కలం చెప్పని కవిత్వం

  • 212 Views
  • 0Likes
  • Like
  • Article Share

అంతవరకూ చంచల మేఘాలతో నిండిన నింగి మబ్బుపట్టి లోకం మసక బారితే పల్లె మనసులు తేలిక పడతాయి. ఆశతో ఆకాశానికి మొక్కుతూ నిట్టూర్పు విడుస్తూన్నప్పుడు తూర్పుగాలి వీస్తుంది. తొలకరి చినుకు కురుస్తుంది. విచ్చుకున్న విత్తులవుతారు కర్షకులు. మెత్తని భూమి పచ్చని పావడా పరుచుకుంటుంది. పర్జన్యుడు (వర్షమేఘం) పలకరిస్తాడు. తూనీగలు ఆడతాయి. తూములతో వర్షం కురుస్తుంది. పూలమకరందం నిండుతుంది. తుమ్మెదలకు తీరిక కరువవుతుంది. ఏరులూ, వాగులూ, నదులూ, సాగర సంగమానికి పరుగులు తీస్తాయి. పలుగు, పార, పలుపు, పశువు రైతుకు నేస్తాలై పుడమితల్లి సౌభాగ్యానికి తోడవుతాయి. పల్లె తల్లి ఒంటరవుతుంది. పొలాలే పల్లె ప్రజలకు నివాసాలవుతాయి. ఇది నాట్ల కాలంలో అన్నదాతల జీవితచక్రం. 
      వ్యవసాయాధార రాష్ట్రం మనది. దేశానికి అన్నపూర్ణగా వాసికెక్కిన నేల మనది. అయితే, రైతులు అనేక వ్యయప్రయాసలకోర్చి భూమిని సాగు చేస్తారు. విత్తులు జల్లి, ఆకును ఉడిచి, కలుపు తీసి, కోతల వరకూ పడే వారు శ్రమను వాళ్లు మరచి పోవడానికి పాట ఊతమైంది. తెలుగు జానపదుల మాండలికాల్లో భేదమున్నా ఈ పాట ప్రతిచోటా, నోటా పూదోటై వికసించింది. పదాల మకరందాన్ని పంచింది. ఈ గీతాల బృందావనిలోంచి ఓ ‘నాట్ల’ పాట...
‘‘గట్టూ మాకులు గట్టి గడలూ బొందిచ్చి
గట్టు రాయని ఇంట్లో పుట్టే గౌరమ్మ
గట్టూ మాకులు గట్టి గడలూ బొందిచ్చి
గట్టు రాయని ఇంట్లో పుట్టే గౌరమ్మ ।।
పుట్టుటే గౌరమ్మ ఏమేమి  గోరు
కుట్టూ వయ్యారి రవికె, కుంకూమా కాయ
జాల వయ్యారి రవికె, జామాల పేరు
వంకా చక్కటి కుడక వజ్రాల పేరు ।।
నీ చేతి కంకణము ఏదే శ్రీగౌరు
ఆడబోయిన కాడ ఏడ బోయినదో
నీ చేతి కంకణము ఏదే శ్రీగౌరు
ఆడబోయిన కాడ ఏడ బోయినదో ।।’’
      పల్లె ప్రజలు శ్రమకు ఎంత విలువనిస్తారో...వేలుపునీ అంతే నమ్ముతారు. ధాన్యాన్ని లక్ష్మీదేవిగా, పంటచేలను గౌరీదేవిగా భావిస్తారు. వివిధ సందర్భాల్లో కానుకలను సమర్పిస్తారు. తమ కుటుంబంలో వ్యక్తిగానూ భావిస్తారు. శ్రామికులు వరినాట్లు వేస్తున్న భూయజమాని ఇంట్లో పుట్టిన గౌరీ దేవతను వర్ణించిన గీతం అబ్బుర పరుస్తోంది.
      నాటి రోజుల్లో జానపదగీతాలను ఆకాశవాణి ఆదరించింది. నియమిత సమయంలో ప్రసారాలు చేసింది. పల్లెపాటకు పీట వేసింది. ఆ గీతాల్లో మధురంగా ఆలపించిన గిడుగు లక్ష్మీకాంతమ్మ జానపద గీతం...
‘‘ఊడ్పులూడ్చి యింటికెడదామె
రాయోలే పిల్లా
ఊడ్పులూడ్చి యింటికెడదామె
సీరాలెల్లి ఓసీరా తేవయ్యో
సీరాగట్టితే సిలకాలాగుంటా! ఆ
ఊడ్పులూడ్చి యింటికెడదామె!!
పోలేరమ్మ గుడి పుంతకాడ
ఆజాలారెంకటసామి జట్టేటో
ఆజాలారెంకటసామి జట్టేటో
వాలుగన్నులా సిన్నదానా!!
వల్లమాలినా సిగ్గటే
వచ్చి పోపోమంటారు
యెంటరారో యెంకన్నమావ
యెంటరారో యెంకన్నమావ!’’
      జానపదం అంటే ఆమెకు ప్రాణప్రదం. అది అంతరించిపోతున్న అపురూప సంపదన్నది ఆవిడ భావన. అందుకే, పల్లె పల్లెకు తిరిగి జానపద గీతాలను సేకరించారు. పదిలపరిచి ప్రపంచానికందించారు. ఆవిడే వింజమూరి సీతాదేవి. ఆమె సేకరించిన వ్యవసాయ గీతాల్లోని ఉడుపుల పాట...
‘‘గట్టు మీదున్నది గానుగ చెట్టూ
గాలీ ధూళీ వచ్చి కొమ్మలల్లాడో
రింగుజాణా యశోదో గౌరీజాణ।।
గాలీ ధూళీ వచ్చి కొమ్మ లల్లాడీ
పూగొమ్మ లల్లాడి పూవు లల్లాడో।। రింగూ।।
పూగొమ్మ లల్లాడి పూవు లల్లాడో
కడకమ్మ లల్లాడి కాయ లల్లాడో।। 
కడకమ్మ లల్లాడి కాయ లల్లాడో
అడవిలో వున్నాయి టేకు దూలాలో।। రింగూ।।
అడవిలో వున్నాయి టేకు దూలాలు
టేకు దూలాలు దెచ్చి కొత్తిల్లు గట్టో।। రింగూ।।
టేకు దూలాలు దెచ్చి కొత్తిల్లు గట్టో
కొత్తింట్లో నన్ను బెట్టి దండెల్లినారో।। రింగూ।।
కొత్తింట్లో నన్ను బెట్టి దండెల్లినారో
దండెల్లిన మామయ్యలు నాకేమి దెచ్చో।। రింగూ।।
దండెల్లిన మామయ్యలు నాకేమి దెచ్చో
కావిడతో చక్కిడాలు కరకంచు చీరో।। రింగూ।।
కావిడతో చక్కిడాలు కరకంచు చీరో
మూటతో మట్టిడాలు మువ్వంచు చీరో।। రింగూ।।
మూటతో మట్టిడాలు మువ్వంచు చీరో
ఉగ్గెట్టి పట్టీగిన్నె ఉయ్యాల పంపీ।।రింగూ।।
ఉగ్గెట్టి పట్టీగిన్నె ఉయ్యాల పంపీ
వేల్లాడే సెంగులకూ వెండుంగ రాలో।। రింగూ।।
వేల్లాడే సెంగులకూ వెండుంగ రాలో’’
      జానపదమంటే సాహిత్యం కాదని, సామాన్యుల కాలక్షేపానికే ఉపయోగపడుతుందనే అభిప్రాయం ఉన్న వారికి సమాధానం ఈ గీతం.  
      కావ్యాలు, స్తోత్రాల్లోనూ చివర ఫలశ్రుతి ఉన్నట్లే జానపదాల్లోనూ ఉంటాయనటానికి ఉదాహరణగా ఉన్న పాట...
‘‘నాదాప నాదులు నంబ వెళ్లూరు స్వామి
వేదాంత సారాన వేరు గావించే
పరమాత్మడనువాడు పాదిగావించెర స్వామి
విష్ణూకై మూర్తులు విత్తనము ఏశా
విష్ణూకై మూర్తులు విత్తనము ఏసెర స్వామి
మొదటి మంత్రము చేత మోమేరు పరశా
తిరు మంత్ర మనియేటి తీగె గాయించెర
హరి మంత్ర మనియేటి అల్లు గాయించెర
ఆకింత నలుపేమి అల్లు గాయించెర
ఆకింత నలుపేమి పూలు తెలుపేమి
తిరునాళ్లు పొయ్యేటి నాయన్నలారా స్వామి
తిరునాళ్ల నిధిమీద చెట్టే మొలిసింది స్వామి
చెట్టు మీదవి రెండు పక్షూలున్నాయిర స్వామి
పక్షూల పేరేమీ చెట్టూ పేరేమిర సామి
పరమ యోగులు రెండు పక్షులైనాయిర స్వామి
హరి మంత్రం తిరుమంత్రం ఆ చెట్టు పేరు
హరి మంత్రం అనేటి ఆ చెట్టు పేరు
పాట పాడిన వారికీ ఇన్నవారికిర స్వామి
కలుగును పుణ్యములు తొలగు దోషములు’’
      జానపదం ఆది స్వరమై వెలసింది. కర్త ఎవరో, పుట్టుకెప్పుడో తెలియక పోయినా కాలానికి ఎదురీదింది. కలకాలం నిలిచింది. జానపదుల నుంచి జాలువారిన గీతం నిరక్ష రాస్యుల్నీ చరిత్రలో నిలిపింది.


వెనక్కి ...

మీ అభిప్రాయం