భామనే... సత్యభామనే!

  • 735 Views
  • 0Likes
  • Like
  • Article Share

‘అలరులు కురియగ నాడెనదే అలకల కులుకుల అలమేల్‌ మంగ/ అన్న అన్నమయ్య మాట అచ్చ తేనె తెనుగు పాట పల్లవించు పదకవితలు పాడి/ తకిట తధిమి తకిట తధిమి తందానా’ అంటూ బావి అంచున నిలబడి కమల్‌హాసన్‌ చేసిన నృత్యాన్ని మర్చిపోగలమా? ఇదొక్కటే కాదు... 1990 వరకు వచ్చిన ఎన్నో చిత్రాల్లో నటీనటులు చేసిన శాస్త్రీయనృత్యాలు ఇప్పటికీ తెలుగువాళ్ల కళ్లలో మెదులుతూనే ఉంటాయి. ఆయా గీతాల సాహిత్యమూ అర్థవంతమైన అక్షరాలంకరణతో అలరిస్తూనే ఉంటుంది.
‘సర్వ కళాసారము నాట్యము, నయన మనోహరము, రసిక జనానందము, కైవల్య సాధనము’ అని ‘శ్రీరామ కథ’ చిత్రంకోసం వేటూరి రాసిన పాట... నాట్యం విశిష్టతకు అద్దంపడుతుంది. అందులో అంగ భంగిమల అందము వెలయించి/ హావ భావములు ప్రకటించీ/ రాగ రాగిణుల రక్తిని కురిపించి/ హొయలూ, లయలూ చిలికించి అంటూ నాట్యాన్ని నర్తకి ఎలా అభినయించాలో చెప్పారు కవి. నాట్యం సర్వకళల సమాహారం. సంగీత, సాహిత్య, అభినయాల సమ్మేళనం. ఆనాడు ఉత్తమాభిరుచి ఉన్న నిర్మాతలు, దర్శకులు దాదాపు ప్రతిచిత్రంలోనూ ఒకటి, రెండు శాస్త్రీయ నృత్య ప్రధానమైన పాటలను చిత్రీకరించేవారు. ఖండాంతరాలలో సైతం నృత్య ప్రదర్శనలిచ్చి కీర్తిప్రతిష్ఠలు పొందిన నర్తకీనర్తకులు సందర్భానుసారం ఆయా చిత్రాలలో నర్తించారు.
      ఆనాటి నటీమణులకు శాస్త్రీయనృత్య అభినివేశం తప్పనిసరి అర్హతగా పరిగణించేవారు. లలిత, పద్మిని, వైజయంతిమాల, రాజసులోచన, బి.సరోజాదేవి, ప్రభ, హెలెన్‌, ఎల్‌.విజయలక్ష్మి, జమున తదితరులందరూ శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించిన వారే. అనేక చిత్రాల్లో తమ నాట్యకళా కౌశలాన్ని ప్రదర్శించి ప్రేక్షకుల మెప్పు పొందినవారే. ‘చిన్నతనంలో నరసింహారావు మాస్టారి దగ్గర నాట్యం అభ్యసించాను. ఏవీఎం వారి సినిమాలకు పనిచేసే దండాయుధపాణి గారి దగ్గర శాస్త్రీయనృత్యం నేర్చుకున్నాను. అది సినిమాలకు చాలా ఉపయోగపడింది’ అని నాటి కథానాయిక రాజశ్రీ ఓ సందర్భంలో చెప్పారు. ఆమె విదేశాల్లో సైతం ప్రదర్శనలు ఇచ్చారు. సినీరంగంతో సంబంధం లేని వృత్తి కళాకారులైన గోపీకృష్ణ (‘భూకైలాస్‌’ శివతాండవం), మంజుభార్గవి వంటివాళ్లు సైతం వివిధ చిత్రాలలో నర్తించిన సందర్భాలున్నాయి. అయితే.. నృత్యాన్ని శాస్త్రీయంగా అభ్యసించి ప్రదర్శించిన వారికి, కేవలం ఓ చలనచిత్రంలోని ఆ సన్నివేశం కోసం అభ్యసించి నర్తించిన వారికీ ముద్రల్లో, అడుగుల్లో స్పష్టమైన భేదం ఉండేది.
సంప్రదాయానికి గౌరవం
సన్నివేశ ప్రాధాన్యపరంగా ఇలాంటి పాటలను రాసినవారిలో మల్లాది రామకృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, పింగళి నాగేంద్రరావు, సముద్రాల సీనియర్‌, ఆరుద్ర, సినారె వంటి వాళ్లెందరో ఉన్నారు. ఆయా పాటలకు నిండుదనం తెచ్చారు.
‘రహస్యం’ చిత్రంలో మల్లాది రచించిన ‘గిరిజా కల్యాణం’ యక్షగానం ప్రజాదరణ పొందింది. ‘చిలుక తత్తడి ఎందుకీ హుంకరింత’, ‘అంబాయని అసమశరుడు నను పిలిచెను వినవో’ వంటి ప్రబంధ ఛాయలున్న పద ప్రయోగాలతో... కూచిపూడి భాగవతుల యక్షగాన రీతిని, సంప్రదాయాన్ని పాటిస్తూ దీన్ని రాశారు మల్లాది. దీని ప్రారంభంలో ‘లలిత కళల విలువ తెలియు సరసులు పదింపదిగ పరవశులై’ అంటూ నాట్యం లాంటి కళలను ఆస్వాదించడానికి రసహృదయం అవసరం అని చెప్పారు. ఇదే చిత్రంలో లలితామాత త్రిమూర్తి స్వరూపాలను వర్ణిస్తూ రాసిన ‘లలిత భావ నిలయా నవరసానంద హృదయా’ అనే గీతాన్ని నేటికీ ఎందరో శాస్త్రీయనృత్య కళాకారులు అభినయిస్తూనే ఉన్నారు.
సాహిత్యం సుమధురం
‘నర్తనశాల’లో అర్జునుడు ఉత్తరకు నాట్యం నేర్పే సందర్భంలో వచ్చే కూచిపూడి సంప్రదాయ ‘వినాయక కౌతం’ సుప్రసిద్ధమైంది. ఎల్‌.విజయలక్ష్మి నృత్యం ఆ గీతానికి జీవం పోసింది. ‘భూకైలాస్‌’ చిత్రంలోని దశావతారాల నృత్య గీతం ‘మున్నీట పవళించు నాగశయనా’ను ఎం.ఎల్‌.వసంతకుమారి ఆలపించారు. ‘కిటి రూపమూ దాల్చినావు కనకాక్షు వధియింప....’, ‘మోహినీ విలాస కలిత నవమోహనా మోహదూర మౌనిరాజ మనో మోహనా’ వంటి విలక్షణ పద ప్రయోగాలున్నాయి. అలాగే అదే చిత్రంలో రావణుని తపోభంగం సన్నివేశంలో హెలెన్‌ నర్తించిన ‘సుందరాంగా అందుకోరా సౌందర్య మాధుర్య మందారము’ పాట జనాదరణ పొందింది. దీన్ని సముద్రాల సీనియర్‌ రాశారు. ఇందులో ఓచోట ‘కేలు కేలగొని మేనులేకముగ ఏకాంత సీమలలో/ మది సంతాపమారగ సంతోషమూరగ చెంత చేరరాద’ అని వస్తుంది. కేలు అంటే చెయ్యి. ఇక కేలగొని అంటే చెయ్యికలపడం. మొత్తమ్మీద చేయీ చేయీ కలిపి ఏకాంతసీమల వైపు సాగుదాం అని ‘ఆమె’తో అనిపించారు కవి. ‘అతని’ రాకతో ‘ఆమె’ మనసులోని సంతాపం ఆరిపోతుందట. సంతోషం వూరుతుందట. అంతేకదా మరి!
      అప్పట్లో వచ్చిన ప్రతి పౌరాణిక చిత్రంలోనూ శాస్త్రీయనృత్య ప్రధాన గీతాలు కనిపిస్తాయి. వీటిని ప్రత్యేకంగా చిత్రీకరించడం ఆనాడు ఓ సంప్రదాయంగా పాటించారు. ‘పాండవ వనవాసం’లో భీముడి ఎదుట యక్షకన్యగా రాజసులోచన ‘ఉరుకుల పరుగుల దొర’ అంటూ పాడుతూ చేసిన నాట్యం కనువిందు చేస్తుంది. ‘శ్రీకృష్ణ పాండవీయం’లోని ‘స్వాగతం సుస్వాగతం’, ‘భక్తప్రహ్లాద’లోని ‘అందని సురసీమ నీవోనోయి’, ‘సీతారామ కల్యాణం’లో ‘శివతాండవం’, ‘శ్రీకృష్ణ విజయం’లోని ‘జోహారు శిఖి పింఛమౌళీ’, ‘సంపూర్ణ రామాయణం’లోని రావణుని స్తోత్రం ‘ఎవ్వరు నిను మించువారు’ తదితర గీతాలు ప్రజాదరణ పొందాయి.
చారిత్రక చిత్రాల్లో చూస్తే, ‘మహామంత్రి తిమ్మరుసు’లోని ‘తిరుమల తిరుపతి వెంకటేశ్వరా’ గీతం రాయలవారి కళావైభవాన్ని కళ్లముందు నిలుపుతుంది. ఇందులో కవి పింగళి ‘ఆశారాగమే ఆలాపనగా సరసరీతుల స్వరమేళనల....’ లాంటి మధుర భావ ప్రయోగాలెన్నో చేశారు. అలాగే ‘అమరశిల్పి జక్కన’లోని ‘అందాల బొమ్మతో ఆటాడవా’, ‘నగుమోము చూపించవా గోపాలా’ తదితర పాటలూ శాస్త్రీయనృత్య ప్రధానమైనవే. నాటి సాంఘిక చిత్రాల్లో కూడా ఇలాంటి పాటలు చాలానే ఉన్నాయి. కళ్లతోనే హావభావాలు పలికించగలిగిన సావిత్రి, శాస్త్రీయ నృత్యాభినయంలోనూ తన ప్రతిభను ప్రదర్శించారు. ‘చరణదాసి’ (ఈ దయచాలునురా కృష్ణా), ‘కన్యాశుల్కం’ (సరసుడ దరిజేరరా) చిత్రాల్లో శాస్త్రీయ నృత్యాలు చేశారు. ‘ఈ దయచాలునురా’ పాటను మల్లాది రచించారు. ఇందులోని ‘మువ్వముగా నీ కాలిన ఘల్లన/ మువ్వల నన్నొక మువ్వ చేయరా’ అనే భావం కవితాత్మకంగా ఉంటుంది.
జావళీలు... అష్టపదులు
కథ, సన్నివేశాలకు అనుగుణంగా ఆనాటి చిత్రాలలో ఎక్కువగా నాయిక పాత్రల మీద ‘జావళీ’లను చిత్రీకరించారు. ఇవీ శాస్త్రీయ నృత్యాంశంతో కూడుకున్నవే. ‘బొబ్బిలియుద్ధం’లోని ‘నిను చేర మనసాయెరా’, ‘జయసింహ’లోని ‘నడిరేయి గడిచేనే’, ‘మంగమ్మ శపథం’లోని ‘అందాల నా రాజ అలకేలరా’, ‘మిస్సమ్మ’లో జమున నర్తించిన ‘బాలనురా మదనా’ తదితర జావళీలు జనాదరణకు నోచుకున్నాయి. అలాగే, బాపూరమణల కమనీయ దృశ్యకావ్యం ‘ముత్యాలముగ్గు’లోని ‘ఎంతటి రసికుడివో తెలిసెరా’ కూడా ప్రఖ్యాతం. ‘నీ వింతలు ఇంతలు ఇంతలై/ కవ్వింతలై మరులొలికెరా’ అంటూ సినారె కలం ఇందులో శృంగారరసాన్ని ఒలకబోసింది.
      తగిన శాస్త్రీయ నృత్యాలతో తెలుగు వాగ్గేయకారుల రచనలూ చలనచిత్రాల్లోకి వచ్చాయి. ‘దేవదాసు’లో ప్రముఖ నర్తకి లలిత చేసిన క్షేత్రయ్య పదం ‘ఇంత తెలిసియుండి ఈ గుణమేలరా’; అభిసారిక, విప్రలబ్ధ, విరహోత్కంఠిత తదితర అష్టవిధ నాయికలను వర్ణించే ‘మహాకవి క్షేత్రయ్య’లోని గీతం ఆకట్టుకుంటాయి. అలాగే ‘త్యాగయ్య’, ‘సాగరసంగమం’ చిత్రాలకోసం ‘ఓడను నడిపే ముచ్చటగనరే వనితలారా’, ‘బాల కనకమయ చేల’ అనే త్యాగరాజ కృతులను తెరకెక్కించారు. ‘పెళ్లిపుస్తకం’ చిత్రంలోని ‘కృష్ణం కలయసఖి సుందరం’ నారాయణ తీర్థుల తరంగం.
      అన్నమయ్య కీర్తనలు, జయదేవుని అష్టపదులకు శాస్త్రీయ నృత్యాలను జోడించి వెండితెర మీద ఆవిష్కరించారు దర్శకులు. ‘అలరులు కురియగ ఆడినదే అలకల కులుకుల అలమేల్మంగా’ కీర్తనకు భానుప్రియ అభినయించిన తీరును జంధ్యాల ‘ష్‌...గప్‌చిప్‌’లో చక్కగా చిత్రీకరించారు. ‘మేఘసందేశం’లో దాసరి జయప్రదపై ‘‘రాధికా కృష్ణా’’, ‘‘ప్రియే చారుశీలే’’ వంటి అష్టపదులను చిత్రీకరించారు. అలాగే ‘చందన చర్చిత నీలకళేబర’ అష్టపదిని ‘తెనాలి రామకృష్ణ’లో తెరకెక్కించారు దర్శకుడు బి.ఎస్‌.రంగా.
విశ్వనాథుడి సేవ
డెబ్భయ్యో దశకం చివరిభాగంలో కె.విశ్వనాథ్‌ సంగీత, నృత్య ప్రధానమైన చిత్రాలను తీశారు. ‘శంకరాభరణం’లో మంజుభార్గవి చేసిన శాస్త్రీయ నృత్యాలు అందరినీ కట్టిపడేశాయి. అలాగే, ‘సప్తపది’లోని ‘జాతవేదసే సునవామసోమ’, ‘అఖిలాండేశ్వరి, చాముండేశ్వరి’, ‘భామనే - సత్యభామనే’ ప్రఖ్యాతాలు. ‘స్వర్ణకమలం’లోని ‘అందెల రవమిది పదములదా/ అంబరమంటిన హృదయముదా’ గీత సాహిత్యంలో లోతెక్కువ. అందుకే దాన్ని రాసిన ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రికి నంది పురస్కారం లభించింది. ఈ అందెల శబ్దం పాదాలదా లేదా అంబరాన్నంటేంత సంతోషంతో నిండిన గుండెదా అనే మధురభావంతో సాగే ఈ పాటకు భానుప్రియ చేసిన నృత్యం కన్నులపండువగా ఉంటుంది. ఇదే చిత్రంలోని ‘కొలువై ఉన్నాడే దేవదేవుడు’ కూడా రసరమ్యంగా సాగుతుంది. ‘శ్రుతిలయలు’లోని ‘ఆలోకయే శ్రీ బాలకృష్ణం’, ‘శ్రీ గణనాథం భజామ్యహం’ తదితరాలూ శాస్త్రీయనృత్య ప్రధానమైనవే. ఇక ‘సాగరసంగమం’ ఓ నాట్య కళాకారుడి కథ. ఇందులో కమల్‌హాసన్‌ దేశంలోని శాస్త్రీయ నృత్యరీతులన్నింటినీ కొద్దిసేపు అభినయించారు. ‘ఓం నమశ్శివాయ’, ‘నాదవినోదం’ పాటలూ ప్రేక్షకుల హృదయాలపై చెరగని ముద్ర వేశాయి.
      జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ‘ఆనందభైరవి’కి ఆధారం కొండముది శ్రీరామచంద్రమూర్తి రచించిన ‘చిరుమువ్వల మరు సవ్వడి’ నవల. పూర్తిగా కూచిపూడి నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ఇందులో నాయిక పాత్రను అప్పటి కర్ణాటక రాష్ట్ర ఆస్థాన నర్తకి మాళవిక పోషించారు. కూచిపూడి సంప్రదాయ పూజా నృత్యం ‘బ్రహ్మాంజలి’ ఈ చిత్రంలో చక్కగా ఆవిష్కృతమైంది. ఇక వేటూరి చేసిన రుతువర్ణన గీతం ‘చైత్రము కుసుమాంజలి’ కి మాళవిక నృత్యం చక్కగా కుదిరింది. ఇందులోనే ‘తాండవ నృత్యస్రష్ట’(శివుడు)కు బ్రహ్మాంజలి, ‘లాస్య ఖేలనాలోల’(పార్వతి)కు దివ్యాంజలి, ‘సిద్ధయోగీంద్ర సత్కవి’కి భక్త్యంజలి, ‘నాట్య కోవిదవరులకు’ నృత్యాంజలి ఘటించారు వేటూరి. సాహిత్యపరులు, సంగీత విదులు, నాట్యానుమోదులతో పాటు సర్వజనాళికి శుభం పలికారు. అలాగే ఈ చిత్రంలోని ‘కొలువైతివా రంగశాయి’ (దేవులపల్లి రచన), ‘శివతాండవం’ వంటివీ, నాట్యకళ ఔన్నత్యాన్ని తెలుపుతాయి.
సుప్రసిద్ధ నర్తకి సుధాచంద్రన్‌ జీవితం ఆధారంగా ఉషాకిరణ్‌ సంస్థ నిర్మించిన ‘మయూరి’... పూర్తి శాస్త్రీయ నృత్య ప్రధాన చిత్రం. ఇందులోని ‘ఈ పాదం ఇలలోన నాట్యవేదం’ పాట నాట్య ప్రాశస్త్యాన్ని వివరిస్తుంది. ‘కైలాసంలో తాండవమాడే నటరాజా’, ‘ఇది నా ప్రియ నర్తన వేళా’ గీతాలు శాస్త్రీయనృత్య ప్రాధాన్యాన్ని, నాట్యం మీద నాయికకు ఉన్న మక్కువను వెల్లడిస్తాయి. ఇటీవలి చిత్రాల్లో కూడా అడపాదడపా శాస్త్రీయ నృత్య ప్రధానమైన గీతాలు కనిపిస్తూనే ఉన్నాయి. ‘పౌర్ణమి’లో ఛార్మిపై ‘భరత వేదమున నిరత నాట్యమున’ గీతాన్ని చిత్రీకరించిన తీరు నాట్యం అంటే దర్శకుడికి ఉన్న అభిరుచికి నిదర్శనం.
సంగీత నాట్యాలు జీవకళలు. మొదటిది శ్రవ్యయోగ్యం. రెండోది దృశ్యయోగ్యం. ఆ రెంటికి సాహిత్యం తోడై... సంగీత, సాహిత్య, నృత్య- త్రివేణీ సంగమమై రససిద్ధికి సాధకాలవుతాయి. ప్రేక్షకులకు అనుభవైక వేద్యాలవుతాయి. కళాకారులకు యశస్సాధనకు దోహదమవుతాయి. తెలుగు చలనచిత్రాల ద్వారా కూడా ప్రేక్షకులకు ఆ రససిద్ధి, కళాకారులకు చిర యశస్సు లభించాయి.

*  *   *


వెనక్కి ...

మీ అభిప్రాయం