పిల్లల స్థాయికి ఎదగాలి!

  • 130 Views
  • 0Likes
  • Like
  • Article Share

    తెలుగు వెలుగు బృందం

‘చిలుకు ఛిలాట్‌ - ములుకు ములాట్‌... గువ్వా దెబ్బ చూసుకో’ అని పాడుతూ గురి చూసి బొంగరాన్ని కొట్టే తెలుగింటి పిల్లాడు నేడు ఎలుక(మౌస్‌)లతో సావాసం చేస్తున్నాడు. ‘ఆకు - అల్లం - సూది - సుద్ద’ అంటూ ఒకచోట కాలునిలవకుండా  పరిగెత్తే బుజ్జోడు ఇప్పుడు కాలుకదపకుండా ‘ఆటలాడుతున్నాడు’. పాట సంగతి దేవుడెరుగు మాటనూ మర్చిపోయి రంగుల తెరపై తుపాకీగుళ్లు పేల్చేస్తున్నాడు. మనవైన ఆటపాటలకు దూరంగా ఎదుగుతున్న నవతరం చివరికి నష్టపోతోందేంటి? ఒకప్పుడు అఖిలాంధ్ర చిన్నారిలోకాన్ని చేయి పట్టుకుని నడిపించిన తెలుగు బాలసాహిత్యం నేడు ఏ స్థితిలో ఉంది?
అజంత
భాషలోని అద్భుతమైన బాలసాహిత్యంపైన మొట్టమొదట పరిశోధన చేసి, దాని విస్తృతిని, విశిష్టతను చాటిన ఆచార్య ఎం.కె.దేవకి దగ్గర బాలల గురించి ప్రస్తావిస్తే... ఆమె గొంతు గద్గదమవుతుంది. ఇప్పుడు పిల్లలకు బాల్యమనేదే లేదంటూ ఆవేదన చెందుతారావిడ.
      ప్రస్తుతం తెలుగులో వస్తున్న బాలసాహిత్యం, దానికి దక్కుతున్న ఆదరణ, బాలసాహిత్య సృష్టికర్తలు గమనంలో ఉంచుకోవాల్సిన విషయాలపై దేవకి... ‘తెలుగు వెలుగు’తో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే....
      ఓ తల్లి తన బిడ్డకు ఒక పేద కుర్రాడి కథను చెబుతోందట! ఆ పిల్లాడు తినడానికి తిండిలేక అల్లాడుతున్నాడంటూ చెప్పుకెళ్తోంటే మధ్యలో అబ్బాయి అడ్డుతగిలాడంట! ‘ఏం... అతనికి అమ్మ లేదా’ అని అడిగాడంట! ‘‘లేదు కన్నా’’ అని బదులిస్తే  ’ఈ బిస్కెట్టును తనకివ్వు’ అని తన చేతిలో ఉన్న బిస్కెట్టును అమ్మకిచ్చాడట! ఓ ప్రసిద్ధ రచయిత స్వానుభవంలోంచి చెప్పిన విషయమిది. బాలలపై ‘కథ’ ముద్రకు ఈ ఉదంతమే ఉదాహరణ. ఆకలితో ఉన్న వాడికి సాయపడాలన్న విషయం ఆ పిల్లాడికి అప్రయత్నంగా స్ఫురణకు వచ్చిందంటే అది కథ వల్లే కదా. బాలసాహిత్యం గొప్పతనమే అది. చిన్నారుల్లో విచక్షణా జ్ఞానాన్ని, నైతికతను పెంచడానికి ఉద్దేశించిందది. కానీ, నేడెక్కడా పిల్లలకు కథలు చెప్పట్లేదు. మా చిన్నప్పుడు పాఠశాలలో చివరి గంటలో ఎవరో ఒక ఉపాధ్యాయుడు కథలు చెప్పేవాళ్లు. ఇప్పుడేమో ప్రతి నిమిషమూ ర్యాంకుల రొదే. ఇక పిల్లల్లో విలువలెట్లా పెరుగుతాయి?
      ఆట ఆనంద సంకేతం. చెడుగుడు లాంటి ఆటలిప్పుడు కనపడటం లేదు గానీ, గతంలో పాటలు పాడుతూ మరీ వాటిని ఆడేవారు. అలాగే, ఆయాసం లేకుండా గడిపే పిల్లాడు. ఇప్పుడు పెద్దలకన్నా పిల్లలే ఎక్కువ ఆయాస పడుతున్నారు. మార్కుల బరువు మోయలేక. వెన్నెల రాత్రుల్లో ఆటల్లేవు. చేలగట్టున పాటల్లేవు. పట్నాలు, పల్లెలు అన్న తేడానే లేకుండా ఎక్కడ చూసినా పిల్లలకు అవస్థలే. ఒక్కమాటలో చెప్పాలంటే ఇప్పటి తరానికి బాల్యమే లేదు. అందుకే బాలసాహిత్యం ఉనికే రాష్ట్రంలో కనపడట్లేదు. ఒకవేళ అమ్మానాన్నలు ఏవైనా పాడించినా అవి ‘రైమ్స్‌’ మాత్రమే ‘పాటలు’ కాదు. తెలుగులో కొన్ని వేల బాలల గేయాలున్నాయి. ఇప్పుడవి ఎక్కడా వినిపించడం లేదు. అసలు అవి ఉన్నాయన్న సంగతి కూడా చాలామందికి తెలియదు. వాటిని తిరిగి వ్యాప్తిలోకి తీసుకురావాలి.
అంబాలు
అంబాలు మీద కుంబాలు
కుంబాలు మీద కుడితిబాన
కుడితిబాన మీద ఈరబలక 
ఈరబలక మీద ఇనపగుండు
ఇనపగుండు మీద ఎదురుమోసులు
ఎదురుమోసుల్లో రేచుకుక్కలు

      ఈ పొడుపు కథను విప్పండి చూద్దాం. (జవాబును చివర్లో చెప్పుకుందాం) ఒకప్పుడు ఇలాంటి వాటిని విప్పడానికి పిల్లలు ఉత్సాహం చూపించే వారు. బుద్ధికి పదును పెట్టే ప్రక్రియ ఇది. అంతే కాదు భాషనూ నేర్పించే సాధనమిది. పొడుపు కథంటే ఓ సమస్య. దాన్ని విప్పడమంటే పరిష్కారాన్ని సాధించడం. జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనే పద్ధతిని బాలలకు నేర్పే విధానమిది. ఇప్పుడెక్కడైనా ఈ పొడుపుల విరుపులు కనిపిస్తున్నాయా? తెలుగులో ఉన్న అసంఖ్యాక పొడుపు కథలన్నీ ఏమయ్యాయి? ఎక్కడికీ పోలేదవి. తెలుగు వారు పట్టించుకోకపోవడంతో మూలనపడ్డాయి. వాటిని మళ్లీ అక్కునజేర్చుకుంటే... చిన్నారులను ఐక్యూ తరగతులకు పంపాల్సిన అవసరముంటుందా?
      చిన్నారులకు అద్భుతరస కథలను చెబితే సృజనాత్మకత పెరుగుతుంది. వాటిలో వాస్తవిక దృష్టి లోపిస్తోందని భావిస్తే అసలుకే మోసం. రష్యాలో బాలసాహిత్యానికి అమితమైన ప్రాధాన్యమిస్తారు. మొదట్లో అక్కడ అద్భుతరస ప్రధానమైన కథలు విరివిగా వచ్చేవి. వాటి వల్ల పిల్లలు ఊహాలోకాల్లో విహరిస్తున్నారని అక్కడి ప్రభుత్వం ఆ కథలను నిషేధించింది. కొద్దికాలం తర్వాత ప్రభుత్వమే ఓ పరిశీలన చేయించింది. నిషేధం వల్ల పిల్లల్లో వాస్తవిక దృష్టి పెరగకపోగా సృజనాత్మక శక్తి తగ్గిపోయిందని తేలింది. ఉన్నది ఉన్నట్లుగా చెబితే పిల్లలు పట్టించుకోరు. ఏ విషయాన్నైనా, నీతినైనా కథ రూపంలో కల్పన జోడించి చెబితేనే ఫలితముంటుంది. 
      ‘భోజనం చేద్దువుగాని రా రా’ అంటే పిల్లాడు రాడు. ‘కన్నా... బువ్వ తింటానికి రా’ అంటే వచ్చేస్తాడు. పిల్లలకు ప్రత్యేకమైన భాష ఉంది. వారివైన పదాలున్నాయి. బాలల కోసం రచనలు చేద్దామనుకునే వారు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. చింతా దీక్షితుల కలం శక్తి అందరికీ తెలిసిందే. ఆయన రచనలను చదివిన వారు... అవి పిల్లలే రాశారనుకునే వారు. ముళ్లపూడి బుడుగూ మనకెప్పటికీ గుర్తుండే వాడే. అంతలా ఆయన చిన్నారుల భాషను ఉపయోగించే వారు. అలాంటి రచనలే పిల్లల మనసులను దోచుకుంటాయి. నేటి రచయితలు మాత్రం పిల్లల స్థాయికి దిగిరావట్లేదు. తమ పాండిత్యాన్నంతా ప్రదర్శించి మరీ రచనలు చేస్తున్నారు. అయినా... ఇప్పుడు పిల్లల కోసం కలం కదలించే వారు అతి తక్కువ. నేను పరిశోధన చేసే సమయంలో 60 - 70 మంది ఉండేవారు. ఇప్పుడెవరైనా రచనలు చేసినా వాటికి ఆదరణ ఉండట్లేదు. కర్ణాటకలో అయితే అక్కడి ప్రభుత్వమే 60 శాతం ప్రచురణలను కొంటుంది. రచయితలను ప్రోత్సహిస్తుంది. మన ప్రభుత్వం దీనికి చాలా దూరం. అందుకే తెలుగులో రాన్రానూ బాలసాహిత్య రచయితలు తగ్గిపోతున్నారు. 
      బాలసాహిత్యంలో సైన్సునూ మిళితం చేయాలి. శాస్త్ర సాంకేతిక విషయాలను కథలు, పాటల రూపంలో చెబితే పిల్లలకు తొందరగా అర్థమవుతాయి. గతంలో తెలుగులో ఈ కోణంలో ఎన్నో రచనలు వచ్చాయి. ‘గాలులు రెండు కలుసుకుని నీళ్లుగా మారును ఏమిటవీ’... ‘‘ఉదజనీ, ఆమ్లజనీ కలిసి నీళ్లుగ ఔనండీ’’, ‘నీళ్లల్లోనే నిప్పుంటుందని మీరెప్పుడైనా విన్నారా’.... ‘‘కడలి కడపులో నిప్పుంటుంది. అదే బడబాగ్ని’’ లాంటి సంభాషణల రూపంలో పాఠాలు చెప్పేవారు. ఇప్పుడు సైన్స్‌ ముచ్చట్లే చెప్పట్లేదు. చెప్పినా సాంకేతిక పదాలను ఆంగ్లంలోనే ఉంచేస్తున్నారు. ఇక పిల్లలు తెలుగులో నేర్చుకునేదేంటి?
      గతంలో వారాలు, తిథులు, నక్షత్రాలు, అంకెలు లాంటి వాటిని పిల్లలకు పాటల రూపంలోనే నేర్పేవారు. ‘ఆదివారము నాడు ఆవడలు పెరుగు...’ తదితరాల ద్వారా అన్న మాట! ఇప్పుడేమో బట్టీవేయిస్తున్నారు. పాఠ్యపుస్తకాల్లో మార్పులు రావాలి. పిల్లల వయసును బట్టి పాఠాలను రాయాలి. 
      టీవీల్లో పిల్లల కోసం ఉద్దేశించే కార్యక్రమాల్లో సున్నితత్వం ఉంటోందా? శాడిజం, హత్యలు, దొంగతనాలు చూపిస్తున్నారు. వాటిని చూస్తే ఎదిగే చిన్నారులు భవిష్యత్తులో ఏమవుతారు? నైతిక విలువలు లేకుండా ఎంతటి జ్ఞానాన్ని సముపార్జించినా అదంతా వృథానే. పైగా ఇప్పటి సమాజంలో విలువల పతనాన్ని చూస్తున్నాం కదా! దానికి కారణం పిల్లలకు చిన్నతనంలో ఆ విలువలను రంగరించి పోయకపోవడమే. అందుకే బాలసాహిత్యాన్ని బతికించుకోవాలి. ప్రతి తెలుగువాడూ దానికి నడుంకట్టాలి. 
      ఇంతకూ మధ్యలో చెప్పిన పొడుపు కథ విప్పారా? సమాధానమిది... అంబాలు (పాదాలు), కుంబాలు (మోకాళ్లు), కుడితిబాన (పొట్ట), ఈరబలక (ఎదరొమ్ము), ఇనపగుండు (తల), ఎదురుమోసులు (వెంట్రుకలు), రేచుకుక్కలు (పేలు)

సహకారం: కాకర్ల వాసుదేవరావు, అనంతపురం


వెనక్కి ...

మీ అభిప్రాయం