వేటూరి అనే మూడక్షరాల పేరు... తెలుగు పాటలమ్మ వన్నెల చీరకు వెన్నెల జలతారు. గలగలపారే పదామృతాల సెలయేరు. దాదాపు మూడు దశాబ్దాలకు పైబడి చలనచిత్ర సీమను ఒక ఏలుబడిగా, సాగుబడిగా తన పాటల పలుకుబడిగా చెలాయించుకుని, చెలామణి చేసుకున్న అపురూపమైన మాటల ముత్యాలపేరు - ‘వేటూరి’.
వెండితెర ద్వారా అశేష రసజ్ఞలోకాన్ని పాటకట్టుతో ఆకట్టుకున్న చలనచిత్ర మహాభారత గేయపర్వ గాంగేయమూర్తి, స్వర్గీయ డా।। వేటూరి సుందరరామమూర్తి.
మంచి గంధపు చల్లదనం, మల్లెపూవు సౌరభం, జుంటితేనె తీయదనం, కోయిల గొంతు కమ్మదనం వంటి పరిచయం అక్కర్లేని జాతివన్నె వస్తువుల జాబితాలో చేరే మరో అంశం వేటూరి పాట.
చలనచిత్ర గీతాలకు కలం నేత నేసిన కలనేతలు, చమత్కారాల చమ్కీల కలబోతల సంగతులన్నీ ఆయా గాయకుల గళగతుల్లో ఇప్పటికే జనప్రసిద్ధం.
పాటల్లోనే కాదు.. మాములు మాటల్లో కూడా మనస్సును ఆహ్లాదపరుస్తూ సంభాషణ సరస్వతికి వేటూరి వేసిన పట్టుశాలువలు ఎన్నో..
హాసాలు, విలాసాలు, వికాసాలు ఎన్నెన్నో.... ఆ నోటిన వెలువడిన అన్నోటి చమత్కా ‘‘రసగుల్లాల’’ నుంచి ఉల్లాసంగా కొన్ని సల్లాపాలు...
విశ్వప్రభాకరం
విజయవాడలోని ఎస్.ఆర్.ఆర్.సి.వి.ఆర్ ప్రభుత్వ కశాశాల్లో బి.ఏ. విద్యార్థిగా ఉన్న రోజులవి. తెలుగు, సంస్కృత భాషలు అభిమానవిశేషకంగా తీసుకొని అధ్యయనం సాగిస్తారనుకున్న వేటూరి బి.ఏ(ఆర్థికశాస్త్రం)లో చేరారు. అప్పట్లో ఆ కశాశాలలో వేటూరికి ఆంధ్రోపన్యాసకులుగా తరగతులను తీసుకుంటున్న కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణకు వేటూరి వారి వంశ ప్రఖ్యాతి తెలుసు. ఓ రోజు సుందరరామమూర్తిని దగ్గరగా పిలిచి ‘‘మీ పెదనాన్న గారైన వేటూరి ప్రభాకరశాస్త్రిగారిలా పండితుడివో, లేదా నాలాంటి గొప్ప కవివో అయ్యేలా ఏ స్పెషల్ తెలుగునో అభిమాన విషయంగా ఎంచుకోక ఈ ఆర్థికశాస్త్రంలో చేరావేం.’’ అని అడిగారట. దానికి బదులిస్తూ ‘‘మా పెదతండ్రి గారి నుంచి ఇంటి విద్య అయిన శాస్త్రసారం, మీ సాహిత్యానికి చెందిన అర్థసర్వస్వం గ్రహించడానికే ఈ ‘‘ఆర్థికశాస్త్రం’’ అనే మిషతో ఈ కశాశాలలో చేరాను. మీరింత స్పెషల్గా నన్ను పిలిచి అడగడం కన్నా స్పెషల్ తెలుగు తరగతిలో చేరడం గొప్పంటారా?’’ అని ప్రశ్నించారు. వేటూరి ప్రతిభాత్మక వినయానికి ముగ్ధులయ్యారట విశ్వనాథ. అనంతర కాలంలో చలనచిత్ర గీతికా సమ్రాట్టుగా ఎదిగిన వేటూరి, ‘‘మనోహరం’’ చిత్రానికి రాసిన - ‘‘ఓరా, వాకిలి తీసి తీయని దోరవయసులతో’’ పాటకు ప్రేరణ - విశ్వనాథవారి ‘‘ తెనుగు రుతువులలోని’’ ‘‘తలుపింత ఓర వాకిలి తీయనీయదు’’ అనే పద్యమే.
మల్లాది రామకృష్ణాతీరంలో...
వేటూరి వారికి గురుస్థానీయులైన వారిలో ముఖ్యులు మల్లాది రామకృష్ణశాస్త్రి. 1960 ప్రాంతాల్లో ‘ఆంధ్రసచిత్ర వారపత్రిక’లో వేటూరి ఉపసంపాదకుడిగా ఉన్నప్పటి నుంచి మల్లాది శిష్యుల్లో తానూ ఒకరయ్యారు. మల్లాది వారి మరణానంతరం వెలువడిన ‘ఆనందవాణి’ సంచికలో వేటూరి రాసిన సంస్మరణ వ్యాసంలో తన గురువుగారి వ్యక్తిత్వ వైభవాన్ని ఎంత చమత్కారంగా వర్ణించారో!
పార్క్లాండ్స్ హోటల్లో కాఫీ- పానగల్ పార్క్ ముందు పేవ్మెంట్ వారి పార్లమెంటు. స్పీకర్వారు. అలాగని వారే స్పీకర్. వారికంటె, వారి కంటి చూపు, దాని కంటె వారి చిరునవ్వు, రెంటి కంటె వారి మధ్యేమౌనం ఇంకా బాగా మాట్లాడేది. వద్దన్నా గోల్డ్ఫ్లాక్ సిగరెట్ అందించేవారు. ఆయన బ్రాహ్మణీ లోకానికి గోల్డ్ఫ్లాక్ టిన్- గుండుచెంబు’’ ఇలా ఆద్యంతభక్తి భావపూర్ణంగా చమత్కార పద సత్కార సంభరితంగా మల్లాది గురు సంస్మరణను ప్రకటించిన వేదనావ్యాసులు వేటూరి.
2008లో హైదరాబాద్లో జరిగిన ‘‘ఆపాతమధురాలు’’ సంగీత విభావరిలో అన్నీ మల్లాది రామకృష్ణ శాస్త్రీయ చలనచిత్ర గీతాలే ఆలపించారు. ఆ సభకు ప్రధాన అతిథి వేటూరి.
‘చిరంజీవులు’ చిత్రగీతమైన ‘‘తెల్లవారవచ్చె తెలియక నా స్వామి... మళ్లీ పరుండేవు... మా రాము చాలింక లేరా!’’ పాటను వేటూరి విశదీకరించిన తీరు అద్భుతం. ‘మళ్లీ పరుండేవు’ అని నొక్కి చెప్పడంలో ‘లేరా!’ అని ఒకసారి. ‘‘లే! రా!’’ అని రెండోసారి అనటంలో మల్లాది వారు విశ్లేషించిన తీరు అనితరసాధ్యం. అందుకే రాసిన మల్లాది వారు, వారి గురించి విశేషాలు రాసి పోసిన వేటూరి ‘చిరంజీవులు’.
‘వైకౌంట్’ విమానం... వైకుంఠయానం
‘ఓసారి.. ప్రముఖకవి దాశరథి, వేటూరి కలిసి మద్రాసు నుంచి హైదరాబాద్ వస్తున్నారు. తానెక్కిన విమానం పేరు ‘వైకౌంట్’’. విమానం నెమ్మదిగా గాల్లోకి లేచి ఎత్తుకు దూసుకుపోతోంది. ‘ఇది ఇలా వైకుంఠాన్ని అందుకొనేటంత ఎత్తుకు మనల్ని తీసుకువెళ్తుంది. కనుకనే దీన్ని ‘‘వైకౌంట్’’ అన్నారేమో’ అని వేటూరి వ్యాఖ్య.
...అందుకే ఆత్రేయ
తప్పనిసరి పరిస్థితుల్లో మనసుకవి ఆచార్య ఆత్రేయ రాయాల్సిన పాటను వేటూరి రాసివ్వాల్సి వచ్చింది. దర్శక నిర్మాతల బలవంతం మీద అందుకు అంగీకరిస్తూ, పాటకు తగిన పారితోషికం ఆత్రేయకే ఇవ్వాలనీ, ఆ పాట తాను రాయడానికి ఫోన్ ద్వారా ఆత్రేయ అనుమతించాలనీ షరతు విధించారు వేటూరి. అన్నీ సక్రమంగానే జరిగాయి. పాట రికార్డింగ్ పూర్తయి ఇంటికి వెశ్లారు వేటూరి. ఈలోగా ఆత్రేయ ఫోన్ చేసి వేటూరి గారి శ్రీమతితో, పారితోషికం అందిందని, మర్నాడు వచ్చే శుక్రవారం నాడు ఆమెకు తండ్రిలా పట్టుచీరె పెట్టి ఆమె చేత పట్టెడన్నం తిని వెళ్తానని అన్నట్లుగా వేటూరికి చెప్పారు భార్య సీతమ్మ. అలాంటి శుక్రవారాలు చాలా వచ్చాయిగానీ ఆత్రేయ రాలేదు. ‘‘ఆత్రేయ గారు అంతగా చెప్పారు రాలేదేమండీ’’ అన్న శ్రీమతికి ‘‘వస్తే ఆత్రేయ కాడు కనుక’’ అని వేటూరి సమాధానం.
పాటల రచయితగా ఆత్రేయ పతాకం జగజ్జేగీయమానంగా ఎగురుతున్న కాలంలోనే వేటూరి వారి కలం కదం తొక్కుతున్న 1980 నాటి రోజులవి. ఓనాడు తనకు ఎదురుపడిన వేటూరితో ‘‘ ఏం తొందరొచ్చిందని వచ్చావయ్యా, ఇంకా ముందు భవిష్యత్తు పెట్టుకుని.. ఎడాపెడా రాసి పారేస్తున్నావట.. చాలా స్పీడుగా రాస్తున్నావట’’ అన్నారు ఆత్రేయ. అందుకు వేటూరి ‘‘గురువుగారూ మీ అంత గొప్పగా ఎలాగూ రాయలేను- మీకన్నా తొందరగానైనా రాయకపోతే నా బతుకుతెరువు ఎలాగండీ!’’ అని వినయంగా బదులిచ్చారు.
‘‘శంకరాభరణం’’ చిత్రగీతాలు రికార్డింగు జరుగుతున్న స్టూడియోలోంచి బయటకు వస్తున్నారు ఆచార్య ఆత్రేయ. ఆయనకు ఎదురుపడ్డారు వేటూరి. ‘‘దొరకునా ఇటువంటి సేవ’’ పాటవిని వస్తున్న ఆత్రేయ ‘‘ ఏమిటయ్యా! అంత పొడవు పల్లవి రాశావు. పాడేవాడి ప్రాణం పోతుంది’’ అన్నారు. ‘‘... అలా అనిపించిందా! అయితే ధన్యుడిని. ఆ సన్నివేశమే అది’’ అన్నారు వేటూరి. నిజంగానే ఆ చిత్రంలో శంకరశాస్త్రి ఆఖరుగా పాడే పాట అదే. ఆ గీతాలాపనతోనే ఆ పాత్ర ముగిసిపోతుంది మరి.
‘‘సాగరసంగమం’’ చిత్రంలో ‘‘ఓం నమఃశ్శివాయ’’ గీతంలో త్రికాలములు నీ నేత్రత్రయమై’’ అనే వేటూరి ప్రయోగం మీద ఆత్రేయ వివరణ కోరారు. శివుని ముఖాన స్థిరంగా ఉండే త్రినేత్రాలకు, సంచార శీలమైన కాలానికి సమన్వయమెలా అని ఆత్రేయ సందేహం. అందుకు స్పందిస్తూ వేటూరి ‘‘కనులకు గమించే స్వభావం లేకపోయినా రెప్పలకు ఓ లయ ఉంది. వాటితోనే తాళం, సమయం ముడిపడి ఉన్నాయి. కాలనిర్ణయానికి మూలమైన ‘‘లిప్త’’ (రెప్పపాటుకాలం) కనురెప్పల కదలికలోంచి పుట్టిందే. కనుక ఆ మూడు కళ్లనూ త్రికాలాలతో పోల్చాను. ఆ మూడూ కళ్లనూ ఎటునుంచి ఎటు త్రికాలాలకూ కేటాయించుకొని చూస్తే మూడోకన్ను కచ్చితంగా భవిష్యత్తుకు సంబంధించిందే. ఆ కన్ను తెరిస్తే అంతా భస్మం. భవితవ్యం తెలుసుకోవాలనుకొంటే కూడా అదే మిగులుతుంది. అందుకే ఆ నయనం ఎప్పుడూ మూసే ఉంటుంది. అందుకే మనకు భవిష్యత్తు అగోచరంగానే ఉంటుంది’’ అని బదులిచ్చారు.
ఇంతటి పాండితీగరిమ, పామర జనహితంగా సాగే గీతార్థ మహిమ పడుగు పేకగా అల్లుకున్న సాహితీ సమున్నతులు కనుకనే వేటూరి పట్ల ఆచార్య ఆత్రేయకు గల అభిమానం, ‘‘అభిలాష’’ చిత్రం శతదినోత్సవ సభలో ఎల్లలు దాటి పెల్లుబికిన సందర్భాన్ని ముచ్చటించుకు తీరాలి.
‘‘నేను సినిమా పాటలకు పది పన్నెండు మాటలను వాడుకున్నాను. అవే అటూ ఇటూ మార్చి కాలక్షేపం చేశాను. కానీ నువ్వలా కాదు. ఏళ్ల తరబడి సుళ్లు తిరిగి ఎక్కడినుంచో వారసత్వంగా వరదలా వస్తుంది నీ పాట’’ అని భావావేశంతో అందరి వైపు తిరిగి ‘‘వీడు నావాడు.... వీడు మావాడు.. వీడు మనవాడు.. నా వారసత్వం వీడిదే’’ అంటూ వేటూరిని కౌగిలించుకున్నారు ఆత్రేయ. మనసుకవి కంట ఆశీః బాష్పాక్షతలు.. వేటూరి వెడద కనులంట అశ్రురూప కృతజ్ఞతలు.
‘‘సరిగమ’’లకు ‘‘డుమువు’’ల ఆశీస్సులు...
జూన్ 4వ తేదీ... పద్మభూషణ్ డా।। ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం పుట్టినరోజు. అదీ 2006వ సం।।లో షష్టిపూర్తి వేడుకగా అమరిన రోజు. ఆనాటి ఆ ముచ్చటకు మూలమైన ‘బాలు’ని ఆశీర్వదిస్తూ అదే నెలలో ప్రత్యేక సంచికగా వెలువడిన ‘వెలుగు’లో అచ్చయిన వేటూరి వారి అక్షరాల ఆశీరక్షతలు...
‘‘శ్రీనారద సరసీరుహ భృంగ గళోత్తుంగ మహా
మధుగంగా భగీరథుడు మా యస్పీబాలు
శారదవీణా ప్రసంగ సంగీతపు ప్రావీణుకుల
ప్రాణాయామం లోతున పండిన పండితుడీతడు
షష్టిదాటినా సరే ‘‘బాలు’’డిగా చలా‘‘మణీ’’
ఘంటసాల గాంధర్వపు వంశానికి శిరోమణి
తనువంతా హృదయమున్న అతనికెవరు సాటి?
స్వర సంపదలో అతనికి లేరు కదా పోటీ
వెయ్యి పూర్ణ చంద్రులనూ చూడాలీ బాలు
ఈ ఆశీరక్షతలే ప్రియమిత్రుడి వ్రాలు’’
సంగీత నేపథ్యంగల నేస్తానికి, సాహిత్య సంపన్నుడైన స్నేహితుడిచ్చే కవితాకృతి గల కానుక కనుకనే ‘‘సరిగమలకు డుమువుల ఆశీస్సు’’లనే శీర్షిక పెట్టారు వేటూరి. ఆంధ్ర జనత వంటి పత్రికల్లో పనిచేసిన ఒకప్పటి పాత్రికేయ దిగ్గజం కూడా అయినందువల్ల వాక్యవిన్యాసం, వ్యాఖ్యావిలాసంలో పదునుదేరిన పాళీ వేటూరిది. ‘వెలుగు’ మాసపత్రిక ముఖచిత్రం దిగువన ‘‘ప్రతి ఏక సంచిక ప్రత్యేక సంచికే’’ అనే విశేష పదప్రకాశం వేటూరిదే.
తెలుగు తక్కువ సన్నాసులు
ఉత్సవ్, వైభవ్, మార్గ్ వంటి పదాలను తెలుగు లిపిలో రాసేటపుడు ఉత్సవం, వైభవం, మార్గం అనడమే న్యాయమని, అలా కాకుండా పొల్లుతో పదాన్ని ముగించేవారు ‘‘ తెలుగు తక్కువ సన్నాసు’’లని వేటూరి అభిప్రాయం. పైగా ఉత్సవ్, వైభవ్ లాంటి మాటల ఉచ్చారణలో ‘‘భౌభౌ’’ అన్నట్లుగా వినపడటం తెలుగు భాషకు అవమానం అంటూ, ఆంధ్రులది సంగ్రామ సింహ’’ భాషే కానీ, ‘‘గ్రామసింహ (కుక్క) భాష’’ కాదని చెప్పారు.
‘‘తెలుగునాడు అన్న తెలుగుల రాష్ట్రాన
నాడు తెలుగు గాన నేడు లేదు
నేతి బీరలోన నేయెక్కడుందిరా
తెలుగువాడనోడ తెలుగువాడ’’
‘‘మాతృభాష మీద మమకారమే లేక
తెలుగువాడనోడు తెలుగువాడు
ఇరుగుపొరుగు నున్న అరవము కన్నడ
వారిజూచి తలను వంచుకోడు’’
- అనే ఈ పద్యరూప విమర్శనాస్త్రాలు వేటూరి వారి చమత్ కారాలూ మిరియాల్లో కొద్దిపాటి ఘాటైనవి, ఆయన అంతేవాసులకు అంతే అలవాటైన వీనూ.
వేటూరి ‘పద’ బాలశిక్ష
‘‘ఎవరూ పుట్టించకపోతే మాటలెలా పుడతాయ్’’ అన్న ‘‘మాయాబజార్’’లోని పింగళి ఆలోచనా విధానం వేటూరిది.
పాట బాగే పాడే తత్త్వాన్ని ‘పాట’వంగా, చక్కని గీతాన్ని ‘పాట’లీ కుసుమంగా, ఎస్పీబాలును ‘పాట’లాధర చక్రవర్తి, పాటలీపుత్రుడనే విశేషణాలతో సంభావించడం వేటూరి ప్రతిఫలాలు. ‘బాలు’ గశానికి ఏ స్వరమైనా లొంగుతుం దనే అర్థంలో, ఆయనకు పలకని స్వరమే లేదనే పరమార్థంలో ‘‘బాలోచ్చిష్టం స్వరం సర్వం’’ అన్నారు. ‘‘స్వరాయురస్తు’’ దీవెన కూడా వేటూరి వారిదే. ప్రముఖ సంగీత దర్శకులు రెహమాన్ని ఉద్దేశించి ‘‘బాల చాకచక్యు’’ డన్నారు. డబ్బింగ్ చిత్రాలను ‘‘అధ]రచలనాధార’’గా పేర్కొన్నారు. వేటూరి ‘పద’బాలశిక్షలో ఇప్పుడు చెప్పినవి కొన్ని మాత్రమే. ఇలాంటి అక్షరామృత బిందువులు ఎన్నో... ఎన్నెన్నో!