బతుకు... బతికించు

  • 46 Views
  • 0Likes
  • Like
  • Article Share

    తల్లావజ్ఝల పతంజలిశాస్త్రి

  • సాహితీవేత్త, పర్యావరణ ఉద్యమకారులు.
  • కాకినాడ.
  • 9440703440
తల్లావజ్ఝల పతంజలిశాస్త్రి

తెలుగు నేలంతా వట్టిపోతోంది. మట్టిని, మానును మింగేసే మనుషుల ధాటికి తట్టుకోలేకపోతోంది. పైసలే పరమావధిగా పర్యావరణాన్ని నాశనం చేస్తూ... తెలుగు జాతి మనుగడకే ప్రమాదం తెచ్చిపెడుతున్న వారి తీరుకు తల్లడిల్లుతోంది.
మనిషి
బతకాలనుకోవడానికి మించి మనిషి మాత్రమే బతకాలి అనుకుంటున్న వారి దురాశ చివరికి దుఃఖానికి చేటవుతోంది. చెట్టూచేమలు, పక్షులు, జంతువులు.. అన్నీ కలిస్తేనే ‘లోకం’. కాస్త ఆలోచన శక్తి ఉంది కాబట్టి లోక నాయకుడిగా దీన్ని కాపాడాల్సిన బాధ్యత మనిషిదే. కానీ, తను ఏం చేస్తున్నాడు? ఒక్కొక్క దాన్ని కబళిస్తున్నాడు. విశాల వసుధపై ఒంటరిగా మిగిలిపోయేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. ప్రపంచం మొత్తం ఇదే పరిస్థితి. తెలుగు నేల కూడా ఇందుకు అతీతం కాదు. అసలు ఒక పిసరు ఎక్కువే అనిపిస్తోంది. 
      ప్రతి జీవావరణ వ్యవస్థా విలక్షణమైందే. ప్రాంతీయ వైవిధ్యం ఉండటం వల్లనే జీవవైవిధ్యం ఏర్పడింది. అలాంటి వైవిధ్యం మన తెలుగు నేలకు ఎంతో ఉంది. అది మన సంస్కృతిలో భాగంగా మారిపోయింది. కొండలు, అడవులు, అటవీ పర్వతాలు, నదులు, సరస్సులు, బీలభూములు వంటివి అన్నిచోట్లా ప్రాంతీయ వైవిధ్యంతో ఉండే నైసర్గిక పరిస్థితులు. భిన్న జీవావరణ వ్యవస్థల కారణంగానే భిన్న జీవన విధానాలు ఏర్పడ్డాయి. వీటిలో మళ్లీ కొన్ని ప్రత్యేకమైన జీవావరణ వ్యవస్థల్లో ప్రత్యేకమైన జీవికానిర్వహణ చేసుకునే సమూహాలు వృత్తి కులాలుగా, జాతులుగా ఏర్పడ్డారు. మత్స్యకారులు ఇందుకు ఉదాహరణ. 
      జంతు, పక్షిజాతులు... ప్రత్యేక జీవావరణ వ్యవస్థలు పరస్పర ఆధారితాలు. బలిష్ట ఆహారమైన మెట్ట పంటలు పండే చోట శతాబ్దాలుగా ఒంగోలు జాతి పశుసంతతి వృద్ధి చెందింది. (చారిత్రక యుగాల్లో గుంటూరు, ప్రకాశం జిల్లాలను మహిష మండలం అనే వారు) క్రమంగా అక్కడ జొన్న వెయ్యడం తగ్గిపోతోంది. ఇది ఇలాగే కొనసాగితే ఒంగోలు ఎద్దుల ప్రత్యేకత అంతరిస్తుంది. కొన్ని పక్షిజాతులు మనుషుల మీద ఆధారపడతాయి. మన జీవన విధానంలో మార్పు వచ్చినప్పుడు ఆ ప్రభావం వాటి మీద పడుతుంది. పిచ్చుకలు ఎక్కడైనా ఉన్నాయా? మన గృహ నిర్మాణ శైలిలో మార్పుల వల్ల వాటికి గూళ్లు పెట్టుకునే సౌకర్యం తగ్గిపోయింది. పిడికెడంత పిట్ట, చక్కటి చిన్నముక్కు, క్షణం కూడా ఒక చోట నిలవనితనం, కిచకిచలు - ఇవన్నీ ఇప్పటికే కనిపించడం మానేశాయి. మన జీవితాల్లో పెద్ద వెలితి వదిలి వెళ్లిపోయాయి. సెల్‌టవర్లు వచ్చిన ఇంత కాలానికి గానీ అవి పక్షులకు హానికరం అని మనకి తెలియలేదు. నగరాల్లో పశువులు ప్లాస్టిక్‌ వ్యర్థాలు తిని, అవి అరక్క నరకాన్ని అనుభవిస్తున్నాయి. ఒక జాతికి చెందిన గద్దలు దాదాపు అంతరించిపోయాయి. పురుగు మందుల కారణంగానే గద్దల ఆహారం విషతుల్యమైంది. ప్రపంచ వ్యాప్తంగా వారానికి ఏదో ఒక పక్షి, జంతు జాతి నశిస్తోంది. ఎందుకంటే అవి ఆధారపడే జీవావరణ వ్యవస్థని మనం నాశనం చేస్తున్నాం కాబట్టి.
      మన చిన్నతనంలో ఎక్కడ ప్రయాణించినా రైలు పట్టాల పక్కన విద్యుత్, టెలిఫోన్‌ తీగలకు అద్భుతంగా వేలాడుతూ బంగారు పిట్టల గూళ్లు కనిపించేవి. ఎంతో అందంగా ఉండేవి వాటి గూళ్లు. ఇప్పుడు అవీ ఎక్కడా కనిపించట్లేదు. ఈ పిట్టలన్నీ రైతులకి స్నేహితులు. పంటని చీడపీడల్నుంచి కాపాడేవి. మన బాల్యాన్ని లయబద్ధం చేసిన వడ్రంగి పిట్ట ఎటువెళ్లిపోయింది?
      రుతువులకే రంగులద్ది స్వరబద్ధం చేసి జీవితం పట్ల రుచి నేర్పిన అనేక పక్షులు మనకింక ఎప్పటికీ కనిపించవు. అవి మనకి చేసిన ఉపకారం కూడా మనకి తెలియదు. స్థూలంగా మన రాష్ట్రంలో మూడు ప్రత్యేకమైన జీవావరణ వ్యవస్థలున్న ప్రాంతాలు లేదా మూడు వ్యవసాయ వాతావరణ ప్రదేశాలున్నాయి. కోస్తా, తెలంగాణ, రాయలసీమ. ఇప్పుడు రాయలసీమలో అనేక ప్రాంతాలు వర్షాభావ పరిస్థితుల వల్ల క్షామప్రాంతాలయ్యాయి. కానీ వీటిలో చాలా భాగం చారిత్రక యుగాల్లో అడవులతో, చెరువులతో నిండి ఉండేవి. కర్నూలు జిల్లాలో విస్తారంగా గడ్డిమైదానాలుండేవి. మెట్టపంటలు, గడ్డిమైదానాలు ఉన్న చోట పశుసంపద పుష్కలంగా ఉంటుంది. మనకి ఆ ఇంగితం లేకపోవడంతో కొన్ని విశాల ప్రాంతాలను కేవలం పశుపోషణకూ, పాల ఉత్పతి కేంద్రాలుగా అభివృద్ధి చెయ్యలేకపోయాం. వరి అన్నం తినడం నాగరికం అనే ఒక అనారోగ్యకరమైన భ్రమ మన కొంప ముంచింది. గడ్డిమైదానాలను ఆధారం చేసుకుని బట్టమేక పిట్ట అనే పక్షి ఆ ప్రాంతాల్లోనే కాలక్షేపం చేస్తూ వచ్చింది. గడ్డిమైదానాలు అంతరించడం, దాని వేట సులభం కావడం తదితరాల వల్ల చివరికి నాలుగు పక్షులు మిగిలాయి. వన్యప్రాణి విభాగం శ్రద్ధ తీసుకోవడంతో మెల్లగా సంఖ్య పెరుగుతోంది. తూర్పుగోదావరి, విశాఖ జిల్లా అటవీ పర్వతాల్లో కొన్ని వృక్ష జాతుల మీద ఆధారపడ్డ పక్షుల సంఖ్య తరిగిపోయిందని పరిశోధకులంటున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం పర్యావరణ శాఖ దీనిపై కొంత అధ్యయనం చేసింది. మైనా అంటే అందరికీ ఇష్టం. దానిచేత మాట్లాడించడం సులభం. ఇవాళ మైనాలు కూడా కనిపిస్తున్నాయా? 
      పక్షులే కాదు కొన్ని మత్స్య జాతులు కూడా మన తీరంలో అంతరిస్తున్నాయి. ఒక అరుదైన జీవ జాతి ఆవాసంలోంచి వెళ్లే సాగునీటి కాలువను గానీ, నిర్మించ తలపెట్టిన కర్మాగారం గానీ నిలిపేసి ప్రత్యామ్నాయాలు ఆలోచించడం నాగరిక ప్రభుత్వాల కర్తవ్యం. మన దగ్గర ఆ పరిస్థితి లేదు. గోదావరి పక్కనే పురుషోత్తమపట్నం (తూ.గో) వెలుపల సహజంగా ఏర్పడ్డ 1500 ఎకరాల సరస్సు ఉంది. ఇప్పుడు అది కుంచించుకు పోయింది. కొండల మధ్య కలువపూల దుప్పటి కప్పుకుని ఉండే ఈ సరస్సు కొన్ని వేల ఎకరాలకు నీరివ్వడమే కాక కొన్ని వలస పక్షులకు ఆవాసంగా ఉండేది. పుష్కర కాలువ అనే ఒక చిన్న సాగునీటి కాలువ కోసం దీన్ని 1/4 వంతు కప్పేశారు. ఈ జిల్లాలోనే ఏలేశ్వరం దగ్గర పెద్దచెరువు. శీతాకాలంలో వలస పక్షులు వస్తుంటాయి. గ్రామస్థుల కళ్లు కప్పి కొందరు యథేచ్ఛగా వేటాడటంతో అక్కడ శ్మశాన నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. 
      ఒకప్పుడు రాయలసీమ, తెలంగాణ చెరువుల్ని చూస్తే కడుపు నిండిపోయేది. ప్రస్తుతం కడుపు తరుక్కుపోతుంది. రాజధాని నగరంలో 3086 చెరువులు ఉన్నట్లు నీటిపారుదల శాఖ వద్ద ఉన్న లెక్కలు చెబుతున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే 175కి మించిలేవు. మిగిలిన వన్నీ ఏమయ్యాయి? కబ్జాకోరల్లో చిక్కి అదృశ్యమయ్యాయి. చెరువులను కేవలం సాగునీటి జలాశయాలుగా చూడకూడదు. అవన్నీ బీలభూములు, జీవావరణ వ్యవస్థలూ. ఇళ్లు, వాణిజ్య సముదాయాల కోసం వాటిని పూడ్చడమేంటి? నెల్లూరు, చిత్తూరు (ఇక్కడ వీటిని సముద్రాలని పిలచుకుంటారు) జిల్లాల్లో చెరువులు అనేకం. నేడు అవి ఏ స్థితిలో ఉన్నాయో అందరికీ తెలిసిందే. 
      చారిత్రక కాలం నుంచీ తెలుగు నేల ధాన్యాగారంగా ప్రసిద్ధి. ధాన్యకటకం, సాలిహుండం (ధాన్యాగారం) వంటి పేర్లలోని అంతరార్థమిదే. మన రాష్ట్రంలో కనీసం మూడు వందల రకాల వరి విత్తనాలు, చక్కటి పేర్లతో ప్రాంతీయ నైసర్గిక పరిస్థితులకు అనుగుణంగా ఉండేవి. ఈ విత్తనాలు, వైవిధ్యం, వాటి పేర్లతో ఉన్న భాష పోయి కొత్తవి వచ్చాయి. చీడపీడలకి తట్టుకోగల జన్యుసామర్థ్యం ఉన్న వరి విత్తనాలు పోయి కృత్రిమ రసాయనాల మీద బతికేవి అవతరించాయి. అవే నేడు మనకు జీవనాధారమయ్యాయి. మన రాష్ట్రంలో వాడినన్ని ఆకుకూరలు దక్షిణ దేశంలో ఎక్కడా కనిపించవు. ఆరోగ్యంగా, చవకగా, రుచికరంగా భిన్నరకాల్లో దొరికే వీటి లభ్యత కూడా వచ్చే దశాబ్దంలో తరిగిపోయే పరిస్థితి ఉంది. గ్రామీణ ఉమ్మడి భూములు పోవడంతోనే వీటికి ముప్పు ఏర్పడింది. తీరాంధ్రలో ప్రత్యేక ఆర్థిక మండళ్ల కోసం వేలాది ఎకరాల పంట భూములను బలిపెడుతున్నారు. బొగ్గు విద్యుత్‌ కేంద్రాల కారణంగా గ్రామాలకు గ్రామాలే బూడిదమయమవుతున్నాయి. మరికొన్ని చోట్ల భూ అభివృద్ధి పేరుతో తాడిచెట్లు నరికేశారు. తీరం అంతా ఒకప్పుడు తాడిచెట్లు విపరీతంగా ఉండేవి. ఈ తాటితోపులు తుపాను గాలుల తీవ్రతను నిరోధించి లోతట్టు ప్రాంతాలకు రక్షణగా ఉంటాయి. వీటితో పాటు సరుగుడు తోటలు, మడ అడవులు కూడా తుపాను లను ఎదుర్కొంటాయి. నేడు ఇవేమీ ఉండట్లేదు. అనకూడదు కానీ, ప్రకృతి వైపరీత్యం ఏదైనా సంభవిస్తే పరిస్థితి ఏంటి? గ్రామీణ, నగర ప్రాంతాల్లో విస్తరణ, అభివృద్ధి కారణాల విధ్వంసం జరుగుతోంటే... గిరిజన ప్రాంతాల్లో విలయం నెలకొంది.. గిరిజన వైద్యుల్ని వెజ్జులంటారు. ముఖ్యంగా పది రకాల మందు మొక్కల మీద వీరి వైద్యం ఆధారపడి ఉంటుంది. పెరట్లోనో, అయిదారు ఇళ్లు దాటితేనో విస్తారంగా దొరికే ఈ మందు మొక్కలు ఇప్పుడు కనిపించడం లేదు. అడవి లోపలికో, కొండల మీదకో వెళ్లాల్సిన పరిస్థితి. దీనికి తోడు అశ్వగంథÅ, సర్పగంథÅ, సరస్వతి ఆకు వంటివి వాణిజ్యపరంగా లాభసాటి కావడంతో కొన్ని మందుల పరిశ్రమల వారు, దళారీల సాయంతో టన్నుల కొద్దీ పట్టుకెళ్తున్నారు. ఈ లాభాల్లో గిరిజనులకి ఒక్కపైసా దక్కట్లేదు. కేరళలో గిరిజనులు, వారి వైద్యుల సహకారంతో పెద్ద పరిశోధనాలయాలే పనిచేస్తున్నాయి. అక్కడి గిరిజనులు లాభపడుతున్నారు. ఈ పని మన రాష్ట్రంలో ఎందుకు చేయకూడదు? ఇంకో చిత్రం.. గిరిజనులు మాంసానికి ఉప్పు కలిపి వెదురు బొంగుల్లో దాచుకుంటారు. ఇప్పుడు ఈ ‘వెదురు మాంసం’ కార్పొరేట్‌ సంస్థల కళ్లబడింది. ఆరు పెద్ద హోటళ్లు మారేడుమిల్లి ప్రాంతంలో దీనికోసం గుత్తేదారులను నియమించుకున్నాయి.
      గిరిజన వైద్యులకీ, ఆయుర్వేద వైద్యాలయాలకీ, ఔషధ పరిశ్రమలకీ ప్రత్యక్ష సంబంధం ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి తోచలేదు. కానీ మందు మొక్కల పెంపకంలో ప్రాంతీయ అటవీ పరిశోధనాలయ సంస్థ కృషి చేస్తోంది. అభివృద్ధి పనుల వల్ల నిర్వాసితులైన గిరిజనుల్లో వెజ్జులు కూడా ఉంటారు. కట్టబోయే జలాశయంలో చేపలు పట్టుకోమని చెప్పే బదులు వారి వైద్య నైపుణ్యాన్ని లాభసాటిగా ఉపయోగించడం మంచిది. వారందరికీ తేనెటీగల పెంపకంలో శిక్షణ ఇవ్వడం కూడా మంచి పనే.
      మరోవైపు... దివిసీమ, కోనసీమ వంటి సారవంతమైన దీవులు; నెల్లూరు జిల్లాలో పులికాట్‌; పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో విస్తరించిన కొల్లేరు వంటి ప్రపంచ ప్రసిద్ధమైన సరస్సులు, తూ.గో. జిల్లాలోని కోరింగ మడ అడవులు ఆంధ్ర తీరాన్ని విలక్షణమైన జీవావరణ వ్యవస్థగా మార్చాయి. విశాఖ, గుంటూరు జిల్లాల్లోనూ కొద్ది మేరకు మడ ప్రాంతాలున్నాయి. ఈ మడ అడవులు ఉప్పునీరు, మంచినీరు కలిసే నదీ ముఖద్వారాల్లో పెరుగుతాయి. వీటి మిగతా ప్రత్యేకతలు అలా ఉంచితే, ఇవి ఉన్న చోట్ల మత్స్యజాతి బాగా ఉంటుంది. కోరింగ మడ అడవుల్లో పెరిగే చేపలే విశాఖ వరకూ విస్తరిస్తున్నాయి. అయితే, వివిధ కారణాలతో కోనసీమ కరిగిపోతోంది. ఒక పక్క ఉప్పునీరు భూగర్భజలాన్ని క్షారమయం చేస్తోంది. మరో పక్క గ్రామాలు, కొబ్బరి తోటలు నేలకోత వల్ల గోదావరిలో కలిసిపోతున్నాయి. కోనసీమ విధ్వంసం మొదలైంది. దీనిపై అధ్యయనం అవసరం.
      దక్షిణ భారతంలో ఎక్కడా లేని అద్భుతమైన పక్షుల ఆవాస కేంద్రం గుంటూరుకి 6 కి.మీ. దూరంలోని ఉప్పలపాడులో కనిపిస్తుంది. కనీసం 70 పక్షి జాతులు సంవత్సరం పొడవునా ఇక్కడ కనిపిస్తాయి. వీటి సంఖ్య ఎక్కువ కావడంతో రెండు మూడు రకాల పక్షులు రాక తగ్గించాయి. ఇరుకైపోయిన ఈ ఆవాసాన్ని బాగా విస్తృతం చెయ్యాలి. చుట్టుపక్కల కొన్ని ఎకరాలు కొంటేనే గానీ ఇది ఎక్కువ కాలం ఉండదు. అటవీ, పర్యాటక శాఖలు కలిసి నిధులు సమకూర్చుకోవాలి. కృష్ణాడెల్టా అభివృద్ధి కోసం కేటాయించిన నిధుల్లో కొంత ఉప్పలపాడుకి కూడా కేటాయించారు కానీ ఆ మొత్తం సరిపోదు.
      తడ నుంచి శ్రీకాకుళం వరకూ ఉన్న తీరం దాదాపు వేయి కి.మీ.లు. ఇది మన ప్రత్యేకత. బంగాళాఖాతంలో కలిసే రెండు అతి పెద్ద నదులు కూడా తెలుగు నేలకు ప్రత్యేకమే. ఈ తీరం వేలాది మత్స్యకార కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తోంది. ఇప్పుడిది మందుల పరిశ్రమలతో కలుషితం అవుతోంది. చేపలు దొరకట్లేదు. ప్రత్యేక ఆర్థిక మండళ్లు వస్తే తీర సముద్ర జలాలు ఇంకా కలుషితమయ్యే అవకాశం ఉంది. విశాఖ సమీపంలోని భీమిలి ఒక అరుదైన జీవావరణ వ్యవస్థకు చిరునామా. పట్టణం బయట ఎర్రమట్టి దిబ్బలు, లోతైన ఎర్రని వాకలూ కనీసం లక్ష ఏళ్ల నాటివి. పరివాహ ప్రాంతంలో కురిసిన వాన నీటిని ఈ వాకలు మోసుకొచ్చి సముద్రానికి సమర్పిస్తాయి. ఉత్త వర్షపునీరే కాదు, సముద్రపు చేపలకు సూక్ష్మపోషక పదార్థాల్ని కూడా అందజేస్తాయి. వీటికోసం ఒక జాతి చేపలు తీరానికి సమీపంగా వస్తాయి. మత్స్యకారులకూ ఇది మంచి అవకాశం. నేడు ఈ చక్రం దెబ్బతింటోంది.
      భౌగోళికంగా మనిషి ఎప్పుడూ జీవావరణ వ్యవస్థల మీదా, జీవవైవిధ్యం మీదా ఆధారపడే ఉంటాడు. ప్రాచీనులకు ఈ స్పృహ ఉండేది. అందుకే వాటిని ఈ భౌతికావరణంలోంచి ఉన్నతీకరించుకుని సభక్తికంగా ఒక పేగు బంధాన్ని ఏర్పరచుకున్నారు. మనిషితోపాటు అన్ని జీవరాశులకూ జీవించే హక్కు ఉందని భావించారు. నిజానికి మనిషికే ప్రత్యేకమైన కేంద్రస్థానం ఇవ్వలేదు. కానీ, కాలప్రవాహంలో విలువల హననంలా... పర్యావరణ విధ్వంసం జరుగుతోంది. కూర్చున్న కొమ్మను నరుక్కుంటున్న అవివేకం ఎప్పటికైనా అంతమే కోరుతుంది. అందుకే తెలుగు నేలను కబళిస్తోన్న విధ్వంసాన్ని ఆపేందుకు ప్రతి తెలుగు వాడూ నడుం కట్టాలి.


వెనక్కి ...

మీ అభిప్రాయం