సరదా... సరదా... సాహిత్యం

  • 217 Views
  • 2Likes
  • Like
  • Article Share

    డా।। పాపినేని శివశంకర్‌

  • గుంటూరు
  • 8500884400
డా।। పాపినేని శివశంకర్‌

‘‘చదివిన విన్నా జనులందరికి చక్కగ
 తెలిసితె వ్రాతా
మెదడు చించుకొని నిఘంటులన్నీ
వెదికించిందే రోతా’’

      అన్నారు ‘తాతాజీ’గా సాహిత్య లోకంలో ప్రసిద్ధులైన తాపీ ధర్మారావు. వాడుక మాటలతో భావాలు ప్రకటించడమే సరైన రాత అని కూడా అన్నారు. ఇవాళ అది విశేషం కాదు గానీ, 1950 దశాబ్దంలో ఆ మాట అనడం సాహసమే. అవును, తాపీ ధర్మారావు మరో పేరు సాహసమే.
      సమాజంలో గానీ, సాహిత్యంలో గానీ తరతరాల నుంచి స్థిరపడిపోయిన ఆచారాలుంటాయి, సంప్రదాయాలుంటాయి. హేతుబద్ధమైన మార్పు లేకపోతే అవి గిడసబారిపోతాయి. వాటిని తోసిరాజని, కొత్తదారి వెయ్యాలంటే కొత్తచూపు, సామాజిక అవగాహన, సాహిత్య సాంస్కృతిక విషయాలపై అధికారం కావాలి. బరంపురంలో 1887లో పుట్టి, శ్రీకాకుళ సీమలో పెరిగిన ధర్మారావు ఎస్‌.ఎ. చదివి, పాశ్చాత్య సామాజిక శాస్త్ర వికాసాన్ని గమనించారు. వలసవాదం ప్రవేశపెట్టిన ఆధునిక దృక్పథంతో ఇక్కడి సమాజాన్ని, సాహిత్యాన్ని పరిశీలించారు. వ్యావహారిక భాషోద్యమ నిర్మాత గిడుగు రామ్మూర్తి పంతులు శిష్యుడిగా తెలుగు భాష పరిణామం గురించి కొత్త ఆలోచనలు చేశారు.
      ‘దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు’, ‘పెళ్లి - దాని పుట్టుపూర్వోత్తరాలు’, ‘ఇనపకచ్చడాలు’ అనే పుస్తకాల ద్వారా తాపీ వారు మన సాంఘికాచారాల వెనుక శాస్త్రీయ మూలాల్ని అన్వేషించారు. మానవ నాగరికత ప్రస్థానంలో మతం, వివాహం, స్త్రీ పురుష సంబంధాలు మొదలైనవి నిర్వహించిన పాత్రని నిర్ధరించే ప్రయత్నం చేశారు. (ఆ ప్రయత్నాన్ని పునఃమూల్యాంకనం చెయ్యాల్సిన అవసరం కూడా ఉంది.)
      కొత్తపాళీ, సాహిత్య మొర్మొరాలు అనే పుస్తకాలు తాపీ వారు చేసిన అపూర్వ పరిశీలనని తెల్పుతాయి. వెనుకటి రోజుల్లో పక్షి ఈకల్ని సిరాబుడ్డిలో ముంచి రాసే ‘పిట్టకలాలు’ ఉండేవి. అవి పాతదనానికి గుర్తు తర్వాత కాలంలో పాళీలతో మెత్తగా రాసే కలాలు వచ్చాయి. కనుక ‘కొత్తపాళీ’ కొత్త ఆలోచనల సరికొత్త రాతలకి సంకేతం. ఇక మరమరాలు/మొరమొరాలు/ మొర్మొరాలు చిరుతిండికి పనికొచ్చేవి. తేలిగ్గా అరిగేవి. ‘సాహిత్య మొర్మొరాలు’ ప్రాచీన సాహిత్యంలో ఆహ్లాదకర విషయాల మీద రాసిన చిన్నచిన్న సరదా వ్యాసాలు. (నిజానికి సాహిత్య మొర్మొరాలు అనేది దుష్ట సమాసం) ఈ రెండు పుస్తకాలూ సామాన్య పాఠకుల్లో సాహిత్యాభిరుచిని పెంపొందిస్తాయి.
      వ్యావహారిక భాషోద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన తాపీవారు ఒకరి ఉద్దేశం ఇంకొకరికి తెలపటానికే భాష ఏర్పడిందని, ఆ ఉద్దేశాన్ని ఎంత చక్కగా బోధపడేట్టు చెప్పగలిగితే అది అంత చక్కటిభాష అవుతుందని నమ్మారు. ప్రజలేమో ‘చెట్టు నీడన కూర్చున్నాడు’ అంటుంటే, కవులేమో ‘వృక్షచ్ఛాయను విష్ణుండయ్యెను’ అన్నారు. పండిత సభలకే పరిమితమయ్యారు. కనుక తాపీవారు తాపీగా చెట్టునీడలో కూర్చోటానికే ఇష్టపడ్డారు. కవుల భాష ‘అందరికీ తెలిసేటట్టుండాలి’ అని ఒక వ్యాసం రాశారు కొత్తపాళీతో.
       వెనకటి కవులు, పండితులు ‘సంస్కృత పంజరం’లో తెలుగును బంధించారని తాతాజీ ఆరోపించారు. వాడుకలో లేని భాష, వ్యాకరణం, అనవసర వర్ణనలు, కవి సమయాలు, బంధ గర్భ రచనలు నింపి కవిత్వాన్ని ప్రజలకి దూరం చేశారని విమర్శించారు. ‘తెలుగు కవి, రచయిత తెలుగు ప్రజల జీవితంలో ఉండి రాయాలి’ అని నిగ్గు తేల్చారు. వెనకటి పదాలు, పాటలు, ద్విపదలు, యక్షగానాలు, కథలు మొదలైన దేశీ ప్రక్రియల్లో తేలిక మాటల్లోనే గొప్ప గొప్ప భావాలు వెలువడ్డాయని గుర్తించి, దేశీ కవిత గుప్పించిన పాల్కురికి సోమనాథుడు వంటి కవులను మెచ్చుకొన్నారు. (బసవ పురాణంలో బెజ్జమహాదేవి, గొడగూచి కథలు రెండూ ఒకటిగా భ్రమించి పొరపడ్డారు)
      భాషలో బండిరాలు, అరసున్నలతో పాటు ‘సంహరింపబడెను’ మొదలైన బడు (కర్మలో) ప్రయోగాల్ని, ‘రాముడి యొక్క పుస్తకం’ మొదలైన కృత్తిమ విభక్తి ప్రయోగాల్ని తాతాజీ తప్పుపట్టారు. భాషా పరిణామం గుర్తించని వ్యాకరణాలు నిర్జీవమైనవని తూలనాడారు. ఈ వరసలోనే ‘సూరి మరణం లేక బండి రా పల్లకీ’ అనే అపహాస్య నాటిక గూడా రాశారు. గ్రాంథిక భాషనర్థం చేసుకోవటానికి కొన్ని సూత్రాలను, నియమాలను ఏర్పరచిన చిన్నయసూరి బాలవ్యాకరణానికి ఒక పరిధి, పరిమితి ఉండవచ్చు. అంతమాత్రాన ఆ వ్యాకరణమే నిర్జీవమనటం అతివాదమే. అంతేకాదు. తాపీవారితో సహా ఎందరో వ్యావహారిక భాషావాదులు చిన్నయసూరి ‘నీతిచంద్రిక’ లోని వచన రచనా నైపుణ్యాన్ని అందుకోలేకపోయారు.
      ప్రాచీన కావ్యాల్లో సంప్రదాయబద్ధంగా వ్యాఖ్యానాలు రచించిన పండితులు ఆ కవుల స్వాతంత్య్రాభిలాషని, కళాదృష్టిని గుర్తించలేకపోయారని ఆరోపించారు తాపీ వారు. చేమకూర వేంకట కవి విజయ విలాసానికి హృదయోల్లాస వ్యాఖ్యతో వ్యాఖ్యానాలకే కొత్త ఒరవడి దిద్దారు. కవుల ఊతపదాలని, వ్యర్థపదాలని తూర్పారబట్టిన చేతితోనే వాళ్లు వాడిన చక్కని లోకోక్తుల్ని పైకెత్తి చూపారు. కావ్యావతారికల్లో ఆనవాయితీగా మారిన కవుల స్వప్నాలు, కుకవి నిందలు, పుష్పలావికా వర్ణనలు మొదలైన వాటిని నిరసించిన కలంతోనే తిక్కన, పోతన, చేమకూర రచనల్లో విశేషాంశాలను మెచ్చుకొన్నారు.
      సాహిత్యం గంభీర విషయమే కావచ్చు. అయితే అందులో మాత్రం సరదాలకు తావుండదా? ఈ ప్రశ్న తాతాజీకి తగిలింది. ‘సాహిత్య మొర్మొరాలు’లో ఆయన ‘వెనకటి కావ్యాల్లోని’ చిన్న చిన్న విషయాలను మాత్రమే ఎత్తుకొని ‘వినోదంగా చదువుకో తగినట్టు’ వివరించారు. ‘కృష్ణుడి శిరసును సత్యభామ తన్నిందా?’ అన్నది తాతాజీ చేసిన ఒక సరదా చర్చ. ‘లతాంతాయుధు కన్నతండ్రి శిరమచ్చో వామపాదమ్మునన్‌ దొలగం ద్రోచెలతాంగి’ అని చెప్పాడు. ముక్కు తిమ్మన పారిజాతాపహరణంలో ఎడమ కాలితో కృష్ణుడి తల పక్కకి నెట్టింది సత్యభామ. ఆ తర్వాతేమో కృష్ణుడు ‘నను భవదీయదాసుని మనంబున నెయ్యపు గిన్కపూని తాచినయడి నాకు మన్ననయ’ అన్నాడు. ‘తాచుట’ అంటే కాలితో తన్నడమే గదా? అయితే ఈ తాపు ఆ కుహనా గోపాలుడి తలలో పుట్టిందే కానీ సత్యభామ చేసిన మర్యాద కాదని తేల్చారు తాపీ వారు.
      ‘తాంబోలం యిచ్చేశాను. యిహ తన్నుకు చావండి’ అన్నాడు కన్యాశుల్కంలో అగ్నిహోత్రావధానులు, తాంబూలానికి అంత ప్రాధాన్యం ఉంది మరి. భారతదేశపు భిన్నత్వంలో ఏకత్వానికి తాంబూలం రుజువన్నారు తాతాజీ. ఎక్కడెక్కడో పుట్టిన తమలపాకు, వక్క, సున్నం- ఈ మూడిటిని కలిపి మన నోరు పండించిన తాంబూల మూల పురుషుడికి జేజేలు పలికారు. అంతటితో ఆగకుండా పెద్దన ‘ప్రియదూతిక తెచ్చియిచ్చు కప్పురవిడెము’, వరూధిని వేసుకొన్న అతి కర్పూర తాంబూలం, శ్రీనాథుడి ‘తములపాకుల బేరము’ ఇట్లా చాలా ‘కవితా తాంబూలాలు’ మనకందించారు. అందులో ఒకటి దండి, కాళిదాసుల తాంబూల సరసం. ఆ ఇద్దరు మహాకవులూ వీధిన వెళ్తున్నప్పుడు ఒక అరుగు మీద అమ్మాయిని దండి అడిగాడు ‘‘తూర్ణ మానీయతాం చూర్ణం, పూర్ణ చంద్ర నిభాననే’’ అని. పున్నమి చంద్రుడి వంటి ముఖం గల అమ్మాయీ! నాకు సున్నం తేవమ్మా అని అర్థం. వెనువెంటనే ఆ అనుష్టుప్‌ శ్లోకం పూరిస్తూ కాళిదాసు ముక్తాయించాడు ‘‘పర్ణాని స్వర్ణ వర్ణాని, ఆకర్ణాయతలోచనే!’’ అని. చెవులదాకా సాగిన పెద్ద కన్నులు గలదానా! బంగారు వన్నెగల తమలపాకులు గూడా తెమ్మని అర్థం. ఆ అమ్మాయి ముందుగా కాళిదాసుకి తమలపాకులిచ్చి, ఆ తర్వాత దండికి సున్నం ఇచ్చింది. ముందుగా అడిగిందేమో  దండి. అందుకు సరసమైన కారణం చెప్పారు తాపీవారు. ఏమిటంటే దండి మూడు అణాలే ఇచ్చాడు. కాళిదాసు నాలుగణాలిచ్చాడు! కావాలంటే శ్లోకం చూడండి. (ఈ శ్లోకాన్ని ‘కర్ణాంతాయతలోచనే’ అని తప్పుగా ఉదాహరించారు తాపీ వారు)
       పెద్దన గారి వరూధిని ప్రవరుడిని ఆకర్షించటానికి కల్లబొల్లి ఏడ్పులు ఏడ్చింది. తిమ్మన గారి సత్యభామ కృష్ణుడి మీద కోపంతో లేతమామిడి చిగుళ్లు మెక్కిన కోకిల గొంతుతో ఏడ్చింది. భట్టుమూర్తిగారి గిరిక విరహంతో ఏకంగా కాంభోజీ రాగంలోనే ఏడ్చింది. ఈ ముగ్గురిని పోల్చిన తెనాలి రామలింగడు ‘‘అల్లసాని వాడు అటు ఇటుగా ఏడ్చాడు. ముక్కు తిమ్మన ముద్దు ముద్దుగా ఏడ్చాడు. భట్టుమూర్తి బావురుమని ఏడ్చాడు’’ అని తూకం వేశాడని ఒక కథ. ఈ ‘మూడేడుపుల ముచ్చట్లు’ చక్కగా వివరించారు తాతాజీ.
      ఈ వ్యాసాలన్నీ మొదట తాపీవారే స్థాపించిన కాగడా, జనవాణి పత్రికల్లో వెలువడినవే. పత్రికా రచనలో ఆయనది కొత్తదారి. ‘‘ఆంధ్ర విశారద’’ బిరుదు పొందిన ఈ అభ్యుదయవాది 1943లో తెనాలిలో జరిగిన ప్రథమాంధ్ర అభ్యుదయ రచయితల మహాసభకి అధ్యక్షత వహించారు. మాలపిల్ల, రైతుబిడ్డ, ద్రోహి, రోజులు మారాయి మొదలైన చలన చిత్రాలకు కూడా రచన చేసిన తాపీ ధర్మారావు బహుముఖ ప్రజ్ఞాశాలి.


వెనక్కి ...

మీ అభిప్రాయం