తేనెలూరే ‘తెనాలి’ తెలుగు

  • 36 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డా।। కావూరి పాపయ్యశాస్త్రి

హాస్య చమత్కారాలకు పెట్టింది పేరుగా జనసామాన్యంలో పేరుపొందిన తెనాలి రామకృష్ణుడు తెలుగు సాహిత్యంలో పదహారవ శతాబ్దికి చెందిన ప్రముఖ ప్రబంధ కవి. ఆయన కీర్తి సౌధానికి మూలస్తంభం వంటిది ఆయన రాసిన ‘పాండురంగ మాహాత్మ్యం’. ఆయన తనదంటూ ఒక విచిత్ర శైలిలో పద్య రచన చేసిన ప్రౌఢకవి. ఈ ప్రౌఢత్వాన్ని సూచిస్తూనే నేమో ‘రామకృష్ణుడు సురారామగజము’ అని రామాయణ కల్పవృక్షం అవతారికలో అన్నారు విశ్వనాథ సత్యనారాయణ. అంటే ఐరావతం వంటి వాడన్నమాట. తెలుగు సంస్కృత పదాల విచిత్రమైన పోహళింపు ఆయన శైలికొక వింత సొబగును సంతరింపజేసింది. ‘‘పాండురంగవిభుని పద గుంఫన’’మన్న నానుడి తెలుగు సాహిత్యంలో సుప్రతిష్ఠితమైంది. పాండురంగ మాహాత్మ్య ప్రబంధాన్ని అంకితం పొందిన విరూరి వేదాద్రిమంత్రి - ‘‘తగ సంస్కృతము తెనుంగుగ జేయ, దెనుగు సంస్కృతముగ జేయంగ జతురమతివి’’ అని రామకృష్ణకవిని శ్లాఘించడంలోని అంతరార్థమిదేననిపిస్తుంది.   
      తెనాలి కవికి తెలుగు మీద మక్కువ ఎక్కువ. వందలాది తెలుగు పదబంధాలను ఆయన అందంగా తన ప్రబంధంలో అలవోకగా బంధించాడు. అది పాండురంగమాహాత్మ్య ప్రబంధానికొక విశిష్టతను కలిగించింది. ఆయనది ఎదురులేని మహాంధ్ర కవితా విద్యాబలప్రౌఢి. విరూరి వేదాద్రి ఆయనకు ప్రబంధాన్ని రచించమని తాంబూలాన్నిచ్చాడు. ఆ తాంబూలంలోనే రామకృష్ణుడు తన సరస్వతిని చూపించాడు. పలుకుం దొయ్యలి మోవి కాంతి కెనయౌ బాగాలు, నయ్యింతి చెక్కులబోలుందెలనాకుల, య్యువిద పల్కుల్‌ వంటి కప్రంపు బల్కులతోగూడిన వీడియం బొసగె నాకున్‌... అన్నాడు. తన కవిత్వంలో తెలుగు కప్రపు పలుకుల సరస్వతి ఉంటుందని సూచించాడు. లక్ష్మీదేవిని గూడా సంస్కృతంలో కలిసిన తెలుగుతో- ‘‘తోబుట్టువయ్యెనే తులిత కాంచనవర్ణ వెలది వెన్నెలగాయు వేల్పునకును’’ అని వర్ణించాడు. శ్రీసూక్తం లక్ష్మీదేవిని ‘‘హిరణ్యవర్ణామ్‌’’ అంటుంది. రామకృష్ణుడు - ‘‘కాంచన వర్ణ వెలది’’ అన్నాడు. ఈ మిశ్రమ సమాసాన్ని రామకృష్ణుడు కావాలనే వాడాడు. అది ఆయన శైలి. ఆయన స్వభావం. ఇక్కడ చంద్రుడిని ‘‘వెన్నెలగాయువేలు’’పన్నాడు. చతుర్ముఖ బ్రహ్మను ‘‘నలుమోములవేలుపు’’గా, ఆయన వాహనాన్ని ‘‘అంచతెలిమావు’’గా మురువుగా పేర్కొన్నాడు. పూర్వకవిస్తుతిలో వాల్మీకికి వందనాలర్పిస్తూ - ‘‘పుట్టకు బుట్టెడు వేళన్, దిట్టపు నునుపచ్చి పుట్టతేనియ చవితో, బుట్టెనన నమృతము ముట్టెడు పుట్టనిసువు’’ అన్నాడు. వేదాలు నేర్పించిన వ్యాసుని- ‘‘ఇట్టాడ రాని యాగమ ఘట్టమునకు నడవయచ్చుకట్టిన మునిరాట్పట్టాభిషిక్తుదపముల పుట్టిన నెలవైన’’ వానిగా నుతించాడు. ఈయన పద్యాల్లో సరస్వతి మొదలు వ్యాసుని వరకు తెలుగు పదాల సొగసులను చూపించాడు. పలుకుందొయ్యలి - బాగాలు - ఇంతిచెక్కులు - తెలనాకులు - వీడియము - పుట్టతేనియ - పుట్టనిసువు - ఇట్టాడు - నడవయచ్చుకట్టు - మొదలైనవన్నీ తెలుగు పదాల వెలుగులు.  
తెలుగు పలుకుబడుల సొగసులు 
మొలక చీకటి జల జల రాల్పగా రాదె 
    నెరులు మించిన వీరి కురుల యందు

వెలదుల పొడవైన నల్లని కురులను పట్టుకుని దులిపితే చీకటి జలజల రాలుతుందిట. 
కెరలించి యమృతము గిలకొట్టగా రాదె 
      ముద్దు చూపెడి వీరి మోములందు.

ఆ వనితలు అమృతాధరాలు. ముద్దులొలికే వారి పెదవులందు అమృతాన్ని గిలకొట్టవచ్చునట. 
పచ్చి బంగారు కుప్పలు సేయగా రాదె 
గబ్బు మీఱిన వీరి గుబ్బలందు.
ఆ గుబ్బెతల బంగారు రంగు వక్షోజాలను బట్టి పచ్చి బంగారాన్ని కుప్పలు చేయవచ్చునట. అది కూడా పరిమళం కలిగిన బంగారాన్ని.
పండు వెన్నెల తేట బలియంపగా రాదె
   నగవుగుల్కెడు వీరి మొగములందు 

ఆ చంద్రవదనల నగవులొలికే మొగాల నుంచి పండు వెన్నెలలను గ్రహించవచ్చునట. 
మొలక చీకటులు - జలజల రాల్చు - నెరులు మించిన కురులు - కెరలించు - గిలకొట్టు - ముద్దు చూపెడి మోములు - పచ్చి బంగారు కుప్పలు - గబ్బు మీఱిన గుబ్బలు -  పండు వెన్నెల తేట - బలియంచు - నగవు గుల్కెడు మొగములు తెలుగు పలుకుల కుప్ప ఈ పద్యం. 
ప్రమథగణాలు - తెలుగు వాలకాలు   
బలుపాప తలచుట్టులలవరించినవారు (పన్నగధరులు)
లేత చందురుల దాలిచినవారు (చంద్రశేఖరులు)
పునుక తమ్మంటుల బొలుచు వీనులవారు (కపాలకుండలులు)
నొసల మిక్కిలి చూపు గలుగువారు (ఫాలనేత్రులు)
బూది పాఱగ మేన బూది బూసిన వారు (భస్మగాత్రులు)
త్రిముఖాస్త్రముల గేల ద్రిప్పువారు (త్రిశూలపాణులు)
పులితోలు హొంబట్టు పుట్టముల్‌ గలవారు (శార్దూలచర్మాంబరులు)
కొమ్ముతేజులనెక్కి గునియువారు (వృషభవాహనులు)
వెండికొండ మీది ప్రమథులను తెలుగు వెలుగుల్లో ప్రకాశింప చేశాడు తెనాలి కవి. 
పాండురంగమాహాత్మ్యంలోని అందమైన పద్యాలలో రామకృష్ణకవి చిన్నికృష్ణుని వర్ణించిన పద్యం ఒకటి. ఈ పద్యంలో శ్రీకృష్ణమూర్తి అంతా తెలుగువాడే - 
వెడద కన్నులవాని వేనామములవాని 
    వ్రేతల వలపించు వెరవు వాని 
చిప్పకూకటివాని, చిన్ని నవ్వులవాని, 
    జెరివిన మంచి పించియము వాని 
బులుగు తత్తడివాని, బొడవుల తుదవాని,
    బొక్కిటకెందమ్మి పూవు వాని 
మినుకుటూర్పులవాని, మిసిమి మేతల వాని, 
    మెఱుగు చామనచాయ మేనివాని 
దిస్సమొలవాని, పసి ద్రిప్పువాని 
మురళిగలవాని మువ్వంక మురువువాని 
విఠ్ఠలాధీశు దలచి తద్విపుల మహిమ
నొడువు బ్రామఱ్ఱి క్రీనీడ విడిది ప్రోడ

అందాల ప్రోవైన నందనందనుడు తెలుగు పదాలలో మరింత అందంగా కనిపించాడు ఈ పద్యంలో. 
పుండరీకుడు కృష్ణభక్తుడు. ఆయనకు సాక్షాత్కరించిన చిన్ని కృష్ణుని రూపాన్ని తెలుగు పలుకులలో రూపు కట్టించాడు. తెనాలి కవి మాటల సొబగులు స్వయంగా కనాలి. చిన్ని కృష్ణుడి తలపైన చిక్కమొక్కటి ఉందని
‘మునుమీనగుట, బట్ట, మునులు వైచిన 
బత్తి వల వోలె జిక్క మౌదల దలార్ప’

అని వర్ణించారు. శ్రీమహావిష్ణువు దశావతారాలలో తొలి అవతారం చేప. చేపను పట్టాలంటే వలవేయాలి. కనుక విష్ణువనే మహామీనాన్ని పట్టడానికి మునులు భక్తి అనే వల వేశారా అన్నట్లుగా చిన్ని కృష్ణుని తల మీద చిక్కం ఉందన్నాడు రామకృష్ణుడు. అట్లాగే నారాయణుని చేతిలో శంఖాన్ని 
‘వెలితిగా జవి గొన్న వెన్నముద్దయుబోలె 
     శంఖంబు వామ హస్తమున దనర’ 

      సగం తిని రుచి చూచి అర చేత దాల్చిన వెన్నముద్దవలె శంఖం ఉందని వర్ణించారు.- అందమైన ఊహకు అపురూపమైన భాష .
      ఇంతకూ ఆ చిన్ని కృష్ణుడెవరంటే - ‘‘మందప్రోయాండ్ర కూరిమి మ్రాని పండు’’ గొల్లల మందలోని అందగత్తెల కంది వచ్చిన ఇష్టమైన ప్రేమఫలం.
      పుండరీకుడు పుండరీకాక్షుని దర్శించి పులకలెసగిన మేనితో స్తుతించిన పద్యం నిండా తెనాలి కవి తెలుగు పలుకుబడులు వినాలి. 
పొదలు నీ పొక్కిట పువ్వు కాన్పున గదా
     పెనుమాయ పిల్లలు బెట్టుటెల్ల

శ్రీమహావిష్ణువు పొక్కిటి పువ్వు నుంచి జన్మించిన బ్రహ్మ మాయతో నిండిన సకలలోకాలను సృష్టించాడు.
పొడము నీ మొదలి యూర్పుల నేర్పుల కదా
     చదువు సంధ్యలు గల్గి జనులు మనుట

విష్ణువు నిశ్వాసాలే వేదాలు. అవి ప్రపంచానికి తొలి చదువులు.
కెరలు నీ యడుగు దామరల తేనియ గదా
పాపంపు పెనురొంపి పలచనగుట

శ్రీమహావిష్ణువు పాదం నుంచి గంగ జనించింది. ఆ గంగ లోకుల పాప పంకిలాన్ని కడిగి వేసింది.
పొసగు నీ తెలిచూపు పస గదా యిది రాత్రి
యిది పగలను మేర లెఱుగబడుట

      విష్ణువు చంద్రసూర్యనేత్రుడు. ఆయన చూపుల వలనే కదా పగలు రాత్రుల తేడాలు తెలుస్తున్నవి.
      వేదాలు వర్ణించిన విరాట్పురుషుని విశ్వరూపాన్ని తేట తెలుగు పలుకుల వెలుగులో తేట తెల్లంగావించాడు రామకృష్ణకవి. ఆపై పుండరీకుడు చేసిన దశావతారస్తోత్రం నిండా ఉన్న తెలుగు పలుకుబడులను బండ్ల కెత్తవచ్చును. అంతవాడింతవాడని దనుజాంతకుని ఇంతగా వర్ణించినా తనివితీరని తెలుగుకవి రామకృష్ణుడు సంగ్రహంగా చేసిన దశావతార స్తుతి నిండా తెలుగు పలుకులు సొగసులీనాయి. 
నీటిలో జివుకక నిలచి క్రుమ్మరుపూన్కి (మత్స్య)
కఠిన కర్పరపు చుక్కాని బిగువు (కూర్మ)
దంష్ట్రనెత్తిన మహీతలపు గాడుపు జీర (వరాహ)
యురుదారకలనయందుదయమగుట (నారసింహ)
పరులకు దనకట్ల బలిమి చూపు విధంబు (వామన)
పులిమిన నెత్రు గుగ్గిలపు నూనె (పరశురామ)
ద్వీపాంతరమునకు దెగువమై జనుపెంపు (రామ)
చేముట్టు నాగంటి జీవితగులు (బలరామ)
సౌగతాగమ మాలిమి శాస్త్రసరణి (కృష్ణ)
వల్లు వల్లన చిత్రధావనము గల్గు (కల్కి)

      ఓడనొక పక్క - భవాబ్దిని దాటించే భగవంతుడైన విష్ణుడను ఓడనొక పక్క చూపిన పద్యమిది.
      పౌండరీక తీర్థమునందున్న నందుని లేబట్టి (నందనందనుడు) ప్రాలేయనగము పట్టి (పార్వతీదేవి)కి వర్ణించి చెప్పిన పద్యంలోని పదాల పోహళింపు ఇంపు కలిగింది. 
నిడివాలు గనుచూపు నిగిడినబోనెల్ల
    బీఱెండ రేయెండ బెండ్లియాడు
నిశ్వాస పవనంబు నెలకొన్నచో నెల్ల 
    బ్రామిన్కు నెత్తారు లాము కవియ 
పొక్కింటి తమ్మిపుప్పొడి యొల్కలోనెల్ల
    బ్రహ్మాంకురంబులు పాదుకొనగ
అడుగులేజిగురాకులంటినచో నెల్ల 
    వివిధ తీర్థశ్రేణి వెల్లవొడువ

      శ్రీమహావిష్ణువు నేత్రద్వయం సూర్యచంద్రులు. సూర్యుడు కాసే బీఱెండ, చంద్రుడు కురిసే రేయెండ. రెండూ కలిసి బెండ్లియాడినట్లుంటాయి. విష్ణువు నిశ్వాసాలు వేదాలు కాబట్టి ఒక్కసారి ఆయన నిశ్వసిస్తే పరిమశాలు పరుచుకుంటాయి. 
      స్వామి నాభి కమల రజం నుంచి బ్రహ్మాండాలు పుట్టుకొస్తాయి. నారాయణుడు కాలుమోపిన చాలు గంగాదినదులు ఉప్పొంగుతాయి. నిడువాలుగనుచూపు - బీఱెండ రేయెండ - పెండ్లియాడు - నెత్తావులు - పొక్కిలి తమ్మిపూవు - పుప్పొడి - అడుగులేజిగురాకులు.. మొదలైన తెలుగు పదాల వెలుగుల వెల్లువ ఈ పద్యం.
      పాండురంగమాహాత్మ్యం మూడో ఆశ్వాసంలో నిగమ శర్మోపాఖ్యానం ప్రబంధం మధ్యలో హృదయస్థానంలో ఉంది. అంటే ఆయువుపట్టులో ఉందన్నమాట. తెనాలికవి తెలుగుతనమంతా ఈ ఆఖ్యానంలో నిలువెత్తు వెలుగుగా దర్శనమిస్తుంది. నిగమశర్మ ‘‘ప్రాసగు విత్తువంటి నెఱపాఱు కులం’’లో పుట్టినవాడు. ‘‘వేదముల్‌ బొసినగాదె శాస్త్రముల పుట్టిల్లు. కలాకలాపముల్‌ డాసిన రచ్చగా’’ - అచ్చమైన తెలుగు నేల బ్రాహ్మణుడిగా కథలోకి వస్తాడు. ఇకపై కథలో అంతా తెలుగు పలుకుల జడివాన. నేలవేల్పుగులము, గొనబుంబ్రాయపు దేజుకూన, పులుగడుగంగబడ్డనునుముత్యము, మీనుమీసమువోలె నుండు జందెము, మోవిపల్లొత్తులు, నేతిబీరకాయ, వంకపొరకబాటు, ఈదుగీసినరీతి, మిండవడ్డి, గువ్వకుత్తుక, కనుగీటినంతలోన, ఇంతలునంతలునగు సంతానము, చంటవెంటసందడి, ఏరా తమ్ముడ, ఎన్నాళ్లనోయుండి, పిల్లి శీలము, చిల్కచదువులు, తమ్ముగుఱ్ఱనోరులేని తొడువలు, తేనెపూసిన కత్తి, పడకకు జెప్పక, ముక్కర, ఆడుబిడ్డ, ఊచముట్టుగ, ఎడ్డితనపుగయసేతలు, కంచంతకాపురము, ఆకుమఱుంగుపిందె, ముంగిటబందిట రాగట్టుక్కలు వత్తిడుకొని... ఇంకా కాపు కోడలి కామవికారాలు, జాతరలో జానపదుల తీరుతెన్నులు వంటి వాటిలో తెలుగు పలుకుబడులు కుప్పతెప్పలుగున్నాయి. తమ్ముడి తలలో పేలు చూస్తూ, తమ్ముడిని చక్కదిద్దాలని మంచి మాటలు చెప్పిన నిగమశర్మ అక్క తెలుగువారిళ్లల్లో ఆడపడుచుగా కనిపిస్తుంది. 
తెలుగు పలుకులలో విలయహరి 
‘‘జలధి వీచీవాత్య జలిదాకెగాయని యక్కున యందంద యదిమి యదిమి’’ 
సముద్రపు గాలుల చలి తాకిందని అక్కున చేర్చుకొని హత్తుకొనుట 
‘‘ప్రామఱ్ఱి యాకొత్తు రాయిడి పొందెగాయని సన్న పొత్తుల నునిచియునిచి’’
- వటపత్రశాయికి ఒళ్లు వత్తుకు పోయిందని మృదు వస్త్రాలపై పడుకోబెట్టడం.
‘‘వాపోయి వాపోయి పసివాడి యూకట బెగడెగాయని యుగ్గు వెట్టి వెట్టి’’
- పసివాడు ఏడ్చి ఏడ్చి అలసిపోయి ఆకలితో ఉన్నాడని ఉగ్గుపెట్టడం.
‘‘పెనుచీకటులుగ్రమ్ము పెన్‌ బైట వసియించి వెఱచెగాయని పుల్ల
విఱిచి విఱిచి’’
- అంతులేని చీకటిలో ఆరుబైటన బెదిరిపోయాడని రక్షలు చేయడం.
      మంచి లక్షణాలు పుట్టు మచ్చవాడు (శ్రీవత్సాంకుడు) నేత్రములు విప్పనట్టి యా నెత్రుకందు (కళ్లుతెరవని పురిటిగుడ్డు)గా ప్రళయ శ్రీహరి కనిపిస్తాడు.
      భగవంతుడి తత్వాన్ని తేటతెల్లం గావించిన పద్యం...
మహితపుణ్యులైన మద్భక్తవరులకు
గానివాడు నాకు గాని వాడు 
భాగవతుల నన్ను భావించి యొకటిగా
గన్నవాడు నన్ను గన్నవాడు

ఇవేకాక, ‘‘పెనుగంప తొడుగు లీడ్చిన మొల్కససియయ్యె గగనంబులో రాయు కాననములు’’, ‘‘కడులావు మానిసి కాలరాచిన చీమ చాలయ్యె బశ్వాది జంతుపంక్తి’’ వంటి పద్యాల్లోని పెనుగంప తొడుగు లీడ్చుట - మొల్కససి - గగనముతో రాయు కాననములు - కడులావు మానిసి - కాలరాచిన చీమల చాలు... వంటి తెలుగు పలుకుబడుల ఉపమానాలు కనిపిస్తాయి. 
తెనాలి కవిత్వంలో ‘తెలుగు సామెతలు’
పువ్వులు ముడిచిన యంగళ్లనె కలకల వీడెవల్ల నవ్వ గట్టెలు మోసెన్‌ 
‘పూలమ్మిన అంగట్లో కట్టెలమ్మినట్లు’ అనేది సామెత సామాన్యరూపం. బాగా బతికినవాడు చెడిపోయి తక్కువ పనులకు పాల్పడినప్పుడు ఈ సామెత వాడతారు.
సాలగ్రామ ఖనిన్‌ జనించును గదా జాత్యల్ప పాషాణముల్‌ 
సాలగ్రామాలు పుట్టిన గనిలో గాజురాళ్లు పుట్టాయని సామెత. మంచి వంశంలో పనికిమాలిన వాళ్లు పుట్టారని ఇందులో భావం. 
కర్ణునౌదలనె భారత సంహిత నిల్చు చాడ్పునన్‌ 
‘కర్ణుడి నెత్తిమీదనే భారతం అంతా నడిచింది’ ఈ సామెతర్థం. జరిగినదంతటికీ ఒక అమాయకుణ్ణి కారణంగా చూపించే సందర్భం. 
గుడి నుండి గుడి రాళ్లు దీయు కరణి 
‘గుడి నుంచి గుడి రాళ్లు పీకినట్టు’ అని సామెత. వెనుక నుంచి గోతులు తవ్వే విషయంలో ఈ సామెత వాడతారు. మనిషికి తెలియకుండానే అతని పతనానికి కారణం కావడమన్నమాట. 
పెచ్చు పెరిగెట్టిదియు హెచ్చి పేర్చుటెల్ల స్రగ్గుటకె 
‘ధర హెచ్చుట తగ్గుట కొరకే’ అనేది సామెత. పెరుగుదల శాశ్వతం కాదని భావం. 
గుడి మింగెడు వానికి తలుపులప్పడములు 
‘గుడిని మింగే వాడికి లింగం ఒక లెక్కా’ అని సామెత. లింగానికి బదులు తలుపులు అప్పడాలు అని ప్రయోగించారు. ఇది వేరే సామెతేమో! ఏమైనా ఉద్ధతుడి ఔద్ధత్యం ఒప్పుకొంటున్నట్లు. 
బొందితోన కైలాసము జేరజూచెడు
‘బొందితో కైలాసం’ అనేది నానుడి. త్రిశంకు కథ ఇందులో దాగి ఉంది. అత్యాశ పనికి రాదని భావం.
ఔదల గొఱవింగొని గోక దివురు కుమతి 
‘నెత్తి మీద కొరివి పెట్టుకుని కోక చుట్టుకుంటుందని’ భావం. మతిలేనివాళ్ల హావభావాలకు ఇది తార్కాణం. 
రామకృష్ణుని కవిత్వమంతా వైభవంగా పాండురంగ మాహాత్మ్యంలో ప్రభలు వెలారుస్తుంది. ఆ రచనావిధానం, ఆ పద ప్రయోగ నైపుణ్యం, ఆ సామెతల సమయోచిత ప్రయోగం, అన్నింటిని మించి ఆ తెలుగు పలుకుబడుల సొగసులు ఆయనను మహాకవిగా ప్రకాశింపజేశాయి. ఈ ప్రబంధాన్ని పట్టుకునూపితే తెలుగు పలుకు బడులు జలజలా రాల్తాయి. రామకృష్ణ కవి శారద రూపం. ఆయన సాంద్ర కీర్తీశ్వరుడు. 


వెనక్కి ...

మీ అభిప్రాయం