ఇట్లు నాన్న!

  • 33 Views
  • 0Likes
  • Like
  • Article Share

ఓ తండ్రి ఆలోచన... తన కొడుక్కి లోకం గురించి చెప్పాలని! మనుషుల మనస్తత్వాలను వివరించాలని! అమ్మభాషలోని అమ్మతనాన్ని గుర్తుచేయాలని! విజేతల వ్యక్తిత్వాలను పరిచయం చేయాలని! ప్రపంచ విజ్ఞానాన్ని అందివ్వాలని! సామాజిక అంశాలపై చైతన్యం కలిగించాలని! 
      ఇవన్నీ చేశాడు ఆ నాన్న! అలా అని ఒళ్లో కూర్చొపెట్టుకుని చెప్పలేదు. చెప్పలేడు కూడా. ఎందుకంటే అబ్బాయి ఎక్కడో వందల కి.మీ.ల దూరంలో ఉన్నాడు. మరి ఎలా తన ఆలోచనను ఆచరణలోకి తెచ్చాడు? ఆలోచించండి! ఊసులు చెప్పే ఉత్తరం గుర్తొచ్చిందా! దాంతోనే! రోజుకో లేఖ చొప్పున వరసగా ఏడొందలకు పైగా రాశాడు ఆ కన్నతండ్రి. నాన్న మనస్సును అర్థం చేసుకుని, ఆ ఉత్తరాల్లోని ఆత్మను ఆవాహన చేసుకున్నాడా పుత్రుడు.
 
      స్వాతంత్రోద్యమం ఉధృతంగా నడుస్తున్న రోజులవి... జవహర్‌లాల్‌ నెహ్రూ కారాగారంలో ఉన్నారు. అక్కడి నుంచి తన పదేళ్ల కూతురు ఇందిరకు ఉత్తరాలు రాశారు. ప్రపంచ చరిత్రను అలతి అలతి అక్షరాల్లోకి కుదించి చెప్పారు. ఆ లేఖల ప్రభావంతోనే ఎదిగారు ఇందిర. తర్వాతర్వాత నెహ్రూ ఉత్తరాలు పుస్తక రూపంలోకి వచ్చి లోక ప్రసిద్ధమయ్యాయి. అందరికీ తెలిసిన విషయమే ఇది. 
      అయితే, నాటి నెహ్రూ రాతల స్ఫూర్తితో ఓ తెలుగింటి నాన్న కూడా కలం పట్టాడు. తమిళనాడులో చదువుకుంటున్న తన పదకొండేళ్ల బాబుకు రోజుకు కొంత విజ్ఞానాన్ని  అందించాడు. రెండు చేతులతో దాన్ని అందిపుచ్చుకున్న ఆ అబ్బాయి ఇప్పుడు విద్యా సంబంధిత పోటీల్లో విజేతగా నిలుస్తున్నాడు. 
      సోమిరెడ్డి... నల్గొండ జిల్లా మఠంపల్లి మండలంలోని బక్కమంతుల గూడెం వాసి. 1994 గ్రూప్‌2 పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో రెండో స్థానంలో నిలిచిన వ్యక్తి. ఆబ్కారీ శాఖలో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. తర్వాత తోటి గ్రామస్థులను చదువు వైపు నడిపించారు. ఊళ్లో గ్రంథాలయం, పోటీ పరీక్షల పుస్తకాల నిధిని ఏర్పాటు చేశారు. ఆయన స్ఫూర్తిని అందిపుచ్చుకున్న యువత గ్రూప్‌-1, గ్రూప్‌-2, పోలీస్, రెవెన్యూ, ఉపాధ్యాయ ఉద్యోగాలను సాధించారు. 
      అయితే, సోమిరెడ్డి మనసులో మాత్రం ఏదో వెలితి. ఆబ్కారీ శాఖలో ఇమడలేకపోయారు. అనారోగ్యమూ కొంత ఇబ్బంది పెట్టింది. మరోవైపు, నేటితరం చిన్నారులకు మెరుగైన విద్య అందట్లేదన్న బాధ. వెరసి, ఉద్యోగానికి దీర్ఘకాలిక సెలవు పెట్టారు. 2012లో కోదాడలో తేజ విద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. పిల్లలకు విలువలతో కూడిన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నారు. 
      మూడేళ్ల కిందటి మాట. సోమిరెడ్డి కుమారుడు ధనుష్‌ ఆరో తరగతిలో ఉన్నాడప్పుడు. తమిళనాడులోని కాంచీపురంలో ఉన్న రిషివ్యాలీ పాఠశాలలో చదువుతున్నాడు. అంత దూరంలో ఉన్న అబ్బాయితో రోజూ మాట్లాడలన్న ఆశ సోమిరెడ్డిది. ఎంతైనా నాన్నప్రేమ కదా. ఫోనులో పలకరిస్తే తనివి తీరదు. పైగా పాఠశాల వాళ్లూ ఒప్పుకోరు. పైపెచ్చు ఫోనులో అయితే... ఎలా ఉన్నావ్‌ కన్నా! అన్నం తింటున్నావా సరిగ్గా! లాంటి సాధారణ మాటలే దొర్లుతాయి. అది కాదు కావాల్సింది ఆ తండ్రికి. తన మాటల వల్ల బిడ్డకు ఓ నాలుగు మంచి విషయాలైనా తెలియాలి. అవి తనకు ఎప్పుడో ఒకప్పుడు... ఎక్కడో ఓ చోట ఉపయోగపడాలి. ఇదే అనుకున్నారాయన. ఆలోచించారు. ఓ మెరుపు మెరిసింది. ఉత్తరం జ్ఞప్తికి వచ్చింది. అప్పుడే మొదలైంది లేఖా రచన. రెండు విద్యా సంవత్సరాల పాటు, ధనుష్‌ ఏడో తరగతి పూర్తయ్యే వరకూ (తర్వాత అబ్బాయి స్వస్థలానికి వచ్చేశాడు) నిరంతరంగా సాగిందా వెల్లువ.
      సమకాలీన, పర్యావరణ, జీవవైవిధ్య, వైజ్ఞానిక అంశాలు, లోకం పోకడను మార్చిన ఆవిష్కరణలు, లోకనాయకుల జీవిత విశేషాలు, చారిత్రక వ్యక్తుల మూలాలు, తెలుగు తీయందనాలు, సైన్సు పరిశోధనలు, ఆటలు... ఇలా సోమిరెడ్డి ఎంచుకున్న అంశాలన్నీ దేనికది విభిన్నమే. రోజుకొక విషయాన్ని తీసుకోవడం, దాని గురించి పోస్టు కార్డుపై సూటిగా, స్పష్టంగా రాయడం, కాంచీపురం చిరునామాకు ఆ ఉత్తరాన్ని జాగ్రత్తగా పంపడం... ఆగస్టు, 2010 నుంచి ఏప్రిల్, 2012 వరకూ సోమిరెడ్డి దినచర్య ఇదే. ప్రతి ఉత్తరంపై ఆయన ఏదో ఒక బొమ్మ వేసేవారు. ‘ఈనాడు’ హాయ్‌బుజ్జీలో వచ్చే హాస్యోక్తులను ఉట్టంకించే వారు. సందర్భానుసారం సూక్తులు, ప్రముఖుల మాటలను గుదిగుచ్చేవారు. ఒక్కో లేఖ రచనకు పదిహేను నిమిషాల నుంచి గంట వరకూ వెచ్చించే వారు. దినపత్రికలు, పుస్తకాలు, అంతర్జాలం నుంచి విషయ సేకరణ చేసి, దాన్ని అలతి అలతి తెలుగు పదాల్లోకి కూర్చే వారు. 
      నాన్న పంపే ఉత్తరాలతో పాఠశాలలో ధనుష్‌కు ఓ ప్రత్యేక గుర్తింపు వచ్చింది. తనకు వచ్చే లేఖల కోసం మిత్రులు, ఉపాధ్యాయులు కూడా ఎదురుచూసే వారు. తెలుగు తెలిసిన వాళ్లు వాటిని అడిగి తీసుకుని మరీ చదివే వాళ్లు. వచ్చే ఉత్తరాలు తెచ్చే స్ఫూర్తితో తానూ ‘రాయడం’ ప్రారంభించాడు ధనుష్‌. నాన్నకు వారానికో లేఖ చొప్పున పంపేవాడు. పాఠ్యపుస్తకాలతో పాటుగా విషయ బోధన చేసిన నాన్న ఉత్తరాలతో ఆ కుర్రాడి విజ్ఞానస్థాయి విస్తరించింది. రాష్ట్రస్థాయిలో జనవిజ్ఞాన వేదిక నిర్వహించిన సైన్స్‌ క్విజ్‌లో రెండో స్థానంలో నిలిచాడు. ‘హిందూ’ దినపత్రిక ఆధ్వర్యంలో జరిగిన ‘యంగ్‌ వరల్డ్‌ క్విజ్‌’లో కూడా జయకేతనం ఎగరవేశాడు. 
      ఈ నాన్నలేఖలు ఇప్పుడు ‘ఇట్లు... నాన్న’గా పుస్తక రూపంలోకి వచ్చాయి. పాఠకులనూ ఆకట్టుకుంటున్నాయి. ఉత్తరాలు పుస్తకంలో పుటలుగా మారడం వెనక ఆసక్తికర విషయం ఉంది. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో జరిగే ‘బాలోత్సవ్‌’ గురించి అందరికీ తెలిసిందే. 2011లో జరిగిన ఆ ఏటి ఉత్సవానికి వెళ్లారు సోమిరెడ్డి. అక్కడకు వచ్చే చిన్నారుల్లో లేఖా రచనపై ఆసక్తి కలిగించాలన్న ఉద్దేశంతో తన ఉత్తరాలను తీసుకెళ్లారు. అక్కడ వాటిని మెదక్‌ జిల్లా జహీరాబాద్‌కు చెందిన డా।। విజయలక్ష్మి చూశారు. ఆవిడకు అవి బాగా నచ్చాయి. వాటి నకలును తనకివ్వల్సిందిగా సోమిరెడ్డిని అడిగారు. ఆయన ఉత్తరాలను స్కాన్‌ చేసి సీడీలో వేసిచ్చారు. విజయలక్ష్మి దగ్గరకు చేరిన ఆ సీడీ తర్వాత ‘కొత్తపల్లి’ పత్రిక వ్యవస్థాపకులు సుబ్బరాజు దృష్టిలోకి వచ్చింది. అందులోని ఉత్తరాల విలువను గ్రహించిన ఆయన వాటిని పుస్తకంగా అచ్చు వేయించారు. దానికి మంచి స్పందన వచ్చింది. దాంతో తేజ విద్యాలయం ఆధ్వర్యంలో పునర్ముద్రించారు. 
      అమ్మభాషపై పట్టు పెంచే సాధనం లేఖా రచన. భావ వ్యక్తీకరణలో స్పష్టతను సాధించడానికీ ఇది దోహదపడుతుంది. ఈ రచనకు ఉండే శక్తిని గుర్తించి, ఆ శక్తిని ఉత్పేరకంలా మార్చి, అబ్బాయిలో జ్ఞానతృష్ణను పెంచిన సోమిరెడ్డి ఆలోచన అనుసరణీయం. బిడ్డల భవితకదే అభ్యుదయం. 

(సోమిరెడ్డి: 99493 51038)

బి.స్టాలిన్, నల్గొండ
షంషుద్దీన్, కోదాడ


నేర్చుకున్నా
ఎంత పెద్ద విషయాన్ని అయినా సులువుగా, సరళంగా, స్పష్టంగా ఎలా రాయాలో నేర్పాయి నాన్న లేఖలు. తరగతి పుస్తకాల్లో లేని ఎన్నో అంశాలుంటాయి వాటిలో. వేరే రాష్ట్రంలో ఉన్నా తెలుగును మర్చిపోకుండా ఉన్నానంటే ఈ ఉత్తరాల వల్లే.        - ధనుష్‌


అన్నీ లాభాలే
బాబుకు దూరంగా ఉన్నానన్న భావనను తగ్గించాయి ఈ ఉత్తరాలు. వాడిలో తెలుగుపై పట్టును, విజ్ఞానాన్ని పెంచాయవి. ఉత్తరాలను చదవటం అలవాటు కావడంతో పుస్తక పఠనం వైపు ఆకర్షితుడయ్యాడు. పరిశీలన శక్తి, విమర్శనా దృక్పథం అలవడ్డాయి.  - సోమిరెడ్డి


చదువుల్లో ‘తేజం'
సోమిరెడ్డి కలల పాఠశాల అయిన ‘తేజ విద్యాలయం’లో బోధన విభిన్నంగా ఉంటుంది. పాఠాలన్నింటినీ నాటక రూపంలోకి మార్చి చెబుతారు. దాంతో వాటిపై పిల్లలకు ఇష్టం పెరుగుతుంది. అలాగే, తరగతి గదితో మాత్రమే కాక ప్రకృతితో కూడా అక్కడి చిన్నారులకు అనుబంధం ఉంటుంది. వారానికి ఒకసారి ‘దూరపు నడక’కు వెళ్తారు. అందులో భాగంగా చుట్టూ ఉన్న పర్యావరణాన్ని అధ్యయనం చేస్తారు. అలాగే, వ్యవసాయం చేసే పద్ధతిని కూడా విద్యార్థులకు నేర్పిస్తారిక్కడ. పాఠశాలకు దగ్గరగా ఉన్న ఓ వ్యవసాయ క్షేత్రంలో.. తరగతికి ఒక ‘మడి’ని ఇచ్చి విత్తనాలు వేయడం నుంచి అన్నింటిపై అవగాహన కల్పిస్తారు. ప్రతిరోజూ ఉదయం ‘సత్సంగ్‌’ పేరిట విద్యార్థుల మధ్య చర్చలు నిర్వహిస్తారు. వేదిక భయం పోవడానికి ఇది ఉపయోగపడుతుంది. కథలు, కవితలు, నాటకాలు, లేఖలు, వ్యాసాలు రాయడం, చిత్రలేఖనాల్లోనూ పిల్లలను ప్రోత్సహిస్తారు. సృజనాత్మక శక్తిని పెంపొందించడానికి ఇవి ఉపయోగపడతాయి.


వెనక్కి ...

మీ అభిప్రాయం