శ్రుతిలయలు

  • 23 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డా।। ఎం.పురుషోత్తమాచార్య

  • నల్గొండ
  • 9396611905
డా।। ఎం.పురుషోత్తమాచార్య

గుండె ‘లయ’ తప్పుతోంది... ప్రవర్తన ‘శ్రుతి’ మించుతోంది... అప్పుడప్పుడూ అందరి నోటా అప్రయత్నంగా వచ్చే మాటలివి. ప్రేమ భావనతో ఉక్కిరిబిక్కిరయ్యే హృదయాన్ని వర్ణించడానికో, అల్లరి పిల్లాడి చేష్టలను నిరసించడానికో ఈ పద ప్రయోగం చేస్తాం. బాగుంది... ఇంతకూ శ్రుతిలయలంటే ఏంటి? సంగీత పారిభాషిక పదాలైన వీటి ప్రత్యేకతలేంటి?  
మానవ
మస్తిష్కాన్ని, దాన్ని ధరించిన శరీరాన్ని బ్రహ్మానందానుభూతికి చేర్చే అద్భుత వాహనం సంగీతం. ‘శ్రుతిర్మాతా లయః పితా’ అనేది సంగీతశాస్త్ర సంప్రదాయం. సంగీత శిశువుకు శ్రుతి తల్లి. లయ తండ్రి. బిడ్డలు ఎదిగి ప్రయోజకులవటంలో తల్లిదండ్రుల పాత్ర ఎంత ఉంటుందో... ధ్వని వినసొంపుగా మారి సంగీతంగా అలరించడంలో శ్రుతిలయలకంత ప్రాధాన్యం ఉంది. 
      మన భాషలో శ్రుతి, శృతి అనే రెండు పదాలు కనిపిస్తాయి. వీటి ఉచ్చారణ దాదాపు ఒకేలా ఉంటుంది. కానీ, రెండింటి అర్థాలు మాత్రం వేరు. పదప్రయోగం చేసేటప్పుడు ఈ విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి. శ్రుతి అంటే వేదం, చెవి, వినికిడి అనే అర్థాలున్నాయి. ద్రవ పదార్థాలను మరగబెట్టడమన్న అర్థంలో ‘శృతి’ని ఉపయోగించాలి. సంగీత పరిభాషలోని పదం ‘శ్రుతి’ మాత్రమే.
      వేదమంత్రాలను పఠించేటప్పుడు ఉదాత్తం, అనుదాత్తం, స్వరితం అనే మూడు స్వరాలను అనుసరిస్తారు. అందుకే వేదం మనకు అర్థం కాకపోయినా... ఆ పఠనం మనసుకు ఆహ్లాదం కలిగిస్తుంది. ఈ స్వర స్థానాలనే సంగీతంలో మంద్ర, మధ్యమ, తారస్థాయులుగా మలిచారు. ఈ సంబంధంతోనే ‘శ్రుతి’ సంగీత పరిభాషలోకి వచ్చింది.
      ‘లయం’ అంటే - నాశనం, ఆలింగనం, కలిసిపోవడం. దీన్నుంచే ‘లయ’ పుట్టింది. శివుడు లయకారుడు. సృష్టిస్థితుల దశలు సంపూర్ణం కాగానే శివుడు తాండవం చేస్తూ సమస్తాన్ని తనలో లయం చేసుకుంటాడన్నది ఓ నమ్మిక.
      సృష్టిలోని జీవ నిర్జీవ పదార్థాలన్నీ తమ విధులు, కర్తవ్యాలు సుసంపన్నం కాగానే భగవంతునిలో లయమైపోతాయని  మన ప్రాచీన గ్రంథాలు చెబుతాయి. ఈ ప్రక్రియ అంతా ఒక పద్ధతి ప్రకారం దశలవారీగా జరుగుతుంది. ఇలా జరిగే క్రమానికి సమ పరిమాణంలో ఉన్న గతి, సంచారం, నిర్దిష్టమైన నడక ఉంటాయి. శ్రుతి కలిసిన ఈ గతి పోకడ ్రøÁతల పారవశ్యపు హృదయాల్లోకి పాటతో పాటు లయమైపోతుంది. బ్రహ్మానందానుభూతికి లోనైన ్రøÁతల అంతశ్చైతన్యం పరమేశ్వరుడిలో లీనం కావడానికి ఏర్పరచిన మోక్షమార్గాన్ని ‘లయ’ సుగమం చేస్తుంది. లయ గతిలేని వట్టి పాటకు ఈ సామర్థ్యం లేదు. సంగీత గాన విధానానికి ‘లయ’ కీలకం కాబట్టే తాళగతికి ‘లయ’ అనే పేరు పెట్టారు.
      మన భారతీయ సంగీత విశేషం ఏంటంటే.. శ్రుతిలో లయ ఉంటుంది. లయలో శ్రుతి ఉంటుంది. వీటి పరస్పర ప్రేమానుబంధం విడదీయరానిది. అది అర్ధనారీశ్వరతత్వం. శ్రుతి ప్రకృతి అయితే లయ పరమేశ్వరుడు. ఈ రెండింటి సంలీనమే అలౌకిక పరమానందం.
      శ్రుతిలో లయ ఉండటమంటే... శ్రుతి నుంచి ఏర్పడిన స్వరాలు, రాగాలు ఒక నియమానుసారం ప్రదర్శితమవ్వడం. రాగాలాపన అంటే ఆ రాగ పరిధిని అతిక్రమించకుండా, లక్ష్యం చెడకుండా క్రమశిక్షణను పాటించడం. అది లయతత్వం.
      లయలో శ్రుతి అంటే... లయ వాద్యంలో జతులు, గతులు వినిపిస్తున్నప్పుడు సన్నని షడ్జమస్వరం దానితో జతకడుతూ సాగిపోవడం. భారతీయ వాద్యాలైన మృదంగం, తబల, పఖ్‌వాజ్, కంజీర తదితరాల ద్వారా దీన్ని గమనించవచ్చు.
      శ్రుతి, లయలు కేవలం శాస్త్రీయ సంగీతానికేకాక లలిత జానపద సంగీతాలకూ అనువర్తిస్తాయి. పండితులు శాస్త్రీయ సంగీతాన్ని, పామరులు జానపద గేయాలను విని 
      ఆనందపడతారు. శాస్త్రీయంతో పరిచయం లేని, జానపద సంగీతం తెలియని వారు మధ్యేమార్గాన్ని ఎంచుకున్నారు. శాస్త్రీయంలోని శ్రుతి, రాగ, లయలను కొంత, జానపదంలోని ఉదాత్త శ్రావ్యమైన బాణీల పోకడను కొంత సమ్మిళితం చేస్తూ లాలిత్య ధోరణిలో ఒక కొత్త గాన పద్ధతిని రూపొందించుకున్నారు. అదే లలిత సంగీతం. క్రమేణా ఇది అన్ని వర్గాల వారినీ సంతోషపెట్టే దశకు చేరుకుంది. 
      జానపద కళల్లో ‘బుర్రకథ’ గొప్ప కథాగాన కశాత్మక ప్రక్రియ. దీనిలో ప్రధాన కథకుడు ఎడమ భుజంమీద పెట్టుకునే ‘తంబుర’ చెవి దగ్గర ‘శ్రుతి’ వినిపిస్తూ ఉంటుంది. కుడిచేతిలోని తాశాలు లయను పోషిస్తుంటాయి  కొందరు జానపద
      గాయకుల చేతుల్లో ఉండే ఏక్‌తార శ్రుతికి, చిడతలు లయకు సంకేతాలు. సంక్రాంతి హరిదాసుల మెళ్లో వేలాడే చిటివీణియ శ్రుతి సౌందర్యాన్ని అందిస్తుంది. ఎడమచేతిలోని చిడతలు లయగతులను పాటిస్తాయి.
      జానపద గీతాల ఆలాపనలో ఆర్భాటం ఉండదు. సున్నితమైన శ్రుతి మాధుర్యం, ఉత్సాహవంతమైన లయగతుల పోకడలు కనిపిస్తాయి, వినిపిస్తాయి, మురిపిస్తాయి. అసలు ఏ సంప్రదాయపు పాటకైనా శ్రుతి, లయలు అంతర్లీనంగానో, ప్రస్ఫుటంగానో సాగుతూనే ఉండాలి. లేకపోతే రుచి ఉండదు. వినేవారికి రసానందమూ కలగదు. ఈ రెండింటితో పాటు సంగీత పరిభాషలో తరచుగా వినిపించే మరో పదం... గమకం. 
      ‘గమక’మంటే ఒక స్వరం తన ముందున్న/ వెనకనున్న స్వరంలో కొంత శబ్దాన్ని గ్రహించి, తనలో కలుపుకుని ఒక కొత్త సౌందర్యాన్ని ఆవిష్కరించడం. ఇది పది రకాలని శాస్త్రం చెబుతోంది. గమకం శాస్త్రీయ సంగీతానికి ఆయువుపట్టు. లలిత సంగీతంలో దీని అవసరం అంత ఎక్కువగా ఉండదు. కానీ, కొన్ని భావాత్మకమైన పదాలను పాడేటప్పుడు దీంతో చాలా పని ఉంటుంది. 
      జానపద సంగీతంలో ‘గమకం’ ఉండదని చెప్పడానికి వీల్లేదు. సాధారణంగా పాడుకుంటూ వెళ్లినప్పటికీ గాయకుడి ప్రతిభా సామర్థ్యాలను బట్టి ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా లీలగానైనా ఉంటుంది. కొన్ని ఆవేశ ఉద్వేగ సందర్భాల్లో గాయకుడికి తెలియకుండానే అప్రయత్నంగా బాణీలోనూ రావచ్చు, సుదీర్ఘ రాగాలాపనలోనూ రావచ్చు. గమకం వచ్చినా దోషమేమీ కాదు. రాకుంటే లోపమూ కాదు.  అయితే, గమకం ఉండి తీరాలన్న నిబంధన మాత్రం ఏదీలేదు.
      ఏ శాస్త్ర పరిభాషలోని పదాలనైనా ‘అర్థం చేసుకోవడం’ జ్ఞానానికి చిహ్నం. ఆ శాస్త్రాన్ని వ్యాఖ్యానించేటప్పుడో, ఉపయోగించుకునేటప్పుడో... ఎప్పుడో ఒకప్పుడు ఈ జ్ఞానం తప్పకుండా కరదీపికలా దారి చూపుతుంది. లక్ష్యం వైపు నడిపిస్తుంది. 


వెనక్కి ...

మీ అభిప్రాయం