చదువుల సారం జ్ఞానం

  • 22 Views
  • 0Likes
  • Like
  • Article Share

‘‘విద్యనిగూఢ గుప్తమగు విత్తము, రూపము  పూరుషాళికిన్‌
విద్య యశస్సు, భోగకరి, విద్యగురుండు, విదేశబంధుడున్,
విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబు లేదిలన్,
విద్య నృపాల పూజితము, విద్య నెరుంగని వాడు మర్త్యుడే!’’
భర్తృహరి
సుభాషితాన్ని ఏనుగు లక్ష్మణ కవి ఎంత సొగసుగా చెప్పినా చదువుకోనివాడు మరణించిన వాడితో సమానం అని కూడా హెచ్చరించాడు. చదువు తరగని గని. ఎంత జ్ఞానం సంపాదించినా దాన్ని ఎంత మందికి ఉచితంగా పంచినా అది తరిగిపోయేది కాదు. దొంగలు దోచగలిగేదీ కాదు.
      మూడు రకాల వారికి బంగారు పంట పండుతుందట. శూరులు, విద్య నేర్చుకున్న వారు, ఇతరులను సేవించగలిగిన వారికి అంతా సిరులపంటే. ఇతరులను సేవించడాన్ని వదిలేసినా, మొదటి రెండు ఆచరించదగిన ఆదర్శాలే. చదువంటే చాలామంది పెద్ద పెద్ద డిగ్రీలు అనుకుంటారు. కచ్చితంగా అదీ చదువే. కానీ అసలు చదువు డిగ్రీలకు పరిమితమైంది కాదు. డిగ్రీలు లేకపోయినా విద్యావంతులు అయిన వారు ఉండొచ్చు. ఇప్పుడైతే విద్యాహక్కుచట్టం లాంటివి వచ్చాయి. కాని చదువుకోవాలన్న ఆసక్తి మిక్కుటంగా ఉన్నా బడికో, కళాశాలకో వెళ్లలేక స్వయంకృషితో చదువుకుని ఉన్నత శిఖరాలు చేరుకున్న వారికి కొదవలేదు. ఉన్నత విద్యను అందుకోగలిగి గొప్ప వాళ్లయిన వారూ ఉన్నారు.
      చదువు సిద్ధాన్నంలాంటిది. సొంతంగా అనుభవం లేకపోయినా అనేక విషయాల మీద అపారమైన అనుభవం సాధించడానికి ఉన్న ఏకైక మార్గం చదువే. అందుకే అధ్యయనాన్ని మించిన ఆయుధం లేదంటారు. అనుభవం అందరి జీవితాల్లోనూ ఉంటుంది. కానీ జీవితానుభవం కొందరికి మాత్రమే సొంతం అవుతుంది. జీవితానుభవం సంపాదించడానికి పుస్తకాన్ని మించింది ఏదీ లేదు.
      చదువంటే పాఠ్యపుస్తకాలు చదవడమే, మంచి మార్కులు తెచ్చుకోవడమేనని చాలా మంది అనుకుంటూ ఉంటారు. జీవనోపాధి కోసమే చదువు అన్న అభిప్రాయం మన మదిలో పాతుకుపోయినందువల్ల ఇష్టమైన ఉద్యోగమో, వృత్తో ఎన్నుకోవడం అనివార్యం అయినందువల్ల పాఠ్యపుస్తకాల అధ్యయనానికే ప్రాధాన్యం ఇవ్వడం అసహజమూ, అనవసరమూ కాదు. చాలామంది తల్లిదండ్రుల్లో ఈ మధ్య ఈ ధోరణే కనిపిస్తోంది. తమ పిల్లలు కథల పుస్తకాలో, పిల్లల పత్రికలో చదివితే క్లాసు పుస్తకాలు చదువుకోక అవెందుకు అని గద్దిస్తుంటారు. అసలు చదువు ఎక్కడ వెనుకబడి పోతుందోనని వారి భయం. అంతే! అయితే పాఠ్యపుస్తకాలతో పాటు ఇతర సాహిత్యం కూడా ఎక్కువగా చదివితే మన దృక్పథం మారుతుంది. మన దృష్టి విశాలం అవుతుంది. అప్పుడు అసలు చదువు ఇంకా త్వరగా బుర్రకెక్కుతుంది. చాలామంది తల్లిదండ్రులకు ఈ విషయంలో అనుభవం లేక, తమ పిల్లలు చదవకూడని పుస్తకాలు చదివి ఎక్కడ పాడైపోతారో అన్న బెంగటిల్లుతుంటారు. ఇతర పుస్తకాలు చదివే తమ పిల్లలను అడ్డుకుంటుంటారు. 
      ఈ రోజుల్లో జ్ఞానం సంపాదించడానికి పుస్తకం ఒక్కటే మార్గం కాదు. ఈ మాట వాస్తవమే అయినా పుస్తకాన్ని మించిన నేస్తం మరొకటి లేదు. పుస్తకం ప్రతిఫలం కోరదు. పుస్తకం ఆస్వాదించగలిగిన వారికి కావల్సిన రసానుభూతి కలిగిస్తుంది. దోసిళ్ల కొద్దీ జ్ఞానాన్ని దోచుకున్నా అభ్యంతరం చెప్పదు. అది ఇగిరి పోయేదీ కాదు, తరిగి పోయేదీ కాదు. అక్షరానికి ఉన్న విలువ అలాంటిది. అసలు అక్షరం అంటేనే క్షరం కానిది- నాశనం లేనిది అని అర్థం. ఏ గ్రంథమైనా అక్షర క్రీడే.
      ఇటీవల జ్ఞానపీఠ్‌ పురస్కారాన్ని సాధించుకున్న రావూరి భరద్వాజ మాధ్యమిక పాఠశాల కన్నా పైకి వెళ్లలేకపోయారు. అంతమాత్రాన ఆయనకు చదువు లేదని కాదు. డిగ్రీలు లేవనే అర్థం. అవి సంపాదించడానికి ఆయనకు వీలు చిక్కలేదు. అలాగని నిరాశపడకుండా స్వయంకృషితో చదువుకుని మంచి రచయితగా రాణించడమే కాక జ్ఞానపీఠ్‌ అవార్డు సాధించి తెలుగువారికే వన్నె తెచ్చారు.
      ఇలాంటి వారు మన చుట్టూ చాలామంది ఉండేవారు. ఇప్పటికీ ఉన్నారు. సాహిత్యంతో, నాటక రంగంతో ఏమాత్రం సంబంధం ఉన్నవారైనా షేక్స్‌పియర్‌ పేరు వినే ఉంటారు. ఆయనను నాలుగో తరగతి పట్టభద్రుడు అని ఎద్దేవా చేస్తారు. ఆ తర్వాత చదువుకోకపోవడం ఆయన సృజనాత్మక శక్తికి ఆటంకం కాలేదుగా! ‘‘డిగ్రీలు లేని పాండిత్యంబు వన్నెకురాని పాడు కాలాన బుట్టి...’’ అని విశ్వనాథ సత్యనారాయణ ప్రసిద్ధ పరిశోధకుడు మల్లంపల్లి సోమశేఖరశర్మ గురించి చెప్పడంలో ఆంతర్యం స్వయంకృషితో సాధించిన విజయానికి పట్టం గట్టడమే. 
      90వ పడిలో ఉన్న సినీనటుడు అక్కినేని నాగేశ్వరరావు తెలుగు మీదే కాక ఆంగ్లం మీద కూడా ఆధిపత్యం సంపాదించడానికి కారణం చదువు మీద శ్రద్ధే. ప్రసిద్ధ రచయిత, సాహిత్య విమర్శకుడు, దార్శనికుడు, చిత్రకారుడు, తెలుగులో తొలి రాజకీయ కార్టూనిస్టు, బతుకుదెరువు కోసం అనేక పనులు చేసి పత్రికా రచయిత అయి సంపాదకుడి స్థాయికి ఎదిగిన రాంభట్ల కృష్ణమూర్తికి ఉన్న విద్యార్హతల్లా అయిదో తరగతి మూడు సార్లు తప్పడమే. అక్కడితో ఆయన పాఠశాల విద్య ఆగిపోయింది కాని విద్యాభ్యాసం ఆగిపోలేదు. తెలుగు, ఆంగ్లం, సంస్కృత భాషలను స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. ఉర్దూతో తగుమాత్రం పరిచయం ఉంది.
      అంతెందుకు బడికెళ్లే వీలు లేక చదువు ఆపేయక తప్పనివారు కొందరైతే బడికెళ్లడం ఇష్టం లేకో, బడి చదువుల వల్ల పెద్ద ప్రయోజనం లేదని అనుకున్నందువల్లో మానేసినా చదువు కొనసాగించిన వారు అనేక మంది కనిపిస్తారు. అలాంటివారు అన్ని రంగాల్లోనూ తారసపడతారు.
      మధ్యలో చదువు ఆపేసి వివిధ రంగాల్లో రాణించిన వారు ఎంతో మంది. డెల్‌ కంప్యూటర్ల కంపెనీకి అధిపతి అయిన డెల్‌ 19వ ఏట చదువు ఆపేశాడు. నిజానికి ఆయన చదువు ఆగలేదు. అలా ఆగి ఉంటే కంప్యూటర్‌ విజ్ఞానంలో అంతగా రాణించేవాడే కాదేమో!
      ప్రపంచంలోనే అతి పెద్ద వాహనాల కంపెనీకి అధిపతి అయిన హెన్రీ ఫోర్డు కనీసం పాఠశాల విద్యను కూడా పూర్తి చేయలేదు. మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ కూడా కళాశాల చదువుకు స్వస్తి చెప్పిన వాడే. అమెరికాకు ఆరవ అధ్యక్షుడైన ఆండ్రూ జాక్సన్‌కు చదువులేదు. సౌందర్య సాధనాల తయారీలో ‘మేరీ కే’ సంస్థను స్థాపించిన ‘మేరీ కే ఆశ్‌’ కూడా కళాశాల విద్య మానేసిన కోవలోకే వస్తారు.
      అమెరికాలో మొట్ట మొదటి కోటీశ్వరుడైన జాన్‌ డి. రాక్‌ ఫెల్లర్‌ సీనియర్‌ బడి మానేసిన వాడే. చరిత్రకు తెలిసినంత వరకు ఆయనే అత్యంత సంపన్నుడు. వ్యాపార రంగంలోనూ, కళారంగంలోను రాణించడానికి డిగ్రీలు, నియత విద్య అంతగా అవసరం లేకపోవచ్చు అని సరిపెట్టుకున్నా వారందరికీ విద్యాగంధమే లేదని కాదు.
      ప్రసిద్ధ నాటక రచయిత జార్జ్‌ బెర్నార్డ్‌షా 14వ ఏట బడికెళ్లడం మానేశాడు. ఆ చదువు వల్ల ఫలితం లేదనుకున్నాడు. కానీ ఆయన డబ్లిన్‌లోని నేషనల్‌ గాలరీలో గంటల తరబడి గడిపి తన జ్ఞాన దాహార్తిని తీర్చుకుని క్రమంగా తానే రచయిత అయిపోయాడు.
      విజ్ఞాన శాస్త్రాన్ని కథలుగా మలచి చెప్పిన హెచ్‌ జి వెల్స్‌ కూడా 11వ ఏట చదువు మానేస్తే, జాక్‌ లండన్‌ 13వ ఏట బడి చదువుకు స్వస్తి చెప్పాడు. రాబిన్సన్‌ క్రూసో పేరు వినని వారు అరుదు. కాని ఆ గ్రంథం రాసిన, ఆంగ్లంలో తొలినవలా రచయిత అయిన డేనియల్‌ డీ ఫోకు విద్వత్తు లేదు.
      రష్యన్‌ రచయిత మాగ్జిం గోర్కీదీ అదే పరిస్థితి. ఆయన 11వ ఏట అనాథగా మిగిలాడు. ఒక ఏడాదిపాటు అమ్మమ్మ దగ్గర పెరిగాడు. 12వ ఏటా ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. అయిదేళ్లపాటు రష్యా సామ్రాజ్యం అంతటా కాలినడకన తిరిగాడు. ఆ సమయంలోనే లోకాన్ని చదివి బోలెడు జీవితానుభవం సంపాదించాడు. ఆ అనుభవమే ఆయన రచనలకు ముడి సరుకైంది. అయితే గోర్కీ బతుకుదెరువు కోసం చిన్నచిన్న ఉద్యోగాలు అనేకం చేశాడు. ఒక రొట్టెల కంపెనీలో పని చేసినప్పుడు కాస్త తీరిక దొరికితే ఏదో పుస్తకం చదివేవాడు. అలా చదివినందుకు యజమాని తెగ తిట్టేవాడు. అయినా గోర్కీ చదివే అలవాటు మానుకోలేదు. చదువుకోవడం కోసం కొవ్వొత్తులు దొంగిలించేవాడు. పుస్తకం అంటే ఆయనకు అంత ప్రేమ మరి! అందుకే మహారచయిత అయ్యాడు. స్వయంకృషితో జ్ఞానం సంపాదించాడు కనుకే ‘‘ఈ లోకమే నా విశ్వవిద్యాలయం’’ అనగలిగాడు.
      అంత చదివిన గోర్కీ పుస్తకాలు చదవాలని సలహా చెప్పేవాడు. చదివి సొంతంగా ఆలోచించాలనేవాడు.
      రెండు మహానగరాలు అన్న గొప్పనవల రాసిన చార్లెస్‌ డికెన్స్‌కు పన్నెండేళ్ల వయసున్నప్పుడు అప్పుల వాళ్లు ఆయన తండ్రిని జైలులో పెట్టించారు. అక్కడితో ఆయన జీవితం దుర్భరం అయిపోయింది. కానీ చదువు మీద శ్రద్ధ పోలేదు. కనుకే గొప్ప రచయితగా వెలిగాడు. మార్క్‌ ట్వెయిన్‌ కూడా 12వ ఏటనే తండ్రి చనిపోవడంతో చదువు ఆపేయాల్సి వచ్చింది. వీరందరూ బడికో, కళాశాలకో వెళ్లే అవకాశం లేకపోయినా చదువు మాత్రం ఆపలేదు.
      చదవడం అంటే బండి ఇసుకను ఇటు నుంచి అటు పోయడం కాదు. చదివిన దాన్ని ఆస్వాదించగలగాలి. అందులో ఉన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ఆగకుండా జీర్ణించుకోగలగాలి. అలా జీర్ణించుకున్నప్పుడే ఆ గ్రంథం మంచి చెడ్డలను వింగడించగలిగే నేర్పు అబ్బుతుంది. నచ్చిన పుస్తకాన్ని పదేపదే చదవాలన్న ఆసక్తి లేకపోతే చదవడం వల్ల ప్రయోజనమే లేదు అని ‘ఆస్కార్‌ వైల్డ్‌’ అనేవాడు.
      చదువు బతుకుదెరువుకు బాటలు వేసే మాట నిజమే గాని, అది మాత్రమే దాని పరమార్థం కాదు. అంతకు మించిన లోకాన్ని పుస్తకం చూపిస్తుంది.
      బడిమానేయడం ఎదుగుదలకు అడ్డంకిగా మారనక్కరలేదని నిరూపించిన వారు ఎంతో మంది ఉన్నారు. గొప్ప పండితులు కాకపోయినా ఎవరికీ తీసిపోని రచయితలుగా ప్రఖ్యాతి సంపాదించిన వారు అనేక మంది ఉన్నారు. తెలంగాణ నుంచి తొలి నవలా రచయిత అయిన వట్టికోట ఆళ్వారుస్వామి చిన్నతనంలోనే బతుకు బండి లాగాల్సిన అవసరం వచ్చినందువల్ల హోటల్లో క్లీనర్‌గా పని చేసేవారు. కానీ ఆయనలో చదువుకోవాలన్న ఆసక్తి అంతరించలేదు. చెప్పకోదగ్గ విద్వత్తు లేకపోయినా ‘ప్రజల మనిషి’ నవలను సమర్థంగా రాయగలిగారు. ఆయన చేపట్టని సాహిత్య ప్రక్రియే లేదు. శారద అనే కలం పేరుతో నవలలు రాసిన నటరాజన్‌ పుట్టుకతో తమిళుడు. దారీ తెన్నూ లేని జీవితం. ఆయన హోటల్‌ సర్వర్‌గా పనిచేశారు. కేవలం అధ్యయనం వల్లే ఆయనకు రచనా శక్తి చేకూరింది.
      ఉదాహరణకు మనిషి జీవించడానికి పిండిపదార్థాలు, విటమిన్లు ఖనిజ లవణాలు అత్యవసరం. వీటిలో ఏవి తగ్గినా దాన్ని పోషకాహార లోపం అంటాం. ఇవన్నీ మాత్రల రూపంలో కూడా మనకు దొరుకుతాయి. కానీ ఈ సకల పోషకాలనూ అందించే మాత్రలు మాత్రమే మింగి బతకడం సాధ్యం కాదు. ఇవి జీర్ణం కావడానికి కొంత పీచు పదార్థం కూడా అవసరం. మనం తీసుకునే ఆహారంలో ఈ పీచు పదార్థంతో పాటే పోషకాలూ ఉంటాయి. ఆ పీచు పదార్థం లేకపోతే పోషక పదార్థాలు జీర్ణం కావు. అందుకే వైద్యులు ఈ మధ్యన పీచు పదార్థాలు ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోండి అని చెబుతున్నారు.
      పాఠ్య పుస్తకాలతో పాటు ఇతర ఉపయుక్త గ్రంథాలు సైతం చదవాలనడం అసలు పుస్తకాలు సులభంగా ఒంట బట్టడం కోసమే. ఇతర పుస్తకాలు చదవడం వల్ల లోకజ్ఞానం పెరుగుతుంది. దానివల్ల ఇంగిత జ్ఞానం అబ్బుతుంది. అది మన జీవనయానాన్ని సుఖమయం చేస్తుంది. అందుకే తల్లిదండ్రులకు ఓ విన్నపం! మీ పిల్లలను పాఠ్యపుస్తకాలే కాకుండా ఇతర పుస్తకాలు కూడా చదవమని ప్రోత్సహించడం అవసరం. అది కథో, నవలో, కవిత్వమో, జీవిత చరిత్రో, యాత్రాస్మృతో, ఒక నిర్దిష్ట అంశంపై రాసిందో, సామాజిక శాస్త్రమో అయినా సరే.
      పరీక్షలు ముగిసిన తర్వాత చాలామంది విద్యార్థులు వినోదాత్మక కార్యక్రమాల మీదకు దృష్టి మళ్లిస్తారు. చదవాలనుకున్న చదువు పూర్తి అయిన తర్వాత చాలామంది తలమీద భారం దిగిపోయినట్టు ఆనంద పడిపోతారు. ఆ తర్వాత పుస్తకం ముట్టుకుంటే ఒట్టు! వృత్తిలోనో, ఉద్యోగంలోనో స్థిర పడిపోయిన తర్వాత పుస్తకాన్ని పూర్తిగా పరిహరించే వారు బోలెడు మంది కనిపిస్తారు. మరికొందరు ఉద్యోగ విరమణ తర్వాత చదువుదాం లెమ్మని వాయిదా వేస్తారు. ఇంకా కొందరు చదవడానికి తమకు సమయం చిక్కదంటుంటారు. ఇది నిఖార్సయిన అబద్ధం. పుస్తకం ఏ రకంగానైనా చదవొచ్చు. కూర్చుని, పడుకుని, తింటూ, నడుస్తూ, బస్సులో, రైల్లో, పార్కులో ఎక్కడైనా చదవొచ్చు. దీనికి పుస్తకం అభ్యంతరం చెప్పదు. చదవడం శ్రమ కాదు - సేదదీరడానికి పుస్తకాన్ని మించిన ఉపకరణం లేదు అని గ్రహించగలిగితే ఈ సాకులన్నీ అటకెక్కుతాయి.
      కొందరిని పుస్తకాల పురుగులంటుంటాం. ఇందులో కొంత వెటకారం ఉన్నా ఆ పుస్తకాల పురుగులు అనుకున్న వారే మహా మేధావులు. బ్రిటిష్‌ లైబ్రరీ చాలా పెద్దది. అందులో ఉన్న గ్రంథాలన్నింటినీ దాదాపుగా చదివేసిన వాళ్లు ఇద్దరే ఇద్దరు. మొదటి వ్యక్తి కార్ల్‌మార్క్స్, రెండోవారు డా।। బి.ఆర్‌. అంబేద్కర్‌. మార్క్స్‌ మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేసిన తత్వవేత్త. అంబేద్కర్‌ అంటరాని వారి అభ్యున్నతి కోసం పాటుపడి  స్ఫూర్తి ప్రదాతగా చరిత్రలో నిలిచిపోయారు.
      గాంధీ, నెహ్రూ, మౌలానా అబుల్‌ కలాం ఆజాద్, పండిత మదన్‌ మోహన్‌ మాలవ్యా, సర్‌ సయ్యద్‌ అహమద్‌ లాంటి వారు అందరూ తమ తమ రంగాల్లో ఎంత ప్రావీణ్యం సంపాదించినా ప్రధానంగా పుస్తక ప్రియులే.
      వయసు మీద పడిన తర్వాత కూడా చదవడం ఆరంభించిన వారూ ఉన్నారు. పరీక్షలు రాసి డిగ్రీలు సంపాదించిన వారూ కద్దు. అయితే చిన్నప్పుడే చదివే అలవాటు చేసుకుంటే అపారమైన అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చు. చిన్నతనంలో విద్యాభ్యాసం చేయాలి అని కాళిదాసు మేఘసందేశంలో చెప్పాడు. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠ్యపుస్తకాలు శ్రద్ధగా చదివేటట్టు చూడటంతో పాటు ఇతర పుస్తకాలు చదివే ఆసక్తి కలిగించాలి. చదివే అవకాశాలు లేకపోయినా ఆసక్తి వల్లే చదువుకుని రాణించిన వారందరికీ చిన్నప్పటి నుంచే ఆ లక్షణం ఉండేదని మరిచిపోకూడదు.

- భరణి, హైదరాబాద్‌


వెనక్కి ...

మీ అభిప్రాయం