అర్థాలే వేరులే!

  • 223 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డా।। ద్వా.నా.శాస్త్రి

  • హైదరాబాదు
  • 9849293376
డా।। ద్వా.నా.శాస్త్రి

‘‘ఆడవారి మాటలకు
అర్థాలే వేరులె’’

అనే పాతపాట సుపరిచితమే, అయితే ఇది పూర్తిగా నిజం కాదు. కొంతమంది పట్ల, కొన్ని సన్నివేశాల్లో మాత్రమే అది నిజం కావచ్చు. అసలు మాటలకే అర్థాలు వేరు. ఏ మాటనైనా సహజార్థంలో మాత్రమే కాదు అనేక అర్థాలుగా, అనేక విధాలుగా వాడతారు. ఆలంకారికులు మాటకి అర్థాలను ముఖ్యంగా మూడు రకాలుగా వివరించారు; - వాచ్యార్థం, లక్ష్యార్థం, వ్యంగ్యార్థం.
      ఈ మాటల్ని వినగానే ఇదేదో పాతదనీ, సనాతనమనీ, వ్యాకరణం గోల అని అనుకుంటే పొరపాటే. మనం మాట్లాడే భాషకీ ఇవి అన్వయిస్తాయి. వాచ్యార్థం అంటే ఒక మాటకు గల సహజమైన, అసలైన అర్థం. జలం అంటే నీరు; పుష్పం అంటే పువ్వు- వంటివి! లక్ష్యార్థం అంటే సహజార్థం కాకుండా దానితో సంబంధం గల మరో అర్థం వస్తుంది. ఇక్కడ అసలైన అర్థం పొసగదు.
      ‘‘ఇలా నేరుగా వెళ్తే సినిమా హాలు తగుల్తుంది’’ అన్నప్పుడు నిజంగా తగలదు. కనిపిస్తుందనే అర్థం. వాకిట్లో నుంచి కరేపాక్‌ కరేపాక్‌’’ అంటూ అమ్మేవ్యక్తి వెళ్తుంటే మనం ‘‘కరేపాకూ ఉండు, కరేపాకూ రా’’ అంటాం. కరేపాకు అమ్మేవాడా ఉండు, కరేపాకు అమ్మేవాడా రా అని కదా వీటి భావం!
      ఇక మూడోది వ్యంగ్యార్థం. దీనినే ధ్వని అంటారు. ఇందులో సహజమైన అర్థం ఉంటుంది. దాంతోపాటే చమత్కారం, వేళాకోళం లేదా వ్యతిరేకమైన అర్థం కూడా ఉంటుంది. ఇది కవిత్వానికి చాలా ముఖ్యమే కానీ మనం రోజూ మాట్లాడే మాటల్లోనూ ఈ వ్యంగ్యార్థం ఉంటుంది. అందరూ చెప్పే ఉదాహరణ - ‘‘రాజుగారి రెండో భార్య మంచిది!’’ నిజమే - రెండో భార్య మంచిది అన్న అసలైన అర్థం ఉంది. కానీ- మొదటి భార్య మంచిది కాదన్న అర్థమూ ఉంది. ఇదీ వ్యంగ్యార్థం అంటే. ఎవరన్నా ‘‘మీరు ఫొటోలో చాలా బాగున్నారండీ’’ అన్నారనుకోండి ఇందులో రెండో అర్థం దాగి ఉంది - ఫొటోలో బాగున్నారు గానీ బయట బాగుండరని! అయితే అలా అన్నవాడికి ఆ ఉద్దేశం లేకపోవచ్చు. ఇలా ఒక విధంగా పలికితే మరొక విధంగా అర్థం వస్తుంది. ఇది భాషలోని పదప్రయోగాల లక్షణం.
      కవిత్వంలోనైనా, వాడుక భాషలోనైనా ఒక మాటకి ఒకే అర్థం ఎప్పుడూ ఉండదు. సందర్భాన్ని బట్టి, సన్నివేశాన్ని బట్టి అర్థం వేర్వేరుగా ఉంటుంది. ఉదాహరణకి ‘లెక్క’ అనే పదం తీసుకుందాం-
      ‘‘లెక్క చేశావా?’’
      ‘‘నీ దగ్గర లెక్క ఏవన్నా ఉందా?’’  (డబ్బు)
      ‘‘వాడు నాకో లెక్కా?’’
      ‘‘లెక్కించావా?’’
      అలాగే, ‘మాట’ అనే ఒక్క పదానికి వివిధ సందర్భాల్లో 20 పైగా అర్థాలున్నాయి. మచ్చుకు కొన్ని- 
      ‘‘వాళ్లిద్దరికీ మాటల్లేవు’’
      ‘‘వాడి మాట వాడిదే’’
      ‘‘మనలో మాట’’
      ‘‘ఒక్క మాటలో చెప్పు’’
      ‘‘ఆ పని చెయ్యటం మాటలు కాదు’’
      ‘‘మాటామాటా వచ్చింది’’
      ‘‘ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి’’
      ‘‘మాటంటే మాటే’’.
      అలాగే ఒకనాడున్న అర్థం తర్వాత ఉండదు. దీనిని భాషాశాస్త్రంలో అర్థ విపరిణామం అంటారు. ఒకనాడు ‘శ్రాద్ధం’ అంటే శ్రద్ధగా చేసేది అనే అర్థం. శ్రీనాథుడు ‘కోక’ చుట్టుకున్నాడు. కోక అంటే చీర కాదు- ఒక వస్త్రం! ఉచితం అంటే తగినది, యోగ్యమైనది అని అర్థం. ఇవాళ ఆ అర్థం మారిపోయింది. ‘రెండుకొంటే ఒకటి ఉచితం’ అంటున్నారు. ‘ధర్మం’, అనే పదానికి న్యాయం, విధి, కర్తవ్యం అని అసలైన అర్థాలు. ఇవాళ ‘ధర్మదర్శనం’, ‘ధర్మం చేయండి బాబూ’ అంటూ వాడుతున్నారు.
      ‘‘ఏడిశావ్, నువ్వేం చేస్తావ్‌’’? అన్నప్పుడు ‘ఏడిశావ్‌’కి అర్థం వేరు. ‘వాడికి నచ్చచెప్పలేక చచ్చాననుకో’ అన్నప్పుడు నిజంగా చావలేదు గదా!
      ‘‘బొక్కలో తోస్తా’’
      ‘‘జనగణమన పాడాడు’’
      ‘‘దద్ధోజనంగాడు’’
      ‘‘నీ దుమ్ము దులుపుతా’’
      ‘‘చూసుకుందామా’’
      - వీటి అసలర్థాలతో ఏమైనా సంబంధం ఉందా?
      మనం వాడే తిట్లు కూడా ఇంతే.
      ‘‘నీ నోట్లో పురుగులు పడ’’
      ‘‘నీ యిల్లు కాల్చ’’
      ‘‘నీ కడుపు కాల’’
      ‘‘రాచి రంపాన పెడ్తా’’
      ఇవి అసలైన అర్థాలను కాదని మరో అర్థంలో వాడుకలో ఉండే జాతీయాలు. 
      ‘‘కళ్లలో నిప్పులు పోసుకుంటాడు’’
      అంటే ఈర్ష్య, అసూయ అనే అర్థం. ‘పక్కలో బల్లెం’ అంటే పక్కా ఉండదు, బల్లెమూ ఉండదు. ‘ప్రమాదకరం’ అనే అర్థం. ‘‘వాడు కథలంటే చెవి కోసుకొంటాడు’’ అన్నప్పుడు నిజంగా చెవి కోసుకోవడం ఉండదు. అంత ఇష్టం అనే అర్థం. అలాగే ‘కళ్లకు కట్టినట్టు’ అంటుంటాం. నిజానికి కళ్లకి కడితే ఏమీ కనిపించదు. కానీ స్పష్టంగా, సవివరంగా అనే అర్థంలో వాడతాం. బాగా వాడుకలో ఉన్న ‘‘చెవిలో పువ్వు’’ అనేది కూడా అంతే!
      క్రియాపదాలు కూడా వేరే అర్థాలలో వాడటం తెలిసిందే - ‘‘వరుసలో పెట్టు, పెట్టుబడి, కనిపెట్టు, ఏమైనా పెట్టు...’’ మొదలైనవి.
      ‘తిన్నాడు’ అనే క్రియాపదం ఎన్ని అర్థాలో ఉందో చూడండి.
      - అన్నం తిన్నాడు, కంగుతిన్నాడు,  డబ్బు తిన్నాడు, గడ్డి తిన్నాడు.
      ఇతర భాషా పదం విడినప్పుడు కూడా అర్థం మారుతుంది. మర్యాద అంటే ‘హద్దు’ అనే అర్థం. కానీ తెలుగు మర్యాద వేరు; ఖబర్‌ కాస్తా కబురు అయింది. తెలుగు ‘కబుర్లు’ వేరు. ఖబర్‌ అంటే వార్త మరి! ‘జవాన్‌’ అంటే యువకుడు - ఇతను సైనికుడయ్యాడు. తెలుగులో నౌకరయ్యాడు. ఇలా ఎంతో చెప్పవచ్చు. సారాంశం ఏంటంటే ఏ మాటకైనా ‘అర్థం వేరులే’ అనాలి. భాష ప్రజల కోసం. ప్రజల మనో భావాలను వ్యక్తీకరించడం కోసం. వ్యాకరణం, నిఘంటువులు ప్రజలకి అక్కర్లేదు. ప్రజా నిఘంటువు వేరు. దానికి ప్రాధాన్యం ఇవ్వాలి.


వెనక్కి ...

మీ అభిప్రాయం