే... శ్రీలక్ష్మి రావే...
ఆదిలక్ష్మి రావే... అమ్మాయితో ఆడ... 
జో... లాలీ’’
అంటూ గది మధ్యలో చీరెతో కట్టిన ఉయ్యాల ఊపుతూ జోల పాడి నిద్రబుచ్చే వారొకప్పుడు. అంతేనా!
      బిడ్డకు ఆకాశంలో చందమామని చూపిస్తూ...
‘‘చందమామ రావే... జాబిల్లి రావే...
కొండెక్కి రావే... గోగు పూలు తేవే...
బండెక్కి రావే... బంతి పూలు తేవే...
తేరు మీద రావే... తేనె, పాలు తేవే...
అన్నిటినీ తేవే... అమ్మాయి కీయవే...’’ 
అని మురిపిస్తూ గోరుముద్దలు తినిపించేవారు.
కాళ్లమీద బిడ్డని బోర్లా పడుకోబెట్టుకుని కాళ్లని నెమ్మదిగా పైకి మడుస్తూ, కొద్దిగా వెనక్కి వాలి....
‘‘ఉయ్యాల... జంపాల...
కొండెక్కి... జామెక్కి...
సిరిమువ్వ... చిట్టితల్లి...’’ 
అంటూ కాళ్లని ఊపుతుంటే పిల్లలు కిలకిలలాడే వారు. తల్లులకీ ఈ ఆటా-పాటా ఒక వ్యాయామంగా పొట్ట తగ్గడానికి ఉపయోగపడేది.
      పిల్లల్ని కాళ్లు జాపమని వారి చేతులతో కాళ్లు తడుతూ ‘‘కాళ్లా గజ్జే... కంకాళమ్మ...’’ పాడేవారు. ఆ పాటలో ‘పెట్టు’ అన్న పదం ఏ కాలును తడుతున్నపుడు వచ్చిందో ఆ కాలు మడిపించి, మళ్లీ పాట పాడుతూ కాళ్లు తట్టడం మొదలెట్టేవారు. ఇప్పటికీ పెద్దవారికి ఈ పాట గుర్తుండే ఉంటుంది.
అలాగే, చేతి వేళ్లని చూపించి నేలమీద ఆన్చి, వేళ్లని తడుతూ ‘‘చిట్ల పొట్లకాయ, సీమ చింతకాయ, బళ్ల బచ్చలికూర’’ అని పాడుతూ వేళ్లు మడిపించే ఆట కూడా ఉండేది. 
      కొంచెం పెద్ద వాళ్లయిన తర్వాత ఆడ, మగ పిల్లలందరూ కలసి ఇంటి ఆవరణలో దాగుడు మూతలు ఆడేవారు.
‘‘దాగుడు మూతా దండా కోర్,
పిల్లీ వచ్చే, ఎలుకా... హుష్,
ఎక్కడి దొంగలక్కడే గప్‌ చిప్‌’’ 
అంటూ కళ్లకు గంతలు కట్టుకుని చేసే సందడికి అంతుండేది కాదు. క్రమంగా మగపిల్లలు చెడుగుడులు, చెరువుల్లో ఈతలు వంటి ఆటల్లో మునిగి పాటకు దూరమయ్యేవారు. కానీ, ఆడపిల్లలకు ఆటా... పాటా... కలిసే ఉండేవి. ఇద్దరు లేదా ముగ్గురు కలిసి చేతులు గట్టిగా పట్టుకుని గుండ్రంగా తిరిగే ‘ఒప్పుల కుప్ప’ను పెద్దవాళ్లవరైనా మర్చిపోగలరా! 
‘‘ఒప్పుల కుప్ప - వయ్యారి భామ,
చిన్ని మువ్వ - సన్న గాజు,
సన్న బియ్యం - చాయ పప్పు,
కొబ్బరి కోరు - బెల్లం పచ్చు,
గూట్లో రూపాయ్‌ - నీ మొగుడు సిపాయ్,
రోట్లో తవుడు - నీ మొగుడెవడు?’’
అని సిగ్గు పడుతూ, కిలకిల్లాడుతూ, గిరగిరా తిరుగుతున్న ఒకప్పటి ఆడపిల్లల అందం ఇప్పటికీ కళ్ల ముందే కదలాడుతోంది.
‘‘చెమ్మ చెక్క - చేరడేసి మొగ్గ,
అట్లు పొయ్యంగ - ఆరగించంగా,
ముత్యాల చెమ్మచెక్క - ముగ్గులేయంగా,
రత్నాల చెమ్మచెక్క - రంగులేయంగా,
సుబ్బారాయుడి పెళ్లి - చూచి వద్దాం రండి,
మా ఇంట్లో పెళ్లి - మళ్లీ వద్దాం రండి’’
ఇద్దరు ఆడపిల్లలు ఎదురెదురుగా నిల్చొని చప్పట్లు చరుస్తూ, చేతులు తాకిస్తూ, అడుగులు ముందుకీ వెనక్కీ వేస్తూ పాడే ఈ ‘చెమ్మ చెక్క’ పాట ఏమైందిప్పుడు?  
      రేడియో వచ్చిన తొలి నాళ్లలో చిన్నారుల కోసం మంచి పాటలు వినిపించేవారు.
‘‘ఆటలు ఆడీ, పాటలు పాడీ, అలసి 
వచ్చానే...
తియ్య తియ్యని తాయిలమేదో 
తీసిపెట్టమ్మా!
గూటిలోని బెల్లమ్ముక్కా కొంచెం పెట్టమ్మా,
చేటలోని కొబ్బరి కోరు చారెడు తియ్యమ్మా,
అటకా మీది అటుకుల కుండ అమ్మా!
 దించమ్మా
తియ్య తియ్యని తాయిలమేదో తీసిపెట్టమ్మా!
పిల్లీ పిల్ల కిటికీలోంచి తొంగి చూస్తోంది.
కుక్కాపిల్ల తోకాడిస్తూ గుమ్మం దాటింది.
కడుపులోని కాకిపిల్ల గంతు లేస్తోంది...
తియ్య తియ్యని తాయిలమేదో 
తీసిపెట్టమ్మా!’’
      ఈ పాట ఒక ఉదాహరణ మాత్రమే. 
      ఏవీ...? నేడెక్కడ ఉన్నాయి ఈ మధురమైన భావజాలాలు? పిల్లల సహజ సిద్ధమైన స్వభావ చిత్రణ ఇప్పుడు ఎక్కడ దాక్కుంది...? రాసేవారు లేరా అంటే ఉన్నారు. రాస్తూనే ఉన్నారు. కానీ వాటిని చదివే తీరిక, పాటలుగా పాడే శ్రద్ధ మాత్రం లేవు. అచ్చ తెలుగు అమృతత్వాన్ని అందుకునే సమయం ఇప్పుడెవరికీ లేదు. తల్లిదండ్రులు పని ఒత్తిడిలో, పిల్లలు చదువుల ఒత్తిడిలో మునిగిపోయారు.
      ఇంత చక్కని తెలుగుని ఆనందంగా తమ పెద్దల నుంచి నేర్చుకున్న ఈ తరం పెద్దలు... ఆ తెలుగుని తర్వాత తరాలకు అందించే బాధ్యత తీసుకోవాలి.
మనుమలు మనుమరాళ్లకు తెలుగుదనం అందించే ప్రయత్నం చేయాలి. పిల్లల సర్వతోముఖాభివృద్ధి ఈ అమృత బంధాల్లోనే ఉందని తెలుసుకోవాలి.
జీర్ణం... జీర్ణం... వాతాపి జీర్ణం
పొత్తిళ్లలోని బిడ్డ తాగిన పాలు చకచకా అరగాలి... త్వర త్వరగా ఆ పాప ఎదగాలి. దీన్నే పాట రూపంలోకి మార్చిపాడే వారు ఆనాటి అమ్మలు.


జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం
గుర్రాలు తిన్న గుగ్గిళ్లరిగి
ఏనుగులు తిన్న ఎలక్కాయలరిగి
అర్జునుడు తిన్న అరటిపళ్లరిగి
భీముడు తిన్న కజ్జాలరిగి
అబ్బాయి తాగిన పాలు ఆముదమరిగి
పండల్లే పాప, కుండల్లే కూర్చొని
నందల్లే నడిచి, గుర్రమంత పరుగు
ఏనుగంత సత్తువు ఉండేటట్టు
సాకుమీ ఈ బిడ్డను సంజీవరాయా!


పాటే మందు!
మన పాటల్లో అద్భుతమైన ఔషధ రహస్యాలున్నాయి. కావాలంటే ‘గచ్చకాయలాట’లో పాడే ఈ పాటను చూడండి...
కొండమీద ఎండిగిన్నె
కొక్కిరాయి కాలిరిగె
దానికేమి మందు?
యాపాకు సేదు
ఎల్లుల్లి గడ్డ
నూనెలో మడ్డి
నూటొక్కసారి
పూయవోయ్‌ నూరి
పూటకొక్కతూరి!


బూచోడొత్తున్నాడు!
నువ్వింతే ఏడిస్తే బూచోడెత్తుకుపోతాడు! పిల్లల ఏడుపును ఆపడానికి తెలుగింట అమ్మలు సరదాగా చెప్పే మాట ఇది. పాటలోంచి పుట్టిన పలుకు ఇది. 
అడుగో బూచోడు
మన అటక మీదున్నాడు
ఏడుస్తే వాడు నిన్నెత్తుకుపోతాడు
మిట్ల గుడ్డివాడు
పొణకంత పొట్టివాడు
మన తట్టలో దాగున్నాడు
జడపట్టుకు లాగుతాడు
నోరు చూపుతాడు
పలు కోరలు చూపుతాడు
నీ ఆరడి విన్నాడూ
ఈసారి ఊరుకోడు


ఎవరు దొంగ?
గూట్లో దాచిన పప్పులు మాయమయ్యాయట! చెల్లెలే తినేసిందని అన్నగారికి అనుమానం. దాన్ని పాటగా మార్చి ఎంత ముద్దుగా అడుగుతున్నాడో చూద్దామా...
చిట్టిపొట్టి చెల్లెలా
చిట్టి ఎలుక నేస్తమా!
వేరుసెనగ పప్పులన్నీ
ఎట్ల మాయమయ్యెనే
చిట్టీ నీదు వంతు ఎంత?
చిట్టి ఎలుక వంతు ఎంత?


కాపాడు నా తండ్రీ!
ఏడ్చి ఏడ్చి బిడ్డ నిద్దరోతోంది. అమాయకమైన ఆ పసిదాన్ని చల్లగా చూడమని దేవుణ్ని వేడుకుంటుంది తల్లి. అదీ పాట రూపంలో...
ఆయి ఆయి ఆయి ఆపదలు గాయి
చిన్నివాళ్లను గాయి శ్రీవెంకటేశ
గాయి గాయి గాయి యేదమ్మ గాయి
అంగళ్ల ఆడేటి అబ్బాయి గాయి
పోలేరమ్మ పొత్తిళ్లు గాయి
పొత్తిళ్ల నాడేటి అబ్బాయిగాయి


 


వెనక్కి ...

మీ అభిప్రాయం